ప్రధాన మంత్రి కార్యాలయం
సహాయ కార్యదర్శులుగా (అసిస్టెంట్ సెక్రటరీలు) చేరిన 2022 బాచ్ ఐఏఎస్ ట్రెయినీ అధికారులతో ప్రధానమంత్రి సమావేశం
సంతృప్తత సాధన లక్ష్యంగా పని చేయాలని; తద్వారా మాత్రమే సామాజిక న్యాయం ఏర్పడి వివక్షత నివారించడం సాధ్యమవుతుందని ఉద్బోధ
సేవలందించడంలో స్పీడ్ బ్రేకర్లుగా వ్యవహరించాలా లేక సూపర్ ఫాస్ట్ హైవేగా నిలవాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి : ప్రధానమంత్రి
సమాజంలో మార్పునకు చోదక శక్తులుగా ఉండాలని, అప్పుడే తమ కళ్ల ముందు చోటు చేసుకుంటున్న మార్పు వారిలో సంతృప్తికి దారి తీస్తుందని అధికారులకు ప్రధానమంత్రి సూచన
జాతి ప్రథమం అన్నదే తన జీవిత లక్ష్యమని, ఈ ప్రయాణంలో తనతో కలిసి అడుగేయాలని ప్రధానమంత్రి సూచన
పరిపాలనా వ్యవస్థ అనే స్థూపంలో అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు జరిగే కార్యకలాపాలన్నింటిపై యువ అధికారులకు ప్రయోగాత్మక అభ్యాసం అందించడమే ఈ అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమం ధ్యేయం : ప్రధానమంత్రి
Posted On:
11 JUL 2024 7:28PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ భవనంలో గురువారం జరిగిన వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో సహాయ కార్యదర్శులుగా నియమితులైన 181 మంది 2022 బాచ్ ఐఏఎస్ ట్రెయినీ అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖాముఖి సంభాషించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు శిక్షణ సమయంలో తమ అనుభవాలను ప్రధానమంత్రికి తెలియచేశారు. 2022లో ఆరంభ్ కార్యక్రమం సందర్భంగా కూడా తాను వారితో సమావేశమైన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమం గురించి మాట్లాడుతూ పరిపాలనా యంత్రాంగం అనే ఒక స్థూపంలో అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు జరిగే కార్యకలాపాలన్నింటిపై యువ అధికారులకు ప్రయోగాత్మక అభ్యాసం అందించడమే ఆ కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారు.
నవభారతం లోపభూయిష్టమైన వైఖరిని ఏ మాత్రం సహించదని, ఎల్లప్పుడూ సానుకూల వైఖరినే కోరుతుందని ప్రధానమంత్రి అన్నారు. పౌరులందరికీ వీలైనంత వరకు ఉత్తమ పరిపాలన అందించేందుకు; తయారీ నాణ్యత, జీవన నాణ్యత అందించేందుకు కృషి చేయాలని సూచించారు. లఖ్ పతి దీదీ, డ్రోన్ దీదీ, పిఎం ఆవాస్ యోజన వంటి పథకాల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకాలన్నింటినీ ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా సంతృప్తత సాధనకు కృషి చేయాలని సూచించారు. అందరికీ సామాజిక న్యాయం అందించడంతో పాటు వివక్ష నివారణకు ఈ సంతృప్తత సాధన వైఖరి దోహదపడుతుందన్నారు. ప్రజలకు సేవలందించే క్రమంలో స్పీడ్ బ్రేకర్లుగా ఉంటారా లేక సూపర్ ఫాస్ట్ హైవేగా మారాలనుకుంటున్నారా అన్నది మీరే తేల్చుకోవాలి అని ప్రధానమంత్రి వారికి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురాగల శక్తులుగా నిలవాలన్నదే ఎల్లప్పుడూ మీ ఆకాంక్ష కావాలి, అప్పుడే మీ కళ్ల ముందు చోటు చేసుకుంటున్న మార్పుపై మీలో సంతృప్తి కలుగుతుంది అని ఉద్బోధించారు.
జాతి ప్రథమం అనేది ఒక నినాదం కాదు, అది నా జీవిత లక్ష్యం అని ప్రకటిస్తూ ఈ ప్రయాణంలో తనతో కలిసి అడుగేయాలని యువ అధికారులకు ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఐఏఎస్ కి ఎంపికైన తర్వాత వారికి వచ్చిన ప్రశంసలు, అభినందనలు గత కాలం నాటి మాట అని, అలా గతంలోనే ఉండిపోకుండా భవిష్యత్ దిశగా అడుగేయాలని వారికి సూచించారు.
కేంద్ర సహాయ మంత్రి (సిబ్బంది వ్యవహారాలు) శ్రీ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ పి.కె.మిశ్రా, కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా, కార్యదర్శి (హోం; సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ) ఎ.కె.భల్లా, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2032688)
Visitor Counter : 79
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam