ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
యూనియన్ బడ్జెట్ 2024-25
తక్కువ ధరలో క్యాన్సర్ చికిత్స కోసం మూడు ముఖ్యమైన క్యాన్సర్ ఔషధాలకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు
మెడికల్ ఎక్స్-రే యంత్రాలలో ఉపయోగించే ఎక్స్-రే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై కస్టమ్ సుంకంలో మార్పు
ఎన్ హెచ్ఎం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.4,000 కోట్లు పెరిగిన బడ్జెట్ వ్యయం – రూ.31,550 కోట్ల నుంచి రూ.36,000 కోట్లకు పెంపు
.
విస్తృత ఉత్పాదకత, సృజనాత్మకత కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల (డీపీఐ) అనువర్తనాల ప్రతిపాదన
స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వడం, వీధి ఆహార నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఎంపిక చేసిన నగరాల్లో 100 వీక్లీ “హాట్లు” లేదా వీధి ఆహార కేంద్రాల ప్రారంభం
Posted On:
24 JUL 2024 9:24AM by PIB Hyderabad
పార్లమెంటులో 2024-25 కేంద్ర బడ్జెట్ సందర్భంగా మూడు ముఖ్యమైన క్యాన్సర్ ఔషధాలు - ట్రాస్టుజుమాబ్ డెరుక్స్టెకాన్, ఓసిమెర్టినిబ్, డుర్వాల్యుమాబ్ లకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో 27 లక్షల మంది కేన్సర్ రోగులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ అభ్యర్థనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. తక్కువ ధరలో ఈ ఔషధాల లభ్యతను మెరుగుపరిచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వాటిని కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించింది.
ట్రాస్టుజుమాబ్ డెరుక్స్టెకాన్, ఒసిమెర్టినిబ్, డర్వాల్యుమాబ్ అనే మూడు క్యాన్సర్ ఔషధాలను వివిధ రకాలకు ఉపయోగిస్తారు.
- ట్రాస్టుజుమాబ్ డెరుక్స్టెకాన్ – బ్రెస్ట్ క్యాన్సర్
- ఓసిమెర్టినిబ్ - ఊపిరితిత్తుల క్యాన్సర్;
- డుర్వాల్యుమాబ్ – ఊపిరితిత్తుల క్యాన్సర్, పిత్తాశయ క్యాన్సర్
ఎక్స్ రే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై కస్టమ్ సుంకాల రేట్లను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి సవరించారు. తక్కువ ఖర్చుతో ఈ భాగాల లభ్యతను పెంచడం ద్వారా ఎక్స్-రే యంత్ర పరిశ్రమను ఈ సవరించిన రేట్లు సానుకూలంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ మార్పు దేశీయ వైద్య పరికర రంగాన్ని ప్రోత్సహిస్తుందని, తక్కువ ఖర్చుతో విడిభాగాల లభ్యతకు దోహదం చేస్తుందని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గిస్తుందని, అధునాతన వైద్య చిత్రణను తక్కువ ధరలో మరింత అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ వ్యయం కూడా దాదాపు రూ.4000 కోట్లు పెరిగింది. అది రూ.31,550 కోట్ల నుంచి రూ.36,000 కోట్లకు చేరింది. ఎన్ హెచ్ఎం అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది ప్రధానంగా దేశంలో ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి వ్యాధి నిరోధక, నిర్మూలక అంశాల అమలుతో ప్రజల వ్యయాన్ని విస్తృతంగా తగ్గించడం కోసం ప్రాథమిక, ద్వితీయ ప్రజా ఆరోగ్య సంరక్షణ సదుపాయాల్లో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రైవేటు రంగం ద్వారా ఉత్పాదకత లాభాలు, వ్యాపార అవకాశాలు, సృజనాత్మకతను పెంపొందించడానికి జనాభా స్థాయిలో సాంకేతిక ప్రజా మౌలిక సదుపాయాలు (డీపీఐ) అనువర్తనాల అభివృద్ధిని బడ్జెట్ ప్రతిపాదించింది. క్రెడిట్ ఇ-కామర్స్, విద్య, ఆరోగ్యం, చట్టం - న్యాయం, రవాణా, ఎంఎస్ఎంఈ సేవలు, డెలివరీ, పట్టణ పాలన సహా వివిధ రంగాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
వీటితోపాటు 2024-25 కేంద్ర బడ్జెట్ లో ఎంపిక చేసిన నగరాలలో 100 వారపు ‘హాట్స్’ లేదా వీధి ఆహార కేంద్రాల (స్ట్రీట్ ఫుడ్ హబ్లు) అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజితం చేయడం, వీధి ఆహార నాణ్యతను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది పట్టణాభివృద్ధికి, సామాజిక భాగస్వామ్యానికి మరింత దోహదం చేస్తంది.
నేపథ్యం:
క్యాన్సర్ ఔషధాలు:
ట్రాస్టుజుమాబ్ ఇంజెక్షన్ 440మి.గ్రా/50మి.లీ అనేది ఎన్ఎల్ఈఎం 2022 కింద అనుసూచిత ఔషధం. దాని గరిష్ట ధరను ఎన్పీపీఏ నిర్ణయించింది. 26.03.2024 నాటి ఎస్ ఓ 1547 (ఇ) ద్వారా ప్రస్తుత గరిష్ట ధర ఒక సీసాకు రూ. 54725.21 గా ఉంది. అయితే, దాని ఇతర దార్ఢ్య రూపాంతరాలు షెడ్యూళ్ల జాబితాలో లేవు. ట్రాస్టుజుమాబ్ వివిధ స్థాయిలు, మోతాదుల్లో వస్తుంది. దాని వార్షిక టర్నోవర్ రూ.276 కోట్లుగా ఉంది.
ఇతర రెండు ఔషధాలు ఒసిమెర్టినిబ్, డర్వాల్యుమాబ్ లు డీపీసీవో, 2013 కింద అనుసూచితం కాని ఔషధాలు. అందువల్ల, పన్నెండు నెలల్లో ఎంఆర్పీలో 10% కన్నా ఎక్కువ పెరగకుండా చూడడం కోసం అనుసూచితం కాని ఫార్ములేషన్ల గరిష్ట చిల్లర ధరను ఎన్పీపీఏ పర్యవేక్షిస్తుంది. 2023-24 సంవత్సరానికి డుర్వాల్యుమాబ్ వార్షిక టర్నోవర్ రూ.28.8 కోట్లు.
ఒసిమెర్టినిబ్ – ఇది 27.02.2019 నాటి ఎస్.వో.1041 (ఇ) ప్రకారం వాణిజ్య లాభాల హేతుబద్ధీకరణ కింద వాణిజ్య లాభాలను నియంత్రించే 42 క్యాన్సర్ నిరోధక ఔషధాల జాబితా పరిధిలో ఉంది. ఎన్పీపీఏ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, 2023-24 సంవత్సరానికి ఒసిమెర్టినిబ్ వార్షిక టర్నోవర్ రూ.52.26 కోట్లు.
మెడికల్ ఎక్స్-రే ఔషధాల తయారీ:
మెడికల్ ఎక్స్-రే యంత్రాలు, నిర్దిష్ట విడి భాగాలు/భాగాలు/ ఉప భాగాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి దశలవారీ తయారీ కార్యక్రమాన్ని (పీఎంపీ) 2021 జనవరి 22న డీవోపీ ప్రకటించింది. దీని ద్వారా ఎక్స్-రే యంత్రాల తయారీలో ఉపయోగించే మెడికల్ ఎక్స్-రే యంత్రాలు, నిర్దిష్ట ఉప - విడిభాగాలు/ భాగాలు/ ఉపభాగాలపై టారిఫ్ మార్పుల్లో దశలవారీ పెరుగుదల రేటును ప్రతిపాదించారు.
మెడికల్ ఎక్స్-రే యంత్రాలు, నిర్దిష్ట విడి భాగాలు/భాగాలు/ ఉప భాగాల పరిశ్రమను ఆ రంగంలో తమ పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించుకునేలా ప్రోత్సహించడం, వాటిపై పెరుగుతున్న సుంకాలను దృష్టిలో పెట్టుకుని దేశీయ ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పించడం పీఎంపీ లక్ష్యం. ఇది దేశీయ విలువ జోడింపు పెరుగుతుందని, దేశంలో పటిష్టమైన మెడికల్ ఎక్స్ రే యంత్రాల తయారీని వ్యవస్థను నెలకొల్పుతుందని భావిస్తున్నారు.
అయితే, దేశంలో ఎక్స్-రే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్ల తయారీ సామర్థ్యం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని ఔషధ విభాగానికి పరిశ్రమ నివేదించింది, ఈ వస్తువులకు సంబంధించిన దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) షెడ్యూలును సవరించాలని అభ్యర్థించింది. ఈ విషయంలో నిశితమైన పరిశీలనల అనంతరం దేశీయ అవసరాలను తీర్చడానికి ఎక్స్ రే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లలో తగినంత దేశీయ సామర్థ్యాన్ని సాధించడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టవచ్చని గుర్తించారు. అనంతరం ఔషధ విభాగం 24.5.2024 నాటి ఓఎం ద్వారా సవరించిన రేట్ల కోసం రెవెన్యూ విభాగానికి అభ్యర్థన పంపింది. నోటిఫికేషన్ నెం.30/2024 - 2024 జూలై 23 నాటికి సుంకాలు (క్ర.సం. 71) ద్వారా ఔషధ విభాగం ప్రతిపాదించిన విధంగా సంబంధిత వస్తువులపై సుంకం రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించింది.
***
(Release ID: 2036613)
Visitor Counter : 578