హోం మంత్రిత్వ శాఖ

‘‘అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినం’’ నేపథ్యంలో దేశ ప్రజలకు కేంద్ర హోమ్.. సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు


దేశాన్ని మాదకద్రవ్య రహితం చేసే దృఢమైన నిబద్ధతతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర
మోదీ నేతృత్వాన మా సంపూర్ణ ప్రభుత్వం లక్ష్యంవైపు సాగుతోంది: కేంద్ర హోంమంత్రి;

‘‘మాదకద్రవ్యాలపై పోరులో భాగంగా ‘దిగువ నుంచి ఎగువకు-ఎగువ నుంచి దిగువకు’ విధానం అమలులో మోదీ ప్రభుత్వం మెరుగైన సమన్వయం సాధించింది’’;

‘‘మాదకద్రవ్య ‘సంపూర్ణ నిరోధం’ విధానంతో మా ప్రభుత్వం
ఆ వ్యసనం సంపూర్ణ నిర్మూలనకు కృతనిశ్చయంతో ఉంది’’;

‘‘ప్రభుత్వం చేపట్టిన మాదకద్రవ్య వ్యతిరేక పోరాటంలో దేశ
ప్రజలు తమవంతు సహకారం అందించాలని నా అభ్యర్థన’’;

‘‘మనమంతా సమష్టి కృషితో మాదక ద్రవ్యాల సంపూర్ణ నిర్మూలన ద్వారా
ఆరోగ్యకర.. సంతోషభరిత.. సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం’’

Posted On: 26 JUN 2024 6:16PM by PIB Hyderabad

   ‘‘అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినం’’ నేపథ్యంలో దేశ ప్రజలకు కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో- ‘‘అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. భారతదేశాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలోని మా ప్రభుత్వం దృఢమైన నిబద్ధతను ప్రదర్శిస్తోంది. ఈ లక్ష్యం దిశగా ‘సంపూర్ణ ప్రభుత్వం’ విధానంతో ముందడుగు వేస్తోంది. మాదకద్రవ్య మహమ్మారి నుంచి దేశాన్ని విముక్తం చేయడంతోపాటు మన భవిష్యత్తరాలకు మెరుగైన ప్రపంచాన్ని కానుకగా ఇవ్వడంపై మన సంకల్పాన్ని మరింత దృఢంగా ప్రకటిద్దాం’’ అని పిలుపునిచ్చారు.

   శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మాదకద్రవ్య రహిత భారత్’ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు ‘అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినం’ నేపథ్యంలో పంపిన తన సందేశంలో: ‘మాదకద్రవ్య రహిత భారత్’ దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని సాకారం చేయడంలో నిర్విరామంగా శ్రమిస్తున్న ప్రభుత్వ సంస్థలు-సిబ్బందికి శ్రీ అమిత్ షా అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ‘అఖిలభారత మాదకద్రవ్య రహిత పక్షోత్సవాల’ను విజయవంతంగా నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి)ని ఆయన ప్రశంసించారు.

   మాదకద్రవ్యాలు వ్యక్తులతోపాటు యావత్ సమాజానికి, అంతిమంగా దేశ భద్రతకే సవాలు విసురుతున్నాయని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మాదకద్రవ్య రహిత భారత్’ రూపకల్పన తమ ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యాలలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలపై పోరులో భాగంగా ‘దిగువ నుంచి ఎగువకు-ఎగువ నుంచి దిగువకు’ విధానం అమలులో మోదీ ప్రభుత్వం మెరుగైన సమన్వయం సాధించిందని ఆయన చెప్పారు.

   మాదకద్రవ్యాలపై ‘సంపూర్ణ నిరోధం’ విధానంతో ముందడుగు వేస్తున్నామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ముఖ్యంగా మాదకద్రవ్య వ్యసనాన్ని పూర్తిగా నిర్మూలించడంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ కృషితోపాటు ‘ఎన్‌సిఒఆర్‌డి’ ఏర్పాటు, రాష్ట్రాల పోలీసు విభాగాల్లో ‘యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటుతో ఈ పోరాటం మరింత ఉధృతమై సానుకూల  ఫలితాలిచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

   మాదకద్రవ్య నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన అన్నిరకాల సానుకూల చర్యలకు భారీ ప్రజా భాగస్వామ్యం తోడ్పాటుతో సంపూర్ణ విజయం సాధించడమే తమ లక్ష్యమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఆ మేరకు ‘‘మాదకద్రవ్యాలపై ప్రభుత్వ పోరాటానికి దేశ ప్రజలు తమవంతు సహకారం అందించాలని అభ్యర్థిస్తున్నాను. మనమంతా సమష్టి కృషితో మాదక ద్రవ్యాల సంపూర్ణ నిర్మూలన ద్వారా ఆరోగ్యకర.. సంతోషభరిత.. సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం రండి’’ అని పిలుపునిచ్చారు.

   చట్టవిరుద్ధ మాదకద్రవ్య వ్యాపారం నిరోధం దిశగా కేంద్ర హోంశాఖ బహుముఖ కృషి ఫలితంగా స్వాధీనం చేసుకుంటున్న మాదకద్రవ్యాల పరిమాణం దాదాపు 100 శాతం పెరిగింది. అంతేకాకుండా ఈ అక్రమ కార్యకలాపాలపై కేసుల నమోదు 152 శాతం పెరిగింది. ఈ అంశాలపై మంత్రిత్వశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం- దేశంలో 2006-13 మధ్య కాలంలో 1,257 కేసులు నమోదు కాగా, 2014-23 మధ్య 3 రెట్లు పెరిగి 3755 నమోదయ్యాయి. అలాగే అరెస్టులు కూడా 2006-13 మధ్య 1363 సంఘటనలు నమోదవగా, 2014-23 మధ్య కాలంలో 4 రెట్లు పెరిగి 5745కి చేరాయి. ఇక 2006-13 మధ్యకాలంలో 1.52 లక్షల కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా ఈ పరిమాణం రెట్టింపు పెరిగి 3.95 లక్షల కిలోలకు చేరింది. ఇలా స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ పరంగానూ 2006-13 మధ్య రూ.768 కోట్లు కాగా, మోదీ ప్రభుత్వ హయాంలో 30 రెట్లు పెరిగి రూ.22,000 కోట్లకు చేరింది.

   అంతేకాకుండా మోదీ ప్రభుత్వ హయాంలో రూ.12,000 కోట్ల విలువైన 12 లక్షల కిలోల మాదకద్రవ్యాలను యాంటీ నార్కోటిక్ సంస్థలు ధ్వంసం చేశాయి. మరోవైపు 2023 జూన్ వరకూ ఇటువంటి 23 ఉదంతాల్లో రూ.74,75,00,531 విలువైన ఆస్తులను స్తంభింపజేశాయి.

***



(Release ID: 2028946) Visitor Counter : 29