రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆగస్టు 15న ఎర్రకోట నుంచి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
‘వికసిత్ భారత్ @ 2047’ స్వప్నం ఆవిష్కరణకు సాక్షిగా నిలవనున్న చారిత్రక కట్టడం
ఈ ఘనమైన వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం
Posted On:
14 AUG 2024 2:15PM by PIB Hyderabad
ఆగస్టు 15 న 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశానికి ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత చారిత్రక కట్టడ ప్రాకారాల నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ‘వికసిత్ భారత్ @ 2047’ ఇతివృత్తంతో జరుగుతోంది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరోసారి ప్రోత్సహించేందుకు ఈ వేడుకలు వేదికగా నిలవనున్నాయి.
ప్రత్యేక అతిథులు
జాతీయ పండుగలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. యువత, ఆదివాసీ సమాజం, రైతులు, మహిళలు, ఇలా రకరకాల జీవన విధానాలకు చెందిన వారు ప్రత్యేక అతిథులుగా రానున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సహకారంతో వేర్వేరు రంగాల్లో ఘనత సాధించిన వారు కూడా ప్రత్యేక అతిథులుగా వేడుకలకు హాజరవుతారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్, పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులు, ‘మేరీ మాతి మేరా దేశ్’ కింద మేరా యువ భారత్(ఎంవై భారత్), జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు ఈ వేడుకకు హాజరవుతారు. అతిథుల్లో జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ నిధులను అందుకున్న ఆదివాసీ వ్యాపారవేత్తలు, ఆదివాసీ కళాకారులు/వన్ ధన్ వికాస్ సభ్యులు; ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారులు, రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీఓ)ల ప్రతినిధులు ఉన్నారు.
అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశ), సహాయక నర్సులు (ఏఎన్ఎం), అంగన్వాడీ వర్కర్లు, ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు, సంకల్ప్: మహిళా సాధికారత కేంద్రం, లఖ్‌పతి దీదీలు, డ్రోన్ దీదీ కార్యక్రమాలు, సఖీ కేంద్రం పథక లబ్ధిదారులు, బాలల సంక్షేమ కమిటీ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ల వర్కర్లు సైతం ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భాగమైన భారతీయ బృందాన్ని కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానించారు. యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి బ్లాక్ నుంచి ఒక అతిథి, సరిహద్దు రహదారుల సంస్థ కార్మికులు, ప్రేరణ పాఠశాల కార్యక్రమం విద్యార్థులు, ప్రాధాన్యతా రంగ పథకాల అమలులో లక్ష్యాన్ని సాధించిన గ్రామపంచాయతీల సర్పంచులు సైతం వేడుకకు హాజరవుతారు.
ఈ ఘనమైన వేడుకను చూడటానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 2,000 మంది సంప్రదాయ వేషధారణలో హాజరయ్యేందుకు ఆహ్వానించారు. మైగవ్, ఆకాశవాణి భాగస్వామ్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వివిధ ఆన్‌లైన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన 3,000 మంది కూడా వేడుకల్లో భాగమవుతారు.
వేడుక
ఎర్రకోటకు రాగానే ప్రధాన మంత్రికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే స్వాగతం పలుకుతారు. ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ) లెఫ్ట్‌నెంట్ జనరల్ శ్రీ భవనీశ్ కుమార్‌ను ప్రధానమంత్రికి రక్షణ శాఖ కార్యదర్శి పరిచయం చేస్తారు. ఢిల్లీ ప్రాంత జీఓసీ శ్రీ నరేంద్ర మోదీని సెల్యూటింగ్ బేస్‌కు తీసుకువెళ్తారు. అక్కడ సంయుక్త అంతర్‌సేవలు, ఢిల్లీ పోలీసు సిబ్బంది ప్రధానమంత్రికి జనరల్ సెల్యూట్ చేస్తారు. తర్వాత ప్రధాన మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
ప్రధానమంత్రికి గౌరవ వందనాన్ని సమర్పించే బృందంలో సైనిక, నౌకాదళ, వాయుసేన, ఢిల్లీ పోలీసు నుంచి ఒక్కో అధికారి, 24 మంది సిబ్బంది చొప్పున ఉంటారు. గౌరవ వందనానికి కమాండర్ అరుణ్ కుమార్ మెహతా నేతృత్వం వహిస్తారు. ఆర్మీ బృందానికి మేజర్ అరుణ్ సింగ్, నౌకాదళ బృందానికి లెఫ్ట్‌నెంట్ కమాండర్ గులియా భావేశ్ ఎన్‌కే, వాయుసేన బృందానికి స్క్వాడ్రన్ లీడర్ అక్షర ఉనియల్ నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ అనురాగ్ ద్వివేది నేతృత్వం వహించనున్నారు.
గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రధాన మంత్రి ఎర్రకోట ప్రాకారాల్లోకి వెళ్తారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మైరల్ దినేశ్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీకే చౌదరి అభినందనలు తెలుపుతారు. జాతీయ జెండాను ఎగురవేయడానికి ఢిల్లీ ప్రాంత జీఓసీ ప్రధానమంత్రిని వేదిక వద్దకు తీసుకువెళ్తుంది.
జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రధానమంత్రికి లెఫ్ట్‌నెంట్ సంజీత్ సింగ్ సహాయకులుగా ఉంటారు. 1721 ఫీల్డ్ బ్యాటరీ(సెరిమోనియల్)కు చెందిన శౌర్యవంతులైన సైనికులు ఒకేసారి 21 గన్ సెల్యూట్ చేస్తారు. ఇందుకు దేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ తుపాకులను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమానికి మేజర్ సబ్నీస్ కౌశీక్ నేతృత్వం వహించనుండగా, గన్ పొజిషన్ అధికారిగా నాయబ్ సుబేదార్(ఏఐజీ) అనుతోష్ సర్కార్ వ్యవహరిస్తారు.
ఆర్మీ, నేవీ, వాయుసేన నుంచి ఒక్కో అధికారి, 32 మంది ఇతర ర్యాంకులకు చెందిన వారు, 128 మంది ఢిల్లీ పోలీసులతో కూడిన జాతీయ జెండా గార్డు ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు రాష్ట్రీయ వందనాన్ని సమర్పిస్తారు. ఈ అంతర్-సేవల గార్డ్, పోలీస్ గార్డ్‌కు కమాండ్ వినయ్ దూబే నేతృత్వం వహిస్తారు.
జాతీయ జెండా గార్డ్‌లోని ఆర్మీ బృందానికి మేజర్ దినేశ్ గంగం, నేవీ బృందానికి లేఫ్ట్‌నెంట్ కమాండర్ సచిన్ ధన్‌కడ్, ఎయిర్ ఫోర్స్ బృందానికి స్వ్కాడ్రన్ లీడర్ సీఎస్ శ్రవణ్ దేవయ్య నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ అచిన్ గార్గ్ నేతృత్వం వహించనున్నారు.
ఎగురవేసిన తర్వాత మువన్నెల జెండా ‘రాష్ట్రీయ వందనం’ అందుకుంటుంది. జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు, రాష్ట్రీయ వందనాన్ని సమర్పించేటప్పుడు ఒక జేసీఓ, 25 మంది ఇతర ర్యాంకుల వారితో కూడిన పంజాబ్ రెజిమెంట్ మిలిటరీ బ్యాండ్ జాతీయ గీతాన్ని ప్లే చేస్తుంది. ఈ బ్యాండ్‌ను సుబేదార్ మేజర్ రాజిందర్ సింగ్ నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేయగానే భారత వాయు సేనకు చెందిన రెండు ధ్రువ్ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు లైన్ ఆస్ట్రన్ పద్ధతిలో వేదికపై పూలరేకులను చల్లుతుంది.
దీని తర్వాత ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత నేషనల్ కాడెట్ కోర్స్ (ఎన్‌సీసీ)కి చెందిన కాడెట్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 2,000 మంది బాల, బాలిక క్యాడెట్లు(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఈ వేడుకల్లో పాల్గొంటారు. వీరు ప్రాకారానికి ఎదురుగా ఉన్న జ్ఞాన్‌పథ్‌లో కూర్చుంటారు. వీరు ‘మై भारत’ లోగోగా మువెన్నెల రంగుల్లో ఏర్పడతారు. నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్)కు చెందిన 500 మంది వాలంటీర్లు కూడా కార్యక్రమంలో భాగమవుతారు.
***
(Release ID: 2045308)
Visitor Counter : 86
Read this release in:
Odia
,
Bengali
,
Malayalam
,
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Kannada