ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా డిజిటల్‌ వ్యాప్తి కోసం రేపు 'యూఏ' దినోత్సవంలో భాషానెట్ పోర్టల్‌ ఆవిష్కరించనున్న నిక్సి, మైటీ

Posted On: 20 MAR 2024 3:26PM by PIB Hyderabad

'నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా' (నిక్సి), 21 మార్చి 2024న జరగనున్న 'సార్వత్రిక సమ్మతి' (యూఏ) దినోత్సవంలో భాగంగా భాషానెట్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. దిల్లీలోని డా.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిక్సి, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత (మైటీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండో కార్యక్రమం ఇది. యూఏని ప్రోత్సహించడానికి, దేశవ్యాప్తంగా డిజిటల్ వ్యాప్తిని విస్తృతం చేయడానికి ఈ రెండింటి వారి ఉమ్మడి నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనం. 'ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్' (ఐకాన్‌) కూడా 'యూఏ' దినోత్సవానికి మద్దతు ఇస్తోంది.

ఈ కార్యక్రమం నేపథ్యాంశం ”భాషానెట్: సార్వత్రిక సమ్మతి దిశగా ప్రేరణ”. భాష, లిపితో సంబంధం లేకుండా ప్రజలంతా డిజిటల్ ప్రపంచంలో భాగస్వాములు కాగలరని నిరూపించేందుకు నిక్సి చేస్తున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం దర్పణంగా నిలుస్తుంది.

'యూఏ' దినోత్సవం ద్వారా ప్రజలను ప్రేరేపించడం, నేటి డిజిటల్ యుగంలో 'యూఏ' సంసిద్ధత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం నిక్సి, మైటీ లక్ష్యం. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖల ప్రసంగాలు, చర్చలు, సాంకేతిక కార్యశాలలు సహా కీలక అంశాలు ఉంటాయి. 'యూఏ' ప్రాముఖ్యత, విస్తృత వినియోగాన్ని సాధించడానికి అవసరమైన చర్యలపై ఈ కార్యక్రమాల్లో దృష్టి పెడతారు.

మైటీ కార్యదర్శి శ్రీ ఎస్‌ కృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సంయుక్త కార్యదర్శి శ్రీ శుశీల్ పాల్ కూడా పాల్గొంటారు. డిజిటల్ వ్యాప్తి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును వీరి రాక స్పష్టం చేస్తుంది.

నిక్సి సీఈవో డా.దేవేష్ త్యాగి ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “డిజిటల్ వ్యాప్తి వైపు సాగుతున్న ప్రయాణంలో సార్వత్రిక సమ్మతి కీలకమైన అంశం. 'యూఏ' దినోత్సవం ద్వారా, భాషాపరమైన అంతరాలు తగ్గించడానికి, డిజిటల్ రంగంలో ప్రతి స్వరం వినిపించేలా మా నిబద్ధతను చాటుతాం". అని చెప్పారు.

ఈ కార్యక్రమం గురించి, అందులో పాల్గొనడం గురించి మరింత సమాచారం కోసం https://uaday.in/ లింక్‌ను చూడండి.

నిక్సి గురించి:

మైటీ ఆధ్వర్యంలో పని చేసే 'నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా' ఒక లాభాపేక్ష రహిత సంస్థ. దీనిని 19 జూన్ 2003న ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ వ్యవస్థను ప్రజలు వినియోగించేందుకు వీలుగా, వివిధ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తిని & స్వీకరణను పెంచే కార్యక్రమాలు చేపడుతుంది.

 

***


(Release ID: 2015808) Visitor Counter : 180