రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో వాయుసేన సహాయక చర్యలు

Posted On: 01 AUG 2024 10:31AM by PIB Hyderabad

కొండచరియలు విరిగిపడిన కేరళలోని వయనాడ్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మొదటగా స్పందించి, ఎన్డీఆర్ఎఫ్ వంటి ఏజెన్సీలతో పాటు రాష్ట్ర యంత్రాంగం సమన్వయంతో జూలై 30న తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలను చేపట్టింది. 

 

కీలకమైన సామాగ్రి, సరుకుల సరఫరాతో పాటు తరలింపు చర్యల్లో ఐఏఎఫ్‌కు చెందిన రవాణా విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బెయిలీ వంతెన, డాగ్ స్క్వాడ్స్, వైద్య సహాయం, సహాయక చర్యల కోసం అవసరమైన ఇతర పరికరాలు వంటి 53 మెట్రిక్ టన్నుల కీలకమైన సామాగ్రిని సీ-17 రవాణా చేసింది. దీనితో పాటు సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపునకు ఏఎన్-32, సీ-130లను వినియోగిస్తున్నారు. ఐఏఎఫ్‌కు చెందిన ఈ విమానాలు సహాయ బృందాలు, నిర్వాసితులతో సహా 200 మందిని విపత్తు ప్రభావిత ప్రాంతానికి, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దోహదపడ్డాయి. వాతావరణం విమానాలు ఎగిరేందుకు సవాళ్లు విసురుతున్నప్పటికీ, హెచ్ఏడీఆర్ కార్యకలాపాలను ఐఓఎఫ్ చేపడుతోంది.

సహాయక చర్యల కోసం వాయుసేన వివిధ రకాల హెలికాప్టర్లను మోహరించింది. ఎంఐ-17, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్ హెచ్) హెచ్ఏడీఆర్ ఆపరేషన్‌లు చేపట్టేందుకు ఉపయోగిస్తున్నారు. విస్తృతమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ విపత్తులో చిక్కుకున్న వ్యక్తులను సమీప వైద్య కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలింపు, నిత్యావసర వస్తువుల పంపిణీని 31 జూలై 2024 సాయంత్రం వరకు వాయుసేన చేపట్టింది. సహాయక చర్యల్లో భాగంగా ఈ హెలికాప్టర్లు ప్రభావిత ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించింది. వారి సురక్షిత, తక్షణ రవాణాను వాయుసేన చూసుకుంటోంది.

విపత్తు బాధితులైన కేరళ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐఏఎఫ్ కట్టుబడి ఉంది.

***



(Release ID: 2040197) Visitor Counter : 31