ఆర్థిక మంత్రిత్వ శాఖ

డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై భారత జీ20 టాస్క్ ఫోర్స్ నివేదిక విడుదల


భారతదేశ జి 20 అధ్యక్ష పదవీకాలంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) నిర్వచనం , దృక్కోణం ఆమోదానికి దారి తీసిన టాస్క్ ఫోర్స్ కార్యాచరణ; దీనిని బ్రెజిల్ , దక్షిణాఫ్రికా జి 20 అధ్యక్ష సమయాల్లో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

డి పి ఐ లేకపోతే 50 ఏళ్లు పట్టేదాన్ని భారత్ 9 ఏళ్లలో సాధించింది: జీ20 ఇండియా షెర్పా శ్రీ అమితాబ్ కాంత్

ప్రపంచవ్యాప్తంగా డి పి ఐ విధానం, చర్యల భవిష్యత్ గమనాన్ని నిర్వచించడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుంది: టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్ శ్రీ నందన్ నీలేకని

Posted On: 15 JUL 2024 5:12PM by PIB Hyderabad

'డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ అండ్  డెవలప్మెంట్' పై జీ20 టాస్క్ ఫోర్స్ రూపొందించిన తుది 'డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' నివేదికను న్యూఢిల్లీలో సోమవారం విడుదల చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కు భారత జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ , ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు , చైర్మన్ , యుఐడిఎఐ (ఆధార్) వ్యవస్థాపక చైర్మన్ శ్రీ నందన్ నీలేకని నేతృత్వం వహించారు.

ఈ టాస్క్ ఫోర్స్ పని భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ సమయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) నిర్వచనం , దృక్కోణం ఆమోదించడానికి దారితీసింది.  ఇంకా మున్ముందు బ్రెజిల్  దక్షిణాఫ్రికా అధ్యక్ష సమయంలో కూడా అమలు చేయడానికి ముందుకు తీసుకు వెళ్లనున్నారు. 

భారత్ అత్యంత విజయవంతమైన జి 20 అధ్యక్ష కాలం లో,  పదవీకాలం ముగిసిన తరువాత కూడా టాస్క్ ఫోర్స్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా డిపిఐ పునాదులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  పూర్తి నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం వెబ్ సైట్ లో అందుబాటు లోఉంచారు. https://dea.gov.in/sites/default/files/Report%20of%20Indias%20G20%20Task%20Force%20On%20Digital%20Public%20Infrastructure.pdf

ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా భారత జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, "డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించింది. డి పి ఐ  లేకుండా 50 ఏళ్లలో సాధించేదాన్ని తొమ్మిది ఏళ్లలో సాధించాం. నేడు భారతదేశంలో, వీధి వ్యాపారుల నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని స్థాయిలలో యుపిఐని ఉపయోగిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ లావాదేవీలతో, దాదాపు 46% వాటాను నేడు భారత్ కలిగి ఉంది. 160 మిలియన్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 4.5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడం అయినా,  మొబైల్స్ లో డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లతో రెండేళ్లలో 2.5 మిలియన్ల టీకాల పంపిణీని సులభతరం చేయడం అయినా ఇవన్నీ కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి భారతదేశానికి వెన్ను దన్ను (బిల్డింగ్ బ్లాక్‌లు) గా నిలిచాయి. డిజిటలైజేషన్ పరంగా మనం చాలా ముందంజలో ఉన్నాం.  ఈ నివేదిక ప్రపంచానికి మార్గదర్శక ధ్రువ నక్షత్రం కాగలదని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు. 

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్ శ్రీ నందన్ నీలేకని మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు నిజంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సమ్మిళిత వృద్ధి వంటి సామాజిక లక్ష్యాలను సాధించాలంటే, అందుకు దోహదపడే అంతర్లీన డిపిఐని కలిగి ఉండాలని గ్రహిస్తున్నాయి. ప్రజల జీవితాలను నాటకీయంగా మెరుగు పరచడానికి,  పరిపాలనను మార్చడానికి డిపిఐ కి శక్తి ఉంది. ఇది భారతదేశంలో జరిగింది.ఇది ప్రతి భారతీయుడికి డిజిటల్ గుర్తింపును అందించే లక్ష్యంతో ఆధార్ ఐడి వ్యవస్థతో ప్రారంభమైంది. ఇప్పుడు, సుమారు 1.3 బిలియన్ల మంది భారతీయులు ఈ డిజిటల్ ఐడిని కలిగి ఉన్నారు.  రోజుకు సగటున 10 మిలియన్ల ఇ-కెవైసి ఆధార్ ద్వారా సులభతరం అవుతోంది. కాగా, చెల్లింపులో యుపిఐ నెలవారీ 13 బిలియన్ లావాదేవీలను సులభతరం చేసింది.సుమారు 350 మిలియన్ల వ్యక్తులు , 50 మిలియన్ల వ్యాపారులకు సేవలు అందిస్తోంది. డిపిఐ ఆధారిత ప్రత్యక్ష బదిలీ కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రభుత్వానికి 41 బిలియన్ డాలర్లను ఆదా చేసింది. అందువల్ల, ఇది ఇకపై ఒక ఎంపిక లేదా విలాసం కాదు, మనం కోరుకున్న ప్రదేశానికి చేరుకోవడానికి డిపిఐ అవసరం. ప్రపంచవ్యాప్తంగా డిపిఐ విధానం , చర్యల భవిష్యత్తు దిశను నిర్వచించడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుంది” అన్నారు. 

కీలకమైన ఆర్థిక, అభివృద్ధి ఎజెండాపై ప్రపంచ విధాన చర్చను ఏర్పాటు చేయడానికి, నడిపించడానికి భారతదేశ జి 20 అధ్యక్ష పదవి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించింది. సాంకేతిక ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత ఆర్థిక పరివర్తన ప్రజల అభివృద్ధి, సాధికారతకు ప్రధానమైన అంశాల్లో ఒకటి. భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) - డిజిటల్ గుర్తింపు, వేగవంతమైన చెల్లింపు వ్యవస్థతో పాటు ఆమోద ఆధారిత డేటా షేరింగ్ - ఆర్థిక, ఆరోగ్య,  విద్య, ఇ- పరిపాలన, పన్నులు, నైపుణ్యాలు మొదలైన రంగాలలో 1.4 బిలియన్ల మంది వ్యక్తులు ముఖ్యమైన సామాజిక-ఆర్థికం సేవలను ఎలా పొందవచ్చో నిరూపించింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య పటిష్ట భాగస్వామ్యం ఫలితమే ఈ మౌలిక సదుపాయాలు. ఇవి భారతీయ జనాభా పరిమాణం, వైవిధ్యాన్ని పరిష్కరించడానికి ఆవిష్కరణలకు దోహదపడతాయి. ఇటువంటి డిజిటల్ మార్గాలు  అభివృద్ధి చెందిన,  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ప్రైవేట్,  ప్రభుత్వ రంగాల ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తాయి అధిక, స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు  ప్రయోజనం చేకూరుస్తాయి. జి 20 అధ్యక్ష హోదా సమయంలో భారతదేశం డిపిఐ రంగంలో సాధించిన విజయాలను చూడడం ద్వారా బలమైన డిజిటల్ ఎజెండాను నడిపించింది. ఫైనాన్స్ ట్రాక్ ,  షెర్పా ట్రాక్స్ రెండింటి కింద డిపిఐ సంబంధిత నివేదికలు,  పంచగలగిన వాటిపై  జి 20 సభ్యులందరి నుండి ఏకగ్రీవ మద్దతును కూడగట్టగలిగింది. 

డీపీఐపై భారత్ జీ20 టాస్క్ ఫోర్స్ నివేదిక గురించి…

గ్లోబల్ డిపిఐ పురోగతి, అనుసరణ కోసం విధానాన్ని సమిష్టిగా ఆవిష్కరించే మూడు ముఖ్యమైన భాగాలను ఈ నివేదిక కలిగి ఉంది. పార్ట్ 1 లో, డిపిఐ విధానం వినూత్న సాంకేతిక పరిష్కారాల ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించే పరివర్తన నమూనాగా ఆవిష్కృతం అవుతుంది. నివేదిక రెండవ భాగం భారతదేశం తన డిపిఐ ఎజెండాను ఎలా నడిపించిందో,  ముఖ్యంగా 2023 లో జి 20 అధ్యక్ష సమయంలో ఫైనాన్స్ ట్రాక్ గ్లోబల్ పార్ట్ నర్ షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ (జిపిఎఫ్ఐ) , షెర్పా ట్రాక్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డిఇడబ్ల్యుజి) తో సహా వివిధ వర్కింగ్ గ్రూపుల కింద. నడిపించిన తీరును వివరిస్తుంది. నివేదికలోని మూడవ భాగం, వివిధ రంగాలలో, అలాగే ప్రపంచ స్థాయిలో దాని విధాన సిఫార్సుల శ్రేణి ద్వారా డిపిఐని పెంచడానికి వ్యూహాత్మక బ్లూప్రింట్‌ని వివరిస్తూ, ముందు చూపు ధోరణిని వివరిస్తుంది. 

వివిధ ప్రాంతాలు,  దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలలో డిపిఐ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, ఉపయోగించుకోవడానికి, బహుళజాతి ఉనికి పరిధితో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ప్రామాణిక వ్యవస్థను గుర్తించాల్సిన అవసరాన్ని కూడా నివేదిక ప్రముఖంగా తెలియచేస్తుంది, ప్రజా సేవలను అందించడంలో గణనీయమైన మెరుగుదల ద్వారా ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి, పారదర్శకతను మెరుగుపరచడం , దూరాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు,సంస్థల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో డిపిఐ విధానం భవిష్యత్ దిశ, అమలు కోసం చర్యలను నిర్వచించడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుంది.

టాస్క్ ఫోర్స్ గురించి…

భారతదేశ  జి 20 ప్రెసిడెన్సీ ఎజెండా , డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ), ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై ప్రాధాన్యతలను సాధించడానికి,  పర్యవేక్షించడానికి, సులభతరం చేయడానికి 2023 జనవరిలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. జి20 సభ్య దేశాలు డిజిటల్ టెక్నాలజీని , డిపిఐని రంగాలవారీగా అవలంబించడం ద్వారా ఉత్పాదకతను పెంచగల మార్గాలను టాస్క్ ఫోర్స్ పరిశీలించింది, అలాగే ప్రభుత్వ డిజిటల్ ఆర్థిక విధానాలు , నిబంధనలకు సహాయ పడింది 

ఆర్థిక పరివర్తన, ఆర్థిక సమ్మిళితం, అభివృద్ధి  కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై భారతదేశ  జి 20 టాస్క్ ఫోర్స్' కూర్పు ఈ క్రింది విధంగా ఉంది:

సహ అధ్యక్షులు

1. అమితాబ్ కాంత్ (జీ20 షెర్పా ఇండియా)

2. నందన్ నీలేకని

సభ్యులు

3. సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డి ఇ ఎ ), మెంబర్ కోఆర్డినేటర్

4. సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డి ఇ ఎ)

5. సెక్రటరీ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీమంత్రిత్వశాఖ (ఎంఇఐటీవై)

6. కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎం ఇ ఎ )

7. డిప్యూటీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ))

8. సి ఇ ఒ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్)

9. ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ)

10. సి ఇ ఒ,యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)

11. ఎండీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పి సి ఐ )

 

***



(Release ID: 2033632) Visitor Counter : 45