ప్రధాన మంత్రి కార్యాలయం

జి-7 సదస్సు నేపథ్యంలో ఇటలీ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 14 JUN 2024 11:50PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇటలీలోని అపులియాలో ఆ దేశ ప్రధాని గౌరవనీయ శ్రీమతి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. వరుసగా మూడోసారి భారత ప్రధాని పదవిని చేపట్టడంపై ఆమె ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. కాగా, జి-7 విస్తృత సదస్సుకు తనను ఆహ్వానించడంపై ప్రధాని మెలోనీకి ప్రధానమంత్రి మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ప్రశంసించారు.

   రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులు క్రమబద్ధంగా సాగుతుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పురోగమిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశుభ్ర ఇంధనం, తయారీ, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక, టెలికాం, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో సుస్థిర సరఫరా శ్రేణి నిర్మాణం దిశగా వాణిజ్య సంబంధాలను మరింత  విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్ వంటి అంశాల్లో సహకార చట్రం రూపకల్పన సంబంధిత పారిశ్రామిక సంపద హక్కుల (ఐపిఆర్) ఒప్పందంపై ఇటీవల సంతకాలు పూర్తికావడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.

   భారత్-ఇటలీ ద్వైపాక్షిక రక్షణ-భద్రత సహకారంపై ప్రధానమంత్రులిద్దరూ చర్చించారు. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరన ఇటలీ విమాన వాహక నౌక ‘ఐటిఎస్ కావర్’, సిబ్బంది శిక్షణ నౌక ‘ఐటిఎస్ విష్పూచి’ భారత్ రానుండటంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి భారత సైన్యం సహకారాన్ని గుర్తించడంపై ఆ దేశ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటలీలోని మోంటోన్ వద్దగల యశ్వంత్ ఘడ్గే స్మారకానికి భారత్ మరింత మెరుగులు దిద్దనుందని చెప్పారు. ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి’ కింద సమన్వయం గురించి వారిద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా పరిశుభ్ర-హరిత ఇంధన రంగ పరివర్తనలో ద్వైపాక్షిక సహకార విస్తృతికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడికపై సంతకాలు పూర్తికావడంపై వారు హర్షం ప్రకటించారు. శాస్త్ర-సాంకేతిక  రంగంలో సంయుక్త పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా 2025-27 కాలానికగాను కొత్త సహకార కార్యాచరణ కార్యక్రమం చేపట్టడంపైనా వారు సంతోషం వ్యక్తం చేశారు.

   ఇటలీలో దీర్ఘకాలం నుంచీ ‘ఇండలాజికల్ స్టడీస్’ సంప్రదాయం ప్రాతిపదికగా ప్రజలతో-ప్రజల  అనుసంధానం మరింత బలోపేతం కావడంపై రెండు దేశాలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంపై అధ్యయనాల కోసం మిలన్ విశ్వవిద్యాలయం తొలిసారి పీఠం ఏర్పాటు చేయడంతో  ఈ అనుబంధం మరింత పెనవేసుకోగలదు. రెండు దేశాల మధ్య వృత్తి నిపుణులు, నిపుణ-పాక్షిక నిపుణ మానవ శక్తి, విద్యార్థులు, పరిశోధకుల పరస్పర రాకపోకల సౌలభ్యం దిశగా ‘వలస-ప్రయాణ ఒప్పందం’ సత్వర అమలుకు దేశాధినేతలిద్దరూ పిలుపునిచ్చారు.

   స్వేచ్ఛా-సార్వత్రిక ఇండో-పసిఫిక్ ప్రాంతం దిశగా ‘ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’  కింద ఉమ్మడి కార్యకలాపాల అమలుకు అధినేతలిద్దరూ సంసిద్ధత తెలిపారు. అంతేకాకుండా కీలక ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపైనా ప్రధానమంత్రులు ఇద్దరూ చర్చించారు. భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్‌ సహా అంతర్జాతీయ వేదికలపైనా, బహుపాక్షిక కార్యక్రమాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.

***



(Release ID: 2025823) Visitor Counter : 52