నీతి ఆయోగ్

'సంపూర్ణతా అభియాన్'ను ప్రారంభించిన నీతి ఆయోగ్


500 ఆకాంక్షిత బ్లాక్‌లు, 112 ఆకాంక్షిత జిల్లాల్లోని 12 కీలక సామాజిక రంగ సూచికలలో సంతృప్త స్థాయి సాధించడంపై దృష్టి సారించేందుకు దేశవ్యాప్తంగా అమలు

2024 జూలై 4 నుంచి 30 సెప్టెంబర్ 2024 వరకు 3 నెలల కార్యక్రమం.. ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, విద్య వంటి అంశాలపై దృష్టి

Posted On: 04 JUL 2024 6:07PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ ఇవాళ ప్రారంభించిన 'సంపూర్ణతా అభియాన్'లో దేశవ్యాప్తంగా పౌరుల నుంచి గణనీయమైన స్పందన లభించింది. మొత్తం 112 ఆకాంక్షిత జిల్లాలు, 500 అకాంక్షిత బ్లాక్‌లలో ఈ ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించారు. 2024 జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ సమగ్ర మూడు నెలల కార్యక్రమం, అన్ని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లలో 12 కీలక సామాజిక రంగ సూచికల విషయంలో 100% సంతృప్త స్థాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మొదటి రోజు జమ్ముకశ్మీర్ నుంచి అండమాన్, నికోబార్ దీవుల వరకు లక్షలాది మంది పాల్గొన్నారు. ఇందులో జిల్లా, బ్లాక్ స్థాయి అధికారులు, ముందు వరుస(ఫ్రంట్ లైన్) వర్కర్లు, కమ్యూనిటీ నాయకులు, స్థానిక కళాకారులు, విద్యార్థులు, స్థానిక ప్రతినిధులు (బ్లాక్ ప్రముఖ్‌లు/సర్పంచులు) ఉన్నారు.

కార్యక్రమ లక్ష్యాలను నెరవేర్చడానికి, గుర్తించిన సూచికల పూర్తి సంతృప్తతను సాధించే దిశగా పురోగతిని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ 'సంపూర్ణతా అభియాన్' సూత్రాలతో కూడిన 'సంపూర్ణతా ప్రతిజ్ఞ' చేస్తూ ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లు నిబద్ధతను వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్ లోని రత్లాం, సింగ్రౌలిలో మాదిరిగా ఈ కార్యక్రమంలో ముఖ్య సూచికలపై దృష్టి సారించే శిబిరాలను కూడా నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్, హర్యానాలోని నుహ్ జిల్లా కేంద్రాల్లో ఆర్భాటాలు, స్థానికుల భారీ భాగస్వామ్యం మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి స్థానిక ప్రజలు నుంచి విశేషస్పందన లభించింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలోని బాన్స్ గావ్ బ్లాక్, హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా నిర్మాణ్ బ్లాక్‌లో గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారానికి సంబంధించిన ప్రాంతీయ ఆహారాన్ని వందలాది అశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు.  'సంపూర్ణతా అభియాన్'ను పురస్కరించుకుని ప్రత్యేక సెల్ఫీ బూత్ల వద్ద ఫొటోలు దిగడం సర్వసాధారణమైంది. కొన్ని చోట్ల సంపూర్ణతా అభియాన్ కీలక పనితీరు సూచికలు, లక్ష్యాల గురించి అవగాహన కల్పించడానికి సంపూర్ణతా యాత్రలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యంలోని భామిని బ్లాక్ లో నిర్వహించిన ఇలాంటి యాత్రలో పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. చిత్రలేఖన పోటీలలో పాల్గొనడం ద్వారా పిల్లలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. హార్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలోని బద్రా బ్లాక్‌లో ఈ తరహా పోటీలు నిర్వహించారు. ప్రారంభోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నుక్కడ్ నాటక్, ప్రదర్శన స్టాల్స్, భూసార పరీక్షల కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్ సంపూర్ణతా అభియాన్‌ను అరుణాచల్ ప్రదేశ్‌లోని నామ్సాయి జిల్లాలోని చౌకం బ్లాక్‌లో ప్రారంభించారు. నాగాలాండ్‌లోని కిఫిరేలో జరిగిన ప్రారంభోత్సవంలో శాసన సభ సభ్యుడు  శ్రీ సీ కిపిలి సంగతం ప్రసంగం మంచి ఆరంభాన్ని అందించింది. అదేవిధంగా, మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలోని లమ్కా సౌత్ బ్లాక్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా డయాబెటిస్, రక్త పోటుపై ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది.

3 నెలల పాటు సాగే 'సంపూర్ణతా అభియాన్'  కార్యక్రమంలో భాగంగా జిల్లా, బ్లాక్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామసభలు, నుక్కడ్ నాటక్, పౌస్టిక్ ఆహర్ మేళా, ఆరోగ్య శిబిరాలు, ఐసీడీఎస్ శిబిరాలు, అవగాహన ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, పోస్టర్ల తయారీ, కవితా పోటీలు వంటి అవగాహన కార్యక్రమాలను అన్ని ఆకాంక్షిత బ్లాకులు, జిల్లాల్లో 100% సంతృప్తత కోసం గుర్తించిన 12 అంశాలపై నిర్వహిస్తారు.

 

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అమలు చేయడంలో స్థానిక సిబ్బందికి మార్గనిర్దేశం చేయడానికి, అవసరమైన మద్దతు ఇవ్వడానికి నీతి ఆయోగ్ అధికారులు, యువ వృత్తి నిపుణులు 300 జిల్లాల్లో వ్యక్తిగతంగా ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు.. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో భాగస్వామ్యం వల్ల ఈ కార్యక్రమం లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు బలోపేతమవటమే కాకుండా మారుమూల ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే పోటీ, సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది.

'సంపూర్ణతా అభియాన్' ఫోకస్ ప్రాంతాలు:

 

ఆకాంక్షిత బ్లాక్‌లు కీలక పనితీరు సూచికలు(కేపీఐలు):

 

1. మొదటి త్రైమాసికంలో ప్రసవానంతర సంరక్షణ (ఏఎన్‌సీ) కోసం నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీల శాతం

2. బ్లాక్‌లో నిర్దేశిత జనాభాలో డయాబెటిస్ పరీక్ష చేసుకున్న వారి శాతం

3. బ్లాక్‌లో నిర్దేశిత జనాభాలో రక్తపోటు పరీక్ష చేసుకున్న వారి శాతం

4. ఐసీడీఎస్ పథకం కింద క్రమం తప్పకుండా సప్లిమెంటరీ పోషికాహారం తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం

5. మట్టి నమూనా సేకరణ లక్ష్యంలో భూ‌సార పరీక్ష కార్డులు పంపిణీ శాత

6. బ్లాక్‌లోని మొత్తం స్వయం సహాయక సంఘాల్లో రివాల్వింగ్ ఫండ్ పొందిన స్వయం సహాయక సంఘాల శాతం

 

ఆకాంక్షిత జిల్లాలు కెపిఐలు:

 

1. మొదటి త్రైమాసికంలో ప్రసవానంతర సంరక్షణ (ఏఎన్‌సీ) కోసం నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీల శాతం

2. ఐసీడీఎస్ పథకం కింద క్రమం తప్పకుండా సప్లిమెంటరీ పోషికాహారం తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం

3. పూర్తిగా టీకాలు తీసుకున్న పిల్లల శాతం (9-11 నెలలు) (బీసీజీ+డీపీటీ3+ఓపీవీ3+మీజిల్స్ 1)

4. పంపిణీ చేసిన సాయిల్ హెల్త్ కార్డుల సంఖ్య

5. సెకండరీ స్థాయిలో విద్యుత్ ఉండి, పనిచేస్తున్న పాఠశాలల శాతం
6. విద్యాసంవత్సరం ప్రారంభమైన ఒక నెలలోపు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్న పాఠశాలల శాతం

***



(Release ID: 2031276) Visitor Counter : 9