ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య భారత అద్భుత పనితీరు ప్రదర్శించిన బ్యాంకింగ్, ఆర్థిక రంగం
అత్యధిక సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరిన బ్యాంకుల నిరర్థక ఆస్తులు
మార్కెట్ క్యాపిటలైజేషన్, జీడీపీ నిష్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా, భారత్ 5వ స్థానం
మూలధన సృష్టిలో ప్రాథమిక మార్కెట్లు 2023 ఆర్థిక ఏడాదిలో రూ.9.3 లక్షల కోట్లు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.10.9 లక్షల కోట్లు సృష్టించాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల సంఖ్య 66 శాతానికి పెరిగి 272కు చేరింది.
నిఫ్టీ 50 ఇండెక్స్, 2023 ఆర్థిక సంవత్సరంలో (-)8.2 శాతంగా కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 26.8 శాతం పెరిగింది.
ఎన్ఎస్ఈలో 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు మూడు రెట్లు పెరిగి 9.2 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంఖ్య
సుస్థిర ఆర్థికాభివృద్ధి, అసమానతల తగ్గింపు, పేదరిక నిర్మూలన కొరకు ఆర్థిక సమ్మిళితంపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం
రాబోయే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా మార్కెట్లలో ఒకటిగా భారతదేశం ఆవిర్భవించనుంది.
మైక్రోఫైనాన్స్ రంగంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశంగా అవతరించిన భారత్
Posted On:
22 JUL 2024 3:15PM by PIB Hyderabad
నిరంతర ప్రపంచ రాజకీయ సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్, ఇతర ఆర్థిక రంగాల్లో మంచి పనితీరును కనబరిచిందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో తెలిపారు. మొత్తం ద్రవ్యోల్బణ రేటు నియంత్రణలో ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఏడాది పొడవునా స్థిరమైన పాలసీ రేట్లను కొనసాగించిందని సర్వే పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్దం తరువాత ద్రవ్య ధృడత్వ ప్రభావాలు బ్యాంకులలో రుణాలు, డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచడం స్పష్టంగా కనిపిస్తాయి. బ్యాంకు రుణాలు వివిధ రంగాలలో గణనీయమైన, విస్తృతమైన వృద్ధిని సాధించాయి, వ్యక్తిగత రుణాలు సేవలు ముందంజలో ఉన్నాయి.
ద్రవ్య విధానం (మానిటరీ పాలసీ)
మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 2024 ఆర్థిక సంవత్సరంలో పాలసీ రెపో రేటుపై యథాతథ స్థితిని 6.5 శాతంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక చక్రంలో, అంటే మే 2022 నుండి మే 2024 వరకు, బాహ్య కారకాల ఆధారిత రుణ రేటు, ఒక ఏడాది సగటు మార్జినల్-కాస్ట్-ఆఫ్-ఫండ్స్ ఆధారిత రుణ రేటు వరుసగా 250 బేస్ పాయింట్లు, 175 బేసిస్ పాయింట్లు పెరిగాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య, రుణ పరిస్థితుల పరిణామాన్ని ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాలు రూ .2,000 నోట్ల ఉపసంహరణ (మే 2023), హెడిఎఫ్‌సీ బ్యాంకులో నాన్-బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం (జూలై 2023), ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ (ఐ-సిఆర్ఆర్) తాత్కాలికంగా విధించడం (ఆగస్టు 2023).
హెడిఎఫ్‌సీ బ్యాంకులో నాన్-బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం ప్రభావాన్ని మినహాయించి బ్రాడ్ మనీ (ఎం 3) వృద్ధి 2024 మార్చి 22 నాటికి 11.2 శాతం గా ఉంది.
2024 ఆర్థిక సంవత్సరంలో, ప్రాథమిక ఆపరేషన్లుగా 17 వారాల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) వేలం, ఏడు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) చేపట్టారు. అదనంగా, 49 ఫైన్-ట్యూనింగ్ కార్యకలాపాలు (25 విఆర్ఆర్, 24 విఆర్ఆర్) అడపాదడపా నిర్వహించబడ్డాయి. ద్రవ్య విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత్వ పరిస్థితులను మార్చడం జరిగింది.
బ్యాంక్ రుణాలు
ప్రధానంగా సేవ రంగం, వ్యక్తిగత రుణాలు ఇవ్వడం ద్వారా రుణ వృద్ధి ధృడంగా ఉంది.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) రుణాలు వేగవంతం కావడంతో వ్యక్తిగత రుణాలు, పరిశ్రమలకు రుణాలు అందడంతో వాటి ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. 2023 మార్చి చివరి నాటికి 15 శాతం వృద్ధితో పోలిస్తే 2024 మార్చి చివరి నాటికి 20.2 శాతం వృద్ధితో ఎస్సీబీలు రూ.164.3 లక్షల కోట్లుగా ఉన్నాయి.
వ్యవసాయ రుణాలు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ .13.3 లక్షల కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .20.7 లక్షల కోట్లకు చేరి దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) పథకం రైతులకు సకాలంలో, ఇబ్బంది లేని రుణాలను అందించడంలో కీలక పాత్ర పోషించింది. 2023 చివరి నాటికి 7.4 కోట్లకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నాయి.
2024 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పారిశ్రామిక రుణ వృద్ధి పుంజుకుంది. ఏడాది క్రితం 5.2 శాతం వృద్ధి ఉండగా, 2024 మార్చిలో 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీనికి కారణం, చిన్న, పెద్ద పరిశ్రమలకు బ్యాంకు రుణాలు పెరగడం వల్ల జరిగింది.
ఎంఎస్ఎంఈ రంగానికి తక్కువ ఖర్చుతో రుణ ప్రవాహాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ, ఆర్బిఐ యొక్క విధాన ప్రాధాన్యతల్లో ఒకటి. ఎన్బీఎఫ్సీలకు రుణ వృద్ధి మందగించినప్పటికీ సేవల రంగానికి బ్యాంకు రుణ పంపిణీ 2023 మార్చిలో రూ.19.9 లక్షల కోట్ల నుండి 2024 మార్చిలో రూ .27.2 లక్షల కోట్లకు పెరిగింది.
బ్యాంకింగ్ రంగం
మంచి రుణగ్రహీతల ఎంపిక, మరింత సమర్థవంతమైన రుణాల స్వాధీనం, పెద్ద రుణగ్రహీతలలో రుణ అవగాహన పెరగడంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యతలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. రెగ్యులేటరీ క్యాపిటల్, ద్రవ్యత్వ అవసరాలతో పాటు, ధృడమైన ప్రవర్తనా నియమావళి, పారదర్శక పాలన వంటి గుణాత్మక అంశాలు బ్యాంకింగ్ పనితీరును మెరుగుపరిచాయి.
ఎస్సిబిల స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్పిఎ) నిష్పత్తి 2018 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 11.2 శాతం నుండి 2024 మార్చి చివరి నాటికి 12 సంవత్సరాల కనిష్టానికి 2.8 శాతానికి చేరుకుంది.
ఆర్‌బీఐ, ప్రభుత్వం స్థూల సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలపై తీసుకున్నచర్యల ఫలితంగా ఇటీవలి సంవత్సరాలలో అపాయాన్ని గుర్తించే సామర్థ్యం పెరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వాన్ని మెరుగుపరిచాయి. ఆస్తుల పరిమాణంలో మొదటి స్థానంలో ఉన్న 10 భారతీయ బ్యాంకులకు, అవి ఇచ్చిన రుణాలు వాటి మొత్తం ఆస్తులలో 50 శాతానికి పైగా ఉన్నాయి, ఇది పెరుగుతున్న వడ్డీ రేట్లకు బ్యాంకులను జాగ్రత్తగా ఉంచుతాయి.
2016 నుంచి ఎనిమిదేళ్లలో 2024 మార్చి నాటికి రూ.13.9 లక్షల కోట్ల విలువైన 31,394 మంది కార్పొరేట్ రుణగ్రహీతల (ప్రీ-అడ్మిషన్ కేసు పరిష్కారాలతో సహా) కేసులను పరిష్కరించారు. రూ.10.2 లక్షల కోట్ల డీఫాల్టులను ప్రీ అడ్మిషన్ దశలో పరిష్కరించారు.
దివాలా వ్యవస్థను సరిచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎన్సీఎల్టీని బలోపేతం చేయడం, ఖాళీలను భర్తీ చేయడం, ఇంటిగ్రేటెడ్ ఐటీ ప్లాట్‌ఫాంను ప్రతిపాదించడం ద్వారా తన బలాన్ని పెంచుకుంది. మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా, న్యాయపరమైన తీర్పుల్లో పురోగతికి అనుగుణంగా నిబంధనలను సవరించినట్లు సర్వే పేర్కొంది.
బలమైన ప్రాథమిక మార్కెట్లు
భారత మూలధన మార్కెట్ల గణనీయమైన విస్తరణను సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. మూలధన మార్కెట్లు అద్భుతమైన ఫలితాలను వెల్లడించాయి. భారతదేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, జిడిపి నిష్పత్తి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉంది.
2023 ఆర్థిక సంవత్సరంలో రూ .9.3 లక్షల కోట్లతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక మార్కెట్లు బలంగా ఉన్నాయి, దీని విలువ రూ .10.9 లక్షల కోట్లు (2023 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్, ప్రభుత్వ కార్పొరేట్ల స్థూల స్థిర మూలధన నిర్మాణంలో సుమారు 29 శాతం). ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అనే మూడు మార్గాల ద్వారా నిధుల సమీకరణ గత ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 24.9 శాతం, 12.1 శాతం, 513.6 శాతం పెరిగింది.
ప్రారంభ పబ్లిక్ ఆఫర్ల (ఐపిఒ) సంఖ్య 2023వ ఆర్థిక సంవత్సరంలో 164 నుండి 2024లో 66 శాతం వృద్ధిని కనబరిచి 272 కు పెరిగింది. సేకరించిన మొత్తం 24 శాతం పెరిగింది (2023 ఆర్థిక సంవత్సరంలో రూ .54,773 కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .67,995 కోట్లకు). భారతదేశంలో కార్పొరేట్ డెట్ మార్కెట్ బలపడుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ బాండ్ల జారీ విలువ రూ.7.6 లక్షల కోట్ల నుంచి రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ బాండ్ల పబ్లిక్ ఇష్యూల సంఖ్య ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లేనంతగా ఉంది, సేకరించిన మొత్తం (రూ .19,167 కోట్లు) నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇన్వెస్టర్ల డిమాండ్ పెరగడం, బ్యాంకుల నుంచి తీసుకునే రుణ వ్యయం పెరగడం ఈ మార్కెట్లను కార్పొరేట్లకు నిధుల అవసరాల కోసం మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
బలమైన ద్వితీయ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన మార్కెట్లలో ఒకటిగా నిలిచింది, భారత్ కు చెందిన నిఫ్టీ 50 ఇండెక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో (-)8.2 శాతం నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో 26.8 శాతానికి పెరిగింది. ప్రపంచంతోని ఇతర స్టాక్ మార్కెట్లతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్ ఆదర్శవంతమైన పనితీరు కనబర్చింది. ప్రధానంగా ప్రపంచ భౌగోళిక-రాజకీయ, ఆర్థిక ప్రకంపనలను తట్టుకుని నిలబడటం, దృఢమైన, స్థిరమైన దేశీయ స్థూల ఆర్థిక దృక్పథం, దేశీయ ఇన్వెస్టర్ల బలం ప్రధాన కారణమని సర్వే పేర్కొంది.
గత కొన్నేళ్లుగా భారత మూలధన మార్కెట్లలో రిటైల్ కార్యకలాపాలు పెరిగాయి. ఎన్ఎస్ఈలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల బేస్ మార్చి 2020 నుండి మార్చి 2024 వరకు దాదాపు మూడు రెట్లు పెరిగి 2024 మార్చి 31 నాటికి 9.2 కోట్లకు చేరుకుంది, ఇది దేశంలోని కుటుంబాలలో వారి పొదుపులో 20 శాతాన్ని ఆర్థిక మార్కెట్లలోకి మళ్లిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 11.45 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 15.14 కోట్లకు పెరిగింది.
మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, మార్కెట్ నుంచి మార్కెట్ (ఎంటిఎమ్) లాభాలు, పరిశ్రమ విస్తరణతో 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం) రూ .14 లక్షల కోట్లు (35 శాతం వృద్ధి)పెరిగి రూ .53.4 లక్షల కోట్లకు చేరుకుంది.
స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు గణనీయంగా పెరగడం, అతివిశ్వాసం ఊహాగానాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లలో పనిచేసే సంస్థలు నిష్పాక్షిక అమ్మకాలు, వెల్లడి, పారదర్శకత, విశ్వసనీయత, ప్రతిస్పందన ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది.
ఆర్థిక సమ్మిళిత పురోగతి
దేశంలోని చివరి వ్యక్తి వరకు ఆర్థిక సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని సర్వే పేర్కొంది. ఆర్థిక సంస్థలో వయోజనుల బ్యాంకు ఖాతాలు 2011లో 35 శాతంగా ఉంటగా, 2021 నాటికి 77 శాతానికి పెరిగింది. ధనికులు, పేదల మధ్య సేవలు పొందే అంతరం తగ్గడమే కాకుండా ఆర్థిక సమ్మిళిత పరంగా లింగభేదం కూడా తగ్గింది.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ప్రవాహాలు, రూపే కార్డులు, యుపిఐ 123 ఉపయోగించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి వాటిపై దృష్టి సారించడంతో దేశంలోని ఆర్థిక సమ్మిళిత వ్యూహంలో 'ప్రతి కుటుంబం' నుండి 'ప్రతి వయోజనుడికి' మార్పు వచ్చిందని సర్వే పేర్కొంది.
ఆర్థిక సర్వేలో దేశంలో ఇప్పటివరకు ఆర్థిక సమ్మిళిత పురోగతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్లలో భారతదేశం ఒకటి అని, మూడవ అతిపెద్ద ఫిన్‌టెక్ ఆర్థిక వ్యవస్థగా ప్రశంసించబడుతుందని సర్వే పేర్కొంది. ఈ ఆర్థిక సమ్మిళితత్వానికి ఒక ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ యొక్క డిజిటలైజేషన్, దీనిని సర్వే "పరివర్తనాత్మకం" అని పేర్కొంది. 'డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (డీఎఫ్ఐ)' అనేది ప్రభుత్వం తదుపరి పెద్ద లక్ష్యం. కోవిడ్-19 మహమ్మారి డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (డిఎఫ్ఐ) కు మరింత ఊతం ఇచ్చిందని, అత్యంత బలహీనమైన, మినహాయించబడిన పౌరులు అధికంగా ప్రభావితమయ్యారని సర్వే పేర్కొంది. డిజిటల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, ఆధార్, ఈ-కేవైసీ, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్, యూపీఐ, భారత్ క్యూఆర్, డిజిలాకర్, ఈ-సైన్, అకౌంట్ అగ్రిగేటర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వంటి కొన్ని ప్రధాన పథకాలు వచ్చాయని సర్వే పేర్కొంది.
దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో 31 మార్చి 2024 నాటికి 116.5 కోట్లకు పైగా యుపిఐ చందాదారులను కలిగి ఉంది.యుపిఐ ప్లాట్ ఫాం నిర్వహించిన లావాదేవీల విలువ 2017 ఆర్థిక సంవత్సరంలో రూ .0.07 లక్షల కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .200 లక్షల కోట్లకు పెరిగింది.
అందుబాటు ధరల్లో సేవలను అందించడం ద్వారా అల్పాదాయ కుటుంబాల రుణ అవసరాలను తీర్చడంలో సూక్ష్మ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, భారత మైక్రోఫైనాన్స్ రంగం చైనా తరువాత రెండవ అతిపెద్దది, భారతదేశంలో రుణాలు తీసుకునే వినియోగదారుల సంఖ్య పరంగా ఇది తరువాతి అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేషియా కంటే మూడు రెట్లు ఎక్కువ.
బీమా రంగం
గత ఆర్థిక సంవత్సరంలో బీమా రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని సర్వే పేర్కొంది. రాబోయే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించబోతోందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి, విస్తరిస్తున్న మధ్యతరగతి, సృజనాత్మకత, నియంత్రణ వ్యవస్థ భారత్ లో బీమా మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత మార్కెట్ స్థిరపడటంతో నాన్-లైఫ్ ప్రీమియం వృద్ధి 2022 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం నుండి 7.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఇటీవల, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై) భారతదేశం అంతటా 34.2 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేయగా ఇందులో 49.3 శాతం మహిళలే కలిగి ఉన్నారు.
పింఛను రంగం
పింఛను రంగంలోని పరిణామాల గురించి మాట్లాడుతూ, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్), ఇటీవల అటల్ పెన్షన్ యోజన (ఎపివై) ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశ పింఛను రంగం విస్తృతి పెరిగిందని సర్వే పేర్కొంది. మార్చి 2024 నాటికి మొత్తం చందాదారుల సంఖ్య 735.6 లక్షలుగా ఉంది, మార్చి 2023 నాటికి 623.6 లక్షల నుండి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఏపీవై చందాదారుల సంఖ్య (పాత వెర్షన్, ఎన్ పి ఎస్ లైట్ తో పాటు) మార్చి 2023 నాటికి 501.2 లక్షల నుండి మార్చి 2024 నాటికి 588.4 లక్షలకు పెరిగింది. మొత్తం పెన్షన్ చందాదారుల్లో ఏపీవై చందాదారులు 80 శాతం ఉన్నారు. మహిళా చందాదారుల వాటా 2017 ఆర్థిక సంవత్సరంలో 37.2 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 48.5 శాతానికి పెరగడం గమనార్హం.
నియంత్రణ సమన్వయాన్ని, మొత్తం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే యంత్రాంగాలను కూడా సర్వే ప్రస్తావించింది, ఇది ఊహించని పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా అధిక స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉంటుందని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పరిష్కరించడంలో ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎఫ్ ఎస్ డీసీ) కీలక పాత్రను గుర్తించింది.
****
(Release ID: 2035464)
Visitor Counter : 296