ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 15 AUG 2024 3:04PM by PIB Hyderabad

ప్రసంగంలోని ప్రధానాంశాలు:

1. సాధారణం

  • మనది ఒకే ఒక సంకల్పం – ‘దేశమే ప్రధానం’... దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం.
  • భారత్ ఖ్యాతి నేడు ప్రపంచవ్యాప్తం... భారత్ పట్ల ప్రపంచ అవగాహన మారింది.
  • నా దేశంలోని 140 కోట్ల మంది పౌరులు, 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు ఒక సంకల్పంతో ప్రారంభించి, ఒక దిశను నిర్దేశించుకుని, అంచెలంచెలుగా ముందుకు సాగుతూ, భుజం భుజం కలిపి ఎంత పెద్ద సవాళ్లనైనా ఎదుర్కొనగలం. వనరుల కొరత, అందుకు పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, మనం ప్రతి సవాలునూ అధిగమించి, సుసంపన్న భారత్‌ను నిర్మించి, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించగలం.
  • దేశం కోసం జీవించాలనే నిబద్ధత వికసిత భారత్‌ను సృష్టించగలదు.
  • వికసిత భారత్-2047 నిబద్ధతలో ప్రతి పౌరుడి కల, సంకల్పం స్పష్టంగా కనిపిస్తాయి.
  • నేటి భారతదేశంలో ‘మై-బాప్’ సంస్కృతికి చోటు లేదు.
  • ఈ దేశ ప్రజలు ఇంత విశాలమైన ఆలోచనలు, గొప్ప కలలను కలిగి ఉన్నప్పుడు, వారి సంకల్పం ఈ మాటలలో ప్రతిబింబించినప్పుడు అది మనలో కొత్త సంకల్పానికి బలాన్నిస్తుంది.
  • దేశ రక్షణ, దేశ నిర్మాణం కోసం పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో దేశాన్ని కాపాడుతున్న మహనీయుల పట్ల నేను అపారమైన గౌరవం వ్యక్తం చేస్తున్నాను.
  • మనలో ఉరకలువేసే దేశభక్తి, ప్రజాస్వామ్యంపై నిండైన విశ్వాసం ప్రపంచానికి ప్రేరణ.
  • మనం పాత స్థితి నుండి అభివృద్ధి, సంస్కరణలకు మారాము.
  • మన సంస్కరణల మార్గం వృద్ధికి బృహత్ప్రణాళికగా మారింది.
  • ప్రపంచ పరిస్థితులు దిగజారినప్పటికీ, అవకాశాల పరంగా ఇది ‘భారత్‌కు స్వర్ణయుగం’
  • ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఈ క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకొని, మన కలలు, సంకల్పాలతో ముందుకు సాగితే, ‘స్వర్ణ భారతం’ ఆకాంక్షలను నెరవేర్చగలం. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధిస్తాం.
  • పర్యాటక రంగం, ‘ఎంఎస్ఎంఇ’లు, విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, వ్యవసాయం-అనుబంధ రంగాలు... ఇలా ఏ రంగంలోనైనా సరికొత్త, ఆధునిక వ్యవస్థ స్థాపన చోటుచేసుకుంటోంది.
  • ప్రపంచవ్యాప్త అత్యుత్తమ పద్ధతులను అవలంబిస్తూనే మన దేశ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
  • సాంకేతికతను జోడించడంపై దృష్టితోపాటు ప్రతి రంగానికి ఆధునికీకరణ, ఆవిష్కరణలు అవసరం.
  • వికసిత భారత్-2047 దృక్పథంలో సామాన్య పౌరుల జీవితాలలో కనిష్ఠ ప్రభుత్వ జోక్యం కీలకం.
  • దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 3 లక్షల సంస్థల్లో కనీసం రెండు వార్షిక సంస్కరణలు తప్పనిసరి, ఫలితంగా ఏటా దాదాపు 25-30 లక్షల సంస్కరణలు సామాన్యుల విశ్వాసాన్ని పెంచుతాయి.
  • మూడు కీలక రంగాలపై దృష్టి సారించి ప్రతి రంగంలో పురోగతిని వేగవంతం చేయడమే మా లక్ష్యం. ముందుగా అన్ని రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. రెండోది... అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలకు అవసరమైన సహాయక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలి. మూడోది... పౌరుల ప్రాథమిక సౌకర్యాలకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి.. మెరుగుపరచాలి.
  • ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
  • ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో దేశం వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను.
  • మన విధానంలో కరుణ ప్రధానమైనది. మేము మా పనిలో సమానత్వం, కరుణ రెండింటితో ముందుకు సాగుతున్నాం.
  • మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి సేవ చేయడానికి మేమిక్కడ ఉన్నాం.
  • అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకోవడానికి, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, దేశానికి సేవ చేయడానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు కోట్లాది మంది దేశప్రజలకు  ఈరోజు ఎర్రకోట ప్రాకారాల నుండి నేను కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
  • కొత్త ఉత్సాహంతో, కొత్త శిఖరాలకు చేరేదిశగా ముందుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాను.
  • చిన్నచిన్న విజయాలను చూసి తృప్తిపడే వాళ్లలో మనం లేము.
  • మనం కొత్త జ్ఞానం, స్థితిస్థాపకతను కోరుకునే సంస్కృతి నుండి వచ్చాము; ఉన్నత విజయాల కోసం అవిశ్రాంతంగా ఆకాంక్షించే భవిష్యత్ సాధకులం.
  • మనం సరికొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాం. మన పౌరులలో దీన్నొక అలవాటుగా మార్చాలనుకుంటున్నాం.
  • తమ శ్రేయస్సును మించి ఆలోచించలేని, ఇతరుల బాగోగులను పట్టించుకోని ఒక వర్గంవారు ఉంటారు. అలాంటి వ్యక్తులు, వక్రీకృత మనస్తత్వంతో ఆందోళన చెందుతారు. నైరాశ్యంలో కూరుకుపోయిన వీరిని దేశం పట్టించుకోనవసరం లేదు.
  • ఈ నిరాశావాద అంశాలు కేవలం నిస్సహాయమైనవి మాత్రమే కావు; వారు విధ్వంసం గురించి కలలు కనే ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతున్నారు. మన సామూహిక పురోగతిని అణగదొక్కాలని చూస్తున్నారు... ఈ ముప్పును దేశం గుర్తించాలి.
  • మన మంచి ఉద్దేశాలు, విశ్వసనీయత, దేశం పట్ల అంకితభావం ద్వారా మనల్ని వ్యతిరేకించే వారిపైనా విజయం సాధించగలమి నా తోటి పౌరులకు నేను హామీ ఇస్తున్నాను.
  • కట్టుబడి ఉన్న అంశాలను నెరవేర్చడంలో, 140 కోట్ల మంది పౌరుల భవిష్యత్తును మార్చడంలో, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో,  దేశం కలలను సాకారం చేయడంలో మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టం.
  • అన్ని స్థాయుల అవినీతి వల్ల సామాన్యులకు వ్యవస్థపైగల విశ్వాసం ఛిన్నాభిన్నమైంది.
  • అవినీతిపరులు భయపడే వాతావరణాన్ని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా సాధారణ పౌరుడిని లూటీ చేసే సంప్రదాయానికి స్వస్తి పలకవచ్చు.
  • సమాజంలో ఇలాంటి బీజాలు నాటేందుకు ప్రయత్నించడం, అవినీతిని ఆకాశానికెత్తడం,  అవినీతిపరులకు ఆదరణ పెంచేందుకు నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఆరోగ్యకర సమాజానికి పెద్ద సవాలుగానూ, ఆందోళన కలిగించే అంశంగానూ మారాయి.
  • గత 75 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఇది మన దళితులు, అణగారిన-దోపిడీకి గురైన, సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కులను కాపాడింది.
  • మన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన విధులపై దృష్టి సారించడం చాలా ముఖ్యం.
  • విధులకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కేవలం పౌరులకు మాత్రమే కాకుండా దేశంలోని వివిధ సంస్థలకు విస్తరించింది.
  • మనమందరం సమష్టిగా మన బాధ్యతలను నిర్వర్తించినప్పుడు, సహజంగానే పరస్పరం హక్కులను సంరక్షించుకుంటాం.
  • మా విధులను నిర్వర్తించడం ద్వారా, ఎటువంటి అదనపు ప్రయత్నం అవసరం లేకుండా మేము ఈ హక్కులను అంతర్గతంగా సంరక్షిస్తాము.
  • వంశ పారంపర్య రాజకీయాలు, కులతత్వం భారత ప్రజాస్వామ్యానికి ఎంతో హానిచేస్తున్నాయి.
  • 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా భావించి, ‘స్వర్ణ భారతం’గా దేశాన్ని తీర్చిదిద్దాలి. ఈ శతాబ్దంలో ‘వికసిత భారత్’గా కల సాకారం దిశగా ముందుకు సాగడంలో మన ఆశలు-ఆకాంక్షలను, కృషిని సమన్వయం చేసుకోవాలి.
  • నేను మీ కోసం జీవిస్తున్నాను, నేను మీ భవిష్యత్తు కోసం జీవిస్తున్నాను.. నేను భరతమాత ఉజ్వల భవిష్యత్తు కోసం జీవిస్తున్నాను.

2. రక్షణ మంత్రిత్వశాఖ

  • రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తున్నాం.
  • వివిధ రక్షణ పరికరాల ఎగుమతిదారుగా, తయారీదారుగా భారత్ వేగంగా ముందడుగు వేస్తూ స్థిరపడుతోంది.
  • మన సాయుధ బలగాలు మెరుపుదాడితో శత్రువును మట్టుబెట్టినపుడు మన హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది.
  • ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు మన సాయుధ బలగాల పరాక్రమంపై ఎంతో విశ్వాసంతో వారి ధైర్యసాహస కథనాలపై ఎంతో గర్విస్తున్నారు.

3. ఆర్థిక మంత్రిత్వ శాఖ

  • ‘ఫిన్‌టెక్’ రంగంలో విజయాలపై భారతదేశం గర్విస్తోంది.
  • వ్యక్తుల తలసరి ఆదాయాన్ని విజయవంతంగా రెట్టింపు చేశాం.
  • ఉపాధి-స్వయం ఉపాధి రంగాల్లో కొత్త రికార్డులు నెలకొల్పడంలో గణనీయ ప్రగతి సాధించాం.
  • బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు అమలులోకి తెచ్చాం. ఫలితంగా నేడు మన బ్యాంకులు ప్రపంచంలోని కొన్ని శక్తిమంతమైన బ్యాంకుల సరసన చేరాయి.
  • సాధారణ పేదలు.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ గొప్ప బలం అవుతుంది.
  • మన ‘ఎంఎస్ఎంఇ’లకు బ్యాంకులు గొప్ప మద్దతునిస్తున్నాయి.
  • పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు వంటి సమాజంలోని వివిధ అణగారిన వర్గాలు ఇప్పుడు బ్యాంకులతో అనుసంధానం అవుతున్నాయి. కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. అభివృద్ధి పథంలో భాగస్వాములు అవుతున్నాయి.
  • దేశాన్ని పురోగమింపజేయడానికి అనేక ఆర్థిక విధానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థలపై దేశం విశ్వాసం క్రమంగా పెరుగుతోంది.
  • కోవిడ్ అంతర్జాతీయ మహమ్మారి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను వేగంగా మెరుగుపరుచుకున్న దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే.
  • ఆధునిక మౌలిక వ్యవస్థ, జీవన సౌలభ్యం పెంపు మన ఆర్థిక వృద్ధి, ప్రగతికి దోహదపడాలి.
  • గత దశాబ్ద కాలం ప్రజా రవాణా అనుసంధాన దిశగా అత్యాధునిక రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, బలమైన రోడ్డు మార్గాల నెట్‌ వర్క్‌ అందించడం ద్వారా భారీ మౌలిక సదుపాయాల కల్పనను మనం ప్రత్యక్షంగా చూశాం.
  • జీవన సౌలభ్యం దిశగా ఉద్యమ తరహాలో పార్టీ లేదా రాష్ట్రానికి అతీతంగా కృషి చేయాలని ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరినీ నేను కోరుతున్నాను.
  • నా మూడోదఫా పదవీ కాలంలో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. నేను మూడు రెట్లు ఎక్కువ కష్టపడి, మూడు రెట్ల వేగంతో, మూడు రేట్లు విస్తృతంగా పని చేస్తాను. తద్వారా దేశం కోసం మనం కంటున్న కలలు త్వరగా సాకారమవుతాయి.

4. వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ

  • వ్యవసాయ రంగంలో పరివర్తన అనేది ఈ సమయంలో కీలకం.
  • ప్రకృతి వ్యవసాయ మార్గాన్ని ఎంచుకుని మన మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పం తీసుకున్న రైతులందరికీ కృతజ్ఞతలు.
  • సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో గణనీయ కేటాయింపులతో గణనీయ పథకాలు ప్రవేశపెట్టాం.
  • మనం ప్రపంచంలో పోషకాహారాన్ని బలోపేతం చేయాలి, భారతదేశంలోని చిన్న రైతులకు కూడా మద్దతు ఇవ్వాలి.
  • భారతదేశానికి, ఇక్కడి రైతులకు సేంద్రీయ ఆహార రాశులు సృష్టించగల సామర్థ్యం ఉంది.
  • దేశంలో 60 వేల ‘అమృత సరోవరాల’ (చెరువులు)ను పునరుద్ధరించాం. అవి నేడు నిండుకుండలుగా మారాయి.

5. వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ

  • జి-20 మునుపెన్నడూ ఇంత గొప్పగా నిర్వహించింది లేదు.
  • ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించగల సామర్థ్యం నేడు భారత్ సొంతం. దేశం ఇప్పుడు అసాధారణ ఆతిథ్యం ఇవ్వగల స్థాయిలో ఉంది.
  • ముఖ్యంగా బాహ్య సవాళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
  • భారత్ అభివృద్ధి అంటే ఎవరికీ ముప్పు లేదని అలాంటి శక్తులకు నేను చెప్పదలిచాను.
  • మాది బుద్ధుడు జన్మించిన గడ్డ. యుద్ధం మా మార్గం కాదు... కాబట్టి, ప్రపంచానికి ఆందోళన అక్కర్లేదు.
  • బంగ్లాదేశ్‌లో పరిస్థితులు... ముఖ్యంగా మన పొరుగు దేశం కావడంవల్ల త్వరలో సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాను.
  • బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలకు భద్రతే మన 140 కోట్ల మంది పౌరుల ప్రాథమిక ఆందోళన.
  • మన పొరుగు దేశాలు సంతోషంగా ఉండాలి.. శాంతి మార్గాన్ని అనుసరించాలని భారత్ సదా కోరుకుంకుంటుంది.
  • శాంతి విషయంలో మన నిబద్ధత మన సంస్కృతిలోనే లోతుగా పాతుకుపోయింది.

6. కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ

  • ఇప్పటికే రెండు లక్షల పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేశాం.
  • భారతదేశం ఇప్పటికే 6జి కోసం ఉద్యమ తరహాలో పనిచేస్తోంది. మన పురోగతితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాం.

7. అంతరిక్ష విభాగం

  • అంతరిక్ష రంగం మన కొత్త భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది.
  • భారత అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల సంఖ్య పెరుగుతోంది.
  • నేడు మన దేశంలోనే ప్రైవేట్ ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారు.
  • చంద్రయాన్ మిషన్ విజయం మన పాఠశాలలు, కళాశాలల్లో శాస్త్ర-సాంకేతికతలపై ఆసక్తిని పెంచే కొత్త వాతావరణాన్ని సృష్టించింది.

8. సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ

  • పేద, మధ్యతరగతి, నిరుపేదలు, పెరుగుతున్న మన పట్టణ జనాభా, యువత కలలు, వారి ఆకాంక్షలు వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము సంస్కరణల మార్గాన్ని ఎంచుకున్నాం.
  • రాజకీయ నాయకత్వం సాధికారతను తీసుకురావాలని నిశ్చయించుకున్నప్పుడు, అభివృద్ధి వైపు దృఢ నిశ్చయంతో ముందడుగు వేస్తున్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం కూడా విధానాల  పటిష్ట అమలు దిశగా అడుగులు వేస్తుంది.
  • సాధికారత, ప్రగతి సాధనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ప్రారంభమైతే, ఆ ఫలితాలు దేశానికి ఎంతో విలువైనవిగా ఉంటాయి.
  • చివరి గ్రామం వరకు కూడా అనుసంధానం కోసం చర్యలు చేపట్టాం. అటవీ ప్రాంతాలలో కూడా పాఠశాలలు ఏర్పాటయ్యాయి.  ఆధునిక ఆసుపత్రులు, ఆరోగ్య మందిరాలు సుదూర ప్రాంతాల్లోనూ నిర్మితమవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా అణగారిన వర్గాలకూ అందుబాటు వ్యయంతో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం కలిగింది.
  • ‘‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’’లోని అంతస్సూత్రం వాస్తవరూపం దాలుస్తోంది.
  • మేము 25 కోట్ల మంది ప్రజలను పేదరిక విముక్తులను చేసిన నేపథ్యంలో మా కలలు నెరవేరగలవనే నమ్మకానికి బలం మరింత పెరుగుతోంది.
  • విశిష్ట సామర్థ్యంగల నా సోదరసోదరీమణులు భారతీయ సంకేత భాషలో సంభాషించుకోవడం  ప్రారంభించినప్పుడు లేదా సుగమ్య భారత్ ద్వారా సార్వజనీన, సౌలభ్య ప్రయోజనం పొందినప్పుడు వారు దాన్నొక గౌరవంగా పరిగణిస్తారు.
  • మన పారాలింపిక్స్‌ క్రీడాకారుల అత్యద్భుత ప్రదర్శన ఆశ్చర్యానందాలు కలిగించింది.
  • వెలివేతకు గురైన లింగమార్పిడి సమాజంపై మరింత అవగాహనతో నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకుంటున్నాం. చట్ట సవరణ, కొత్త చట్టాలు తేవడం ద్వారా వారిని ప్రధాన జనస్రవంతిలోకి తెచ్చేలా కృషి చేశాం. అందరికీ గౌరవం, మర్యాద, సమానత్వంపై భరోసా ఇస్తున్నాం.
  • మేము ‘త్రివిధ మార్గ్’ (మూడు దారులు)లో బయలుదేరాం. ‘అందరికీ సేవ’ స్ఫూర్తితో ప్రత్యక్ష ప్రయోజనాలు అందేలా చూస్తున్నాం.
  • నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు, అట్టడుగు వర్గాలవారు, అడవుల్లోని మన చిన్న రైతులు, గిరిజన సోదరసోదరీమణులు, మన తల్లులు, మన కార్మికులు... వీరందరి అభ్యున్నతి మన కర్తవ్యం.

9. విద్యా మంత్రిత్వ శాఖ

  • వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో 75,000 కొత్త సీట్లు అందుబాటులోకి వస్తాయి.
  • కొత్త విద్యా విధానంతో ప్రస్తుత విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాలనుకుంటున్నాం.
  • ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఉన్నత విద్య, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చనున్నాం.
  • వేగవంతమైన అభివృద్ధి అంచనాలను అందుకోవడానికి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకు అవసరమైన నైపుణ్య వనరులను మన దేశంలోనే సిద్ధం చేసుకోవాల్సి ఉంది.
  • మన దేశ యువత విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మన మధ్యతరగతి కుటుంబాలు విదేశాల్లో ఉన్నత విద్య కోసం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు... విదేశాల విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం భారత్‌కు వచ్చేలా చేయగల సంస్థలను రూపొందించాలనుకుంటున్నాం.
  • భారతదేశ ప్రతిభకు భాష అడ్డంకి కాకూడదు. మాతృభాష బలం మన దేశంలోని నిరుపేద పిల్లలకు కూడా తమ కలలను నెరవేర్చుకునే శక్తినిస్తుంది.
  • నిరంతర పరిశోధనలతో ఆ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చట్టపరమైన విధివిధానాలను అందించడానికి 'నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' స్థాపించాం.
  • మన దేశ యువత కలలను సాకారం చేసేందుకు వీలుగా బడ్జెట్‌లో పరిశోధన-ఆవిష్కరణల కోసం లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలనే నిర్ణయం గర్వించదగినది.

10. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

  • యువకులు, రైతులు, మహిళలు, గిరిజనులు... ప్రతి ఒక్కరూ బానిసత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు.
  • ‘పిఎం జన్మ‌న్‌’ పథకం ప్రయోజనాలన్నీ గ్రామాలు, కొండలు, అడవులలోని వివిధ మారుమూల ప్రాంతాల్లోగల ప్రతి గిరిజనుడికీ అందించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది.
  • భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సమీపిస్తున్న వేళ ఆ వారసత్వం నుంచి మనం స్ఫూర్తి పొందుదాం.

11. మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

  • వికసిత భారత్ తొలితరంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాతీయ పోషకాహార మిషన్‌ను ప్రారంభించాం.
  • గత దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములయ్యారు.
  • మహిళలు ఆర్థికంగా సాధికారత పొందినప్పుడే సామాజిక పరివర్తనకు భరోసా-సంరక్షణ సాధ్యం.
  • కోటి మంది తల్లులు, సోదరీమణులు మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి ‘లఖ్‌పతి దీదీలు’గా రూపొందుతున్నారు.
  • మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించే నిధులను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నాం.
  • బ్యాంకుల నుంచి నేటిదాకా స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.9 లక్షల కోట్ల నిధులు మంజూరయ్యాయి.
  • మా ప్రభుత్వం ఉద్యోగ, శ్రామిక మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించింది.
  • మహిళలు సారథ్య పాత్ర పోషిస్తున్నారు. నేడు అనేక రంగాలలో... రక్షణ, వైమానిక దళం, సైన్యం, నావికా దళం లేదా అంతరిక్ష విభాగం సహా అన్నింటా మహిళల శక్తిసామర్థ్యాలు ఎంతటితో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
  • ఒక సమాజంగా మనం మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలపై అఘాయిత్యాలను అరికట్టడంపై నిశితంగా దృష్టి సారించాలి.
  • మహిళలమీద నేరాలపై ఎలాంటి జాప్యం లేకుండా విచారణ చేపట్టాలి. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌర సమాజంపై నమ్మకాన్ని పునరుద్ధరించే దిశగా ఇలాంటి రాక్షస చర్యలకు పాల్పడే వారిపై తక్షణం కేసు నమోదు చేయాలి.
  • శిక్ష అనుభవించే నేరగాళ్లపైనా విస్తృత చర్చ అవసరం. తద్వారా అలాంటి తప్పులు చేసిన వారు ఉరిశిక్ష సహా తీవ్రమైన పరిణామాలకు భయపడతారు. అలాంటి వారిలో ఈ విధమైన భయం సృష్టించడం అనివార్యమని నా అభిప్రాయం.

12. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

  • దేశం ‘ఆరోగ్య భారత్’ బాటలో ముందుకు సాగాలి.
  • కోవిడ్‌ నుంచి రక్షణ కోసం కోట్లాది జనాభాకు అత్యంత వేగంగా టీకాలు వేయడంలో భారత్ విజయం సాధించింది.

13. పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ

  • భారతదేశం ఇప్పుడు హరిత వృద్ధి, హరిత ఉపాధిపై దృష్టి సారించింది.
  • వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న కృషిలో హరిత ఉపాధి అత్యావశ్యం.
  • గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారత్ ప్రపంచ కేంద్రంగా మారడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నది.
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధంలో, పునరుత్పాదక ఇంధన సామర్థ్య సాధన దిశగా గణనీయ ముందంజలో భారత్ అగ్రగామిగా ఉంది.
  • జి-20 దేశాలలో భారత్ పారిస్ ఒప్పందంలోని తన లక్ష్యాలను ముందుగా చేరుకుంది.
  • మన పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను మనమిప్పటికే చేరుకున్నాం. ఆ మేరకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పాదన లక్ష్యం సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం.

14. వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ

  • ఆర్థికాభివృద్ధికి ‘‘వోకల్ ఫర్ లోకల్’’ కొత్త మంత్రంగా మారింది.
  • ‘‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’’ అనేది నేడు అలలా ఎగసిపడుతోంది.
  • భారత్ పారిశ్రామిక తయారీ కేంద్రంగా మారుతోంది.. ప్రపంచమంతా నేడు మనవైపు చూస్తోంది.
  • ‘‘డిజైన్ ఇన్ ఇండియా’’ పిలుపును స్వీకరించి ‘‘డిజైన్ ఇన్ ఇండియా అండ్ డిజైన్ ఫర్ ది వరల్డ్’’ అనే స్వప్నంలో ముందడుగు వేద్దాం.
  • పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విస్పష్ట విధానాలను రూపొందించాలి. సుపరిపాలనకు హామీ ఇస్తూ శాంతిభద్రతలపై విశ్వాసాన్ని కలిగించాలి.
  • సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి భారత్ నిబద్ధతతో కృషిచేస్తోంది.
  • ‘మేడ్ ఇన్ ఇండియా’ గేమింగ్ ఉత్పత్తులతో మరింత ప్రగతి దిశగా భారత్ తన సుసంపన్న ప్రాచీన వారసత్వం, సాహిత్యాలను తప్పక వినియోగించుకోవాలి.
  • భారతీయ నిపుణులు ఆడటంలోనే కాకుండా గేమ్‌ల రూపకల్పనలోనూ ప్రపంచ గేమింగ్ మార్కెట్‌కు సారథ్యం వహించాలి.
  • భారతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలుగా మారాలన్నది మా ఆకాంక్ష.
  • ప్రపంచ వృద్ధికి భారత్ తోడ్పాటు గణనీయంగా అవసరం. మన ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు రెట్టింపయ్యాయి. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌పై అత్యంత విశ్వాసం కనబరుస్తున్నాయి.
  • మనం బొమ్మల ఎగుమతి కూడా ప్రారంభించాం. ఈ పరిశ్రమ ప్రపంచ మార్కెట్‌లో గణనీయ పేరుప్రతిష్టలు సాధించడం మనకు గర్వకారణం.
  • మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న రోజులు పోయి, నేడు భారత్ ఒక భారీ మొబైల్ ఫోన్‌ తయారీ కూడలిగా రూపుదిద్దుకుంది. మనమిప్పుడు వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నాం... అదీ భారత్ సామర్థ్యం!

15. రైల్వే మంత్రిత్వ శాఖ

  • రైల్వేలను 2030 నాటికి నికర-శూన్య కర్బన ఉద్గార వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

16. జలశక్తి మంత్రిత్వ శాఖ

  • ప్రతి కుటుంబం నేడు పరిశుభ్ర వాతావరణానికి చేరువై పరిశుభ్రతపై చర్చను ప్రోత్సహిస్తోంది.
  • ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ పరిశుభ్ర అలవాట్లు, పర్యావరణంపై సామాజిక స్పృహతో మార్పు దిశగా సమష్టి కృషి చేస్తున్నారు.
  • నేడు 12 కోట్ల కుటుంబాలకు తక్కువ వ్యవధిలోనే జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశుభ్ర కొళాయి నీరు సరఫరా అవుతోంది.

17. గృహనిర్మాణ‌-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

  • నాలుగు కోట్ల పక్కా ఇళ్లు పేదలకు కొత్త జీవితాన్నిచ్చాయి.
  • ఈ జాతీయ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ 3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చాం.

18. పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ

  • సమగ్రాభివృద్ధికి కృషితో పాటు మత్స్యకారులు, పశుపోషకుల అవసరాలు-ఆకాంక్షలు తీర్చడమన్నది మా విధానాలు, ఉద్దేశాలు, సంస్కరణలు, కార్యక్రమాలు, పనితీరులో భాగం.

19. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

  • దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరినీ మనం నేడు గౌరవిస్తున్నాం. వారి త్యాగానికి, సేవకు మన దేశం సదా రుణపడి ఉంటుంది.
  • స్వాతంత్ర్య దినోత్సవమంటే- వారికి కృతజ్ఞతలర్పించడంతోపాటు సంకల్పం, దేశభక్తి వంటి సద్గుణాలను గుర్తు చేసుకునే వేడుక. ఈ పర్వదినం నాడు స్వేచ్ఛావాయువులు పీల్చే అదృష్టం ఆ ధైర్యవంతుల వల్లనే మనకు లభించింది. వారికి ఈ దేశం ఎంతో రుణపడి ఉంటుంది.
  • నేడు దేశం యావత్తూ త్రివర్ణ పతాకం కింద ఏకతాటిపైకి వచ్చింది. ప్రతి ఇంటిమీదా జాతీయ పతాకం రెపరెపలు దేశానికి కొత్త వన్నెలద్దాయి. కుల, మత, ధనిక, పేద అనే భేదాలేవీ లేవు; మనమంతా భారతీయులం... ఈ ఐక్యతే మన బలానికి నిదర్శనం.

20. న‌వ్య‌-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ

  • పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం జి-20 దేశాలన్నిటి సామర్థ్యంతో పోలిస్తే అంతకన్నా ఎక్కువ వృద్ధి సాధించింది.
  • ఇంధన రంగంలో స్వావలంబనకు భారత్ నిరంతరం కృషి చేస్తోంది.
  • ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కొత్త బలాన్నివ్వడానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో సగటు కుటుంబాలు... ముఖ్యంగా మధ్యతరగతి ఉచిత విద్యుత్ పొందినప్పుడు దీని ప్రయోజనాలను వారు అర్థం చేసుకోగలరు. ఈ పథకం కింద సౌరశక్తి ఉత్పాదనతోపాటు తమ ఇంధన ఖర్చులను కూడా వారు తగ్గించుకోవచ్చు.
  • దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకూ నేడు డిమాండ్ పెరుగుతోంది.

21. విద్యుత్ మంత్రిత్వ శాఖ

  • భారత్‌లోని 18,000 గ్రామాలకు నిర్ణీత గడువులోగా విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని ఎర్రకోట సాక్షిగా హామీ ఇవ్వడం ప్రతి సామాన్యుడు విన్నాడు. నేడు అది నెరవేరడంతో వారి విశ్వాసం మరింత బలపడుతుంది.
  • అయితే, నేటికీ 2.5 కోట్ల కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి.

22. రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ

  • మారుమూల గ్రామాలు, సరిహద్దులను కలుపుతూ రహదారుల నిర్మాణంతో ఈ ప్రాంతాలన్నీ ప్రధాన స్రవంతిలోకి చేరాయి.
  • ఈ బలమైన మౌలిక సదుపాయాల నెట్‌ వర్క్‌ ద్వారా మా ప్రభుత్వం దళితులు, పీడితులు, దోపిడీకి గురైనవారు, అణగారినవారు, వెనుకబడినవారు, గిరిజనులు, మూలవాసులు, ఆదివాసీలు, అడవులు, కొండలు, సుదూర సరిహద్దు ప్రాంతాలవారి అవసరాలను తీర్చగలిగింది.

23. క్రీడలు- యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

  • భారతదేశ యువతకు శిక్షణ ఇవ్వడం, ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మారడం దీని లక్ష్యం.
  • కుటుంబంలో రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయ వ్యవస్థలోకి ప్రవేశించాలి.
  • కొద్దిపాటి జీతాలతో కుటుంబ పోషణలోగల సవాళ్ల దృష్ట్యా కొత్త ఉద్యోగాల సముపార్జన, అదనపు ఆదాయ వనరుల సృష్టికి తగిన నైపుణ్యంతో యువతను సన్నద్ధం చేయడానికి మేము సమగ్ర కృషి చేస్తున్నాం.
  • పారిస్ ఒలింపిక్స్‌ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మన క్రీడాకారులందరికీ 140 కోట్ల మంది దేశవాసుల తరపున నా అభినందనలు తెలియజేస్తున్నాను.
  • మన పారాలింపిక్ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
  • భారత గడ్డపై 2036 ఒలింపిక్స్‌ నిర్వహించడంపై మా లక్ష్యం సుస్పష్టం. ఇందుకు సిద్ధం కావడంలో గణనీయ పురోగతి సాధిస్తున్నాం.

24. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

  • ఈశాన్య భారతం ఇప్పుడు వైద్యపరమైన మౌలిక వసతులకు కేంద్రంగా ఉంది. చివరి మైలు వరకు అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా ఈ పరివర్తన అందరి జీవితాలకు అండగా నిలవడంలో మాకు సహాయపడింది.

25. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

  • యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.
  • స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశాం.
  • యువతకు శిక్షణ కోసం (ఇంటర్న్‌ షిప్‌) ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ప్రతిపాదించాం. యువత తగిన అనుభవంతో తమ సామర్థ్యం పెంచుకుంటూ మార్కెట్‌లో తమ నైపుణ్యం ప్రదర్శించడంలో ఇది తోడ్పడుతుంది.
  • భారత నిపుణ శ్రామికశక్తి ప్రపంచ ఉపాధి మార్కెట్‌లో తనదైన ముద్ర వేయనుంది. ఆ కల సాకారం దిశగా ముందుకు సాగుతున్నాం.

26. చట్టం-న్యాయ మంత్రిత్వ శాఖ

  • ప్రస్తుత పౌరస్మృతి వివక్షాపూరిత మతప్రాతిపదిక సివిల్ కోడ్‌ తరహాలో ఉంది.
  • మతం ఆధారంగా దేశాన్ని విభజించి వివక్షను పెంచే అటువంటి చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదు.
  • అందుకే 75 ఏళ్ల సదరు పౌరస్మృతికి స్వస్తి పలికి, లౌకిక సివిల్ కోడ్ వైపు మళ్లడం కీలక ముందడుగు కాగలదు.
  • మన రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత.
  • లౌకిక పౌరస్మృతిపై భిన్నాభిప్రాయాలు, దృక్కోణాలను మనం స్వాగతించాలి.
  • ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ భావనను స్వీకరించడానికి భారతీయులు ముందుకు రావాలి.
  • పౌరులు చట్టపరమైన సంక్లిష్టతల ఉచ్చులో చిక్కుకోకుండా చూడటం లక్ష్యంగా కాలం చెల్లిన 1,500 చట్టాలను రద్దుచేశాం.
  • శతాబ్దాల నాటి నేరవిచారణ చట్టాల స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ పేరిట కొత్త చట్టాలు  తెచ్చాం. బ్రిటిష్ భావజాలంలోని జరిమానాలు-శిక్షల విధానానికి భిన్నంగా పౌరులకు న్యాయ ప్రదానమే కొత్త చట్టాల ప్రధానోద్దేశం.

 

**కొన్ని అంశాలకు ఒకటికి మించి మంత్రిత్వ శాఖలతో ప్రమేయం ఉంటుంది కాబట్టి, అవి పునరావృతమై ఉండొచ్చు.

****


(Release ID: 2045824) Visitor Counter : 150