కేంద్ర మంత్రివర్గ సచివాలయం

వడగాడ్పులు.. కార్చిచ్చు ముప్పుల నిర్వహణ సంసిద్ధతపై ‘ఎన్‌సిఎంసి’ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా

Posted On: 06 JUN 2024 6:20PM by PIB Hyderabad

   దేశంలో వడగాడ్పులు, కార్చిచ్చు వంటి ముప్పుల నిర్వహణ సంసిద్ధతపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా ఇవాళ జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్‌సిఎంసి)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వడగాడ్పులు, కార్చిచ్చు వంటి విపత్తులకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌-అటవీ-వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌, జాతీయ ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఎన్‌డిఎంఎ) అధికారులు, నిపుణులు వివరణాత్మక ప్రదర్శనల ద్వారా విశదీకరించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితుల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి కూడా తెలిపారు.

   ఈ ఏడాది (2024) ఏప్రిల్-జూన్ నెలల మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా 10-22 వడగాడ్పుల రోజులు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు వెల్లడించారు. ఇక జూన్ నెల అంచనాల మేరకు- వాయవ్య, ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో, వాటి పొరుగు ప్రదేశాల్లో సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రత రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవన ప్రభావంతో సాధారణ-సాధారణంకన్నా అధిక వర్షపాతం నమోదు కాగల అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వడగాడ్పులపై ఐఎండి క్రమబద్ధ హెచ్చరికలు జారీచేస్తున్నదని చెప్పారు.

   దేశంలో ఈ పరిస్థితులపై 2023 అక్టోబరు నుంచి కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంసిద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించినట్లు ‘ఎన్‌డిఎంఎ’ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా3 కంట్రోల్ రూములను అప్రమత్తం చేయడం, వడగాడ్పులపై ప్రామాణిక నిర్వహణ ప్రక్రియల అమలు, తాగునీటి లభ్యతకు భరోసా, అత్యవసర మందులతోపాటు ‘ఒఆర్ఎస్’ లభ్యతసహా  నిరంతర విద్యుత్ సరఫరా, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల సంసిద్ధత వగైరాలపై రాష్ట్రాలకు సలహాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర సంస్థలలో అగ్ని ప్రమాద నివారణ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ప్రమాదాలపై ప్రతిస్పందన సమయాన్ని తగ్గించాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు ఆయా జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించి, పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు.

   అనంతరం కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి మాట్లాడుతూ- వడగాడ్పుల పరిస్థితుల నిర్వహణ సంసిద్ధత మెరుగు దిశగా స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక చర్యలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, సమీక్షించాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సూచించారు. నీటి సరఫరా వనరుల నిర్వహణ, మెరుగుదల కృషిని ముమ్మరం చేయాలని, అన్ని సంస్థలలో అగ్నిప్రమాద తనిఖీలు క్రమం తప్పకుండా సాగాలని ఆయన నొక్కిచెప్పారు.

   ఈ సమీక్ష సమావేశం సందర్భంగా దేశంలో కార్చిచ్చు నిర్వహణపై పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంసిద్ధత-కార్యాచరణ ప్రణాళికలను వివరించే ప్రదర్శన ఇచ్చింది. ఇందులో భాగంగా మొబైల్ సందేశాలు, ఈ-మెయిళ్ల ద్వారా కార్చిచ్చు ప్రమాద హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘వన్ అగ్ని’ కార్చిచ్చు హెచ్చరిక వ్యవస్థ పోర్టల్ ద్వారా అగ్ని ప్రమాద ముప్పు-మంటలపై ప్రత్యక్ష హెచ్చరికలు జారీ అవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రాలతోపాటు ఇతరత్రా సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఐ) దీనికి రూపకల్పన చేసింది.

   కాగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024 జూన్ 02న నిర్వహించిన సమీక్ష  సమావేశంలో కార్చిచ్చుపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన ఆదేశించచడాన్ని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి గుర్తుచేశారు. ఇందులో భాగంగా వరద ముప్పు ఎదురయ్యే ముందు ఏటా చేపట్టే కసరత్తుల తరహాలో కార్చిచ్చులపైనా సన్నాహక చర్యలు, కార్యక్రమాలు నిర్వహించే విధానాన్ని అనుసరించాలని సూచించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ముప్పు నివారణ, సత్వర-సమర్థ ప్రతిస్పందనపై దృష్టి సారించే సమగ్ర విధానం అనుసరించాలని గుర్తుచేశారు.

   వడగాడ్పులు, కార్చిచ్చు ఫలితంగా సంభవించే ప్రాణనష్టం నివారణ, ఇతరత్రా నష్టాల కనిష్టీకరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మరింత మెరుగైన సంసిద్ధతతో ఉండాలని మంత్రిమండలి కార్యదర్శి సూచించారు. ఇందులో భాగంగా ‘ఎన్‌డిఎంఎ’, కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మంత్రిత్వశాఖ సూచించిన సన్నాహక చర్యల ప్రాముఖ్యాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. సరైన సంసిద్ధతకు భరోసా ఇవ్వడంతోపాటు సకాలంలో ఉపశమన- ప్రతిస్పందన చర్యల అమలు దిశగా కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరస్పర సహకారంతో వ్యవహరించేలా చూస్తామని రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.

   కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, తాగునీరు-పారిశుద్ధ్య శాఖ, వ్యవసాయం-రైతు  సంక్షేమ శాఖ, పశు సంవర్ధక-పాడి పరిశ్రమ శాఖ, జలవనరుల శాఖ, నదీ అభివృద్ధి-గంగా పునరుజ్జీవన శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఎన్‌డిఎంఎ’ విభాగాధిపతి-సభ్యుడు, సిఐఎస్‌సి (ఐడిఎస్) డైరెక్టర్ జనరల్, ‘ఎన్‌డిఆర్ఎఫ్‌’ డైరెక్టర్ జనరల్, ఐఎండి డైరెక్టర్ జనరల్, ఎఫ్ఎస్ఐ డైరెక్టర్ జనరల్, అటవీ, కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖల అదనపు కార్యదర్శులు, హోంవాఖ సలహాదారు, ‘ఎన్‌డిఎంఎ’ డైరెక్టర్ తదితరులు కూడా హాజరయ్యారు. అలాగే బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్ము-కశ్మీర్, ఒడిషా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల, జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు.

***



(Release ID: 2023338) Visitor Counter : 65