ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని
రాబోయే ఐదేళ్లలో వికసిత్ భారత్ ప్రయాణంలో కీలకపాత్ర పోషించనున్న వార్తాపత్రికలు
తమ సామర్థ్యాల మీద నమ్మకం సంపాదించుకున్న దేశ పౌరులు విజయ సాధనలో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో అదే జరుగుతోంది.
భారతదేశ ప్రయాణంలోని ఆటుపోట్లకు సాక్షిగా నిలవడమే కాకుండా వాటి మధ్య నిలబడుకొని ఆయా సంగతులను దేశ ప్రజలకు తెలియజేసిన ఐఎన్ ఎస్.
ఏ దేశానికైనా ప్రపంచస్థాయిలో వుండే ఇమేజ్ అనేది ఆ దేశ ఆర్థికరంగాన్ని ప్రభావితం చేస్తుంది. భారతీయ ప్రచురణ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించాలి
Posted On:
13 JUL 2024 8:08PM by PIB Hyderabad
ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భారతీయ వార్తాపత్రికల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఐఎన్ ఎస్ టవర్స్‌ను ప్రారంభించారు. నూతన భవనం ముంబాయిలో తగినంత స్థలంలో ఆధునిక కార్యాలయాన్ని కలిగివుందని ఇది ఐఎన్ ఎస్ సభ్యుల అవసరాలను తీరుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ముంబాయిలోని వార్తాపత్రికల పరిశ్రమకు ఇది కీలకమైన కేంద్రంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన నూతన టవర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ వార్తాపత్రిక సంఘ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. నూతన కార్యాలయంనుంచి నిర్వహించే విధుల నిర్వహణవల్ల భారతదేశ ప్రజాస్వామ్య మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే భారతీయ వార్తాపత్రిక సంఘం ఏర్పడిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని భారతదేశ ప్రయాణంలోని ఆటుపోట్లకు ఐఎన్ ఎస్ సాక్షిగా నిలిచిందని అన్నారు. అంతే కాకుండా ఆయా ఘటనలతో మమేకమవుతూ వాటిని వార్తల రూపంలో ప్రజలకు తెలియజేసిందని అన్నారు. ఒక సంస్థగా భారత వార్తాపత్రికల సంఘం చేసిన కృషి ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
ఆయా దేశాల స్థితిగతులకు మీడియా అనేది ప్రేక్షకురాలు కాదని వాటిని మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని వివరించారు. రాబోయే పాతిక సంవత్సరాల్లో వికసిత భారత్ చేసే ప్రయాణంలో వార్తాపత్రికలు, మ్యాగజైన్ల పాత్రను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేశ పౌరుల హక్కులు, వారి సామర్థ్యాలగురించి అవగాహనను కల్పించడంలో మీడియా పాత్రను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ శక్తియుక్తుల మీద నమ్మకమున్న పౌరులు గొప్ప విజయాన్ని సాధిస్తారనేదానికి భారతదేశంలో డిజిటల్ లావాదేవీల విజయమే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు. భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ప్రపంచంలోని ప్రధాన దేశాలు ఆసక్తిని చూపుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ విజయాల్లో మీడియా భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.
సీరియస్ అంశాలపై చర్చలు చేయడంద్వారా ఒక సంవాదాన్ని తయారు చేయడంలో మీడియా నిర్వర్తించే సహజ పాత్రను ప్రధాని ప్రస్తావించారు. మీడియా నిర్వహణపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ఆయన ప్రత్యేకంగానొక్కి చెప్పారు. జన్ ధన్ యోజన ఉద్యమంద్వారా నూతన బ్యాంకు అకౌంట్ల ప్రారంభంద్వారా బ్యాంకుల రంగంలోకి 50 కోట్ల మందిని తీసుకురావడమనేది ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని అన్నారు. డిజిటల్ ఇండియా సాధనకు, అవినీతిని అంతమొందించే కార్యక్రమాలకు ఈ ప్రాజెక్ట్ భారీగా సాయం చేసిందని అన్నారు. అలాగే తన ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలపై వోటుబ్యాంక్ రాజకీయాల ప్రభావం లేదని అన్నారు. జాతీయ సంవాదంలో ఈ ఉద్యమాలను భాగం చేసినందుకు మీడియా పాత్రను ఆయన ప్రశంసించారు.
భారత వార్తాపత్రికల సంఘం తీసుకునే నిర్ణయాలు దేశ మీడియాకు దిశానిర్దేశం చేస్తాయని ప్రధాని అన్నారు. దేశంలో మొదలుపెట్టే ఏ కార్యక్రమమైనా అది తప్పనిసరిగా ప్రభుత్వ కార్యక్రమం అయివుండాల్సిన పని లేదని, ఏ ఆలోచనైనా అది ప్రభుత్వానిదై వుండాలని లేదని అన్నారు. ఆజాదీకీ అమృత మహోత్సవ్, హర్ ఘర్ తిరంగాలాంటి ఉద్యమాలను ప్రభుత్వం ప్రారంభించిందని, మొత్తం దేశం వాటిని ముందుకు తీసుకెళ్లిందని ప్రధాని ఉదహరించారు. అదే విధంగా పర్యావరణ సంరక్షణకోసం ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది రాజకీయ అంశం కాదని, మానవీయ అంశమని చెబుతూ ఈ మధ్యనే ప్రారంభించిన ఏక్ పేద్ మా కే నామ్ ఉద్యమాన్ని ఉదహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా దాని గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. తాను ఈ మధ్యనే పాల్గొన్న జి7 శిఖరాగ్ర సదస్సులో అంతర్జాతీయ నేతలు సైతం భారతదేశ ఉద్యమంపట్ల ఆసక్తిని కనబరచారని గుర్తు చేశారు. నేటి యువ తరాలకు మంచి భవిష్యత్తును అందించే కార్యక్రమంలో అన్ని మీడియా సంస్థలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంకోసం అలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మీడియాను కోరారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లవ్వడంతో నిర్వహిస్తున్న సంబరాలను ప్రస్తావిస్తూ రాజ్యాంగంపట్ల పౌరుల విధి, అవగాహనను పెంచడంలో మీడియా కీలకపాత్రను ప్రత్యేకంగా స్పష్టం చేశారు.
పర్యాటక రంగ అభివృద్ధికోసం అందరమూ సమిష్టిగా కృషి చేసి మంచి పేరును తేవాలని, ఈ రంగాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చేలా మార్కెట్ చేయాలని ప్రధాని కోరారు. వార్తాపత్రికలు ఒక నెలను ఎంపిక చేసుకొని ఆ నెలలో ప్రత్యేకంగా ఒక రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల రాష్ట్రాల మధ్యన ఒకదానిపట్ల మరొక రాష్ట్రానికి పరస్పర ఆసక్తి పెరుగుతుందని అన్నారు.
వార్తాపత్రికలు అంతర్జాతీయంగా తమకున్న ఉనికిని పెంచాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. సమీప భవిష్యత్తులో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని అందుకోసం దేశం చేస్తున్న కృషిని ప్రస్తావించిన ప్రధాని భారతదేశ విజయాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకుపోయే బాధ్యత మీడియాదేనని అన్నారు. ఒక దేశానికి వుండే ప్రపంచ స్థాయి ఇమేజ్ నేరుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని ప్రధాని అన్నారు. భారతదేశ స్థాయి పెరుగుతున్న కొద్దీ ప్రవాస భారతీయులకు ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ ప్రగతికోసం వారిలో బలోపేతమవుతున్న సామర్థ్యాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని భాషల్లో భారతదేశ ప్రచురణ సంస్థలు వుండాలని ఆయన అభిలషించారు. ఈ ప్రచురణ సంస్థలు ప్రపంచ భాషల్లో తమ వెబ్ సైట్లను, మైక్రో సైట్లను, సోషల్ మీడియా సైట్లను నిర్వహించాలని ఇలాంటి పనుల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకోవాలని సూచించారు.
మీడియా సంస్థలు తమ ప్రచురణలకోసం డిజిటల్ ఎడిషన్లను ఉపయోగించుకోవాలని ,ప్రింట్ ఎడిషన్లతో పోలిస్తే డిజిటల్ ఎడిషన్లలో స్థలానికి సంబంధించిన పరిమితులుండవని తాను ఈ రోజు ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మీరందూ నా సలహాలను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను, కొత్త ప్రయోగాలు చేయండి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. మీరు ఎంత బలంగా పని చేస్తే దేశం అంత బలంగా ప్రగతి సాధిస్తుందని చెబుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాధ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, శ్రీ అజిత్ పవార్, భారత వార్తాపత్రికల సంఘం అధ్యక్షులు శ్రీ రాకేష్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
DS/TS
(Release ID: 2033108)
Visitor Counter : 107
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi_MP
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam