ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల' కోసం ప్రభుత్వం 3 పథకాలను అమలు చేయనుంది.


210 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని అధికారిక రంగాల్లో కొత్తగా శ్రామిక శక్తిలోకి ప్రవేశించే వ్యక్తులందరికీ ఒక నెల వేతనాన్ని అందించే పథకం

ఉత్పాదక రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహించే ఈ పథకం మొదటిసారిగా పని లోకి వెళ్తున్న వారి ఉపాధితో ముడిపడి ఉంటుంది, దీని వల్ల తొలిసారిగా ఉపాధి పొందుతున్న 30 లక్షల మంది యువత లబ్ధి పొందుతారని అంచనా  

రంగాల వారీగా అదనపు ఉపాధిని కల్పించే యజమానులపై దృష్టి సారించిన ఈ పథకం 50 లక్షల మంది వ్యక్తులకు అదనపు ఉపాధిని అందిస్తుందని అంచనా

Posted On: 23 JUL 2024 1:07PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల' కోసం ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేయనుంది. ఈపీఎఫ్ఓలో నమోదు, మొదటిసారి ఉద్యోగులను గుర్తించడం, ఉద్యోగులు, యజమానులకు సహాయం అందించడం ఆధారంగా ఈ పథకాలు ఉంటాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2024-25 కేంద్ర బడ్జెట్ ను  ప్రవేశపెడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. అమలు చేయాల్సిన మూడు పథకాలు ఇలా ఉన్నాయి.

పథకం  (స్కీమ్) ఎ: మొదటిసారి ఉద్యోగార్థులు

ఈ పథకం ద్వారా కొత్తగా అన్ని అధికారిక రంగాల్లోకి ప్రవేశించే వారందరికీ ఒక నెల వేతనాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న మొదటి సారి ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని 3 వాయిదాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ చేయడం రూ.15,000 వరకు ఉంటుంది. అర్హత పరిమితి నెలకు రూ.లక్ష వేతనం లోపు ఉన్నవారికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.


పథకం (స్కీమ్)   బి: తయారీ రంగంలో ఉపాధి కల్పన

ఈ పథకం తయారీ రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహిస్తుందని, మొదటిసారి ఉద్యోగుల ఉపాధితో ముడిపడి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి 4 సంవత్సరాల్లో ఈపీఎఫ్ఓ చందా కు  సంబంధించి ఉద్యోగికి, యజమానికి నేరుగా నిర్ణీత స్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పథకం  (స్కీమ్)   సి : యజమానులకు సహాయం

యజమాని-కేంద్రీకృత పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. నెలకు రూ.లక్ష వేతనం లోపు ఉన్న అదనపు ఉద్యోగాలన్నింటినీ లెక్కిస్తారు. ప్రతి అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ఓ చందా (కంట్రిబ్యూషన్) కింద  నెలకు రూ.3,000 చొప్పున రెండేళ్ల పాటు యజమానులకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.  ఈ పథకం ద్వారా అదనంగా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

 

***

 



(Release ID: 2036024) Visitor Counter : 18