మంత్రిమండలి
azadi ka amrit mahotsav

2024-25 నుంచి 2028-29 లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ అమలుకు కేబినెట్ ఆమోదం

Posted On: 09 AUG 2024 10:17PM by PIB Hyderabad

2024-25 నుంచి  2028-29 ఆర్థిక సంవత్సరాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) పథకం అమలు కోసం గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పథకంలో భాగంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం అందించనున్న ఆర్థిక సాయం మైదాన ప్రాంతాల్లో రూ. 1.20 లక్షలు, ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లలో రూ.1.30 లక్షలు

వివరాలు:
కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి.
2024 ఏప్రిల్ నుంచి 2029 మార్చి వరకు మౌలిక సదుపాయాలతో కూడిన 2 కోట్ల పక్కా గృహాలకు సహాయం అందించడం ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కొనసాగింపు. సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) 2011 పర్మినెంట్ వెయిట్ లిస్ట్ (పీడబ్ల్యూఎల్)లో ఆవాస్+ (2018) జాబితాలో ఉన్న గృహాలను సంపూర్ణంగా నిర్మించేందుకు దీనిని అమలు చేస్తారు.
2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అంచనా వ్యయం రూ.3,06,137 కోట్లు కాగా, ఇందులో కేంద్ర వాటా రూ.2,05,856 కోట్లు, రాష్ట్ర వాటా రూ.1,00,281 కోట్లు.
ఈ పథకాన్ని నీతి ఆయోగ్ మదింపు చేసి, ఈఎఫ్సీ ఈ పథకాన్ని పునఃసమీక్షించిన తర్వాత 2026 మార్చి తర్వాత కూడా కొనసాగించాలి.
సవరించిన మినహాయింపు ప్రమాణాలను ఉపయోగించి అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడానికి  ఆవాస్+ జాబితాను అప్‌డేట్ చేయడం.
నిర్మాణానికి  ఇదివరకే నిర్ణయించిన యునిట్ ధర మైదాన ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల చొప్పున కొనసాగుతుంది.
కార్యక్రమ నిధులలో 2% పరిపాలన నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1.70 శాతంగా, కేంద్ర స్థాయిలో 0.30 శాతంగా విభజించబడతాయి.
31.03.2024 నాటికి పీఎంఏవై-జీ లో అసంపూర్తిగా మిగిలి ఉన్న ఇళ్లను, ప్రస్తుత రేట్ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి.

ప్రయోజనాలు:

31.03.2024 నాటికి పూర్తికాని మిగిలి ఉన్న 35 లక్షల ఇళ్లను పూర్తి చేసి, మునుపటి దశలో పెట్టుకున్న 2.95 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోనున్నారు.
వచ్చే ఐదేళ్లలో అంటే 2024-2029 ఆర్థిక సంవత్సరాల మధ్య పీఎంఏవై-జీ కింద మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఈ ఇళ్ల నిర్మాణంతో దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
ఇళ్లు లేనివారు, శిథిలావస్థలో ఉన్న కచ్చా ఇళ్లలో నివసిస్తున్న వారంతా అన్ని మౌలిక వసతులతో నాణ్యమైన సురక్షితమైన ఇంటిని నిర్మించుకునేందుకు ఈ ఆమోదం దోహదపడుతుంది.  ఇది లబ్ధిదారుల భద్రత, పరిశుభ్రత, సామాజిక సమ్మిళితత్వాన్ని నిర్ధారిస్తుంది.

నేపథ్యం:

గ్రామీణ ప్రాంతాల్లో 'అందరికీ ఇళ్లు' అనే లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి వరకు దశలవారీగా ప్రాథమిక సౌకర్యాలతో కూడిన 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 


 

***


(Release ID: 2044204) Visitor Counter : 136