నీతి ఆయోగ్

వికసిత్ భారత్@2024 ను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో నీతి ఆయోగ్ 9 వ పాలకమండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.

Posted On: 26 JUL 2024 3:41PM by PIB Hyderabad

సులభతర  జీవనానికి ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్ అభివృద్ధికి చేయూతనివ్వడంపై ప్రధానంగా దృష్టిపెట్టనున్న  సమావేశం.
ప్రధానమంత్రి  శ్రీ  నరేంద్ర మోదీ 2024 జూలై  27 వతేదీ న నీతి ఆయోగ్ 9 వ పాలకమండలి  సమావేశానికి అధ్యక్షత  వహించనున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి  భవన్ లోగల కల్చరల్ సెంటర్ లో  ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశపు  ఈ ఏడాది ఇతివృత్తం వికసిత్  భారత్@2024. ఇండియాను అభివృద్ధి  చెందిన దేశంగా చేయడం పై ఇది ప్రధానంగా  దృష్టిపెడుతుంది.
నీతి  ఆయోగ్  పాలకమండలి సమావేశం, వికసిత్  భారత్@2024 దార్శనికతకు  సంబంధించిన మార్గదర్శకపత్రంపై చర్చించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, పరస్పర సహకారాన్ని  మరింత  పెంపొందిచడం , గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో ప్రజల  జీవన  నాణ్యతను  మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాల అమలు మరింత బలోపేతం  చేయడం లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
2047 నాటికి భారత  ఆర్ధిక వ్యవస్థ30 ట్రిలియన్ డాలర్ల  అమెరికన్ ఆర్థిక  వ్యవస్థను దాటాలన్నది  లక్ష్యం. ఆ దిశగా మన జి.డి.పి 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను దాటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద  ఆర్ధిక వ్యవస్థగా అవతరించే క్రమంలో ముందుకు సాగుతోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి  కేంద్ర ,రాష్ట్రప్రభుత్వాల మధ్య పరస్పర సహకారంతో  కూడిన విధానం అవసరం. నీతి ఆయోగ్ 9వ పాలక  మండలి సమావేశం ఈ దార్శనికత  ను సాధించడానికి అవసరమైన మార్గ  సూచి (రోడ్  మ్యాప్)ను రూపొందించడంతోపాటు, టీమ్ ఇండియా  గా కేంద్ర , రాష్ట్రాల మధ్య టీమ్  వర్క్ ను పెంపొందించడానికి కృషి చేయనుంది.
నీతి ఆయోగ్ పాలకమండలి  సమావేశం,2023 డిసెంబర్ 27-29 మధ్య జరిగిన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశం చేసిన సూచనలపైనా ద్రుష్టి పెట్టనుంది. సులభతర జీవనం ఇతివృత్తంతో , 3వ జాతీయ స్థాయి ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శుల సదస్సు 5 అంశాలపై సిఫార్సులు చేసింది. అవి....
1. త్రాగునీరు : అందుబాటు, పరిమాణం, నాణ్యత
2. విద్యుత్ : నాణ్యత, సమర్ధత, విశ్వసనీయత
3. ఆరోగ్యం : అందుబాటు,స్థోమత, నాణ్యమైన ఆరోగ్యం పరిరక్షణ
4. విద్య : అందుబాటు, నాణ్యత
5. భూమి, ఆస్తి : అందుబాటు, డిజిటైజేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్

వీటికి  తోడు సైబర్ భద్రత, ఆకాంక్షిత  జిల్లాలు, బ్లాక్ కార్యక్రమాలు, రాష్ట్రాల  పాత్ర, పాలనలో కృత్రిమ మేథ వంటి వాటిపై ప్రత్యేక సెషన్ లు నిర్వహించనున్నారు. ఈ అంశాలను ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శుల 3వ జాతీయ సమావేశంలోనూ చర్చించారు.
నీతి ఆయోగ్  9 వ పాలక మండలి సమావేశానికి  సన్నద్ధతలో భాగంగా  2023 డిసెంబర్ చివరలో ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శుల 3వ జాతీయ సమావేశం జరిగింది.  ఈ  సందర్భంగా  పైన పేర్కొన్న  ఐదు ప్రముఖ ఇతివృత్తాలపై విస్తృత చర్చలు జరిగాయి.  వికసిత్ భారత్@2047 అజెండాకు తగిన సూచనలు అందించడం, ఫ్రేమ్ వర్క్ కు రూపకల్పన  వంటి వాటి  సంప్రదింపుల ప్రక్రియలో భారతప్రభుత్వ కార్యదర్శులు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత  ప్రభుత్వాల ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శులు  భాగస్వాములయ్యారు.  
నీతి ఆయోగ్ కు ప్రధానమంత్రి  ఛైర్ పర్సన్ గా  ఉంటారు.ఈ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్ అఫిషియో  సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర  మంత్రులు, నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్, ఇతర సభ్యులు హాజరవుతారు.

***



(Release ID: 2037866) Visitor Counter : 156