వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

‘పర్యావరణ-జీవావరణ ప్రామాణీకరణ'పై ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ వర్క్‌ షాప్


పర్యావరణ-జీవావరణ ప్ర‌మాణాల నిర్ధార‌ణ‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు

Posted On: 13 AUG 2024 11:04AM by PIB Hyderabad

   జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బిఐఎస్) పర్యావరణ- జీవావరణ అంశాల సంబంధిత ప్రామాణీకరణ కోసం ‘ఎన్విరాన్‌మెంట్ అండ్ ఇకాలజీ డిపార్ట్‌ మెంట్’ (ఇఇడి) పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది.

   ఈ నేపథ్యంలో కొత్త విభాగం భవిష్యత్ కార్యకలాపాలకు బలమైన పునాది దిశగా 2024 ఆగస్టు 12న ఇక్కడ ‘పర్యావరణం-జీవావరణం కోసం ప్రామాణీకరణ’ పేరిట  కార్యశాల (వర్క్‌ షాప్‌)ను నిర్వహించింది.

   ఈ కార్యక్రమంలో ‘బిఐఎస్’ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ- ‘‘కొత్త పర్యావరణ-జీవావరణ విభాగం ద్వారా ఉత్తమ ప్రమాణాల అవసరాన్ని తీర్చడమే కాకుండా అన్నిరకాల పర్యావరణ సమస్యలను అధిగమించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం’’ అని వెల్లడించారు. అలాగే దేశం కోసమే కాకుండా ప్రపంచం కోసం ప్రమాణాల రూపకల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. పర్యావరణ ప్రామాణీకరణ, అంతర్జాతీయ సుస్థిరతకు ప్రమాణాల నిర్దేశంలో ప్రపంచ అగ్రగామిగా రూపొందడంలో భాగంగా మరో రెండు నెలల్లో సదస్సులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా నందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ- ప్రమాణాల గురించి చర్చిస్తున్నామంటే ఇందులో కచ్చితంగా నిపుణులు, సలహాదారులు, ఇతర భాగస్వాములతో కూడా సమాలోచనలు అవసరమని స్పష్టం చేశరు. సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే విభిన్న అంశాలకు సంబంధించి ప్రమాణాల నిర్దేశానికి బిఐఎస్, పర్యావరణ-అటవీ మంత్రిత్వ శాఖతోపటు  ఇతర భాగస్వాముల మధ్య సహకారం ప్రాముఖ్యాన్ని ఆమె నొక్కి చెప్పారు.

   దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మందికిపైగా నిపుణులు ఈ వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు.

***



(Release ID: 2045152) Visitor Counter : 12