జౌళి మంత్రిత్వ శాఖ
10వ జాతీయ చేనేత దినోత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
చేనేత పరిశ్రమ సుస్థిరత... విద్యుత్ సామర్థ్యంపై దృష్టి కేంద్రీకరిస్తోంది: శ్రీ గిరిరాజ్ సింగ్;
మహిళల సారథ్యంలో భారత చేనేత పరిశ్రమ ముందడుగు: శ్రీ సింగ్
Posted On:
07 AUG 2024 6:09PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్‌కడ్ ఇవాళ 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరీటా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ థన్‌కడ్ మాట్లాడుతూ- ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘‘బి వోకల్ ఫర్ లోకల్’’ కార్యక్రమానికి చేనేత ఉత్పత్తులే కేంద్రకమని గుర్తుచేశారు. వాతావరణ మార్పు ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో చేనేతకు ప్రోత్సాహం ప్రస్తుత కాలానికి, దేశానికే కాకుండా భూగోళానికే అత్యావశ్యమని ఆయన అన్నారు. మన ఆర్థిక ప్రగతికి, స్వాతంత్య్రానికి ఆర్థిక జాతీయతే ఆధారమని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రసంగిస్తూ- ప్రపంచ చేనేత రంగంలో భారత చేనేత పరిశ్రమ అతి పెద్దదని, ఈ రంగం నేడు సుస్థిరత, విద్యుత్ సామర్థ్యంపై దృష్టి సారిస్తున్నదని అన్నారు. ప్రపంచం సుస్థిర ఉత్పత్తుల వినియోగం వైపు అడుగులు వేస్తుండగా, చేనేత పరిశ్రమ శూన్య-కర్బన పాదముద్రతో ఉత్పత్తి చేస్తుందని, ఎలాంటి శక్తితో దీనికి అవసరం లేదని చెప్పారు. అంతేగాక చేనేత పరిశ్రమ సున్నా-నీటి పాదముద్ర గల రంగమని కూడా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం 2015 ఆగస్టు 7 నుంచి జాతీయ చేనేత దినోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. లోగడ 1905లో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం మొదలు కావడాన్ని స్మరించుకుంటూ ఈ తేదీని ఎంచుకున్నామని కేంద్ర మంత్రి శ్రీ సింగ్ పేర్కొన్నారు. ఇది నేత కార్మికులను, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని ఆయన తెలిపారు. దేశంలో సాంకేతికత, మార్కెటింగ్, డిజైన్, ఫ్యాషన్‌ను సాముదాయక అభివృద్ధి కార్యక్రమం (సిడిపి) కిందకు తేవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. నేత కార్మికులకు న్యాయమైన పారితోషికం దక్కేవిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. నేత కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన ఆదాయ అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం వస్త్ర విలువ శ్రేణి మెరుగుదలకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
దేశంలోని నేత కార్మికులలో 70 శాతం మహిళలేనని, చేనేత రంగం మహిళా సారథ్యంలో ముందడుగు వేస్తున్నదని మంత్రి తెలిపారు. సంప్రదాయ నేత కార్మికుల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- వారు తమ తదుపరి తరానికీ ఈ సంప్రదాయ హస్తకళా నైపుణ్యాన్ని సంక్రమింపజేయాలని సూచించారు. అలాగా నైపుణ్యాభివృద్ధి దిశగా ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ’ (ఐఐహెచ్ టి)ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చేనేత ఉత్పత్తుల స్వీకరణ వేగం పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ- త్వరలో భారతీయులంతా చేనేత ఉత్పత్తులను విస్తృతంగా ఉపయోగించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత చేనేత మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి, నేత కార్మికులకు, వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.
***
(Release ID: 2043409)
Visitor Counter : 59