ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధిక దిగుబడితోపాటు వాతావరణ ప్రతిరోధక.. జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి


వ్యవసాయంలో విలువ జోడింపు ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పిన ప్రధాని;

కొత్త వంగడాలు ఎంతో ప్రయోజనకరమని.. ఖర్చు తగ్గడమేగాక
పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయన్న రైతులు;

కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందన;

వినియోగంలోకి రాని పంటలను ప్రధాన స్రవంతిలోకి తేవాలన్న
ప్రధాని సూచన మేరకు కృషి చేస్తున్నట్లు తెలిపిన శాస్త్రవేత్తలు;

ప్రకృతి వ్యవసాయంతో ప్రయోజనాలు.. సేంద్రియ
ఆహార డిమాండ్‌ పెరుగుదలపై చర్చించిన ప్రధాని మోదీ

Posted On: 11 AUG 2024 1:15PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో  నిర్వహించిన కార్యక్రమంలో 109 రకాల అధిక దిగుబడినిచ్చే, వాతావరణ ప్రతిరోధక, జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించారు.

   ఈ సందర్భంగా ఆయన రైతులు, శాస్త్రవేత్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. కొత్త వంగడాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- వ్యవసాయంలో విలువ జోడింపు ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. అలాగే కొత్త వంగడాల ఆవిష్కరణపై రైతులు స్పందిస్తూ- ఇవెంతో ప్రయోజనకరమేగాక సాగు ఖర్చును తగ్గిస్తాయని, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతాయని అన్నారు.

   అటుపైన ప్రధానమంత్రి చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- పౌష్టికాహారం దిశగా ప్రజలు అడుగు వేస్తుండటాన్ని ఉదాహరించారు. ప్రకృతి వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు, సేంద్రియ ఉత్పత్తులపై సామాన్యుల్లోనూ పెరుగుతున్న విశ్వాసం గురించి చెప్పారు. దీనివల్ల సేంద్రియ ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ- ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న తీరుకు  అభినందనలు తెలిపారు.

   రైతులకు అవగాహన కల్పనలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కెవికె) పోషిస్తున్న పాత్రను అన్నదాతలు కొనియాడారు. కాగా, ప్రతినెలలో విడుదలయ్యే కొత్త వంగడాల సమాచారాన్ని రైతులకు తెలియజేస్తూ, వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచాలని ప్రధాని ‘కెవికె’లకు సూచించారు.

   ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు. కాగా, వినియోగంలోకి రాని పంటలను ప్రధాన స్రవంతిలోకి తేవాలన్న ప్రధాని సూచన మేరకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు.

   ఈ కార్యక్రమంలో భాగంగా 61 పంటలకు సంబంధించిన 109 కొత్త వంగడాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. వీటిలో 34 సాధారణ పంటలు కాగా, 27 ఉద్యాన పంటల రకాలున్నాయి. సాధారణ పంట రకాల్లో చిరుధాన్యాలు, పశుగ్రాసం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, పీచు తదితర విత్తనాలను విడుదల చేశారు. అలాగే ఉద్యాన పంటలలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఇతర పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పజాతులు, ఔషధ మొక్కల విత్తనాలను విడుదల చేశారు.

****


(Release ID: 2044465) Visitor Counter : 105