నౌకారవాణా మంత్రిత్వ శాఖ
డిబ్రూగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన శ్రీ సర్బానంద సోనోవాల్
డిబ్రూగర్ నగరంలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేసిన ఆకస్మిక వరదలపై శ్రీ సోనోవాల్ సమీక్ష నిర్వహించారు, అలాగే గ్రాహమ్ బజార్, ఏ.టీ. రోడ్, హెచ్.ఎస్. రోడ్, ఆర్.కె.బి. పథ్, మాన్‌కొట్టా రోడ్, థానా చరియాలి, ఝాలుక్‌పారా ప్రాంతాలను సందర్శించారు
వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల గురించి కేంద్రమంత్రి సమీక్షించారు, టెంగాఖాట్ వద్ద గల సహాయక శిబిరాన్ని సందర్శించి వరద బాధితులను కలిశారు అలాగే హాతిబంధ & టెంగాఖాట్ కట్ట ప్రాంతాలను సందర్శించారు
వరద బాధితులకు సహాయ సామాగ్రిని త్వరగా అందించాలి & పంపిణీ చేయాలని జిల్లా పరిపాలన అధికారులను శ్రీ సోనోవాల్ ఆదేశించారు
Posted On:
03 JUL 2024 7:37PM by PIB Hyderabad
ఓడరేవులు, షిప్పింగ్ & జలరవాణా మంత్రిత్వశాఖ కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గ్రేటర్ డిబ్రూగర్ ప్రాంతంలో వరదల పరిస్థితిని పరిశీలించి, వరద బాధితుల ప్రయోజనం కోసం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించారు. గ్రాహమ్ బజార్, ఏ.టీ. రోడ్, హెచ్.ఎస్. రోడ్, ఆర్.కె.బి. పథ్, మాన్‌కొట్టా రోడ్, థానా చరియాలీ, ఝాలుక్‌పారా సహా డిబ్రూగర్ నగరంలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాలను శ్రీ సోనోవాల్ సందర్శించారు. టెంగాఖాట్, హాతిబంధ కట్ట (తీర) ప్రాంతాలను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
ఈరోజు టెంగాఖాట్ వద్ద ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయక శిబిరాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. వరద బాధితుల పరిస్థితిని పరిశీలించిన ఆయన వారితో మాట్లాడి జరిగిన ఆస్తి నష్టం గురించి తెలుసుకున్నారు. సహాయక శిబిరాల్లో పరిశుభ్రత నిర్వహణ, అంటువ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి జిల్లా కమిషనర్‌కు పలు సూచనలు చేసి శిబిరంలో బాధితులకు వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
వరద బాధితుల సహాయానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్), రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్.డి.ఆర్.ఎఫ్.), బారత సైన్యం, భారత వైమానిక దళం డిబ్రూగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సహాయ మరియు రక్షణ చర్యలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నారు.
ఈ పరిస్థితిని గురించి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “డిబ్రూగర్, టిన్సుకియాతో పాటు అసోంలోని అనేక ప్రాంతాల్లో వరద పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఇక్కడి పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి, వరద బాధిత ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కట్టల మరమ్మతులు, నిర్మాణాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నేను అధికారులను ఆదేశించాను.” అన్నారు.
కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ వెంట డిబ్రూగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, అస్సాం రాష్ట్ర మంత్రి, టిన్సుకియా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టెరాస్ గోవాలా, అస్సాం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎ.టి.డి.సి.) చైర్మన్ రీతూపర్ణ బారుహా, జిల్లా కమిషనర్ బిక్రమ్ కైరీ, డిబ్రూగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సైకత్ పాత్రా, డి.ఎమ్.సి డిప్యూటీ మేయర్ & బి.జె.పి డిబ్రూగర్ జిల్లా అధ్యక్షులు ఉజ్వల్ కశ్యప్ తదితరులు ఉన్నారు.
***
(Release ID: 2030608)
Visitor Counter : 73