ప్రధాన మంత్రి కార్యాలయం

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 15 AUG 2024 2:30PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై ।

భారత్ మాతా కీ జై ।

భారత్ మాతా కీ జై ।

ప్రియమైన నా దేశప్రజలారా, నా కుటుంబసభ్యులారా!

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన, దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన, దేశం కోసం జీవితాంతం పోరాడిన, ఉరికంబం పై కూడా జై భారతమాత అని నినదించిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొనే ఆ శుభ ఘడియ ఈ రోజు. వారి పవిత్ర స్మృతులను స్మరించుకొనే పండుగ ఈ రోజు. ఆ సమరయోధుల త్యాగం తో మనకు లభించిన ఈ స్వేచ్చా వాయువులు జీవితాంతం మనం వారికి రుణ పడేలా చేసింది. అలాంటి ప్రతి మహానుభావుడికి మన గౌరవాన్ని తెలియజేస్తున్నాం.

ప్రియమైన నా దేశప్రజలారా,

దేశ నిర్మాణం కోసం నిబద్ధతతో పూర్తి అంకితభావంతో మహానీయులు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అది మన రైతులు కావచ్చు, సైనికులు కావచ్చు, స్ఫూర్తి నిండిన యువత కావచ్చు, మన తల్లులు, సోదరీమణుల సహకారం కావచ్చు; లేదా దళితులు కావచ్చు, బాధితులు కావచ్చు, దోపిడీకి గురైనవారు కావచ్చు, అణగారినవారు కావచ్చు; నేడు వారి దేశభక్తి, ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అలాంటి వారందరికీ నేను ఎంతో గౌరవంతో నమస్కరిస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా,

ఈ ఏడాదితో పాటు గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా మంది తమ కుటుంబాన్ని, ఆస్తిని కోల్పోయారు, దేశం కూడా అనేక సార్లు భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ రోజు వారందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో దేశం మీ అందరికి అండగా నిలుస్తుందని నేను వారికి మరో సారి భరోసా ఇస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా,

స్వాతంత్య్రానికి పూర్వం నాటి రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. వందల ఏళ్ల బానిసత్వంలో ప్రతి కాలమూ ఒక పోరాటమే. మన యువత అయినా, వయోజనులైనా, రైతులైనా, మహిళలైనా, గిరిజనులైనా బానిసత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. 1857 స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే మన దేశంలో అనేక గిరిజన ప్రాంతాలలో స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయనడానికి చరిత్రే నిదర్శనం.

మిత్రులారా,

స్వాతంత్య్రానికి పూర్వం 40 కోట్ల మంది దేశప్రజలు అపారమైన స్ఫూర్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఒక స్వప్నం, ఒక సంకల్పంతో ముందుకు సాగి అవిశ్రాంతంగా పోరాడారు. "వందేమాతరం" అనే ఒకే ఒక స్వరం, “భారత స్వాతంత్ర్యం”- అనే ఒకే ఒక స్వప్నం తో ముందుకు కదిలారు.  వారి రక్తం ఈ రోజు మన నరాల్లో ప్రవహిస్తున్నందుకు మనం గర్వపడదాం. వారు మన పూర్వీకులు. వారు కేవలం 40 కోట్లు మాత్రమే. కేవలం 40 కోట్ల మంది ప్రజలు ప్రపంచ శక్తిని కూలదోసి బానిసత్వ సంకెళ్లను విచ్ఛిన్నం చేశారు. మన పూర్వీకులు దీన్ని సాధించగలిగితే నేడు మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం. 40 కోట్ల మంది ప్రజలు బానిసత్వ సంకెళ్లను విచ్ఛిన్నం చేయగలిగితే, 40 కోట్ల మంది ప్రజలు స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కలను సాకారం చేయగలిగితే, నా దేశంలోని 140 కోట్ల మంది పౌరులు, 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు ఒక సంకల్పంతో ముందుకు సాగితే, వారు ఒక దిశను నిర్ణయించుకుని, ఎన్ని సవాళ్లు ఎదురైనా చేయి చేయి కలిపి ముందుకు సాగాలి.  వనరుల కొరత లేదా పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా, ప్రతి సవాలును అధిగమించి, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించవచ్చు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోగలం. 40 కోట్ల మంది దేశప్రజలు తమ కృషి, అంకితభావం, త్యాగం, బలిదానాలతో మనకు స్వాతంత్ర్యం ఇవ్వగలిగితే, 140 కోట్ల మంది దేశప్రజలు కూడా అదే స్ఫూర్తితో సుసంపన్నమైన భారతాన్ని నిర్మించగలరు.

మిత్రులారా,

 

ఒకప్పుడు దేశం కోసం ప్రాణత్యాగానికైనా కట్టుబడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. దేశం కోసం జీవించడానికి కట్టుబడి ఉండాల్సిన సమయం ఇది. దేశం కోసం చనిపోవాలనే నిబద్ధత మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకురాగలిగితే, దేశం కోసం జీవించాలనే నిబద్ధత కూడా సుసంపన్నమైన భారతదేశాన్ని సృష్టించగలదు.

మిత్రులారా,

 

వికసిత్ భారత్ 2047 కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక కఠోర శ్రమ ఉంది. దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి సూచనలు తీసుకుంటున్నాము. పౌరుల నుండి సూచనలు తీసుకున్నాము. వికసిత్ భారత్ 2047 కోసం కోట్లాది మంది పౌరులు లెక్కలేనన్ని సూచనలు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి పౌరుడి కల ఇందులో ప్రతిబింబిస్తుంది. ఇందులో ప్రతి పౌరుడి సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. యువత, వృద్ధులు, గ్రామస్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, పర్వతాలు, అడవులు, నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ 2047 నాటికి, దేశం వందేళ్లు జరుపుకునే నాటికి వికసిత్ భారత్ ను నిర్మించాలని విలువైన సూచనలు చేశారు.

 

ఈ సలహాలను చదివినందుకు నాకు చాలా సంతోషం కలిగింది.. వారు ఏమి రాశారు? దేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా చేయాలని కొందరు ప్రతిపాదించారు. వికసిత్ భారత్ 2047 కోసం, దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రం (గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) గా మార్చాలని కొందరు సూచించారు. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయికి చేరుకోవాలని కొందరు సూచించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మన మీడియా ఎందుకు ప్రపంచవ్యాప్తం (గ్లోబల్) కాకూడదు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. నైపుణ్యం కలిగిన మన యువత ప్రపంచానికి ప్రథమ ఎంపిక కావాలన్న విశ్వాసాన్ని మరికొందరు వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా జీవితంలోని ప్రతి అంశంలో దేశం స్వయం సమృద్ధిగా ఉండాలని కొందరు సూచించారు. శ్రీ అన్న అని మనం పిలుచుకునే మన రైతులు పండించిన ముతక ధాన్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంచానికి (డైనింగ్ టేబుల్ కు) చేరాలని చాలా మంది సూచించారు. ప్రపంచంలోని పోషకాహారాన్ని బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని చిన్న రైతులకు మద్దతు ఇవ్వాలి. స్థానిక స్వపరిపాలనా సంస్థలతో సహా దేశంలోని వివిధ సంస్థల్లో పాలనా సంస్కరణల ఆవశ్యకతను పలువురు ఎత్తిచూపారు. న్యాయ సంస్కరణల ఆవశ్యకతతో పాటు న్యాయవ్యవస్థలో జాప్యంపై ఆందోళనలు కూడా తరచూ వ్యక్తమయ్యాయి. అనేక గ్రీన్ ఫీల్డ్ నగరాలను నిర్మించాల్సిన అవసరం ఉందని చాలా మంది రాశారు. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగంలో సామర్థ్యాన్ని పెంపొందించే ప్రచారాన్ని ప్రారంభించాలని ఒక వ్యక్తి సూచించారు. మరికొందరు వీలైనంత త్వరగా భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. ప్రపంచం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను స్వీకరిస్తున్నందున భారతదేశం సాంప్రదాయ వైద్యం, ఆరోగ్యానికి (శ్రేయస్సుకు) కేంద్రంగా అభివృద్ధి చెందాలని కొందరు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా భారత్ నిలవడం లో ఎటువంటి జాప్యం ఉండకూడదని మరొకరు అన్నారు.

 

మిత్రులారా,

 

నేను ఈ సూచనలను చదివాను ఎందుకంటే అవి నా తోటి పౌరులు అందించారు. ఇవి నా దేశంలోని సామాన్య పౌరుల సూచనలు. ఈ దేశ ప్రజలకు ఇంత పెద్ద ఆలోచనలు, గొప్ప కలలు ఉన్నప్పుడు, వారి సంకల్పం ఈ మాటలలో ప్రతిబింబించినప్పుడు, అది మనలో ఒక కొత్త సంకల్పాన్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. మన ఆత్మవిశ్వాసం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది, ప్రజల ఈ విశ్వాసం కేవలం మేధోపరమైన చర్చ మాత్రమే కాదు; ఇది అనుభవాల నుంచి బయటపడింది. ఈ నమ్మకం దీర్ఘకాలిక కృషి ఫలితమే. అందువల్ల భారత్ లోని 18 వేల గ్రామాలకు నిర్దిష్ట కాలపరిమితిలో విద్యుత్ అందిస్తామని, ఆ హామీ నెరవేరుతుందని ఎర్రకోటపై నుంచి సామాన్యుడు  వినగానే వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 2.5 కోట్ల కుటుంబాలు విద్యుత్తు లేకుండా అంధకారంలో మగ్గిపోతున్నాయని చెప్పగానే..  2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ అందితే సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మనం 'స్వచ్ఛ భారత్' గురించి మాట్లాడేటప్పుడు, సమాజంలోని సంపన్న వర్గాల నుండి గ్రామీణ కుటుంబాల వరకు, పేద కాలనీలలో నివసిస్తున్న ప్రజలు లేదా చిన్న పిల్లల వరకు, ఈ రోజు ప్రతి కుటుంబం పరిశుభ్రమైన వాతావరణాన్ని అలవాటుగా మార్చుకుంది, పరిశుభ్రతపై చర్చలను ప్రోత్సహిస్తోంది. పరిశుభ్రమైన అలవాట్లు, పర్యావరణం దిశగా సామాజిక మార్పు కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. ఇది దేశంలో వచ్చిన కొత్త చైతన్యానికి నిజమైన ప్రతిబింబం అని నేను నమ్ముతున్నాను.

 

నేడు మూడు కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఎర్రకోటపై నుంచి ప్రకటించినప్పుడు, మన కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన, స్వచ్ఛమైన తాగునీరు అందడం చాలా అవసరం. జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్ల కుటుంబాలకు తక్కువ సమయంలో పరిశుభ్రమైన కుళాయి నీటి సరఫరా అందుతోంది. నేడు 15 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయి. మన ప్రజలలో ఎవరు ఈ సౌకర్యాలకు దూరమయ్యారు? ఎవరు మిగిలారు? సమాజంలోని అగ్రవర్ణాలకు ఇలాంటి సౌకర్యాల లేమి ఎదురుకాలేదు. దళితులు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వర్గాలు, గిరిజన సోదరసోదరీమణులు, మురికివాడలలో బందీలుగా నివసిస్తున్న ప్రజలు, వారికి కనీస అవసరాలు లేవు. ఇలాంటి అనేక ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మేము ప్రయత్నాలు చేశాము. ఫలితాల ప్రయోజనాలు సమాజంలోని అందరికీ అందాయి.

 

వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని మేం ఇచ్చాం. ఈ రోజు ఆర్థికాభివృద్ధికి ఇదొక కొత్త మంత్రంగా   మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతి జిల్లా ఇప్పుడు తమ ఉత్పత్తులను చూసి గర్వపడుతోంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఇప్పుడు కొత్త తరంగం (వేవ్). వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్పత్తిని ఎగుమతి చేసే దిశలో ప్రతి జిల్లా ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించింది. పునరుత్పాదక ఇంధన సంకల్పాన్ని జిల్లాలు తీసుకున్నాయి. ఈ రంగంలో జీ-20 దేశాల కంటే భారత్ ఎక్కువ సాధించింది. ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది.

 

మిత్రులారా,

 

ప్రపంచం కూడా మన నుంచి నేర్చుకోవాలనుకుంటున్న ఫిన్ టెక్ లో సాధించిన విజయానికి మన దేశం ఎంతో గర్వపడుతోంది. ఇది మన సామర్థ్యాల గురించి మరింత గర్వపడేలా చేస్తుంది.

 

మిత్రులారా,

కరోనా మహమ్మారి సమయంలో మనం ఎదుర్కొన్న సంక్షోభాన్ని మనం ఎలా మరచిపోగలం? ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ (టీకా) కార్యక్రమం జరిగింది మన దేశంలోనే. ఇప్పుడు మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు యువత హృదయాలు గర్వంతో నిండిపోతాయి. వారి కారణంగానే 140 కోట్ల మంది దేశ ప్రజలు ఈ రోజు గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

మిత్రులారా,

ఈ అంశాలన్నింటిపై ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది. సంస్కరణల సాంప్రదాయానికి మరింత ఊపు లభించింది. రాజకీయ నాయకత్వం సాధికారతను తీసుకురావాలని నిశ్చయించుకున్నప్పుడు, అభివృద్ధి పట్ల దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పటిష్ఠమైన అమలుకు వీలు కల్పించడంతో పాటు నిర్ధారించడం ప్రారంభిస్తుంది. ఈ కలల ను సాకారం చేసే దిశ గా ప్రతి ఒక్క పౌరుడు క్రియాశీలకంగా పాలుపంచుకోవడం మొదలు పెట్టినప్పుడు ఆశించిన ఫలితాలను సాధించడం ఖాయం.

 

ప్రియమైన నా దేశప్రజలారా,

 

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఒక దేశంగా మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని మరచిపోకూడదు. 'చల్తా హై' (నడిచిపోతుంది లే) అనే మన వైఖరి, యథాతథ స్థితిని అంగీకరించడమే ఇందుకు కారణం. మార్పును అమలు చేయడంలో మనం విశ్వసించము లేదా పాల్గొనము. ప్రస్తుత స్థితిని సవాలు చేయం. కొత్తగా ఏమీ చేయం. అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని అనుకోం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతోనే జీవించాలన్న స్థితిగతుల వాతావరణం ఏర్పడింది. ప్రజలు ఏమీ జరగబోదని నమ్మేవారు. ఈ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చింది. మనలో ఆత్మవిశ్వాసం నింపాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేశాం. చాలా మంది అంటుంటారు, "మనం ఇప్పుడు తరువాతి తరం కోసం ఎందుకు పనిచేయాలి? వర్తమానంపై దృష్టి పెడదాం. కానీ దేశంలోని సాధారణ పౌరులు అలా కోరుకోలేదు. వారు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు, వారు మార్పును కోరుకుంటున్నారు, వారు దాని కోసం ఆత్రుతగా ఉన్నారు. కానీ వారి కలలు, ఆశలు, ఆకాంక్షలకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఫలితంగా వారు కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సంస్కరణల కోసం ఎదురు చూశారు. మాకు బాధ్యత అప్పగించారు, మేము గణనీయమైన సంస్కరణలను అమలు చేసాము. పేదలైనా, మధ్యతరగతి వారైనా, బడుగు, బలహీన వర్గాలైనా, పెరుగుతున్న పట్టణ జనాభా అయినా, యువత కలలు, తీర్మానాలు, వారి ఆకాంక్షలు అయినా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంస్కరణల మార్గాన్ని ఎంచుకున్నాం. సంస్కరణల పట్ల మా నిబద్ధత కేవలం గులాబీ పత్రికల సంపాదకీయాలకే పరిమితం కాదని దేశ పౌరులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. సంస్కరణల పట్ల మా నిబద్ధత నాలుగు రోజులు మాత్రమే కాదు. మా సంస్కరణల ప్రక్రియ బలవంతం వల్ల కాదు, దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో నడుస్తుంది. అందువల్ల, ఈ రోజు, మన సంస్కరణల మార్గం వృద్ధికి బ్లూప్రింట్ గా మారిందని నేను చెప్పగలను. మన సంస్కరణలు, ఈ పెరుగుదల, మార్పు, ఇవి కేవలం చర్చా సంఘాలు, మేధో సమాజం లేదా నిపుణులకు సంబంధించిన అంశాలు కావు.

 

మిత్రులారా,

 

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మేం అలా చేయలేదు. ఏం చేసినా రాజకీయ లాభనష్టాలను లెక్కపెట్టి ఆలోచించం. మా ఏకైక తీర్మానం- నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, దేశ ప్రయోజనాలే పరమావధి. నా దేశం గొప్పగా మారాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.

 

మిత్రులారా,

 

సంస్కరణల విషయానికి వస్తే సుదీర్ఘమైన కథ ఉంది, నేను దాని చర్చలోకి వెళితే గంటలు పట్టవచ్చు. కానీ నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు- బ్యాంకింగ్ రంగం స్థితిగతుల గురించి ఆలోచించండి- అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. అంతే కాదు, జరుగుతున్న కార్యకలాపాలు మన బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టాయి. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేశాం. ఫలితంగా నేడు మన బ్యాంకులు ప్రపంచంలోని ఎంపిక చేసిన బలమైన బ్యాంకుల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. బ్యాంకులు బలపడినప్పుడు, అధికారిక ఆర్థిక వ్యవస్థ శక్తి కూడా బలపడుతుంది. . ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడినప్పుడు, సామాన్య పేదల అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి ఇది గొప్ప శక్తిగా మారుతుంది.

 

గృహ రుణం, వాహన రుణం, ట్రాక్టర్ కొనడానికి నా రైతుకు రుణం, అంకుర సంస్థలు ప్రారంభించడానికి నా యువతకు రుణం, యువతకు విద్య కోసం రుణం లేదా విదేశాలకు వెళ్ళడానికి రుణం- ఇవన్నీ బ్యాంకుల ద్వారా సాధ్యమవుతాయి. నా పశుపోషక రైతులు, మత్స్య కారులైన  నా సోదర సోదరీమణులు కూడా ఈ రోజు బ్యాంకుల నుండి లబ్ధి పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. లక్షలాది మంది వీధి వ్యాపారులు ఇప్పుడు బ్యాంకులతో అనుసంధానం కావడం, కొత్త శిఖరాలను అధిరోహించడం, అభివృద్ధి పథంలో భాగస్వాములు కావడం నాకు సంతోషాన్నిస్తోంది. మన ఎమ్ఎస్ఎమ్ఇ ల కు, మన చిన్న తరహా పరిశ్రమ లకు బ్యాంకులు అతి పెద్ద తోడ్పాటు ను అందిస్తున్నాయి. మరింత పురోగతి కోసం రోజువారీ ఖర్చుల కోసం వారికి డబ్బు అవసరం, ఇది మన బలమైన బ్యాంకుల కారణంగా నేడు సాధ్యమైంది.

  

మిత్రులారా,

 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు "తల్లి-తండ్రి" సంస్కృతి వేళ్లూనుకుంది, ఇక్కడ ప్రజలు నిరంతరం ప్రభుత్వానికి విన్నవించవలసి వచ్చింది, ఉపకారాలు కోరవలసి వచ్చింది. సూచనలు లేదా సిఫార్సులపై ఆధారపడవలసి వచ్చింది. నేడు ఆ పాలనా నమూనాను మార్చాం. ఇప్పుడు ప్రభుత్వమే లబ్ధిదారులకు చేరువవుతోంది. ప్రభుత్వమే వారి ఇళ్లకు గ్యాస్ స్టవ్ లను పంపిణీ చేస్తుంది, వారి గృహాలకు నీటి సరఫరాను తీసుకువస్తుంది, విద్యుత్తును అందిస్తుంది, అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరేలా వారిని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

 

మిత్రులారా,

 

మా ప్రభుత్వం ప్రధాన సంస్కరణలకు కట్టుబడి ఉంది, ఈ ప్రయత్నాల ద్వారా, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

 

మిత్రులారా,

 

దేశంలో కొత్త వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి. దేశ ప్రగతి కోసం అనేక ఆర్థిక విధానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి, ఈ కొత్త వ్యవస్థలపై దేశ విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 20-25 ఏళ్లు ఉన్నవారు, దశాబ్దం క్రితం 12-15 ఏళ్ల వయసున్న వారు తమ కళ్లముందే ఈ మార్పును చూశారు. కేవలం 10 సంవత్సరాలలో, వారి కలలు రూపుదిద్దుకున్నాయి, వేగం పుంజుకున్నాయి, వారి  ఆత్మవిశ్వాసంలో కొత్త చైతన్యం పుట్టుకొచ్చింది,, ఇది ఇప్పుడు దేశానికి తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. నేడు, దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది,దేశం పట్ల ప్రపంచ వైఖరి మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యువతకు అవకాశాల తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లుగా మనకు అందని లెక్కలేనన్ని కొత్త ఉద్యోగావకాశాలు ఇప్పుడు వారి ముంగిట ఉన్నాయి. అవకాశాలు పెరిగాయి, కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి. నా దేశ యువత ఇక నెమ్మదిగా ముందుకు సాగాలని కోరుకోవడం లేదు. పురోభివృద్ధిపై వారికి నమ్మకం లేదు. బదులుగా, వారు ధైర్యంగా, సాహసోపేతమైన అడుగులు వేయడం ద్వారా కొత్త మైలురాళ్లను సాధించడానికి ఉత్సాహంగా ఉన్నారు. భారతదేశానికి ఇది స్వర్ణయుగం అని చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచ పరిస్థితులతో పోలిస్తే ఇది నిజంగా మన స్వర్ణయుగం.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా,

 

ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకుని మన కలలు, తీర్మానాలతో ముందుకు సాగితే 2047 నాటికి స్వర్ణిమ్ భారత్ (స్వర్ణ భారత్) కోసం దేశ ఆకాంక్షలను నెరవేరుసస్తూ, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధిస్తాము. శతాబ్దాల సంకెళ్ల నుంచి విముక్తి పొందాం.

 

ఈ రోజు, పర్యాటక రంగం, ఎంఎస్ఎంఇలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, వ్యవసాయం లేదా వ్యవసాయ రంగం కావచ్చు, ప్రతి రంగంలోనూ కొత్త, ఆధునిక వ్యవస్థ ఏర్పాటు చేయబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ మన దేశ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. సాంకేతిక విజ్ఞానాన్ని సమగ్ర పరచడం పై దృష్టి సారించి ప్రతి రంగం ఆధునికీకరణ, నూతన ఆవిష్కరణలను కోరుతోంది. ప్రతి రంగంలోనూ మా నూతన విధానాల వల్ల ఈ రంగాలు కొత్త మద్దతును, బలాన్ని పొందుతున్నాయి. మనం అన్ని అడ్డంకులను తొలగించి, ఎలాంటి ఒడిదుడుకులనైనా అధిగమించి, పూర్తి ఉత్సాహంతో, వికసిస్తూ, మన కలలను సాకారం చేసుకుంటూ, విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాలి. ఈ దార్శనికతను మనం అంతర్గతం చేసుకుని ఆ దిశగా నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలి.

 

ఇప్పుడు జరుగుతున్న భారీ మార్పును మీరు చూడవచ్చు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులను వెలుగులోకి తెస్తున్నాను. గత దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది సోదరీమణులు ఈ మహిళా స్వయం సహాయక సంఘాల్లో భాగమయ్యారు. 10 కోట్ల మంది కొత్త అక్కాచెల్లెళ్లు.. సాధారణ గ్రామీణ కుటుంబాలకు చెందిన 10 కోట్ల మంది మహిళలు ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా మారుతున్నందుకు నేను గర్వపడుతున్నాను. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులైనప్పుడు, వారు తమ కుటుంబాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం ప్రారంభిస్తారు.  వారు సామాజిక పరివర్తనకు హామీదారులుగా, సంరక్షకులుగా అవుతారు. భారతదేశానికి చెందిన పలువురు సిఇఒలు నేడు ప్రపంచ స్థాయిలో ప్రభావవంతమైన పాత్రలను పోషిస్తున్నందుకు నేను కూడా అంతే గర్వపడుతున్నాను. ఓ వైపు మన సీఈఓలు ప్రపంచ వ్యాపార రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూనే, మరోవైపు కోటి మంది తల్లులు, సోదరీమణులు మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి 'లఖ్పతి దీదీ'లుగా మారడం నిజంగా సంతృప్తినిస్తోంది. ఇది నాకు కూడా ఎంతో గర్వకారణం. మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించే నిధులను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని నిర్ణయించాం. ఇప్పటి వరకు ఈ స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా మొత్తం తొమ్మిది లక్షల కోట్ల నిధులు అందించడం ద్వారా వారు తమ వివిధ పనులను ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతోంది.

 

నా మిత్రులారా,

 

అంతరిక్ష రంగం మనకు కొత్త భవిష్యత్తును తెరుస్తోందనే వాస్తవాన్ని నా యువ మనస్సులారా, దయచేసి గుర్తుంచుకోండి. ఇది అభివృద్ధికి చాలా ముఖ్యమైన అంశం, దీనిపై మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము. ఈ రంగంలో అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ రంగం వృద్ధికి అడ్డంకిగా ఉన్న అనేక ఆంక్షలను తొలగించాం. భారత్ లో అంతరిక్ష రంగంలో అంకుర సంస్థలు పెరుగుతున్నాయి. ఈ రంగం ఇప్పుడు చాలా చైతన్యవంతంగా మారుతోంది, మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ రంగాన్ని బలోపేతం చేస్తూనే మా దార్శనికతతో ముందుకెళ్తున్నాం. నేడు మన దేశంలోనే ప్రైవేటు ఉపగ్రహాలు, రాకెట్లను ప్రయోగించడం మనకెంతో గర్వకారణం. జాతీయ అభివృద్ధి పట్ల సంపూర్ణ నిబద్ధత తో కూడిన విధానాలు, ఉద్దేశ్యాలు సరైనవే అయితే మనం గొప్ప ఫలితాలను సాధించగలమని నేను హామీ ఇవ్వగలను.

 

ప్రియమైన నా దేశప్రజలారా,

 

ఈ రోజు మన దేశం అపారమైన అవకాశాలను, కొత్త అవకాశాలను తెరిచింది. మన ఆర్థికాభివృద్ధి, అభివృద్ధిని వేగవంతం చేసిన మరో రెండు పురోగతులపైనే మనం దృష్టి పెట్టాలి. మొదటిది ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీనిలో మనం అంచెలంచెలుగా ఎదిగాం. రెండోది జీవన సౌలభ్యం, సామాన్య ప్రజలకు కూడా సరసమైన గౌరవప్రదమైన జీవనశైలి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.

 

గత దశాబ్దకాలంలో అత్యాధునిక రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పటిష్టమైన రహదారులు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం ద్వారా ప్రతి గ్రామానికి, అటవీ ప్రాంతాలకు కూడా పాఠశాల లభించేలా సౌకర్యాలు కల్పించడం, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించడానికి సుదూర ప్రాంతాల్లో ఆధునిక ఆసుపత్రులు, ఆరోగ్య మందిరాలు నిర్మించడం వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా అపారమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూశాం. అనేక వైద్య కళాశాలలు, ఆసుపత్రులను నిర్మిస్తున్నాము. 'అమృత్ సరోవర్స్'ను పునరుద్ధరించడం ద్వారా అరవై వేల చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేశాము. కాలువల భారీ నెట్వర్క్ కారణంగా ఇప్పుడు చాలా మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు పేదలకు కొత్త జీవం పోశాయి. ఈ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మూడు కోట్ల కొత్త ఇళ్లకు హామీ ఇవ్వడం జరిగింది.

 

మన ఈశాన్య భారతదేశం ఇప్పుడు వైద్య మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఈ రోజు మనం చేసిన పరివర్తన గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్న సమాజంలోని చాలా వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తోంది.. మారుమూల గ్రామాలను, సరిహద్దులను కలుపుతూ రహదారులు నిర్మించి ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చాం. ఈ పటిష్ఠమైన మౌలిక సదుపాయాల నెట్ వర్క్ ల ద్వారా దళితులు, దోపిడీకి గురైన, అణగారిన, వెనుకబడిన, గిరిజనులు, అడవిలో నివసిస్తున్న వారు, అడవులు, కొండలు, సుదూర సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారి అవసరాలను తీర్చగలిగాం. చేపల పెంపకం, పశుపోషణలో నిమగ్నమైన మన పౌరులకు సమగ్ర పథకాలను నిర్ధారించడానికి సంస్కరణలను రూపొందించేటప్పుడు ఇది ఒక కీలక ఎజెండాగా ఉంది.

 

మన మత్స్యకార సోదరసోదరీమణుల అవసరాలను తీర్చడం, మన పశు సంరక్షకుల జీవితాలను మార్చడం, సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం మన విధానాలు, మన ఉద్దేశాలు, మన సంస్కరణలు, మన కార్యక్రమాలు, మన పని శైలిలో భాగం. ఈ ప్రయత్నాల వల్ల నా యువకులు గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టడానికి కొత్త అవకాశాలు వస్తాయి, ఇదే అత్యధిక ఉపాధిని అందిస్తుంది, ఈ కాలంలో వారికి ఉపాధి పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

 

మన మధ్యతరగతి కుటుంబాలు సహజంగానే నాణ్యమైన జీవితంపై ఆశలు పెట్టుకొంటాయి. వారు దేశానికి గణనీయమైన సహకారం అందిస్తారు, కాబట్టి వారి జీవన నాణ్యత అంచనాలను నెరవేర్చడం దేశ బాధ్యత. వారిని అధికార అడ్డంకుల నుంచి విడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ కల సాకారమయ్యేనాటికి సాధారణ పౌరుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలనేది ఈ కలలో ఒక భాగం అని నేను ఊహించాను.అవసరమైన చోట సుపరిపాలన తప్పిపోకుండా, ప్రభుత్వం చేసే జాప్యాల వల్ల ఎలాంటి ప్రభావం చూపని వ్యవస్థకు కట్టుబడి ఉన్నాం. 

 

ప్రియమైన ప్రజలారా,

 

మన పేద కుటుంబాల్లో రోజూ పొయ్యి వెలిగేలా భరోసా కల్పించడమైనా, ఓ పేద తల్లి చింతాక్రాంత హృదయంతో నిద్రపోకుండా చూడడమైనా, ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను నిర్వహించడమైనా సరే – చిన్నచిన్న అవసరాలపైనా మేం దృష్టిపెడతాం; అతిచిన్న అంశాలనూ పరిశీలించి అందుకు తగినట్టుగా పనిచేస్తాం. (ఉచిత) విద్యుత్తు, నీరు, గ్యాస్ (కనెక్షన్లు)ఇప్పుడు పరిపూర్ణ స్థితిలో, అంటే 100 శాతం సరిపడా ఉన్నాయి. ఈ స్థితిలో కులతత్వం, వామపక్ష భావజాలాల రంగులు పులమడం ఉండదు. పరిపూర్ణత మంత్రాన్ని స్వీకరిస్తేనే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నిజమైన తాత్వికత సాకారమవుతుంది.
ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేలా మేం చర్యలు తీసుకున్నాం. గతంలో ప్రభుత్వం వేలాది నిబంధనలతో సాధారణ పౌరులపై భారం మోపేది. పౌరులు చట్టపరమైన సంక్లిష్టతల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడానికి మేము 1,500 చట్టాలను తొలగించాము. చిన్న చిన్న పొరపాట్లకు ప్రజలను జైలుకు పంపే చట్టాలు ఉండేవి. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష విధించే పద్ధతిని మేం రద్దు చేసి, చట్టంలో తదనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేశాము . స్వాభిమానంతో కూడిన మన స్వతంత్ర వారసత్వ ఘనతను నేడు చర్చించుకుంటున్నాం. శతాబ్దాల క్రితం నాటి నేర చట్టాల స్థానంలో (భారతీయ) న్యాయ సంహిత పేరిట కొత్త నేర చట్టాలను తీసుకొచ్చాం. ఇందులో ప్రధాన అంశం శిక్ష కాదు; పౌరులకు న్యాయం చేయాలనే భావన.

 

జీవన సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ లివింగ్) రూపొందించే దేశవ్యాప్త ప్రణాళికతో మేం కృషిచేస్తున్నాం. ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలోనూ నేను ఈ విషయాన్ని నొక్కి చెబుతు న్నాను. పార్టీ లేదా రాష్ట్రాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం పునరంకితమై చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మన యువత, వృత్తి నిపుణులు, ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలపై వాటి పరిష్కారాలను వివరిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. వారు ప్రభుత్వానికి తెలియజేయాలి. అనవసర ఇబ్బందులను తొలగించుకోవడం వల్ల నష్టమేమీ లేదు. నేటి ప్రభుత్వాలు సున్నితమైనవని నేను బలంగా నమ్ముతున్నాను. అవి  స్థానిక స్వపరిపాలన సంస్థలైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఈ అంశానికి ప్రాధాన్యమివ్వాలి.

2047 నాటికి వికసిత భారత్ కల సాకారం కావాలంటే పాలన సంస్కరణలు ఆవశ్యకం. ఈ సంస్కరణలతో ప్రజల జీవితాల్లో అవకాశాలను సృష్టిస్తూ, అవరోధాలను తొలగిస్తూ ముందుకు సాగాలి. పౌరులు తమ జీవితాల్లో గౌరవం పొందాలి; ‘‘ఇది నాహక్కు, అయినా దాన్ని నేను పొందలేకపోయాను’’ అని ఎవరూ ఎప్పుడూ చెప్పవలసిన అవసరం రాకూడదు. ప్రజలు తమకు దక్కాల్సిన వాటి కోసం వెతుక్కోవాల్సి రాకూడదు. కాబట్టి, పాలనలో సేవల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో సంస్కరణల గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల సంస్థలు పనిచేస్తున్నాయి. పంచాయతీలు, నగర పంచాయతీలు, నగర పాలికలు, మహానగర పాలికలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు లేదా కేంద్రం ఏదైనా సరే, ఈ 3 లక్షల విభాగాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈసంస్థలన్నిటికి నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను: మీ స్థాయిలో ప్రతి ఒక్కరూ సామాన్యులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఏడాదికి రెండు సంస్కరణలు చేపట్టండి; మిత్రులారా, నేను అంతకు మించి మరేమీ అడగడం లేదు. అది పంచాయితీ అయినా, రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా ఏ శాఖ అయినా ఏడాదికి రెండు సంస్కరణలు అమలు చేసి ఆచరణలో పెట్టండి. దాని
 

ప్రభావాన్ని ఊహించండి – దీనివల్ల ఏటా 25-30 లక్షల సంస్కరణలు రావచ్చు. 25-30 లక్షల సంస్కరణలు చేస్తే సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కొత్త ఆత్మవిశ్వాసం మన దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మన రంగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టి, కాలం చెల్లిన వ్యవస్థల నుంచి బయటపడి, మార్పును సృష్టించడానికి ముందుకు రావాలి. ధైర్యంగా వ్యవహరించాలి. సామాన్యుడి అవసరాలు చాలా చిన్నవి. కానీ, వారు పంచాయతీ స్థాయిలో కూడా సవాళ్లు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను మనం పరిష్కరించగలిగితే, మన కలలను సాకారం చేసుకోగలమన్న నమ్మకం నాకుంది.

ప్రియమైన దేశవాసులారా,
 

నేడు మన దేశం ఆకాంక్షలతో నిండి ఉంది. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఘనతను సాధించాలని మన దేశ యువత ఉవ్విళ్లూరుతోంది. కాబట్టి, మూడు కీలక రంగాలపై దృష్టి పెడుతూ, ప్రతి రంగంలో పురోగతిని వేగవంతం చేయడమే మన లక్ష్యం. మొదటిది, మనం అన్ని రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించడం. రెండవది, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం . మూడోది, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చి, మన పౌరులకు మెరుగైన జీవన స్థితిగతులు కల్పించడం. ఈ మూడు అంశాలు భారత్‌లో అభిలషణీయ సమాజాన్ని సృష్టించాయి. ఫలితంగా ఆత్మవిశ్వాసంతో నిండిన సమాజం ఏర్పడింది. మన పౌరుల ఆకాంక్షలను మన యువ శక్తితో, మన దేశ బలంతో మేళవించి అపారమైన ఉత్సాహంతో మనం ముందుకు సాగుతున్నాం. ఉపాధిలో, స్వయం ఉపాధిలో కొత్త రికార్డులు నెలకొల్పడంలో మనం గణనీయమైన పురోగతి సాధించామని నేను విశ్వసిస్తున్నాను. నేడు మన తలసరి ఆదాయం రెండింతలైంది.
అంతర్జాతీయ ప్రగతిలో భారత్ పాత్ర గణనీయంగా ఉంది, మన ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయి, మన విదేశీ మారక నిల్వలు రెట్టింపయ్యాయి, అంతర్జాతీయ సంస్థలు భారత్ పై ఎక్కువగా నమ్మకముంచాయి. భారత్ సరైన మార్గంలో ఉందని, వేగంగా పురోగమిస్తోందని, మన కలలకు గొప్ప శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. వీటన్నింటితో పాటు మన సునిశిత ధోరణి మనల్ని ఉత్తేజపరిచి, కొత్త చైతన్యాన్ని జాగరూకం చేస్తుంది. మన విధానంలో కరుణ కేంద్రబిందువు. మన పనిలో సమానత్వం, కరుణ రెండింటితో ముందుకు సాగుతున్నాం.

 

మిత్రులారా,
 

కరోనా కాలం గురించి ఆలోచిస్తే, అంతర్జాతీయ విపత్తు నడుమ తన ఆర్థిక వ్యవస్థను వేగంగా మెరుగుపరచుకున్న దేశమేదైనా ఉందంటే, అది భారత్ మాత్రమే. ఇది మనం సరైన మార్గంలో ఉన్నామన్న భరోసా కల్పిస్తుంది. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తుండడం దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనం. మువ్వన్నెల్లో నేడు దేశమంతా ఏకమైంది — కులం, మతం; పై తరగతి, దిగువతరగతి అనే భేదాలు లేకుండా ప్రతి ఇంటినీ త్రివర్ణ పతాకం అలంకరించింది. మనమంతా భారతీయులం. ఈ ఐక్యత మార్గనిర్దేశం దిశగా మన బలానికి నిదర్శనం. 25 కోట్లమందిని మనం పేదరికం నుంచి బయటకు తేగలిగితే, మనం మన వేగాన్ని కొనసాగించామని, మన కలలు త్వరలోనే నెరవేరుతాయన్న విశ్వాసాన్ని అది బలపరుస్తుంది. వందకు పైగా అభిలషణీయ జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని ఉత్తమ జిల్లాలతో పోటీ పడుతున్న సందర్భంగా దిశానిర్దేశం, వృద్ధి వేగం రెండూ కచ్చితంగా బలంగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. మన గిరిజన జనాభా తక్కువే అయినా మారుమూల ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చిన్న చిన్న సమూహాలుగా విస్తరించి ఉంది. వారి శ్రేయస్సు, అభివృద్ధి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గ్రామాలు, కొండలు, అడవుల్లోని వివిధ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎం జన్ మాన్ పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం ప్రభుత్వానికి సవాలే. కానీ మేము ఎవరినీ ఉపేక్షించడం లేదు. సహానుభూతితో కృషిచేస్తేనే అది నెరవేరుతుంది. మహిళలను గౌరవించడమే కాకుండా వారి ఆరోగ్యంపై మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దిశగా చిత్తశుద్ధితోనే, పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ఆమె ఒడిలో ఉన్న బిడ్డకు మనమే బాధ్యులం. ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ బిడ్డ మంచి పౌరుడవుతాడు. ఇది దేశంలోని మహిళలపై కరుణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో మాకు ప్రేరణ ఇస్తుంది.

భారతీయ సంకేత భాషలో సంభాషిస్తున్నప్పుడు, లేదా ‘సుగమ్య’ భారత్ ద్వారా సమ్మిళిత, గమన సులభ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందినప్పుడు నా దివ్యాంగ సోదర సోదరీమణులు గౌరవానుభూతిని పొంది, దేశ పౌరులుగా హుందాతనాన్ని ఆస్వాదిస్తారు. పారాలింపిక్స్‌లో మన క్రీడాకారులు అత్యద్భుతంగా రాణించడం అబ్బురపరుస్తోంది. మన సహానుభూతితో వారు బలం పొందారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లింగ పరివర్తిత వ్యక్తుల (ట్రాన్స్ జెండర్లు) సమాజంపై ఆచితూచి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చి; హెదా, గౌరవం, సమానత్వాన్ని కల్పించేలా సవరణలు చేయడం, కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా పలు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా, మార్పు దిశగా మనం సరైన మార్గంలో ముందుకు సాగుతున్నాం. ‘త్రివిధ మార్గాల్లో’ మొదలైన మనం సార్వత్రిక సేవాభావం ప్రత్యక్ష ప్రయోజనాన్నిచూస్తున్నాం.

60 ఏళ్ల అనంతరం, వరుసగా మూడోసారి దేశ సేవ కోసం మమ్మల్ని ఎంచుకున్నారు. నాపై 140 కోట్ల మంది దేశప్రజల ఆశీర్వాదాలకు ప్రతిస్పందనగా, నేనిచ్చే సందేశం: మీలో ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి సేవ చేయడానికే మేమిక్కడ ఉన్నాం. మీ ఆశీర్వాదాలు ఇచ్చిన శక్తితో, అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించి, ఎన్నుకున్న కోట్లాది మంది దేశ ప్రజలకు నేడు ఎర్రకోట ప్రాకారల నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొత్త ఉత్సాహంతో మనం కొత్త శిఖరాలను అధిరోహిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మనం చిన్నచిన్న విజయాలకు ఆనందించే వ్యక్తులం కాదు. కొత్త జ్ఞానాన్ని, వైభవాన్ని పొందాలనుకునే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం; ఉన్నత విజయాల కోసం నిరంతరం పరితపించేవాళ్లం. అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాం, మన పౌరుల్లో దానిని పెంపొందించాలనుకుంటున్నాం.
 

నూతన విద్యావిధానం ద్వారా 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత విద్యావిధానంలో పరివర్తన తేవాలనుకుంటున్నాం. వేగవంతమైన అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశంలో భవిష్యత్ సంసిద్ధత గల నైపుణ్య వనరులను మనం సిద్ధం చేయాలి. దేశంలో కొత్త ప్రతిభావంతులను గుర్తించడంలో నూతన విద్యావిధానం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. నా దేశంలోని యువత విదేశాల్లో చదువుకోవాలని ఒత్తిడి చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మధ్యతరగతి కుటుంబం తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మన దేశ యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మన మధ్యతరగతి కుటుంబాలు లక్షలు, కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతే కాదు, విదేశాల నుంచే భారతదేశానికి వచ్చేలా ప్రజలను ఆకట్టుకునే సంస్థలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నాం. ఇటీవల, నలందా విశ్వవిద్యాలయ పునర్నిర్మాణం ద్వారా బీహార్ ఘనమైన చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించాం. నలంద విశ్వవిద్యాలయం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది.
 

విద్యారంగంలో శతాబ్దాల నాటి ఆ నలంద స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసి, కొనసాగించాలి. అత్యంత ఆత్మవిశ్వాసంతో, విద్యారంగంలో ప్రపంచ విజ్ఞాన సంప్రదాయాల్లో కొత్త చైతన్యాన్ని తెచ్చేలా కృషి చేయాలి. నూతన విద్యావిధానం మాతృభాష ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తోందని నేను బలంగా నమ్ముతున్నాను. భాష కారణంగా దేశంలో ప్రతిభకు అవరోధం కలగకూడదని రాష్ట్ర ప్రభుత్వాలను, దేశంలోని అన్ని సంస్థలను కోరుతున్నాను. భాష అడ్డంకి కాకూడదు. మన దేశంలోని నిరుపేద పిల్లలకు కూడా వారి కలలను సాకారం చేసే శక్తిని మాతృభాష అందిస్తుంది. కాబట్టి, మాతృభాషలో అధ్యయనం, జీవితంలో మాతృభాష పాత్ర, కుటుంబంలో దాని స్థానాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి.
నా ప్రియమైన దేశవాసులారా,

 

నేడు ప్రపంచంలో మార్పులను గమనిస్తే, నైపుణ్యాల ప్రాధాన్యం బాగా పెరిగింది. కాబట్టి, మేము నైపుణ్యాలకు కొత్త ప్రేరణ ఇవ్వాలనుకుంటున్నాం. పరిశ్రమ 4.0ని దృష్టిలో ఉంచుకుని, నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాం. వ్యవసాయం సహా జీవితంలోని ప్రతి రంగంలో సామర్థ్యాన్ని పెంచడం కోసం నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలనుకుంటున్నాం. మన పారిశుద్ధ్య రంగంలో కూడా కొత్త నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి, ఈసారి మరింత విస్తృత స్థాయిలో ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ లో ఇంటర్న్ షిప్ లకు ప్రాధాన్యం ఇచ్చాం. తద్వారా మన యువత అనుభవాన్ని పొందవచ్చు; వారి సామర్థ్యాన్ని పెంపొందించుకుని, మార్కెట్లో నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. ఈ విధంగా నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా మిత్రులారా, నేటి అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే నైపుణ్యం గల భారత మానవ వనరులు, నైపుణ్యం కలిగిన మన యువత అంతర్జాతీయ ఉద్యోగ విపణిలో తమదైన ముద్ర వేస్తారని నేను స్పష్టంగాచెప్పగలను; అదే ఆకాంక్షతో మేం ముందుకెళ్తున్నాం.

 

మిత్రులారా,

ప్రపంచం శరవేగంగా మారుతోంది, జీవితంలోని ప్రతి అంశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యం పెరుగుతోంది. మనం సైన్స్ కు పెద్ద పీట వేయాలి. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన తర్వాత మన పాఠశాలలు, కళాశాలల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై కొత్త ఆసక్తి నెలకొనడాన్ని గమనించాను. ఈ నవోత్సాహాన్ని మన విద్యా సంస్థలు పెంపొందించాలి. కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు కూడా చేయూతను పెంచింది. చట్టపరమైన ఛట్రంతో జాతీయ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి పరిశోధనను నిరంతరం బలోపేతం చేసేలా శాశ్వత వ్యవస్థను అభివృద్ధి చేశాం. దేశ యువత ఆలోచనలు సాకారమయ్యేలా పరిశోధన, ఆవిష్కరణలకు బడ్జెట్ లో రూ. లక్ష కోట్లు కేటాయించడం గర్వకారణం.
 
మిత్రులారా,

 

నేటికి కూడా వైద్య విద్య కోసం మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పెద్ద మొత్తంలో వారు డబ్బు ఖర్చు చేస్తున్నారు. గత పదేళ్లలో వైద్య విద్యలో సీట్ల సంఖ్యను లక్షకు పెంచాం. ఏటా దాదాపు 25 వేల మంది యువత వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఒక్కోసారి, వైద్య విద్య కోసం వారు వెళ్లాల్సిన దేశాల గురించి వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి, వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో 75,000 కొత్త సీట్లను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం.


నా ప్రియమైన దేశవాసులారా,


2047 నాటి వికసిత భారత్ ఆరోగ్యవంతమైన భారత్ కూడా కావాలి. అందుకోసం అభివృద్ధి చెందిన భారతదేశపు  మొదటి తరమైన ఇప్పటి పిల్లల పౌష్టికతపై మనం దృష్టి పెట్టాలి. అందుకే వారి బాగోగులపై ప్రత్యేకంగా దృష్టి సారించి పౌష్టికాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తూ ‘జాతీయ పోషకాహార కార్యక్రమం/ నేషనల్ న్యూట్రిషన్ మిషన్  (పోషణ్ అభియాన్)ను ప్రారంభించాం.
 
నా ప్రియమైన దేశవాసులారా,


మన వ్యవసాయ వ్యవస్థలో పరివర్తన చాలా కీలకం, తక్షణ అవసరం. శతాబ్దాలుగా మనల్ని వెనక్కు నెడుతున్న కాలంచెల్లిన ఆచరణల నుంచి మనం విముక్తులం కావాలి. ఈ ప్రయత్నంలో మన రైతులకు మేము క్రియాశీలకంగా సహకరిస్తున్నాం. ఈ పరివర్తన కోసం మేం నిరంతరం కృషి చేస్తున్నాం. నేడు రైతులు సులభంగా రుణాలు పొందేలా చూడడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారికి మేం చేయూత అందిస్తున్నాం. తమ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా రైతులకు సహకరిస్తున్నాం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. తద్వారా రైతులకు అన్ని విధాలా సహకారం అందుతుంది. ఈ దిశలో ముందుకు సాగడానికి మేం కట్టుబడి ఉన్నాం.
నేడు ప్రపంచమంతా భూమాత విషయమై ఆందోళన చెందుతోంది. ఎరువుల వాడకం వల్ల మన నేలల సారం రోజురోజుకూ క్షీణించడాన్ని గమనిస్తున్నాం. అలాగే మన నేలల నుంచి ఉత్పాదకత కూడా క్షీణిస్తోంది. ఈ కీలక సమయంలో సేంద్రియ వ్యవసాయ


మార్గాన్ని ఎంచుకుని, మన భూమాతను రక్షించే బాధ్యతను స్వీకరించిన దేశంలోని లక్షలాది మంది రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది బడ్జెట్ లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, చేయూత ఇవ్వడానికి మేం గణనీయమైన
ఏర్పాట్లు చేసి, ప్రధాన పథకాలను ప్రవేశపెట్టాం.
 
నా ప్రియమైన దేశవాసులారా,

 

ఈ రోజు ప్రపంచ స్థితిగతులను బట్టి, ప్రపంచం మొత్తం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లుతుండడాన్ని గమనించాను. సేంద్రియ ఆహారం అందరికీ ప్రధాన ఎంపికగా మారుతోంది. ప్రపంచ దేశాలకు సేంద్రియ ఆహారానికి కేంద్ర బిందువు గా ఉండేది  నాదేశమే; ఈ ఉత్పత్తులను అందించేది దేశ రైతులే. అందుకే రాబోయే రోజుల్లో ఈ దార్శనికతతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం. తద్వారా, సేంద్రియ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్నందున మన దేశం ప్రపంచానికి సేంద్రియ ఆహార పాత్రగా మారవచ్చు. రైతుల జీవితాల్లో సౌలభ్యం, గ్రామాల్లో అగ్రశ్రేణి ఇంటర్నెట్ అనుసంధానత, రైతులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడడం, వారి పిల్లలకు అధునాతన పాఠశాలలతో పాటు ఉపాధి అవకాశాలు అందేలా భరోసా కల్పించేందుకు కృషిచేస్తున్నాం. చిన్న చిన్న స్థలాలపై మొత్తం కుటుంబం మనుగడ సాగించే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, కొత్త ఉద్యోగాలను పొంది, అదనపు ఆదాయ వనరులు సృష్టించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేసేలా మేము సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం.
ఇటీవలి సంవత్సరాల్లో, మేము మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి నమూనాపై దృష్టి సారించాం. ఆవిష్కరణ అయినా, ఉద్యోగరంగమైనా, వ్యవస్థాపక రంగమైనా ప్రతి రంగంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. భాగస్వామ్యాన్ని పెంచడమే కాదు, మహిళలు నాయకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. నేడు, చాలా రంగాల్లో — అది మన రక్షణ రంగం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, సైన్యం కావచ్చు, నౌకాదళం కావచ్చు లేదా మన అంతరిక్ష రంగం కావచ్చు —మన మహిళల శక్తి సామర్థ్యాలను మనం గమనిస్తున్నాం. మరోవైపు, కొన్ని ఆందోళనలు నన్ను అమితంగా బాధిస్తున్నాయి. ఎర్రకోట ప్రాకారాల నుంచి నేను వాటిని మరోసారి ప్రస్తావించాలనుకుంటున్నాను. మన తల్లి, సోదరీమణులు, బిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఒక సమాజంగా మనం తీవ్రంగా ఆలోచించాలి. దేశంలో, పౌరుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను.
రాష్ట్రాలు, సమాజం, దేశం ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై జరుగుతున్న నేరాలపై జాప్యం లేకుండా విచారణ జరపాలి. ఇటువంటి రాక్షస చర్యలకు పాల్పడే వారిపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌర సమాజంపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. అత్యాచార బాధితులైన మన తల్లీ కూతుళ్లనే మీడియాలో ప్రధానంగా చూపుతూ, సమాజంలో వారి గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు; అయితే, అత్యాచార నేరగాళ్లు వార్తల్లోకి ఎక్కడం లేదని కూడా నేను చెప్పదలచుకున్నాను. ఇప్పుడు నేరస్థుల గురించి విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి తప్పక శిక్ష పడుతుంది. తద్వారా, అలాంటి దుష్కృత్యాలకు పాల్పడేవారు ఉరి శిక్ష సహా తదుపరి పర్యవసానాలకు భయపడతారు. ఈ భయాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను.

 

నా ప్రియమైన దేశవాసులారా,

ఒక జాతిగా మన స్వీయ కృషిని, విజయాలను తక్కువ చేసుకోవడం మనకు అలవాటుగా మారింది. దురదృష్టవశాత్తూ, కారణమేదైనా మన జాతీయతపై గర్వించడం మానేశాం. ‘ఆలస్యంగా రావడం’ అన్నది సర్వసాధారణమైన భారతీయ మనస్తత్వమని వినడం అవమానకరంగా అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల దృక్పథాన్ని మెరుగుపరచడానికి మేం చాలా కష్టించాం. గతంలో భారతదేశంలో బొమ్మలు కూడా దిగుమతి అయ్యేవి. అలాంటి రోజులను కూడా మనం చూశాం. కానీ, నేడు మన బొమ్మల పరిశ్రమ అంతర్జాతీయ విపణిలో పేరెన్నికగన్నదని గర్వంగా చెప్తాం. మనం బొమ్మలను ఎగుమతి చేయడం ప్రారంభించాం. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యేవి. కానీ, మొబైల్ తయారీ వ్యవస్థకు ఇప్పుడు భరత్ పెద్ద కేంద్రంగా ఉంది. మనం వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం మొదలుపెట్టాం. అదీ మన సత్తా.
 
మిత్రులారా,

 

ప్రపంచ భవిష్యత్తు సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధతో ముడిపడి ఉంది. మనం సెమీకండక్టర్ మిషన్ ను ప్రారంభించాం. ప్రపంచానికి తక్కువ ధరల్లో లభించేలా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిస్తున్నాం. మన దగ్గర నైపుణ్యానికి కొదవలేదు; ఈ రంగంలో మన యువత లక్ష్యాలు భారీగా ఉండాలి. భారత్ పరిశోధన రంగంలో ఉంది; ఇప్పుడు తయారీ వైపు కూడా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచానికి అన్ని దశల్లోనూ సేవలందించే సామర్ధ్యం మనకుంది.
మిత్రులారా,

2జీ కోసం కూడా కష్టపడాల్సిన రోజులను మనం చూశాం. నేడు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 5జీ వ్యాప్తి పెరగడాన్ని మనం గమనించవచ్చు. మిత్రులారా, మనం ఇంతటితో ఎక్కడా ఆగేది లేదు, 5జీ తోనే ఆగిపోవడానికి ఒప్పుకునేదీ లేదు. ఇప్పటికే 6జీ కోసం విశేషంగా కృషిచేస్తున్నాం. మన పురోగతితో ప్రపంచాన్ని అబ్బురపరుస్తామని పూర్తి విశ్వాసంతో నేను చెప్పగలను.
 
నా ప్రియ మిత్రులారా,

 

రక్షణ రంగాన్ని గమనిస్తే, రక్షణ బడ్జెట్ లో ఏమాత్రం పెంపునైనా ప్రశ్నించడం మనకు అలవాటే. ఆ నిధులను ఎక్కడ వినియోగించారో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇతర దేశాల ఎగుమతులపై రక్షణ బడ్జెట్‌ను ఖర్చు చేశాం. రక్షణ రంగంలో కూడా స్వయంసమృద్ధంగా మారడంలో మన దళాల నిబద్ధత పట్ల, వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు ఇకపై ఎగుమతులపై ఆధారపడకూడదని  నిర్ణయించుకున్న వస్తువుల జాబితాను అందించారు. మన సైన్యం నుంచి మనం నిజమైన దేశభక్తిని నేర్చుకోవాలి. ఈ స్ఫూర్తితో రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం.  రక్షణ తయారీ రంగంలో కూడా భారత్ ఉనికిని చాటుకుంది. చిన్న వస్తువుల విషయంలోనూ దిగుమతులపై ఆధారపడిన మన రక్షణ రంగం క్రమంగా అభివృద్ధి చెంది ఎగుమతిదారుగా, వివిధ రక్షణ పరికరాల తయారీదారుగా మారిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కీలకమైన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నాం. నేడు, ఉత్పత్తి అనుసంధిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం గొప్ప విజయాన్ని సాధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ), సంస్కరణలు కూడా గణనీయమైన బలాన్ని చేకూర్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఒక కొత్త వ్యవస్థ అభివృద్ధి చెంది; ఫలితంగా మన తయారీ రంగం అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారే దిశలో ఉంది. అధికంగా యువ జనాభా ఉండి, దానిని సద్వినియోగపరచుకోగల సమర్థత ఉన్న దేశం భారత్. తయారీ ప్రపంచంలో, ముఖ్యంగా పరిశ్రమ 4.0లో గొప్ప శక్తితో పురోగమించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాం. నైపుణ్యాభివృద్ధిలో కొత్త నమూనాలను ప్రవేశపెట్టాం. తక్షణ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను త్వరితగతిన పెంపొందించుకునేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాం. భారతదేశం పారిశ్రామిక ఉత్పాదక కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని, ప్రపంచం భారత్ ను గమనిస్తోందని నేను విశ్వసిస్తున్నాను.
నేడు, ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయి. ఎన్నికల అనంతరం ఈ విషయాన్ని నేను గమనించాను. నా మూడో దఫా పదవీకాలంలో నన్ను కలవాలని అభ్యర్థిస్తున్న వారిలో ఎక్కువ మంది
పెట్టుబడిదారులు. వారు భారత్ కు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే అంతర్జాతీయ పెట్టుబడిదారులు. ఇదొక పెద్ద సువర్ణావకాశం.
 
పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు రూపొందించాలని నేను కోరుతున్నాను. సుపరిపాలనపై భరోసా కల్పించి, శాంతిభద్రతలపై వారిలో విశ్వాసం పెంపొందించాలి. ప్రతి రాష్ట్రం ఆరోగ్యకరమైన పోటీ ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించాలి. ఈ పోటీ వల్ల ఆయా రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయి; స్థానిక యువతకు అవకాశాలు లభించి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది.


విధానాలను మార్చాల్సి వస్తే, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు వాటిని మార్చుకోవాలి. భూమి అవసరమైతే, రాష్ట్రాలు భూ నిధిని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలు ఏకైక ప్రాధాన్యంగా సుపరిపాలన దిశగా ఎంత క్రియాశీలకంగా పనిచేసి ప్రయత్నాలు చేస్తే, ఈ పెట్టుబడిదారులు అంతగా దీర్ఘకాలికం కొనసాగే అవకాశం ఉంది. ఇది కేవలం కేంద్రప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడదు; ప్రాజెక్టులు రాష్ట్రాల్లోనే అమలవుతాయి కాబట్టి, రాష్ట్రప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాజెక్టులు  విజయవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలతో రోజువారీ సంప్రదింపులు అత్యావశ్యకం. కాబట్టి, ప్రపంచం భారత్ వైపు ఆకర్షితమై, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నందున, పాత అలవాట్లను విడిచిపెట్టి స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతూ మన బాధ్యతను నెరవేర్చాలని రాష్ట్రాలను కోరుతున్నాను. మీ రాష్ట్రంలో స్పష్టమైన ఫలితాలను చూస్తారు; మీ రాష్ట్రం ఓ వెలుగు వెలుగుతుందని హామీ ఇస్తున్నాను.

 

స్నేహితులారా,


   భారతదేశం తన ఉత్తమ నాణ్యత పరంగా గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. మనమిప్పుడు ప్రపంచం కోసం డిజైన్ రంగంపై దృష్టి పెట్టాలి. “డిజైన్ ఇన్ ఇండియా”కు ప్రాధాన్యమివ్వాలి. భారతీయ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పర్యాయపదంగా మార్చేందుకు కృషి చేయాలి. తద్వారా మన ఉత్పత్తులు ప్రపంచ ఆమోదం పొందడం సులభమవుతుంది. ఇది మన ఉత్పత్తులు, మన సేవలు, విధానాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మనం ముందుకు సాగాలంటే నాణ్యతపై దృష్టి పెట్టాలి. మనలో ప్రతిభ  ఉంది... డిజైన్ రంగంలో ఎన్నో నవ్యావిష్కరణలను ప్రపంచానికి అందించగలం. ‘డిజైన్ ఇన్ ఇండియా’ నినాదాన్ని స్వీకరించి ‘డిజైన్ ఫర్ ది వరల్డ్” అనే కలతో ముందుకు సాగాలి.
   గేమింగ్ ప్రపంచంలో మార్కెట్ నానాటికీ విస్తృతం కావడం నేను చూస్తున్నాను. అయితే, నేటికీ గేమింగ్ ప్రభావం, వీటి రూపకల్పనతో లాభాలు ప్రధానంగా విదేశీ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. మన దేశానికి గొప్ప వారసత్వం ఉంది... గేమింగ్ ప్రపంచంలోకి నవతకం ప్రతిభావంతులను తీసుకురాగలం. మన దేశంలో తయారయ్యే డిజిటల్‌ క్రీడలవైపు ప్రపంచవ్యాప్త బాలలను ఆకర్షించగలం. మన దేశపు బాలలు, యువత,  ఐటీ నిపుణులు సహా కత్రిమ మేధ (ఎఐ)  నిపుణులు గేమింగ్ ప్రపంచానికి నాయకత్వం వహించాలన్నది ఆకాంక్ష. గేమింగ్ ప్రపంచాన్ని మన ఉత్పత్తులు ప్రభావితం చేయాలి. మన యానిమేటర్లకు ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం ఉంది. ఈ పరిశ్రమలో మన భాగస్వామ్యం కోసం ఇంకా శ్రమించాలి.


నా ప్రియమైన దేశవాసులారా,


   ప్రస్తుతం భూ తాపం, వాతావరణ మార్పు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయంలో భారత్ అనేక కార్యక్రమాలు అమలు చేసింది. అంటే- మాటల్లో కాకుండా విస్పష్ట చేతలతో మన నిబద్ధతను నిరూపించాం. ప్రపంచం ఆశ్చర్యపడే ఫలితాలను సాధించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధంలో మనం ముందు వరసలో ఉన్నాం. పునరుత్పాదక విద్యుదుత్పాదన దిశగా గణనీయ కృషిచేశాం. ఈ రంగంలో కొత్త శక్తి నింపాం... మనమిప్పుడు నికరశూన్య ఉద్గార (నెట్-జీరో) స్థాయి వైపు పయనిస్తున్నాం. పారిస్ ఒప్పందం నిర్దేశిత లక్ష్యాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎర్రకోట నుంచి నా దేశ ప్రజల విజయాలను ప్రముఖంగా చాటాలని అనుకుంటున్నాను. జి-20 దేశాలు సాధించలేనిది మన పౌరులు సాధించారు. ఏ జి-20 దేశమైనా ఆ ఒప్పందం లక్ష్యాలను గడువుకు ముందే చేరిందంటే అది నా దేశం... భారత్‌ మాత్రమే. ఈ విజయం నాకెంతో గర్వకారణం. నేడు మనం పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు దగ్గరవుతున్నాం.. అంటే- 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యం చేరడానికి కఠోరంగా శ్రమిస్తున్నాం. నిజంగానే ఇదొక భారీ లక్ష్యం! దీన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోవచ్చుగానీ, మనం తప్పక దాన్ని సాధించగలమని నా తోటి పౌరులకు నేనెంతో ధీమాగా హామీ ఇస్తున్నాను. ఇది మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుంది... మన భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. మన తర్వాతి తరానికి ఉజ్వల భవిష్యత్తునిస్తుంది. మన రైల్వేలను 2030 నాటికి కర్బన ఉద్గార రహితంగా మార్చడానికి మనం కట్టుబడి ఉన్నాం.
 

స్నేహితులారా,


   ‘పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం’ కొత్త శక్తిని అందించడానికి సిద్ధంగా ఉంది, మన దేశంలోని సగటు కుటుంబాలు... ముఖ్యంగా మధ్యతరగతి వారి విద్యుత్ బిల్లులు ఉచితం అయినప్పుడు ఆ ప్రయోజనం వారి అనుభవంలోకి వస్తుంది. ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలకూ డిమాండ్ పెరుగుతోంది. ‘పిఎం సూర్య ఘర్ యోజన’ కింద సౌరవిద్యుత్‌ ఉత్పదనతో వారు తమ విద్యుత్‌ బిల్లుల వ్యయం కూడా తగ్గించుకోవచ్చు.


స్నేహితులారా,


   గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారత్‌ అంతర్జాతీయ కూడలిగా మారాలన్నది మన లక్ష్యం. ఆ దిశగా విధానాల రూపకల్పన-వాటి అమలు శరవేగంగా సాగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్‌ను సరికొత్త ఇంధన  వనరుగా రూపొందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ కృషితో భూ తాపం, వాతావరణ మార్పు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. అదే సమయంలో గణనీయ హరిత ఉపాధి (గ్రీన్ జాబ్స్) అవకాశాలు అందివస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు మన యువతకు ఉపాధి కల్పన కోసం మనం హరిత ఇంధన రంగానికి ప్రోత్సాహంతోపాటు దాని విస్తరణపై దృష్టి పెట్టాలి.
 

నా ప్రియమైన దేశవాసులారా,


   ఈ రోజున... ఈ త్రివర్ణ పతాకం నీడన... ప్రపంచ ఒలింపిక్ వేదికపై భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించిన యువ అథ్లెట్లు మనతో చేరారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలందరి తరఫున మన క్రీడాకారులందరికీ, నా అభినందనలు. కొత్త కలలు, సంకల్పాలు, అచంచల కృషితో సరికొత్త లక్ష్యాల దిశగా నిరంతరం శ్రమిద్దామనే ఆశాభావంతో వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరికొద్ది రోజుల్లో పారాలింపిక్స్ కోసం భారీ భారత ప్రతినిధి బృందం పారిస్ వెళ్లనుంది. ఆ బృందంలోని క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


స్నేహితులారా,


   భారత జి-20  అధ్యక్షత సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో 200కుపైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం. గతంలో ఎన్నడూ జి-20 కార్యకలాపాలు ఇంత ఘనంగా సాగిన ఉదంతాలు లేవు. ఇప్పుడు ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యం భారత్ సొంతం. మన అసమాన ఆతిథ్య హోదా నేడు యావత్‌ ప్రపంచానికీ అనుభవంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌ను భారత్‌ గడ్డపై నిర్వహించాలని లక్ష్యం నిర్దేశం చేసుకున్నాం. ఆ దిశగా ఇప్పటికే గణనీయ పురోగతి సాధించాం.
 

స్నేహితులారా,,


   సమాజంలో అవకాశాల అందనంత దూరంలోగల వారిని ఆదుకోవడం మనందరి సామాజిక బాధ్యత. ఎవరినైనా వదిలేస్తే అది మన సమష్టి పురోగమనానికే అవరోధం కాగలదు. వెనుకబడిన వారి అభ్యున్నతి ద్వారానే మనం నిజంగా ముందడుగు వేయగలం. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు, అణగారిన వర్గాలు, అడవుల్లోని చిన్న రైతులు, గిరిజన సోదరసోదరీమణులు, మన తల్లులు, మన కూలీలు, మన కార్మికులు... అందరికీ సమాజంలో సముచిత స్థాయి కల్పించడం మన కర్తవ్యం. తదనుగుణంగా ఇప్పటికే వేగం పుంజుకున్న మన కృషి త్వరలోనే లక్ష్యం చేరుకుంటుంది. అలా ముందడుగువేసే ఈ వర్గాలన్నీ మన సార్వత్రిక శక్తిని బలోపేతం చేస్తాయి. ముందున్న ముఖ్యమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఈ పనిని గొప్ప చైతన్యంతో నిర్వహించాలి.


   సున్నితత్వాన్ని పెంపొందించడానికి ఇంతకంటే ముఖ్యమైన సందర్భం ఏముంటుంది? 1857నాటి స్వాతంత్ర్య పోరాటానికి ముందే మన దేశంలో ఒక గిరిజన యువకుడు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి దృఢంగా నిలిచాడు. కేవలం 20-22 ఏళ్ల చిన్న వయసులోనే మొక్కవోని ధైర్యంతో వారికి సవాలు విసిరాడు. ఆయనే నేడు అపార గౌరవాదరలు పొందుతున్న భగవాన్ బిర్సా ముండా. ఆయన 150వ జయంతి సమీపిస్తున్న తరుణంలో ఆ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుదాం. ఒక సామాన్యుడు కూడా ప్రగాఢ దేశభక్తిని ఎలా ప్రదర్శించగలడో చెప్పడానికి ఆయనను మించినవారు మరెవరుంటారు? భగవాన్ బిర్సా ముండా జయంతిని సందర్భంగా సమాజంపై  మన అవగాహన, కరుణ మరింత బలపడాలి. పేదలు, దళితులు, వెనుకబడినవారు, గిరిజనులు ఇలా మన సమాజంలోని ప్రతి ఒక్కరినీ మమేకం చేసుకుంటూ గట్టి సంకల్పంతో సమష్టిగా ముందుకు సాగుదాం.


నా ప్రియమైన దేశవాసులారా,


   మనం దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ గణనీయ పురోగతి సాధిస్తున్నాం. అయితే, కొందరు వ్యక్తులు దీన్ని అభినందించలేని దుస్థితిలో ఉన్నారన్నది నిజం. స్వలాభానికి అతీతంగా ఆలోచించలేని వారు, ఇతరుల బాగోగులను పట్టించుకోని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు తమ వక్రబుద్ధితో అందరికీ ఆందోళన కలిగిస్తారు. నిస్పృహలో కూరుకుపోయిన ఇలాంటి వారిని దేశం దూరం నెట్టాలి. ఆ కొద్దిమంది వ్యక్తులు తమ వ్యతిరేక భావనలతో విషబీజాలు నాటితే అది అరాచకం, విధ్వంసం, గందరగోళం, తీవ్రమైన ఎదురుదెబ్బలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితులను సరిదిద్దాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ నిరాశావాద శక్తులు కేవలం నిస్పృహకు పరిమితం కాదు... వినాశం గురించి కలలుకంటూ మన సమష్టి పురోగతిని బలహీనపరిచే ప్రతికూల మనస్తత్వాన్ని వారు పెంచి పోషిస్తున్నారు. ఈ ముప్పును దేశం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన మంచి ఉద్దేశాలు, సమగ్రత, దేశంపై అంకితభావంతో మనను వ్యతిరేకించే వారిని కూడా మనం గెలవగలమని నా తోటి పౌరులకు నేను హామీ ఇస్తున్నాను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నిబద్ధత నుంచి వెనక్కు తగ్గేది లేదని, ఈ సంకల్పాన్ని నెరవేర్చి తీరుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.


స్నేహితులారా,


   అంతర్గతంగానూ, బాహ్యంగానూ మనముందు చాలా సవాళ్లున్నాయి. మనం బలపడుతూ ఎదుటివారి దృష్టిని మరింతగా ఆకర్షించే కొద్దీ ఈ సవాళ్లు పెరగడం ఖాయం. ముఖ్యంగా బాహ్య సవాళ్లు ఇంకా పెరిగే ముప్పుంది. ఈ విషయం నాకు బాగా తెలుసు... కానీ, భారత్ అభివృద్ధి ఎవరికీ ముప్పు కాదని అలాంటి శక్తులకు తెలపాలని భావిస్తున్నాను. గతంలోనూ మనం సుభిక్షంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని యుద్ధాల్లోకి లాగలేదు. మనది బుద్ధుడు పుట్టిన భూమి.. యుద్ధం మన మార్గం కాదు కాబట్టి, ప్రపంచానికి ఆందోళన అక్కర్లేదు. భారత్‌ పురోగమిస్తున్న కొద్దీ దాని విలువలను, వేల ఏళ్ల చరిత్రను అర్థం చేసుకోవాలని నేను ప్రపంచ దేశాలను కోరుతున్నాను. మమ్మల్ని ముప్పుగా భావించవద్దు... సమస్త మానవాళి సంక్షేమానికి దోహదపడే భూమిని కష్టతరం చేసే వ్యూహాలను అనుసరించవద్దు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవడమే  భారత్ స్వభావమని నా సహ పౌరులకు చెప్పాలని భావిస్తున్నాను. మనం ఎన్నడూ తడబడం.. అలసిపోం.. ఆగిపోం... ఎవరికీ తలవంచం. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తలరాతను మార్చడంలో, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో,  దేశం కలలను సాకారం చేయడంలో మా నిబద్ధతను చాటుకోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయం. ప్రతి దురుద్దేశాన్ని మా మంచితో జయించగలమనే నమ్మకమిస్తున్నాను.


నా ప్రియమైన దేశవాసులారా,


   సామాజిక నిర్మాణంలో మార్పులు కొన్నిసార్లు గణనీయ సవాళ్లకు దారితీస్తాయి. ప్రతి పౌరుడు అవినీతి చెదపురుగుతో ఇబ్బంది పడ్డాడు. అన్ని స్థాయులలో అవినీతి చెదపురుగు మన వ్యవస్థపై సామాన్యుల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఒకరి శక్తిసామర్థ్యాలకు అన్యాయం వల్ల కలిగే ఆగ్రహం దేశ పురోగతిని దెబ్బతీస్తుంది. అందుకే అవినీతిపై విస్తృత యుద్ధానికి శ్రీకారం చుట్టాను. ఈ యుద్ధానికి ఎంతోకొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు; నా ప్రతిష్టకు భంగం కలగ వచ్చు... కానీ, దేశంకన్నా వ్యక్తిగత ప్రతిష్ట నాకు ముఖ్యం కాదు. నా కలల్లో ఏ ఒక్కటీ  దేశం కలలకు మించినది కాదు. అందుకే అవినీతిపై నా పోరాటం పూర్తి చిత్తశుద్ధితో, శరవేగంగా కొనసాగుతుంది. అవినీతిని అణచివేసేందుకు చర్యలు తీసుకుంటాం. అవినీతిపరులకు భయానక వాతావరణం సృష్టించాలని అనుకుంటున్నాను. తద్వారా సామాన్య పౌరుడిని దోచుకునే సంప్రదాయానికి ముగింపు పలకాలి. అయితే, అవినీతిని ఎదుర్కోవడం మాత్రమే కాకుండా ఉన్నత స్థాయిలో వస్తున్న సామాజిక మార్పు కూడా అతిపెద్ద కొత్త సవాలు. ఇది సమాజానికి ఒక ముఖ్యమైన సవాలుగా, తీవ్రమైన ఆందోళనగా మారింది. మనది గొప్ప రాజ్యాంగం... మనదేశంలో కొందరు అవినీతిని కీర్తిస్తున్నారని ఎవరైనా ఊహించగలరా? అవినీతిని బహిరంగంగానే అభినందిస్తున్నారు. సమాజంలో అవినీతి బీజాలు నాటేందుకు,   దాన్ని గొప్పగా చిత్రించేందుకు, అవినీతిపరులను సమాజం అంగీకరించే స్థాయికి చేరేలా నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఆరోగ్యకర సమాజానికి పెనుసవాలుగా, అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారాయి. సమాజంలోని అవినీతిపరులకు దూరంగా ఉండటం ద్వారా వారు ఆ మార్గంలో వెళ్లడానికి భయపడే వాతావరణం సృష్టించవచ్చు. ఏదేమైనా అవినీతిని కీర్తిస్తే ప్రస్తుతం నిజాయితీగా ఉన్నవారు కూడా దానిని ప్రతిష్ఠకు చిహ్నంగా చూడటం ప్రారంభిస్తారు. అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యమనే అపోహ ఏర్పడుతుంది.


నా ప్రియమైన దేశవాసులారా,


   బంగ్లాదేశ్ లో ఇటీవలి సంఘటనలపై ఆందోళనలను నేను అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా పొరుగు దేశంగా మన సామీప్యత దృష్ట్యా, త్వరలోనే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రాగలవని నమ్ముతున్నాను. మన 140 కోట్ల మంది పౌరుల ప్రాథమిక ఆందోళన బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీల భద్రత గురించే. మన పొరుగు దేశాలు సంతృప్తి, శాంతి మార్గాన్ని అనుసరించాలని భారత్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. శాంతిభద్రతల విషయంలో మన నిబద్ధత మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. రాబోయే రోజుల్లో, మన సానుకూల ఆలోచనలు బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కొనసాగుతాయి, ఎందుకంటే- మనం మానవాళి సంక్షేమానికి అంకితమయ్యాం.


నా ప్రియమైన దేశవాసులారా,


   మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నేపథ్యంలో దేశాన్ని ఏకం చేయడంలో, బలోపేతం చేయడంలో దాని కీలక పాత్ర గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ 75 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు దళితులు, అణగారిన, దోపిడీకి గురయ్యే, అవకాశాలు అందని అన్నివర్గాల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించింది. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా, పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన విధులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం, నేను విధుల గురించి మాట్లాడటమంటే- పౌరులపై భారం మోపాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ బాధ్యత కేవలం పౌరులకు అతీతంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి సిబ్బంది, స్థానిక స్వపరిపాలన సంస్థలు... ఒక్కమాటలో చెబితే దేశవ్యాప్త పాలన సంస్థలన్నిటికీ వర్తిస్తుంది. అయితే, 140 కోట్ల మంది పౌరులు తమ కర్తవ్యాన్ని కూడా గుర్తించడం చాలా అవసరం. మనమంతా సమష్టిగా మన బాధ్యతలను నిర్వర్తిస్తే సహజంగానే ఒకరి హక్కులను మరొకరు పరిరక్షించినవారం అవుతాం. తద్వారా ఎలాంటి అదనపు శ్రమ లేకుండా సహజంగానే హక్కులను పరిరక్షిస్తాం. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మన సమష్టి శక్తిని పెంపొందించి, కొత్త శక్తితో ముందుకు నడిపించే ఈ మనస్తత్వాన్ని మనం స్వీకరిస్తామని నేను ఆశిస్తున్నాను.


నా ప్రియమైన దేశవాసులారా,


   మన దేశంలో సుప్రీంకోర్టు పలుమార్లు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అంశాన్ని ప్రస్తావించింది. మన జనాభాలో గణనీయ శాతం నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ అనేక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆ మేరకు ప్రస్తుత పౌరస్మృతి ఒక మతానికి సంబంధించిన సివిల్ కోడ్‌ను పోలి ఉందని, అది వివక్షాపూరితమని స్పష్టమైంది. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మార్పు ను ప్రతిపాదిస్తున్నందున ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలి. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను సాకారం చేయడం మన సమష్టి బాధ్యత. విభిన్న అభిప్రాయాలను, దృక్పథాలను స్వాగతించాలి. మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టే, వివక్షను పెంచే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదు. అందువల్ల దేశం లౌకిక పౌర స్మృతిని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని నేను నొక్కి చెబుతున్నాను. తదనుగుణంగా 75 ఏళ్లపాటు పాత స్మృతి అమలైన నేపథ్యంలో లౌకిక పౌరస్మృతి దిశగా అడుగులు వేయడం చాలా అవసరం. ఈ మార్పు ద్వారా మత వివక్ష తొలగిపోయి, సాధారణ పౌరుల మధ్య అంతరం తగ్గుతుంది.


నా ప్రియమైన దేశవాసులారా,


   దేశంలో వారసత్వ రాజకీయాలు, కులతత్వం గురించి నేనెప్పుడు ప్రస్తావించినా, భారత ప్రజాస్వామ్యానికి అవి తీవ్ర హాని చేస్తున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. వీటినుంచి నుంచి దేశాన్ని, రాజకీయాలను విముక్తం చేయాలి. ఇవాళ నా ముందున్న యువకులు “మై భారత్” సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారన్నది నాకు తెలుస్తోంది. వాళ్లు చాలా బాగా రాస్తున్నారు. ఆ సంస్థకు అనేక లక్ష్యాలున్నాయి. వీలైనంత త్వరగా లక్ష మంది యువతను ప్రతినిధులుగా రాజకీయ జీవితంలోకి తేవడం వాటిలో ఒకటి. రాజకీయ నేపథ్యం లేని... అంటే- తల్లిదండ్రులు, తోబుట్టువులు, మామలు, అత్తలు రాజకీయ నాయకులు కాని కుటుంబాల నుంచి లక్షమంది యువతను ముందుకు తేవాలనుకుంటున్నాం. కొత్త రక్తం కావాలి... పంచాయతీ, మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా కౌన్సిళ్లు, రాష్ట్ర అసెంబ్లీలు, లోక్‌సభలోకి అలాంటి ప్రతిభావంతులైన యువత కావాలి. ఫలానా పార్టీ అనేదేదీ లేకుండా నచ్చిన పార్టీలో చేరి ప్రతినిధులుగా మారాలి. అలాంటివారు లక్షమంది సమీప భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థలో ప్రవేశిస్తే ప్రజాస్వామ్యం సుసంపన్నం కావడమే కాకుండా కొత్త ఆలోచనలకు, కొత్త సామర్థ్యాలకు దారితీస్తుందన్నది వాస్తవం. కాబట్టి, మనం ఈ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తరచూ ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతోందని, అవరోధాలు వస్తున్నాయని కూడా చెప్పదలిచాను. దేశంలో ప్రతి మూడు.. ఆరు నెలలకోసారి ఎన్నికలు వస్తున్నందున ప్రతి పథకం వాటితో ముడిపెట్టడం సులువైంది. ఎప్పుడు ఏ పథకాన్ని ప్రకటించినా అది ఏదో ఒక ఎన్నికలతో ముడిపడి ఉందన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. ప్రతి పథకానికీ ఎన్నికల రంగు పులుముతున్నారు. దీనిపై దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయం వెల్లడించాయి. క్ష కమిటీ చాలా మంచి నివేదిక తయారుచేసింది. ఆ ప్రకారం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను స్వీకరించేందుకు దేశం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టే, ఈ నినాదం సాకారమయ్యేలా రాజకీయ పార్టీలు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవారు ముందుకు రావాలి. భారతదేశ పురోభివృద్ధికి, దాని వనరులను సామాన్యుల కోసం గరిష్ఠంగా వినియోగించడానికి ఈ ముందడుగు అత్యంత అవశ్యమని త్రివర్ణ పతాకం సాక్షిగా ఎర్రకోట బురుజుల నుంచి కోరుతున్నాను.


నా ప్రియమైన దేశవాసులారా,


   ఇది భారత దేశానికి స్వర్ణయుగం... వికసిత భారత్-2047 మన కోసం ఎదురుచూస్తోంది. అవరోధాలు, అడ్డంకులు, సవాళ్లను అధిగమించి దృఢ సంకల్పంతో ముందుకు సాగేందుకు ఈ దేశం కట్టుబడి ఉంది. మిత్రులారా... నా ఆలోచనలలో ఎటువంటి సంకోచం లేదు. నా దక్కోణం చాలా స్పష్టంగా ఉంది. నా కలలకు ఏ ముసుగూ లేదు. మన 140 కోట్ల మంది ప్రజల్లో పూర్వికుల రక్తం ప్రవహిస్తోందని నాకు స్పష్టంగా తెలుసు. ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు స్వాతంత్య్ర స్వప్నాన్ని సాకారం చేయగలిగినపుడు ఈనాడు 140 కోట్ల మంది పౌరులు సుసంపన్న భారత్ కలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. నేనింతకుముందే చెప్పినట్లు, నా మూడోదఫా పదవీకాలంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందడం తథ్యం. ఆ  మేరకు నేను మూడు రెట్లు శ్రమించి.. మూడు రెట్ల వేగంతో... మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తాను. తద్వారా దేశం కోసం మనం కంటున్న కలలు త్వరగా సాకారం కాగలవు. నా ప్రతి క్షణం దేశం కోసమే. ప్రతి సెకను దేశానికే అంకితం; నాది అన్నదేదైనా భరతమాత కోసమే. నా అణువణువూ తల్లి భారతి కోసమే. కాబట్టే 24 గంటలూ పనిచేయాలనే నిబద్ధత, దేశం 2047 నాటికి ‘వికసిత భారత్’ కావాలనే దార్శనికత ఆలంబనగా నా తోటి పౌరులకు పిలుపునిస్తున్నాను: మన పూర్వికులు కన్న కలలను స్వీకరించి మన కలలను వాటికి జోడించి ఒక మహా సంకల్పంగా మార్చుకుందాం. అందుకు తగినట్లు అవిరళ కృషికి శ్రీకారం చుడదాం. మన ఆశయాలను, మన ప్రయత్నాలను అనుసంధానిద్దాం. ఈ 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా పరిగణించి ‘స్వర్ణ భారత్’ను తీర్చిదిద్దుదాం. ఈ శతాబ్దంలో ‘వికసిత భారత్’తో మన కలలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుదాం. స్వతంత్ర భారతం తన 75 ఏళ్ల ప్రయాణం తర్వాత కొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న తరుణంలో మనం ఎంతమాత్రం వెనుకంజ వేయకూడదు. మీరు నాకు అప్పగించిన బాధ్యతల దృష్ట్యా నేను ఏ మాత్రం వెనక్కి తగ్గబోనని హామీ ఇస్తున్నాను. కష్టపడి పని చేసేందుకు నేనెప్పుడూ వెనుకాడను. ధైర్యంలో ఎప్పుడూ తగ్గను; సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ భయపడను. ఎందుకంటే- నేను మీ కోసం బతుకుతున్నాను.. మీ భవిష్యత్తు కోసం బతుకుతున్నాను.. భరతమాత ఉజ్వల భవిష్యత్తు కోసం బతుకుతున్నాను. ఈ నేపథ్యంలో మన కలల సాకారానికి ఈ త్రివర్ణ జాతీయ పతాకం నీడన దృఢనిశ్చయంతో ముందుకు సాగుదాం. నాతో గళం కలిపి నినదించండి:

భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
జై హింద్!
జై హింద్!
జై హింద్!

 

****



(Release ID: 2045948) Visitor Counter : 31