ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ ఆపత్కాలంలో మనమంతా కేరళ ప్రజలకు అండగా నిలుద్దాం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
‘‘అన్నివిధాలా సహాయం కొనసాగిస్తామని అందరికీ...
ముఖ్యంగా బాధితులందరికీ హామీ ఇస్తున్నాను’’;
‘‘సహాయ కార్యక్రమాల్లో ముందు వరుసన నిలిచిన
సేవా పరాయణులైన కార్యకర్తలకు ధన్యవాదాలు’’;
Posted On:
10 AUG 2024 10:58PM by PIB Hyderabad
కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం కొనసాగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హామీ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలు పంపారు...
‘‘వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు మనందరినీ దుఃఖంలో ముంచివేశాయి. ఈ విపత్తు సంభవించినప్పటి నుంచి ఏర్పడ్డ పరిస్థితిని నేను నిశితంగా పర్యవేక్షిస్తున్నాను. బాధిత ప్రజలకు సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం అన్ని వనరులనూ సమీకరించింది. దీంతోపాటు నేను స్వయంగా అక్కడకు వెళ్లి అక్కడి స్థితిగతులను, సహాయ కార్యక్రమాలను సమీక్షించాను. విమానం ద్వారా ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించాను.’’ అని తెలిపారు.
అలాగే దుర్ఘటన బాధితులను కలుసుకున్న అనంతరం- ‘‘కొండచరియలు విరిగిపడటంతో సర్వం కోల్పోయినవారిని కలుసుకున్నాను. ఈ విపత్తువల్ల అనేక కుటుంబాలపై ఎంతటి దుష్ప్రభావం పడిందో నాకు పూర్తిగా అర్థమైంది. నేను సహాయ శిబిరాలకు కూడా వెళ్లి, గాయపడ్డ వారితో మాట్లాడాను’’ అని పేర్కొన్నారు.
ఈ వైపరీత్య బాధితుల సహాయ చర్యలలో పాలుపంచుకొంటున్న యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ‘‘ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకించి బాధిత ప్రజానీకానికి వీలైనంత మేర అన్నిరకాలుగా సాయం కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను. ఈ విపత్కర సమయంలో కేరళ ప్రజలకు మనమంతా అండదండగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు.
బాధిత ప్రాంతాల్లో స్థితిగతులను విమానం నుంచి సమీక్షించిన అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాయ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న వారితో సంభాషించారు. దీనిపై వివరాలను తెలుపుతూ- ‘‘అధికారులను, ముందువరుసలో సేవలందిస్తున్న కార్యకర్తలను కూడా నేను కలిశాను. ఈ ఆపత్కాలంలో అవిరళ సేవలందిస్తున్న వారి సేవాపరాయణతకు ధన్యవాదాలు తెలిపాను. కేరళ ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సమాచారం అందగానే, ప్రభావిత ప్రాంతాలలో ఇళ్ళు, పాఠశాలలు సహా అవసరమైన మౌలిక సదుపాయాల పునర్మిర్మాణంలో సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని ప్రకటించారు.
****
(Release ID: 2044715)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam