సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
భారత్-మాల్దీవ్స్ మధ్య 1,000 మంది సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణపై అవగాహన ఒప్పందం పునరుద్ధరణ
మాలె నగరంలో రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు డాక్టర్ ఎస్.జైశంకర్..
ఎఫ్.ఎం.మూసా జమీర్ సమక్షంలో సామర్థ్య వికాస ఒప్పందంపై సంతకాలు;
జాతీయ సుపరిపాలన కేంద్రం... సివిల్ సర్వీసెస్ కమిషన్ భాగస్వామ్యం:
2024-2029 మధ్య ఐదేళ్లపాటు అమలు కానున్న అవగాహన ఒప్పందం
Posted On:
12 AUG 2024 12:05PM by PIB Hyderabad
భారత్-మాల్దీవ్స్ ప్రగతి భాగస్వామ్యంపై ఆగస్టు 9వ తేదీన మాల్దీవ్స్ రాజధాని మాలె నగరంలో రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు డాక్టర్ ఎస్.జైశంకర్, శ్రీ మూసా జమీర్ చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2024-2029 మధ్య ఐదేళ్లపాటు 1000 మంది మాల్దీవ్స్ సివిల్ సర్వీస్ అధికారుల సామర్థ్య వికాస శిక్షణకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం పునరుద్ధరిస్తూ వారిద్దరి సమక్షంలో సంతకాలు పూర్తయ్యాయి.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వాన జాతీయ సుపరిపాలన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్- ఎన్‌సిజిజి) ఇప్పటిదాకా బంగ్లాదేశ్, టాంజానియా, గాంబియా, మాల్దీవ్స్, శ్రీలంక, కంబోడియా దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు సామర్థ్య వికాస కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే లాటిన్ అమెరికన్ దేశాలతోపాటు ‘ఎఫ్ఐపిఐసి/ఐఒఆర్’ దేశాల వారికోసం బహుళ-దేశీయ కార్యక్రమాలను కూడా నిర్వహించింది.
సామర్థ్య వికాస శిక్షణకు సంబంధించి 1000 మంది మాల్దీవ్స్ సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణ దిశగా భారత జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సిజిజి), మాల్దీవ్స్ ‘సివిల్ సర్వీస్ కమిషన్’ మధ్య 2019 జూన్ 8న అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం కింద ఐదేళ్ల కాలంలో... 2024 నాటికి ‘ఎన్‌సిజిజి’ కీలక మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు మాల్దీవ్స్ శాశ్వత కార్యదర్శులు, సెక్రటరీ జనరళ్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు సహా వివిధ కేడర్లలోని 1000 మంది సివిల్ సర్వీస్ అధికారులకు శిక్షణ పూర్తిచేసింది. ఇందులో భాగంగా మాల్దీవ్స్ అవినీతి నిరోధక కమిషన్ (ఎసిసి), ఇన్ఫర్మేషన్ కమిషన్ (ఐసిఒఎం) అధికారులు సహా సివిల్ సర్వెంట్ల కోసం మొత్తం 32 ‘ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్’ కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ సంయుక్త భాగస్వామ్యం విజయవంతమైన నేపథ్యంలో ఒప్పందాన్ని మరో ఐదేళ్లపాటు పునరుద్ధరించాలని మాల్దీవ్స్ విదేశాంగా మంత్రిత్వశాఖ కోరింది. తదనుగుణంగా 2029 నాటికి మరో 1,000 మంది అధికారులకు శిక్షణ లక్ష్యంగా 2024 ఆగస్టు 9న అధికారికంగా ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ సంతకాలు పూర్తయ్యాయి. దీంతో ప్రభుత్వ విధానాలు, పాలన, క్షేత్రస్థాయి వ్యవహారాల నిర్వహణలో మాల్దీవ్స్ సివిల్ సర్వీస్ అధికారుల సామర్థ్యం ఇనుమడిస్తుంది. అంతేకాకుండా భారత్-మాల్దీవ్స్ సంబంధాలను మరింత బలోపేతం అవుతుంది.
అనేక దేశాల్లో ప్రభుత్వ విధానాలు, పరిపాలనపై విజ్ఞాన ఆదానప్రదానంతోపాటు సహకార విస్తృతిని ప్రోత్సహించడంలో జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సిజిజి) విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వాధికారులకు కెరీర్ మధ్యలో సామర్థ్య వికాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పౌరకేంద్రక పరిపాలన, సేవాప్రదానంలో మెరుగుదల, వినూత్న పాలన పద్ధతుల ఆవిష్కరణకు ప్రోత్సాహం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది. అలాగే పౌరుల డిజిటల్ సాధికారత, వ్యవస్థలలో డిజిటల్ పరివర్తన దిశగా భారత్ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కూడా ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.
***
(Release ID: 2044782)
Visitor Counter : 64