నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

‘ఎలక్ట్రానిక్స్: ప్రపంచ విలువ శ్రేణిలో భారత్ భాగస్వామ్య చోదకం’ పేరిట రేపు నీతి ఆయోగ్ నివేదిక ఆవిష్కరణ


ప్రపంచ విలువ శ్రేణిలో భాగస్వామ్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’కు ఉత్తేజం లక్ష్యం;
వికసిత్ భారత్ దిశగా ప్రయాణంలో కీలక పాత్ర పోషించనున్న తయారీ రంగం

Posted On: 17 JUL 2024 2:59PM by PIB Hyderabad

   నీతి ఆయోగ్ 2024 జూలై 18న ‘‘ఎలక్ట్రానిక్స్: ప్రపంచ విలువ శ్రేణిలో భారత్ భాగస్వామ్య చోదకం’’ పేరిట ఒక నివేదికను ఆవిష్కరిస్తుంది. భారత ఎలక్ట్రానిక్స్ రంగం పరిధులు-సవాళ్లుసహా దానిపై లోతైన విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచ తయారీ కూడలిగా మారేందుకు ఈ నివేదిక మార్గనిర్దేశం చేస్తుంది.

   ప్రస్తుత పరిస్థితుల నడుమ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రపంచ విలువ శ్రేణి (జివిసి)లోని వస్తు సముదాయం వాటా 70 శాతంగా ఉంది. ‘జివిసి’లో భారత్ తన భాగస్వామ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ వాస్తవం నొక్కి చెబుతోంది. ఈ మేరకు ‘జివిసి’లో కీలక పాత్ర పోషించే ఎలక్ట్రానిక్స్, సెమి-కండక్టర్, ఆటోమొబైల్, రసాయన, ఔషధ తదితర రంగాలకు ప్రాధాన్యం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో దాదాపు 80 శాతం ‘జివిసి’ పరిధిలోని ఉత్పత్తులే కావడం వల్ల ‘జివిసి’లో ఈ రంగానికి గణనీయ ప్రాధాన్యం ఉంది.

   భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయ స్థాయిలో నమోదైంది. ఆ మేరకు మొత్తం వస్తూత్పత్తుల ఎగుమతులలో ఈ రంగం వాటా 5.32 శాతంగా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్స్ రంగం పోటీతత్వాన్ని ఈ రంగం ఎగుమతుల జోరు రుజువు చేస్తోంది. అలాగే మన ఉత్పత్తులకుగల అంతర్జాతీయ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోగల సామర్థ్యం కూడా ఈ రంగానికి ఉందని స్పష్టమవుతోంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ స్థానం ఈ రంగం నుంచి ఎగుమతులతో మరింత మెరుగుపడింది. ఇక ‘జివిసి’లో భాగస్వామ్యం పరంగా ఎలక్ట్రానిక్స్ రంగం అగ్రస్థానంలో ఉంది. ఇది ఏదైనా ఒక దేశానికో లేదా ఆర్థిక వ్యవస్థకో పరిమితం కాకుండా భౌగోళికంగా అనేక దేశాలు, సంస్థల స్థాయికి విస్తరించి ఉంది.

   ప్రస్తుతం భారత్ ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తుల విడిభాగాల తుది కూర్పులో కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ బ్రాండ్లు-డిజైన్ సంస్థలు భారతదేశంలోని ఎలక్ట్రానిక్ తయారీ సేవల (ఇఎంఎస్) కంపెనీలకు తుది కూర్పు, పరీక్షలు-ప్యాకేజింగ్ పనులను అధికశాతం అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజైన్-విడిభాగాల తయారీ సంబంధిత పర్యావరణ వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.

   మన దేశం వికసిత భారత్‌ దిశగా పయనించడంలో తయారీ రంగానిదే కీలక పాత్ర. కాబట్టి, ప్రపంచ విలువ శ్రేణిలో భాగస్వామ్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’కు ఊపునివ్వడం ద్వారా ఈ సంకల్పాన్ని సాకారం చేసుకోవచ్చు. ఈ దృక్కోణంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ఉత్పాదక శక్తిగా రూపొందడం లక్ష్యంగా మార్గనిర్దేశం చేయడంపై సమగ్ర నివేదికను నీతి ఆయోగ్ ఆవిష్కరించనుంది.

***


(Release ID: 2034017) Visitor Counter : 148