నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పీఎం-సూర్య ఘర్:ముఫ్త్ బిజ్లీ యోజన కింద 'నమూనా సౌర గ్రామం' అమలుకు నిర్వాహక మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
ప్రతి జిల్లా నుంచి గెలుపొందిన గ్రామానికి రూ.1 కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ నిధులు
Posted On:
12 AUG 2024 1:36PM by PIB Hyderabad
పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కింద 'నమూనా సౌర గ్రామం' అమలు కు సంబంధించిన మార్గదర్శకాలను నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆగస్టు 9న జారీ చేసింది.
ఈ పథకంలో భాగంగా 'నమూనా సౌర గ్రామం' అనే కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక నమూనా సౌర గ్రామాన్ని తయారుచేయాలనేది లక్ష్యం. సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ సమాజాలు విద్యుత్తు అవసరాల కోసం స్వయం సమృద్ధం అయ్యే అవకాశాన్ని కల్పించడం దీని ఉద్దేశం. ఎంపికైన ఒక్కో నమూనా సౌర గ్రామానికి రూ.1 కోటి చొప్పున అందించేందుకు రూ.800 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ పోటీకి పరిగణనలోకి తీసుకునేందుకు రెవెన్యూ గ్రామ జనాభా 5,000కు పైగా ఉండాలి(ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో 2,000). జిల్లా స్థాయి కమిటీ(డీఎల్‌సీ) అర్హత గల గ్రామాలను ప్రకటించిన తర్వాత ఆరు నెలల్లో ఆయా గ్రామాలు ఏర్పాటు చేసుకున్న పునరుత్పాదక ఇంధన సరఫరా సామర్థ్యాన్ని మదింపు చేసి ఎంపిక చేస్తారు.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అధికంగా ఉండి గెలుపొందిన జిల్లాకు ఒక గ్రామానికి రూ.1 కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ(డీఎల్‌సీ) పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుంది. ఎంపికైన గ్రామాలు సమర్థవంతంగా సౌర విద్యుత్తు సమాజాలుగా మారేలా, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచేలా చేయడం ఈ పథకం ఉద్దేశం.
పైకప్పుపైన సౌర విద్యుత్తు సామర్థ్యం పెంచడం, గృహాలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేలా మార్చడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 29 న పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజనను ఆమోదించింది. రూ.75,021 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలవుతుంది.
****
(Release ID: 2044934)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada