మంత్రిమండలి
azadi ka amrit mahotsav

బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-3 ప్రాజెక్టులో 44.65 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లకు కేబినెట్ ఆమోదం


ఫేజ్-3 ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.15,611 కోట్లు



కారిడార్-1 జేపీనగర్ 4వ ఫేజ్ నుంచి కెంపాపుర వరకు అవుటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా 21 స్టేషన్లతో 32.15 కి.మీ. నిర్మాణం



కారిడార్-2 హోసహళ్లి నుంచి కడబగెరె వరకు మాగడి రోడ్డుకు సమాంతరంగా 9 స్టేషన్లతో 12.50 కి.మీ.



బెంగళూరు నగరానికి మొత్తం 220.20 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌వర్క్



ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఈస్ట్ తో ప్రత్యక్ష అనుసంధానమే కాకుండా,

ఐటీ క్లస్టర్లు, నగరంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం

Posted On: 16 AUG 2024 8:08PM by PIB Hyderabad

బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-3కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 31 స్టేషన్లతో 44.65 కిలోమీటర్ల పొడవున రెండు ఎలివేటెడ్ కారిడార్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. కారిడార్ -1 జేపీ నగర్ 4వ ఫేజ్ నుంచి కెంపపుర (ఔటర్ రింగ్ రోడ్డు పశ్చిమం వైపు) వరకు 22 స్టేషన్లతో 32.15 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. కారిడార్ -2 హోసహళ్లి నుంచి కడబగెరె (మాగడి రోడ్డు వైపు) వరకు 12.50 కిలోమీటర్ల పొడవున 9 స్టేషన్లతో నిర్మించనున్నారు.

ఫేజ్-3 అమలులోకి వస్తే బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నట్లు అవుతుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.15,611 కోట్లు.

ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు:


బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ -3 ద్వారా నగరం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. ఫేజ్-3 నిర్మాణం ద్వారా నగరంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ ప్రధానంగా విస్తరిస్తుంది.

మెరుగైన అనుసంధానం: 
 
కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ద్వారా ఫేజ్-3లో సుమారు 44.65 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఫేజ్-3లో పీన్య ఇండస్ట్రియల్ ఏరియా, బన్నేరుఘట్ట రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో ఐటీ పరిశ్రమలు, తుమకూరు రోడ్డు, ఓఆర్‌ఆర్ లోని టెక్స్ టైల్, ఇంజినీరింగ్ వస్తువుల తయారీ యూనిట్లు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పీఈఎస్ యూనివర్సిటీ, అంబేడ్కర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, కేఎల్‌ఈ కళాశాల, దయానందసాగర్ యూనివర్సిటీ, ఐటీఐ తదితర ప్రధాన విద్యాసంస్థలను అనుసంధానం చేయనున్నారు. ఫేజ్-3 కారిడార్లు నగరంలోని దక్షిణ భాగాన్ని కూడా అనుసంధానించనున్నారు.  ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్, మాగడి రోడ్డు, వివిధ పరిసర ప్రాంతాలకు మెట్రో సేవలు అమలులోకి రానున్నాయి. ఇది నగరంలో మొత్తం అనుంధానతను పెంచుతుంది. వాణిజ్య కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు బెంగళూరు వాసులకు మెరుగైన అనుసంధానాన్ని అందిస్తుంది.

గణనీయంగా తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ:
రోడ్డు రవాణాకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు సేవలు అందిస్తుంది. బెంగళూరు నగరంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ నకు పొడిగింపుగా వస్తున్న ఫేజ్ -3 వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్, మాగడి రోడ్డు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే నగరంలోని ఇతర ప్రధాన రహదారులపై రద్దీ తగ్గుతుంది. రోడ్డు ట్రాఫిక్ తగ్గడం వల్ల వాహనాల రాకపోకలు సజావుగా సాగడం, ప్రయాణ సమయం తగ్గడం, మొత్తం రోడ్డు భద్రత పెరగడం వంటివి జరుగుతాయి.

పర్యావరణ ప్రయోజనాలు: 
     
ఫేజ్ -3 మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా బెంగళూరు నగరంలో మెట్రో నెట్‌వర్క్ విస్తరిస్తుంది. దీని ద్వారా సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.

ఆర్థిక వృద్ధి: 
     


మెట్రో విస్తరణ ద్వారా ప్రయాణ సమయాలు తగ్గుతాయి, నగరంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానత కలుగుతుంది. ఉద్యోగులు కార్యాలయాలకు త్వరితగతిన చేరుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా వారి ఉత్పాదకత పెరుగుతుంది. ఫేజ్-3 నిర్మాణం, నిర్వహణ వల్ల నిర్మాణ కార్మికుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నిర్వహణ సిబ్బంది వరకు వివిధ రంగాల్లో అనేక ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే, స్థానిక వ్యాపారాలకు అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల సమీపంలోని ప్రాంతాలలో, పెట్టుబడులు, అభివృద్ధిని కూడా నమోదు చేస్తుంది.

 

సామాజిక ప్రభావం:    
బెంగళూరులో ఫేజ్ -3 మెట్రో రైల్ నెట్‌వర్క్ విస్తరణ ద్వారా ప్రజా రవాణాకు మరింత సమానమైన అనుసంధానాన్ని కల్పిస్తుంది. వివిధ సామాజిక-ఆర్థిక సమూహాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రవాణా అసమానతలను తగ్గిస్తుంది, ఇది ప్రయాణ సమయాలను తగ్గించడం ద్వారా అత్యవసర సేవలను వేగంగా పొందే వీలు కలుగుతుంది. తద్వారా అధిక జీవన నాణ్యతకు దోహదం చేస్తుంది.

మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్, శివారు ప్రాంతాలతో అనుసంధానం:

 

మెట్రో విస్తరణలో భాగంగా మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ ను 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. జేపీ నగర్ 4వ ఫేజ్, జేపీ నగర్, కామాక్య, మైసూర్ రోడ్, సుమనహళ్లి, పీన్య, బీఈఎల్ సర్కిల్, హెబ్బాళ్, కెంపాపుర, హోసహళ్లి వద్ద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్లు, బిఎమ్‌టిసి ప్రయాణ ప్రాంగణాలు, భారతీయ రైల్వే స్టేషన్లు, ప్రతిపాదిత సబర్బన్ (కె-రైడ్) స్టేషన్లతో పరస్పర అనుసంధాన సదుపాయాలను అందిస్తుంది.

ఫేజ్-3 లో నిర్మించనున్న అన్ని స్టేషన్లలో బస్ షెల్టర్లు, పికప్ అండ్ డ్రాప్ సేవల కోసం వివిధ ప్రాంతాలు, పాదచారుల మార్గాలు, ఐపిటి / ఆటో రిక్షా స్టాండ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడుపుతున్న బీఎంటీసీ ఫేజ్-3 స్టేషన్లకు కూడా విస్తరిస్తారు. 11 ముఖ్యమైన స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం కల్పించారు.  ఫేజ్-1, ఫేజ్-2 ప్రస్తుత స్టేషన్లు, ఫేజ్-3 ప్రతిపాదిత స్టేషన్లతో అనుసంధాస్తారు. రెండు రైల్వే స్టేషన్లకు (లొట్టెగొల్లాహళ్లి, హెబ్బాళ్) ఎఫ్ఓబిలు / స్కైవాక్ ద్వారా ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది. ఫేజ్-3 మెట్రో స్టేషన్లలో మోటారు సైకిళ్లు, సైకిళ్ల - షేరింగ్ సదుపాయం కల్పిస్తారు. 

***


(Release ID: 2046295) Visitor Counter : 50