మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

చంద్రయాన్-3 అద్భుత విజయానికి ప్రతీకగా ఆగస్టు 23ను ‘‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’’గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


రేపు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో వేడుకలు నిర్వహించనున్న మత్స్య శాఖ

Posted On: 12 AUG 2024 1:52PM by PIB Hyderabad

   చంద్రయాన్-3 మిషన్ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏటా ఆగస్టు 23వ తేదీని ‘‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా నిర్వహించుకోవాలని ప్రకటించింది. నిరుడు ఇదే తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ సురక్షితంగా పాదంమోపి, ప్రజ్ఞాన రోవర్‌ని కార్యరంగంలో దింపిన అద్భుత క్షణానికి గుర్తుగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ చరిత్రాత్మక విజయం భారతదేశాన్ని అంతరిక్ష పథంలో స్వావలంబన సాధించిన దేశాల సరసన నిలిపింది. ఆ మేరకు చంద్రునిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా, ప్రత్యేకించి చంద్ర దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా ఘనతకెక్కింది. అందుకే అంతరిక్ష విజ్ఞాన సాంకేతిక రంగంలో యువతరానికి ప్రేరణనిచ్చే లక్ష్యంతో 2024 జూలై, ఆగస్టు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ విజయోత్సవం నిర్వహిస్తున్నారు.

   ఇందులో భాగంగా కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ‘‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’’లో పాల్గొంటారు. ఆ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్.ఎస్.పి.సింగ్ బాఘేల్, శ్రీ జార్జ్ కురియన్, మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాష్ లిఖి, ఇతర ప్రముఖులు కూడా దీనికి హాజరవుతారు.

   చంద్రయాన్-3 మిషన్ అద్భుత విజయానికి గుర్తుగా డాక్టర్ అభిలాష్ లిఖి మార్గదర్శకత్వాన తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ‘‘మత్స్య పరిశ్రమలో అంతరిక్ష సాంకేతికతల వినియోగం’’ ఇతివృత్తంగా 18 ప్రదేశాలలో సెమినార్లు, ప్రదర్శనలను మత్స్య శాఖ నిర్వహిస్తోంది. ఫిషరీస్‌లో స్పేస్ టెక్నాలజీ-ఒక అవలోకనం, సముద్ర అవసరాల కోసం కమ్యూనికేషన్-నావిగేషన్ సిస్టమ్, స్పేస్ ఆధారిత పరిశీలన-మత్స్య రంగం మెరుగుదలలో దాని ప్రభావం... వంటి అంశాలపై ఈ సందర్బంగా చర్చిస్తారు.

   అంతరిక్ష విభాగం, ఇన్కయాసిస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహా మత్స్యకారులు, సాగర్ మిత్రలు, ఎఫ్ఎఫ్ఎఫ్పిఓ లు, మత్స్య సహకార సంఘాలు, ఐసిఏఆర్ మత్స్య పరిశోధన సంస్థలు, రాష్ట్రం/యూటీల మత్స్య శాఖలు, ఫిషరీస్ విశ్వవిద్యాలయాల, కళాశాలల విద్యార్థులు సహా ఇతర వాటాదారులు హైబ్రిడ్ మోడ్‌లో పాల్గొంటారు.

   అయితే మత్స్య శాఖకు ఈ వేడుకలతో సంబంధం ఏమిటనే ప్రశ్నకు ఈ కథనం సమగ్ర సమాధానమిస్తుంది:

   భారత మత్స్య రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, ఆర్థిక అవకాశాల కల్పనలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మేరకు 8,118 కిలోమీటర్ల పొడవైన విశాల తీరప్రాంతం, 2.02 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తృతిగల ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్), సమృద్ధిగాగల లోతట్టు నీటి వనరులతో భారతదేశం విశిష్ట ప్రగతి సాధిస్తున్న మత్స్య పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.

   అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం భారతీయ సముద్ర మత్స్య నిర్వహణ, అభివృద్ధిని గణనీయంగా పెంచుతాయి. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఎర్త్ అబ్జర్వేషన్స్, శాటిలైట్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్, జిఐఎస్, శాటిలైట్ కమ్యూనికేషన్, డేటా అనలిటిక్స్, ఏఐ మొదలైన కొన్ని సాంకేతికతలు ఈ రంగంలో గొప్ప పరివర్తన తెచ్చాయి.

   శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సముద్రపు రంగు, క్లోరోఫిల్ కంటెంట్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి ఓషన్-శాట్, ఇన్సాట్ వంటి ఉపగ్రహాలను ఉపయోగించుకుంటుంది. మత్స్య సంపద క్షేత్రాలను గుర్తించడానికి, సముద్ర స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఫైటోప్లాంక్టన్ బ్లూమ్‌లు, అవక్షేపాలు, కాలుష్య కారకాలను కూడా ఇది గుర్తిస్తుంది. సముద్రపు ప్రవాహాలు, అలలు, విపరీత వాతావరణ ప్రమాదాలను పర్యవేక్షించడానికి, చేపలు పట్టే కార్యకలాపాలను అనుకూల పరచడానికి, భద్రతను నిర్ధారించడానికి భూపరిశీలనా శాటిలైట్లు ఇన్సాట్, ఓషన్ సాట్, ఎస్ఏఆర్ మొదలైన ఉపగ్రహాలు పరిశీలిస్తాయి.

   ఇండియన్ కాన్స్టెలేషన్ తో నావిగేషన్‌ (నావ్ఐసి)ని శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ, జిఐఎస్ ఉపయోగించుకుంటాయి. ఫిషింగ్ ఓడల కోసం జిఎన్ఎస్ఎస్ ట్రాకింగ్‌,  సముద్ర నివాసాలు, మత్స్య క్షేత్రాలు, రక్షిత ప్రాంతాలను గుర్తిస్తారు. ఉపగ్రహాలతో సముద్రంలో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు సముద్రాలపై అవగాహన, భద్రత, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి నౌకలు, తీర ఆధారిత స్టేషన్‌లు, పరిశోధనా సంస్థల మధ్య రియల్ టైం డేటా మార్పిడికి అవకాశం కలిగిస్తాయి.

డేటా అనలిటిక్స్, ఏఐ వివిధ వనరుల నుండి డేటాను ఉపయోగించి చేపల పంపిణీలను అంచనా వేస్తాయి. అలాగే ఇవి వ్యత్యాసాలను గుర్తించగలవు, మత్స్య నిర్వహణను గరిష్ఠం చేయగలవు. ఈ అధునాతన వ్యవస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడం, ఆక్వా మ్యాపింగ్‌కు మద్దతు ఇవ్వడం, విపత్తు హెచ్చరికలను అందించే ఉపగ్రహ పర్యవేక్షణ ద్వారా సముద్రంలో సామర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇమేజ్ సెన్సింగ్, ఆక్వా జోనింగ్ వంటి సాంకేతికతలు సమర్థవంతమైన మత్స్య నిర్వహణ కోసం ఖచ్చితమైన సాధనాలను అందిస్తాయి.

   పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ (పిఎఫ్ జెడ్) సలహా-సూచనలు సముద్ర మత్స్య రంగంలో విశేషమైన మార్పులను తీసుకొచ్చాయి. ఓషన్-శాట్ ఉపగ్రహం నుండి ఓషన్ కలర్ మానిటర్ డేటాను పొందడం ద్వారా, చేపల సముదాయానికి సంబంధించిన సంభావ్య సముదాయాలను గుర్తించి, మత్స్యకారులకు తెలియజేస్తారు. ఈ పిఎఫ్ జెడ్ సలహాసూచనలు 2014లో 3.49 లక్షల టన్నుల నుండి 2023లో 5.31 లక్షల టన్నులకు భారతదేశ సముద్ర మత్స్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఇది మత్స్యకారులు మెరుగైన సాగు ప్రదేశాలను గుర్తించి, సమర్ధవంతంగా మత్స్య సాగు చేసుకునే వీలు కల్పించింది. సముద్రంలో వెచ్చించే సమయం, శ్రమను తగ్గించి సముద్ర వనరుల స్థిరమైన నిర్వహణకు దారులు వేసింది.

   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద పర్యవేక్షణ, నియంత్రణ, నిఘా (ఎంసిఎస్) ద్వారా కేంద్ర మత్స్య శాఖ ఈ సాంకేతిక పురోగతికి మద్దతు ఇస్తుంది. వెరీ హై ఫ్రీక్వెన్సీ (విహెచ్ఎఫ్) రేడియోలు, డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్‌మిటర్లు (డాట్ లు), నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (నావ్ఐసి) ఎనేబుల్డ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్), ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ (పిఎఫ్ జెడ్) సమాచారం వంటి సేవలతో ఫిషింగ్ నౌకల కోసం ట్రాన్స్‌పాండర్లు వంటి కమ్యూనికేషన్, ట్రాకింగ్ పరికరాలను అందించడం ఈ వ్యవస్థ ప్రత్యేకతలు.

   మరోవైపు పీఎంఎస్ఎస్వై కింద పర్యవేక్షణ, నియంత్రణ, నిఘా కోసం సముద్రపు ఫిషింగ్ నౌకల్లో వెస్సెల్ కమ్యూనికేషన్, సపోర్ట్ సిస్టమ్ కోసం నేషనల్ రోల్ అవుట్ ప్లాన్‌పై ప్రాజెక్ట్‌ను కేంద్ర మత్స్య శాఖ ఆమోదించింది. నేషనల్ రోల్‌అవుట్ ప్లాన్ రూ.364 కోట్లతో 9 తీరప్రాంత రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ ఓడలతో సహా మెరైన్ ఫిషింగ్ ఓడలపై 1,00,000 ట్రాన్స్‌ పాండర్‌లను అమర్చాలని భావిస్తోంది.

 

***



(Release ID: 2044714) Visitor Counter : 65