రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

న్యూఢిల్లీలో భారత-జపాన్ రక్షణ/విదేశాంగ శాఖ మంత్రుల మధ్య మూడో దఫా 2+2 చర్చలు


జపాన్ రక్షణ మంత్రి శ్రీ కిహర మినోరుతో భారత
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ ద్వైపాక్షిక సమావేశం;

రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ‘ప్రత్యేక వ్యూహాత్మక..
ప్రపంచ భాగస్వామ్యాన్ని’ ప్రోత్సహించడం ఈ చర్చల లక్ష్యం

Posted On: 19 AUG 2024 4:04PM by PIB Hyderabad

   భారత-జపాన్ రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య న్యూఢిల్లీలో 2024 ఆగస్టు 20న మూడో దఫా ద్వంద్వ మంత్రుల స్థాయి (2+2) చర్చలు సాగనున్నాయి. ఈ మేరకు జపాన్ రక్షణ మంత్రి శ్రీ కిహర మినొరు, విదేశాంగ శాఖ మంత్రి యొకొ కామికవతో భారత రక్షణ/విదేశాంగ శాఖల మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌, డాక్టర్ ఎస్.జైశంకర్ సమావేశమవుతారు. ఈ చర్చల కార్యక్రమంలో భాగంగా రెండు దేశాల రక్షణశాఖ మంత్రుల మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా ఉంటుంది.

   ఈ ద్వంద్వ మంత్రులు స్థాయి చర్చల్లో భాగంగా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేపట్టే మార్గాన్వేషణ చేస్తారు. అలాగే ద్వైపాక్షిక సహకారంపైనా సమీక్షిస్తారు. అంతేకాకుండా ఉభయతారక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటారు.

   ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, చట్టబద్ధ పాలన సహిత ఉమ్మడి విలువల ప్రాతిపదికగా భారత్-జపాన్ మధ్య ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’ కొనసాగుతోంది. అందులో అత్యంత కీలకమైన రక్షణశాఖ ఒక మూల స్తంభంగా ఉంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, సార్వజనీన, స్వావలంబిత ఇండో-పసిఫిక్ ప్రాంతీయ ఆవిష్కారానికి హామీ దిశగా భారత్-జపాన్ రక్షణ సంబంధ భాగస్వామ్యాన్ని ఇంకా శక్తిమంతమైనదిగా రూపొందించడం చాలా ముఖ్యం.

   ఈ నేపథ్యంలో ప్రస్తుత ద్వంద్వ మంత్రుల స్థాయి సమావేశం రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రెండు దేశాల మధ్యగల ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని కూడా విస్తృతం చేస్తుంది. కాగా, భారత్-జపాన్ ద్వంద్వ మంత్రుల స్థాయి రెండో దఫా చర్చల కార్యక్రమాన్ని 2022 సెప్టెంబరులో జ‌పాన్‌లో నిర్వహించారు.

***



(Release ID: 2046703) Visitor Counter : 53