ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్‌లో భారత ప్రధాని పర్యటనపై సంయుక్త ప్రకటన


భారత్-భూటాన్: ప్రగతి.. పురోగమనం దిశగా సమష్టి కృషి

Posted On: 22 MAR 2024 7:18PM by PIB Hyderabad

   భారత్-భూటాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సద్భావన, సదవగాహనతో కూడిన స్నేహ, సహకారపూరిత సన్నిహిత బంధం శతాబ్దాలుగా కొనసాగుతోంది. మన సాంస్కృతిక సంబంధాలు, సార్వజనీన భౌగోళిక స్వరూపం మనల్ని ఏకం చేస్తున్నాయి. బలమైన ఆర్థిక-ద్రవ్య సంబంధాలు మనమధ్య బలమైన బంధం ఏర్పరిచాయి. రెండు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు మన స్నేహానికి జీవనాడి వంటివి. ఇరుగుపొరుగు మధ్య సౌహార్ద సంబంధాలకు మన రెండు దేశాల మధ్య స్నేహం తిరుగులేని నిదర్శనం.

   ఉమ్మడి విలువలతోపాటు భాగస్వామ్య సాంస్కృతిక-ఆధ్యాత్మిక వారసత్వంతో మన దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం ముడిపడి ఉంది. ‘భూటాన్ కోసం భారత్-భారత్ కోసం భూటాన్’ అనేది ఈ ప్రాంత సుస్థిర వాస్తవికతకు చిహ్నం. ఇది భూటాన్ అనూచాన ‘డ్రుక్ గ్యాల్పోస్’ భారత, భూటాన్‌ దేశాల్లోని రాజకీయ నాయకత్వం మధ్య వివేచనాత్మక దార్శనికతతో వృద్ధి చెందిన స్నేహబంధం.

   పరస్పర భద్రతకు సంబంధించి రెండు దేశాల మధ్య సహకారంపై మేమెంతో సంతృప్తితో ఉన్నాం. మా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పరస్పరం సన్నిహిత సమన్వయం, సహకారంతో ముందుకు వెళ్లడంపై మేము అంగీకారానికి వచ్చాం.

   మా విశిష్ట, విభిన్న సంబంధాల విస్తృతికి దోహదం చేసే పరివర్తనాత్మక భాగస్వామ్యాన్ని మేం సంయుక్తంగా కొనసాగిస్తాం. రైల్వే అనుసంధానాలు, రహదారులు, విమాన మార్గాలు, జల మార్గాలు, వస్తుసేవలు, ఆర్థిక-డిజిటల్ సంధానం వగైరాలకు సంబంధించి నిరంతరాయ సరిహద్దు రవాణా దిశగా వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పన, విస్తృత భౌతిక సంధానానికి ప్రోత్సాహం కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

   భూటాన్ తొలి పంచవర్ష ప్రణాళిక (1961) నుంచి ఆ దేశంతో భారత్ ప్రగతి భాగస్వామ్యం ప్రజలకు సాధికారత కల్పిస్తోంది. అలాగే వివిధ రంగాలు, ప్రాంతాలలో అభివృద్ధికి భరోసా ఇస్తోంది. భారత్ అనుసరిస్తున్న ‘సబ్కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్’ సూత్రంతోపాటు భూటాన్‌ ‘స్థూల జాతీయ ఆనందం’ సిద్ధాంతాల సమ్మేళనమే మా అభివృద్ధి భాగస్వామ్యం. ఇందులో భాగంగా భూటాన్ ప్రజల, ప్రభుత్వ ప్రాధాన్యాలు సహా గౌరవనీయ రాజు దార్శనికతకు తగినట్లు ఈ భాగస్వామ్య విస్తరణను కొనసాగిస్తాం.

   మా మధ్య లోతైన ఆర్థిక సంబంధాలకు మా ఇంధన సహకారమే నిదర్శనం. దీనివల్ల పరస్పర ప్రయోజనకర ఫలితాలు లభిస్తాయి. ఈ మేరకు జల, సౌర, హరిత ఉదజని ఇంధన రంగాల్లో మా పరిశుభ్ర ఇంధన భాగస్వామ్యాన్ని విస్తరిస్తాం. అలాగే ఈ ప్రాంతంలో ఇంధన భద్రత పెంపు దిశగా మా సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య రంగ చైతన్యం, రెండు దేశాల నిపుణుల ప్రతిభను మేళవిస్తూ కొత్త ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మిస్తాం. దీనికి సంబంధించి భారత్-భూటాన్ ఇంధన భాగస్వామ్యంపై సంయుక్త దార్శనిక ప్రకటన జారీ హర్షణీయం.

   రెండు దేశాలూ నేడు లోతైన డిజిటల్-సాంకేతిక పరివర్తన వైపు పయనిస్తున్న నేపథ్యంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, తద్వారా రెండు దేశాల ప్రజల శ్రేయస్సుకు తోడ్పడటంపై మా సంయుక్త కృషిని కొనసాగిస్తాం. అంతరిక్ష సాంకేతికత, పౌర డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థలు, కృత్రిమ మేధ, పరిశుభ్ర ఇంధనం, ‘స్టెమ్’ పరిశోధన-విద్య, డిజిటల్ నైపుణ్యాభివృద్ధి వంటి సముచిత రంగాల్లో మా బంధాన్ని మరింత విస్తృతం చేస్తాం.

   వాణిజ్యం-పెట్టుబడుల పరస్పర బంధాన్ని... ముఖ్యంగా ప్రైవేట్ రంగం ద్వారా గెలెఫూ ప్రత్యేక పాలనా ప్రాంత అభివృద్ధిపై గౌరవనీయ రాజుగారి దార్శనికత మేరకు మేం మరింత బలోపేతం చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో సుస్థిర, విస్తృత ఆర్థిక అనుసంధానానికి బాటలు పడతాయి. ఆర్థిక భాగస్వామ్యాలకు ప్రోత్సాహం లభించి, భారత్-భూటాన్ ప్రజలను మరింత చేరువ చేస్తాయి.

   రెండు దేశాల ప్రజల మధ్య బలమైన పరస్పర సంబంధాలు మన అసాధారణ ద్వైపాక్షిక బంధానికి పునాదులు. ఈ నేపథ్యంలో మేధావులు, విద్యావేత్తలు, పర్యాటకులు, విద్యార్థులు, యువతరం, క్రీడాకారుల ఆదానప్రదానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత విస్తరిస్తాం. రెండు దేశాల్లో గౌరవనీయ సాంస్కృతిక-వారసత్వ ప్రదేశాలకు ప్రజల సందర్శన సహా మా ఆధ్యాత్మిక-సాంస్కృతిక అనుబంధం పెంచుకోవడానికి కృషి చేస్తాం.

   విద్య, నైపుణ్యం, వ్యవస్థాపన, సాంకేతికత, క్రీడలు, సృజనాత్మక-సాంస్కృతిక పరిశ్రమల ద్వారా యువత ప్రగతిని ప్రోత్సహించే రంగాల్లో మా భాగస్వామ్యాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను మేం గుర్తించాం. ఆ మేరకు మెరుగైన భవిష్యత్తు దిశగా మన యువతరం కలలు-ఆకాంక్షలకు తగినట్లు భారత్-భూటాన్ భాగస్వామ్యం స్పందిస్తుంది.

   భారత్ వేగవంతమైన సామాజిక-ఆర్థిక ప్రగతి, సాంకేతిక పురోగమనాల ద్వారా తన చరిత్రలో నేడు ఓ కొత్త అధ్యాయంలో అడుగుపెట్టింది. ఇక ఈ అమృత కాలంలో 2047 నాటికి ‘వికసిత భారత్’ స్వప్న సాకారం దిశగా పయనంలో వేగం అందుకోనుంది. ఈ నేపథ్యంలో 2034 నాటికి అధికాదాయ దేశంగా ఆవిర్భవించాలన్న దృక్పథంతో భూటాన్ కూడా ఆర్థికవృద్ధి సాధన దిశగా ముందంజ వేస్తోంది. మొత్తంమీద ప్రగతి, శ్రేయస్సు దిశగా ఉమ్మడి కృషిలో భారత్-భూటాన్‌లు అత్యంత సన్నిహిత మిత్రులుగానే కాకుండా విశ్వసనీయ భాగస్వాములుగానూ కొనసాగుతాయి.

***



(Release ID: 2016333) Visitor Counter : 84