ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022-23లో వ్యవసాయ రంగం స్థూల మూలధన ఉత్పన్నత (GCF) 19.04 శాతం పెరిగింది: ఆర్థిక సర్వే
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో వ్యవసాయ పెట్టుబడిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటంతో సంస్థేతర రుణ వాటా 1950లో 90 శాతం నుండి 2021-22 నాటికి 23.40 శాతానికి తగ్గింది
భూమి కౌలుకు తీసుకుని సాగు చేసేవారికి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (JLGs) ప్రధాన రుణ వనరుగా మారాయి
Posted On:
22 JUL 2024 3:01PM by PIB Hyderabad
2023-24 ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో స్థూల మూలధన ఉత్పన్నత (జిసిఎఫ్), వ్యవసాయం, అనుబంధ రంగాలలో జిసిఎఫ్ వాటా స్థూల విలువ జోడింపు (జివిఎ) శాతం ప్రభుత్వ పెట్టుబడి పెరిగిన కారణంగా స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ రంగం జిసిఎఫ్ 2022-23లో 19.04 శాతం పెరిగింది, జివిఎ శాతంగా జిసిఎఫ్ 2021-22లో 17.7 శాతం నుండి 2022-23లో 19.9 శాతానికి పెరిగింది, ఇది వ్యవసాయంపై పెట్టుబడులు పెరగడం సూచిస్తుంది. 2016-17 నుండి 2022-23 వరకు జిసిఎఫ్ సగటు వార్షిక వృద్ధి 9.70 శాతంగా ఉంది. సర్వే ప్రకారం జిసిఎఫ్ వృద్ధి కనపరుస్తున్నప్పటికీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం వల్ల వ్యవసాయంపై పెట్టుబడిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. డి ఎఫ్ ఐ 2016 నివేదిక ప్రకారం 2016-17 నుండి 2022-23 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే వ్యవసాయ రంగంలో ఆదాయం వార్షికంగా 10.4 శాతం వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దీనితో వ్యవసాయ పెట్టుబడిలో వార్షిక వృద్ధి 12.5 శాతం తప్పనిసరి. సకాలం లో, తక్కువ ఖర్చుతో, తగినంత రుణాలు అందించడం ద్వారా సంస్థేతర రుణాలపై ఆధారపడటం తగ్గించటం మరియు పెట్టుబడిని పెంచడం ప్రభుత్వం ప్రాధాన్యత. 1950లో సంస్థేతర రుణ వాటా 90 శాతం నుండి 2021-22లో 23.40 శాతానికి తగ్గింది. జనవరి 31,2024 నాటికి వ్యవసాయానికి మొత్తంగా ₹ 22.84 లక్షల కోట్ల రుణాలు అందించారు. అందులో ₹13.67 లక్షల కోట్లను స్వల్పకాల పంట రుణాలు , ₹ 9.17 లక్షల కోట్ల టర్మ్ రుణాలను అందించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కె సి సి):
ఆర్థిక సర్వే ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డ్ (కె సి సి) సాగు రుణ వితరణను సులభతరం చేసింది. జనవరి 31,2024 నాటికి బ్యాంకులు ₹9.4 లక్షల కోట్ల పరిమితితో 7.5 కోట్ల కె సి సిలను జారీ చేశాయి. అదనంగా, 2018-19లో కె సి సిను మత్స్య, పశుసంవర్థక కార్యకలాపాల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి తాకట్టు లేని రుణాల పరిమితిని ₹1.6 లక్షలకు పెంచడం జరిగింది. రుణగ్రహీతలు, పాల సంఘాలు మరియు బ్యాంకుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం (టీ పి ఏ) ఉన్న 3.49 లక్షల రైతులకు కె సి సిలు మార్చి 31 , 2024 నాటికి అందించారు. వారు ₹3 లక్షల వరకు తాకట్టు లేని రుణం పొందవచ్చు. మత్స్య, పశుసంవర్థక కార్యకలాపాలకు 34.5 లక్షల కె సి సి జారీ చేయబడ్డాయి. ఆర్థిక సర్వే ప్రకారం కౌలురైతులకి ఉమ్మడి బాధ్యత గ్రూప్స్ (జె ఎల్ జి లు) ప్రధాన రుణ వనరులుగా మారాయి. గత ఐదు సంవత్సరాలలో జె ఎల్ జి ఖాతాలు 43.76 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సి ఏ జి ఆర్) తో చిన్న, సన్నకారు,కౌలురైతుల అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన వనరుగా మారాయి.
వ్యవసాయ మౌలిక సదుపాయాలు:
2024 ఏప్రిల్ 30 నాటికి నిల్వ మౌలిక సదుపాయాలకు 48357 ప్రాజెక్టులు మంజూరు చేశారు. వీటికి ₹4570 కోట్ల సబ్సిడీగా విడుదల చేశారు. 20878 ఇతర ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి, వీటికి ₹2084 కోట్ల సబ్సిడీ విడుదల చేశారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మరింత ప్రోత్సహించడానికి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏ ఐ ఎఫ్) ప్రారంభించారు. ఎఫ్ వై 2020-21 నుండి ఎఫ్ వై 2025-26 వరకు ₹1 లక్ష కోట్ల రుణ సౌకర్యం మద్దతు ఎఫ్ వై 2032-33 వరకు అందించనున్నారు.
ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏ ఐ ఎఫ్) ద్వారా పంట దిగుబడి అనంతర నిర్వహణ, సామాజిక సాగు ప్రాజెక్టులకు వడ్డీ రాయితీ, రుణ హామీ మద్దతు తో మధ్య కాల రుణాలను అందిస్తుంది. 2024 జూలై 5 నాటికి ఏ ఐ ఎఫ్ ద్వారా ₹73194 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. తద్వారా 17196 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 14868 ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 13165 గిడ్డంగులు, 2942 సార్టింగ్,గ్రేడింగ్ యూనిట్లు, 1792 ఆహార నిల్వ ప్రాజెక్టులు, 18981 ఇతర ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పి ఎం కె ఎస్ వై ) ద్వారా పంట నుండి రిటైల్ వరకు సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణను నిర్మించడానికి,వ్యవసాయ ఉత్పత్తుల వృథాను తగ్గించడాని, ఆహార నిల్వకాలాన్ని పెంచడానికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా అదనంగా రుణహామీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పి ఎం కె ఎస్ వై కింద 2024 మార్చి చివరినాటికి 1044 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2024 మార్చి చివరినాటికి ₹ 32.78 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం తో ₹ 9.3 వేల కోట్ల సబ్సిడీ తో మొత్తం 1685 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి.
***
(Release ID: 2035452)
Visitor Counter : 329