రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణరంగంలో ఆత్మనిర్భరత : ప్రభుత్వరంగ రక్షణ సంస్థలకు ( డీ పీ ఎస్ యూలు) 346 రక్షణరంగా ఉతపత్తులతో కూడిన ఐదవ స్వదేశీకరణ జాబితాను పంపిన రక్షణ శాఖ
గత మూడేళ్ళలో 12,300 ఉత్పత్తుల స్వదేశీకరణ; దేశీయ వ్యాపారులతో 7,572 కోట్ల రూపాయల విలువగల లావాదేవీలు జరిపిన డీ పీ ఎస్ యూలు
Posted On:
16 JUL 2024 12:29PM by PIB Hyderabad
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత (స్వావలంబన) సాధన, డీ పీ ఎస్ యూలు, రక్షణ ఉత్పత్తుల విభాగాలు (డీడీపీ) జరిపే దిగుమతుల తగ్గింపు లక్ష్యాలుగా, రక్షణ మంత్రిత్వశాఖ 346 ఉత్పత్తులతో కూడిన ఐదవ స్వదేశీకరణ జాబితాను (పీ ఐ ఎల్) విడుదల చేసింది. వీటిల్లో 1,048 కోట్ల రూపాయల దిగుమతి విలువ కలిగి, వ్యూహాత్మకంగా కీలకమైన లైన్ రీప్లేస్మెంట్ యూనిట్లు, వ్యవస్థలు, ఉప వ్యవస్థలు, అసెంబ్లీ వ్యవస్థలు, ఉప అసెంబ్లీ వ్యవస్థలు, స్పేర్ పార్ట్ లు, ముడి సరుకులు ఉన్నాయి. స్వదేశీకరణ సమయ సీమ ముగిసిన అనంతరం శ్రిజన్ పోర్టల్ (https://srijandefence.gov.in) లోని జాబితాలో పేర్కొన్న విధంగా ఆయా వస్తువులను కేవలం దేశీయ ఉత్పత్తిదారుల వద్ద నుండే కొనుగోలు చేస్తారు. జాబితాలోని ఉత్పత్తుల వివరాలను కింది లింకు ద్వారా తెలుసుకొనవచ్చు:
(5TH POSITIVE INDIGENISATION LIST FOR DPSUs - DDP)
రక్షణ మంత్రిత్వశాఖ 2020లో శ్రిజన్ పోర్టల్ ను ప్రారంభించింది. డీ పీ ఎస్ యూ లు, సేవల ప్రధానకేంద్రాలు (ఎస్ హెచ్ క్యూ లు), స్వదేశీకరణ నిమిత్తం రక్షణ ఉత్పత్తులను సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఈ.), అంకుర పరిశ్రమలు సహా ప్రత్యేకించిన పరిశ్రమలకు అందజేస్తాయి. రక్షణ ఉత్పాదకతలో స్వావలంబన యత్నాలను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ముందుండి నడిపిస్తూండగా, ‘ఆత్మనిర్భర్ భారత్’ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాముఖ్యం, ప్రోత్సాహం రక్షణ ఉత్పత్తుల స్వదేశీకరణలో అద్భుత ఫలితాలను చూపుతున్నాయి.
ఐదవ పీ ఐ ఎల్ లో పొందుపరచిన ఉత్పత్తుల స్వదేశీకరణను ‘మేక్’ ప్రక్రియ సహా, ఎం.ఎస్.ఎం.ఈ.లు, ఇతర పరిశ్రమల ద్వారా దేశీయంగా అభివృద్ధి పరచడం వంటి వివిధ ప్రక్రియల ద్వారా డీ పీ ఎస్ యూలు చేపడతాయి. ఈ చర్యల ద్వారా ఆర్ధిక రంగ పురోభివృద్ధికి తగిన ఊతం లభించడమే కాక, రక్షణ రంగంలో పెట్టుబడులు పెరిగేందు అనువైన పరిస్థితి కలుగుతుంది, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. పైగా, విద్యారంగ నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రమేయం వల్ల దేశీయ రక్షణ రంగ డిజైనింగ్ సామర్థ్యాలు మెరుగవగలవు.
హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్(హెచ్ ఏ ఎల్), భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీ ఈ ఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీ డీ ఎల్), బీ ఈ ఎం ఎల్ లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐ ఓ ఎల్), మేజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ( ఎం డీ ఎల్), గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ( జీ ఎస్ ఎల్), గార్డెన్ రీసర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీ ఆర్ ఎస్ ఈ), హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ ఎస్ ఎల్) సంస్థలు ఐదవ పీ ఐ ఎల్ లో పాలుపంచుకుంటున్న డీ పీ ఎస్ యూలు. ఈ సంస్థలు తమ తమ వెబ్సైట్లలో ఆసక్తి గల సంస్థలు తమ ప్రస్తావనలు/అభ్యర్ధనలను పంపవలసిందిగా ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్/రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ ప్రక్రియలను ప్రారంభించి, ఈ నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటైన శ్రిజన్ పోర్టల్ లింక్ ను (srijandefence.gov.in/DashboardForPublic) అందిస్తున్నాయి. వివిధ పరిశ్రమలు, ఎం.ఎస్.ఎం.ఈ.లు,అంకుర పరిశ్రమల వారు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా డీ పీ ఎస్ యూలు ఆహ్వానిస్తున్నాయి.
గతంలో 4,666 ఉత్పత్తులను డీడీపీ నాలుగు పీ ఐ ఎల్ ల ద్వారా డీ పీ ఎస్ యూ లకు కేటాయించగా, 3,400 కోట్ల రూపాయల దిగుమతి విలువ కల 2,972 ఉత్పత్తుల స్వదేశీకరణ ప్రక్రియలు పూర్తయ్యాయి. డీ పీ ఎస్ యూ లకు కేటాయించబడ్డ ఈ ఐదు జాబితాలూ మిలిటరీ వ్యవహారాల విభాగం (డీ ఎం ఏ) 509 ఉత్పత్తులతో రూపొందించిన జాబితాకు అదనం. ఆ జాబితాల్లో సంక్లిష్టమైన ఆయుధ వ్యవస్థలు, సెన్సర్లు, ఆయుధాలూ, మందుగుండు వంటివి కలవు.
డీ పీ ఎస్ యూ లు, ఎస్ హెచ్ క్యూ లు జూన్ 2024 నాటికి 36,000 రక్షణ ఉత్పత్తులను స్వదేశీకరణ నిమిత్తం వివిధ పరిశ్రమలకు అందజేశాయి. వీటిల్లో గత మూడేళ్ళ కాలంలో 12,300 వస్తువుల స్వదేశీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. దరిమిలా డీ పీ ఎస్ యూ లు దేశీయ అమ్మకం దార్ల వద్ద 7,572 రూపాయల విలువ కల లావాదేవీలు జరిపాయి.
***
(Release ID: 2033932)
Visitor Counter : 119