పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

భార‌త‌ 78వ స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా 2024 ఆగ‌స్టు 15న‌ ఎర్ర‌కోట‌ను సంద‌ర్శించిన పంచాయ‌తీ రాజ్ సంస్థ‌ల ప్ర‌తినిధులు

Posted On: 15 AUG 2024 6:56PM by PIB Hyderabad

   భారత 78వ స్వాతంత్య్ర దినోత్స‌వాల సంద‌ర్భంగా దేశవ్యాప్త పంచాయతీ రాజ్ సంస్థ‌ల‌ ప్రజా ప్రతినిధులు దాదాపు 400 వంద‌ల మంది చరిత్రాత్మ‌క‌ ఎర్ర‌కోట‌ను సంద‌ర్శించారు. వీరంతా కేంద్ర‌ ప్ర‌భుత్వ అతిథులుగా ఈ వినూత్న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా గ్రామీణ భార‌త హృద‌య స్పంద‌న‌కు దేశ‌ రాజ‌ధాని సాక్షిగా నిలిచింది. త‌ద్వారా వారిలో ఐక‌మ‌త్య భావ‌న‌ను ప్రోదిచేసింది.

   ఎర్ర‌కోట వేదిక నుంచి జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ ప్ర‌గ‌తి, సౌభాగ్యంలో స్థానిక సంస్థలు పోషించే కీల‌క పాత్ర‌ను నొక్కిచెప్పారు. దేశంలోని పంచాయ‌తీలు సహా 3 ల‌క్ష‌ల వ్యవస్థగత యూనిట్లు ఏటా రెండు అర్థ‌వంత‌మైన సంస్క‌ర‌ణ‌లను అమ‌లు చేయాల‌ని ఆయన ఉద్బోధించారు. ఆ మేరకు ‘‘ఏడాదిలో 25 నుంచి 30 ల‌క్ష‌ల సంస్క‌ర‌ణ‌లు అమలైతే సామాన్య పౌరుల ఆత్మ‌విశ్వాసం ఇనుమడిస్తుంది’’ అని ప్రకటించారు. త‌ద్వారా దేశం కొత్త శిఖ‌రాల‌కు చేరగలదని ప్ర‌ధాని అన్నారు. భార‌త‌ ప్ర‌జాస్వామ్య బ‌లోపేతం, బ‌ల‌హీన వ‌ర్గాల హ‌క్కుల‌ రక్షణలో  రాజ్యాంగ 75 ఏళ్ల పయనం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. పౌర విధులను ప్ర‌త్యేకంగా ఉటంకించిన ప్ర‌ధాని- ‘‘ఎవ‌రికి వారు త‌మ కర్తవ్యాన్ని నిర్వ‌ర్తిస్తే హ‌క్కుల ర‌క్ష‌ణ దానిక‌దే సంపూర్ణం కాగలదు’’ అన్నారు.

   దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన పంచాయ‌తీ రాజ్ ప్ర‌తినిధులు తమ సంప్ర‌దాయ వస్త్రధారణలో రావడంతో ఎర్ర‌కోట ప్రాంగ‌ణం భార‌త‌దేశ వైవిధ్యాన్ని ఆవిష్క‌రించే దృశ్యంగా రూపాంత‌రం చెందింది. త్రివ‌ర్ణ‌ ప‌తాకం ఇచ్చిన ఉమ్మ‌డి స్ఫూర్తితో పంచాయ‌తీరాజ్ ప్ర‌తినిధులు ఐకమత్యానికి, దేశ‌భ‌క్తికి ప్రతీకలుగా, ‘భిన్న‌త్వంలో ఏక‌త్వం’ భావ‌న‌కు నిదర్శనంగా నిలిచారు.

   దేశ 78వ స్వాతంత్య్ర దినోత్స‌వాల సంద‌ర్భంగా పంచాయ‌తీరాజ్ సంస్థ‌ల‌ మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను స‌త్క‌రించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని కూడా ఢిల్లీలో నిర్వ‌హించారు. కాగా, విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌శంస‌లు పొందిన 400 మంది ప్ర‌తినిధుల్ని ప్ర‌త్యేక అతిథులుగా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర‌ పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజ‌న్ సింగ్‌, స‌హాయ మంత్రి ప్రొఫెస‌ర్ ఎస్.పి.ఎస్‌.భాఘేల్ మాట్లాడుతూ- స్థానిక సంస్థ‌ల పాల‌న‌లో మ‌హిళ‌ల కీల‌క‌ పాత్ర‌ను ప్ర‌శంసించారు. వారి భాగ‌స్వామ్యాన్ని, నాయ‌కత్వ ప‌టిమ‌ను కొనియాడారు. పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ వివేక్ భ‌ర‌ద్వాజ, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ కుమార్, సంయుక్త కార్యదర్శులు శ్రీ అలోక్ ప్రేమ్ నాగ‌ర్‌, శ్రీమ‌తి మ‌మ‌తా వ‌ర్మ‌, శ్రీ వికాస్ ఆనంద్, శ్రీ రాజేష్ కుమార్ సింగ్‌, ఆర్థిక వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు డాక్ట‌ర్ విజ‌య కుమార్ బెహ‌రా, వివిధ రాష్ట్రాల‌ అధికారులు, ఇత‌ర భాగ‌స్వాములు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

   పంచాయ‌తీ రాజ్ ప్ర‌జా ప్ర‌తినిధులు జీవితంలో మ‌రిచిపోలేని ఆనందానుభూతి పొందేవిధంగా కేంద్ర పంచాయ‌తీరాజ్ శాఖ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. అనంతరం వారి గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ వేదిక‌ద్వారా పంచాయ‌తీరాజ్ సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఇత‌ర ప్ర‌తినిధుల ఉత్తమ విధానాల‌ను తెలుసుకున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో కేంద్ర మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హించిన వినూత్న కార్య‌క్ర‌మాల‌ద్వారా అనేక కీల‌కాంశాలను ప్రతినిధులు తెలుసుకోగ‌లిగారు.

   పంచాయ‌తీరాజ్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల పాల‌న‌లో కొత్త శ‌క్తి నింపింది. గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌ను శ‌క్తిమంతం చేయడంలో కేంద్ర ప్ర‌భుత్వ నిబ‌ద్ధత‌ను, జాతి నిర్మాణంలో స్థానిక సంస్థ‌ల తిరుగులేని పాత్ర‌ను ఈ కార్య‌క్ర‌మం ఘ‌నంగా చాటింది. దేశం ఆత్మవిశ్వాసంతో 78వ స్వాతంత్య్రం దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ ఈ చారిత్రక వేడుకలలో పంచాయ‌తీ రాజ్ సంస్థ‌ల ప్రతినిధులు పాల్గొనడం విశేషం. ఈ మేరకు సార్వజనీన వృద్ధి, సుస్థిర ప్రగతివైపు భారత పయనంలో ఇదొక కీల‌క‌ ఘ‌ట్టంగా నిలిచింది.

***



(Release ID: 2045825) Visitor Counter : 14