సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఎంపీల హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
వికసిత్ భారత్ @2047 దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈరోజు ఒక కీలక మైలురాయిగా ఎన్నటికీ గుర్తుండిపోతుంది: ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్
ఈ ర్యాలీ మన ఐక్యత, శక్తికి సంకేతం. ఇది మనల్నిఒకటిగా కలిపి ఉంచుతుంది. :శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
13 AUG 2024 4:36PM by PIB Hyderabad
జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఆగస్టు 13న ఢిల్లీ వీధులగుండా సాగిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని దేశ రాజధాని అపూర్వంగా తిలకించింది. స్వాతంత్య్ర, ఐక్యతా స్ఫూర్తికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ఈ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఇందులో త్రివర్ణ పతాకాన్ని చేతబూని, దేశభక్తి, ఐక్యత, జాతీయ గుర్తింపును మరింత ముందుకు తీసుకుపోయేందుకు వందలాది మంది కదిలి వచ్చారు.
ఈ ర్యాలీని ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రారంభమై, ఇప్పుడొక మహోద్యమంగా మారిందని అన్నారు. ఇది గత కొద్ది సంవత్సరాలుగా విజయవంతంగా సాగడంలో జన్ భాగిదారి కీలక పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్@2047 దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ రోజును ఒక కీలక మైలురాయిగా ఎన్నటికీ గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. “మనం కేవలం ఆశావహ దేశంగానో లేదా ఆశాజనక దేశంగానో ఎంతమాత్రమూ కాక, ఇవాళ ,మనం మున్నెన్నడూ లేనంతగా వృద్ధిలో ఉన్నామని అన్నారు. ఈ వృద్ధి తిరుగులేనిదన్నారు. ఈ వృద్ధి మన దేశాన్ని 2047 నాటికి, అంటే మన స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చేస్తుంద”న్నారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ బైక్ ర్యాలీ పట్ల తన ఉత్సుకతను వ్యక్తం చేస్తూ , హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేది కేవలం మన దేశ స్వాతంత్య్ర ఉత్సవాన్ని జరుపుకోవడం మాత్రమే కాక, మనల్ని ఒకటిగా ఉంచుతున్న ఐక్యత, సంఘటిత శక్తిని గుర్తుచేయడమని అన్నారు.
ఈ బైక్ ర్యాలీ భారత మండపం నుంచి ప్రారంభమైంది. ర్యాలీలో పాల్గొన్న వారు తమ బైక్ లపై జాతీయ పతాకాలను సగర్వంగా ఎగురవేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బైకులు ప్రదర్శనగా ముందుకు సాగాయి. త్రివర్ణ పతాకాలను ఊపుతూ , ఆనందోత్సాహాలతో ఢిల్లీలోని కీలక ప్రదేశాల మీదుగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీ సాగిన మార్గం అంతా దేశభక్తీ యుత సందేశాలు, అలంకరణలతో, పండుగ వాతావరణాన్ని తలపించింది.
హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ప్రజలు తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు ,దేశ ఘన వారసత్వ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలలో వారు పాల్గొనేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం.
ఢిల్లీలో జరిగిన బైక్ ర్యాలీ, పౌరులలో గల దేశభక్తి, తామంతా ఒకటే నన్న బలమైన భావనను తెలియజెబుతూ సాగిన విజయవంతమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారిలో చాలామంది దూర ప్రాంతాలనుంచి ఇందుకోసమే వచ్చిన వారు ఉన్నారు. వారు రకరకాల ప్రదర్శనలు ఇస్తూ ,కేరింతలు కొడుతూ, జాతీయ జెండాను ఊపుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి మీనాక్షి లేఖి, పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ,కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్ సుఖ్ ఎల్.మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు లు ర్యాలీలో పాల్గొన్న వారిని ప్రోత్సహించి కార్యక్రమ ప్రభావాన్ని రెట్టింపు చేశారు.
ఈ ర్యాలీ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద చిన్న కార్యక్రమంతో ముగిసింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన నాయకులు పాల్గొని ఈ కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజెప్పారు. మంగళవారం జరిగిన ర్యాలీ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ఉపన్యాసాలు ఏర్పాటయ్యాయి. పలు మతాలకు చెందిన వారు ఈ కార్యక్రమానికి హాజరై తమ మధ్యగల ఐక్యతను చాటారు, పలు తిరంగా ర్యాలీలు దేశ రాజధానిలో ఏర్పాటయ్యాయి. వీటిని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్,ట్రైనింగ్ (సిసిఆర్టి), లలిత కళా అకాడమీ ఏర్పాటు చేశాయి.
దీనికితోడు తిరంగా ర్యాలీలు , తిరంగా సంగీత విభావరులు, తిరంగా పరుగు, తిరంగా మారథాన్, ఇతర దేశ భక్తియుత కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరగుతున్నాయి.
సంఘటిత ఉత్సాహం, పౌరుల భాగస్వామ్యం జాతీయ విలువలను ఎలా అర్థవంతంగా ఉత్సవంలా జరుపుకోవచ్చో తెలియజెప్పడానికి హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. దేశం నలుమూలలా దేశ ఘన వారసత్వాన్ని గౌరవించుకోవడం కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు దేశ సామాజిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
***
(Release ID: 2045166)
Visitor Counter : 53