గనుల మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లో రేపు ఖనిజాన్వేషణ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్స్ రోడ్ షో ను నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 19 JUL 2024 10:35AM by PIB Hyderabad

 

గనుల మంత్రిత్వ శాఖ రేపు, (శనివారం) హైదరాబాద్ బేగంపేట లో ఖనిజాన్వేషణ పై హ్యాకథాన్, క్రిటికల్ మినరల్స్ పై రోడ్ షో ను నిర్వహించనుంది.  ఈ కార్యక్రమం లో కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే లు పాల్గొంటారు.  బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమం లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.

 

ఖనిజాలను అన్వేషించడంలో వినూత్న పద్ధతులపై ఖనిజాన్వేషక సంబంధ హ్యాకథాన్ దృష్టిని కేంద్రీకరించనుంది.  ప్రపంచమంతటా అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని, ఖనిజ నిక్షేపాల జాడలను గుర్తించాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం.  భూ భౌతిక సమాచారాన్ని, తత్సంబంధ నమూనాలను, ఈ మధ్య కాలం లో ఉనికిలోకి వచ్చిన కృత్రిమ మేధ (ఎఐ), మెషిన్ లెర్నింగ్ (ఎమ్ఎల్) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రక్రియలో వినియోగించుకోవాలనే అంశంపై కార్యక్రమంలో కూలంకషంగా చర్చిస్తారు.

 

ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి   నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డిఎమ్ఎఫ్) పోర్టల్ ను కూడా ప్రారంభించనున్నారు.   ఈ పోర్టల్ దేశవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ కు సంబంధించిన సమాచారాన్ని సమీకరించడానికి కేంద్రీకృత వేదికగా ఉంటుంది.  ఈ పోర్టల్ డిఎమ్ఎఫ్ డేటాను అందుబాటులో ఉంచడమే కాక దాని వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది.

 

గనులు, ఖనిజాల అభివృద్ధి, క్రమబద్ధీకరణ (ఎమ్ఎమ్‌డిఆర్)  సవరణ చట్టంలోని సెక్షన్ 11డి ప్రకారం దఖలు పడ్డ అధికారాలను గనుల మంత్రిత్వ శాఖ ఉపయోగించుకొంటూ కీలక, వ్యూహాత్మక ఖనిజాల ఇ- వేలంపాట (ఇ-ఆక్షన్) రెండో, మూడో విడతలను గత ఫిబ్రవరి 29న మొదలు పెట్టింది.  రెండో, మూడో విడత బ్లాకులకు ఎంపికైన బిడ్డర్ ల వివరాలను కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రకటించనున్నారు.

 

ఈ కార్యక్రమం ముగిసిన తరువాత కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకుల ఇ-వేలంపాట (ఇ-ఆక్షన్) నాలుగో విడత కు సంబంధించిన రోడ్ షో ఉంటుంది.  ఈ నాలుగో విడత ఇ-ఆక్షన్ ను కిందటి నెల 24న  ఎన్ఐటి ద్వారా ఆరంభించడమైంది.  ఇ-వేలం ప్రక్రియలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచడానికి, గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఇ-వేలం ప్రక్రియ తీరుతెన్నులను ఆసక్తి గల బిడ్డర్ లకు తెలియజేయడానికి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

****



(Release ID: 2034322) Visitor Counter : 15