ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంగీకార యోగ్యం కాని, ఆమోదయోగ్యం కాని అంచనాల ఆధారంగా జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ అధ్యయనాల ద్వారా 2020లో అధిక మరణాల రేటును ఎక్కువ చేసి నివేదిస్తున్న మీడియా


మునుపటి సంవత్సరం కన్నా 2020 లో సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నమోదు చేసిన అధిక మరణాలు స్థూలంగా పేర్కొన్నవి, తప్పుగా అంచనా వేసినవి

అధ్యయనం తప్పులతో కూడినది, నిర్వాహకులు అనుసరించిన పద్ధతిలో అనేక లోపాలు; వారి ప్రకటనలు అస్థిరమైనవి, అస్పష్టమైనవి

దేశంలో అన్ని కారణాలతో అధిక మరణాల రేటు మునుపటి సంవత్సరంతో పోలిస్తే సైన్స్ అడ్వాన్సెస్ పేపర్ లో నివేదించిన 11.9 లక్షల కన్నా 2020లో చాలా తక్కువ

దాని విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకం చేస్తున్న అధ్యయన ఫలితాలు - నమోదైన కోవిడ్-19 మరణాల నమూనా మధ్య వ్యత్యాసాలు

కేవలం కోవిడ్ విపత్తు ద్వారా మాత్రమే కాక, 2020లో మరణాల నమోదులో (99% పైగా) గణనీయమైన పెరుగుదలను నమోదు చేసిన భారతదేశ బలమైన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్)ను గుర్తించడంలో విఫలమైన అధ్యయనం

Posted On: 20 JUL 2024 12:14PM by PIB Hyderabad

భారతదేశంలో 2020లో కోవిడ్ -19 విపత్తు సమయంలో ఆయుర్దాయంపై సైన్స్ అడ్వాన్సెస్ అనే విద్యాసంబంధ పత్రికలో ఈరోజు ప్రచురితమైన ఓ పత్రం ఆధారంగా కొన్ని మీడియా నివేదనలు ఈ అంశాలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చాయి.  ఇవి అంగీకారయోగ్యమూ ఆమోద యోగ్యమూ కాని అంచనాలపై ఆధారపడినవి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5ను విశ్లేషించడానికి ప్రామాణిక పద్ధతిని అనుసరిస్తున్నట్లు వారు పేర్కొన్నప్పటికీ, ఆ పద్ధతిలో సంక్లిష్టమైన లోపాలున్నాయి. 2021 జనవరి- ఏప్రిల్ మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో (ఎన్ఎఫ్హెచ్ఎస్) పేర్కొన్న కుటుంబాల ఉపసముదాయాన్ని నిర్వాహకులు తీసుకుని, 2020లో ఈ కుటుంబాల్లో మరణాలను 2019తో పోల్చారు; ఆ ఫలితాలను దేశం మొత్తానికి విస్తృతీకరించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ నమూనా మొత్తంగా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే అది దేశం మొత్తాన్ని సూచిస్తుంది. ఇది ముఖ్యమైన లోపం. 14 రాష్ట్రాల నుంచి ఈ విశ్లేషణలో చేర్చిన 23% కుటుంబాలు దేశాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పలేము. మరో ప్రధానమైన లోపం సేకరించిన నమూనాలో సంభవనీయమైన ఎంపిక, నివేదనలో పక్షపాతాలకు సంబంధించినది. కోవిడ్ -19 విపత్తు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఈ గణాంకాలను సేకరించడం ఇందుకు కారణం.

భారత్ సహా అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో కీలకమైన నమోదు వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విశ్లేషణలు అవసరమని ఆ పత్రిక తప్పుగా వాదిస్తోంది. ఇది సత్యదూరం. భారత్ లో పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) అత్యంత దృఢమైనది, 99 శాతానికి పైగా మరణాలను నమోదు చేస్తుంది. ఈ నమోదు 2015 లో 75% నుంచి 2020లో 99%కి పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో మరణాల నమోదు 4.74 లక్షలు పెరిగినట్లు ఈ వ్యవస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2018, 2019 సంవత్సరాల్లో మరణాల నమోదు వరుసగా 4.86 లక్షలు, 6.90 లక్షలు పెరిగాయి. ముఖ్యంగా, ముఖ్యంగా, సీఆర్ఎస్ లో ఏడాదిలో అన్ని అదనపు మరణాలకు కోవిడ్ విపత్తు కారణం కాదు. సీఆర్ఎస్ లో పెరుగుతున్న మరణాల నమోదు (2019లో ఇది 92 శాతంగా ఉంది), తదుపరి సంవత్సరంలో విస్తృతమైన జనాభా ప్రాతిపదిక కూడా ఆ సంఖ్య పెరగడానికి కారణం.

2020లో మునుపటి ఏడాది కన్నా సుమారు 11.9 లక్షల అధిక మరణాలు నమోదయ్యాయని పేర్కొన్న సైన్స్ అడ్వాన్సెస్ పత్రిక నివేదన స్థూలంగా చేసినది, అతిగా అంచనా వేసి తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. కోవిడ్ విపత్తు సమయంలో అధిక మరణాలు అంటే అన్ని కారణాల వల్ల మరణాలు పెరగడమని, ప్రత్యక్షంగా కోవిడ్-19 వల్ల సంభవించిన మరణాలతో వాటన్నింటినీ పోల్చలేమని గుర్తించడం ముఖ్యం.

పరిశోధకులు ప్రచురించిన అంచనాలు స్వాభావికంగా తప్పుగా ఉన్నాయని దేశ నమూనా నమోదు వ్యవస్థ (ఎస్ఆర్ఎస్) గణాంకాలు ధ్రువీకరించాయి. దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 8842 నమూనా యూనిట్లలో 24 లక్షల కుటుంబాల్లోని 84 లక్షల మంది ప్రజలు ఎస్ఆర్ఎస్ పరిధిలోకి వస్తారు. 2018, 2019 సంవత్సరాలకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విశ్లేషణ, నమనా నమోదు సర్వే విశ్లేషణల ఫలితాలు పోల్చదగినవని చూపడానికి అమితంగా కష్టపడుతున్న వారు, 2020 లో ఎస్ఆర్ఎస్ గణాంకాలు తక్కువగా ఉన్నాయని, 2019 గణాంకాలతో పోలిస్తే అధిక మరణాలు (2020లో అల్పాయుష్షు మరణాలు/ క్రూడ్ డెత్ రేటు 6.0/1000, 2019లో 6.0/1000) లేవని, ఆయుఃప్రమాణంలో తగ్గుదల లేదని నివేదించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

వయస్సు, లింగంపై ఫలితాలను ఈ పత్రిక నివేదించింది. భారతదేశంలో కోవిడ్-19పై పరిశోధన, కార్యక్రమాల రూపకల్పన గణాంకాలకు ఇది విరుద్ధం. మహిళలు, యుక్త వయస్కుల్లో (ముఖ్యంగా 0-19 సంవత్సరాల పిల్లలు) అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొన్నది. అయితే, కోవిడ్ -19 కారణంగా నమోదైన 5.3 లక్షల మరణాల గణాంకాలు, అలాగే బృందాలు, నమోదు పట్టికల పరిశోధన గణాంకాలను పరిశీలిస్తే కోవిడ్ -19 కారణంగా మహిళల కన్నా పురుషులలో (2:1), వృద్ధులలో (0-15 సంవత్సరాల పిల్లల కన్నా 60 సంవత్సరాలు, ఆపై వయస్సున్న వారిలో అనేక రెట్లు ఎక్కువ) కోవిడ్ -19 కారణంగా మరణాల రేటు స్థిరంగా ఎక్కువగా ఉంది. ప్రచురితమైన పత్రంలోని ఈ అస్థిరమైన, అస్పష్టమైన ఫలితాలు దాని వాదనపై నమ్మకాన్ని మరింత తగ్గిస్తున్నాయి.

చివరిగా, భారతదేశంలో 2020లో, దాని క్రితం సంవత్సరంతో పోలిస్తే అన్ని కారణాల వల్ల జరిగిన అధిక మరణాలు సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో నివేదించిన 11.9 లక్షల మరణాల కన్నా చాలా తక్కువ. ఈ రోజు ప్రచురితమైన పత్రం అనుసరించిన పద్ధతి లోపభూయిష్టంగా ఉంది. అది చూపిన ఫలితాలు అంగీకార యోగ్యమూ ఆమోద యోగ్యమూ కావు.

***



(Release ID: 2034822) Visitor Counter : 19