సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియను సమగ్రంగా మరింత సులభతరం చేసేందుకు వీలుగా సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ నిబంధనలు 2024 ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.


చిత్ర పరిశ్రమకు సంబంధించి మరింత మెరుగైన పారదర్శక, సమర్ద ,సులభతర వ్యాపారానికి వీలుగా ఆన్ లైన్ సర్టిఫికేషన్ ప్రక్రియ కింద అన్నిరకాల విచక్షణాధికారాలను తొలగించి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సినిమాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రదర్శించేందుకు ఇది వీలు కలిగిస్తుంది.

ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాసెసింగ్ కాలాన్ని తగ్గించడం, పూర్తిగా డిజిటల్ పక్రియ కింద అన్ని లావాదేవీల సమయాన్ని తొలగించడం దీని ఉద్దేశం.

దివ్యాంగులుసైతం చిత్రాలు వీక్షించేందుకు వీలుగా సర్టిఫికేషన్ లో యాక్ససబిలిటీ ఫీచర్ ఏర్పాటు. సిబిఎఫ్.సి బోర్డు, సి.బి. ఎఫ్.సి అడ్వయిజరీ ప్యానళ్లలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం.‌‌‌‌‌‌‌‌‌‌

Posted On: 15 MAR 2024 4:28PM by PIB Hyderabad


సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం 2023 ప్రకారం, భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వశాఖ సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్ ) నిబంధనలు 2024 ను విడుదలచేసింది. సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్ ) నిబంధనలు 1983 స్థానంలో వీటిని తీసుకు వచ్చారు. చిత్రాల బహిరంగ ప్రదర్శనకు, ఫిల్మ్ సర్టిఫికేషన్ కు సంబంధించి సినిమాటోగ్రాఫిక్ సర్టిఫికేషన్ నిబంధనలను విడుదల చేశారు. ఇవి ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియ మొత్తాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చడమే కాక,  ఈసర్టిఫికేషన్ ప్రక్రియను మరింత మెరుగు పరుస్తాయి.

నేపథ్యం:

 భారత చలన చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత భారీ పరిశ్రమలలో ఒకటి. ఏటా భారత చలనచిత్ర పరిశ్రమ సుమారు 40 భాషలలో సగటున 3,000 సినిమాలను రూపొందిస్తుంది. ఇండియా ప్రపంచ కంటెంట్ హబ్ గా రూపొందడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని ప్రధానమంత్రి ఇప్పటికే  ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ అద్భుతమైన వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం ఉన్నాయని, ఇవి భారత్ బలమని ప్రధానమంత్రి చెబుతూవచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి , ప్రధానమంత్రి గారి దార్శనికతను మరింత ముందుకు తీసుకుపోతున్నారు. భారత సంస్కృతి, సమాజం, అంతర్జాతీయ విలువలను మరింత ముందుకు తీసుకుపోవడానికి సినిమా ఒక బలమైన సాధనంగా ఉంటూ వస్తోంది. పారదర్శకత, సులభతర వ్యాపారానికి వీలుకల్పించడం, పైరసీ   నుంచి రక్షణ వంటివి భారతదేశంలోచిత్ర పరిశ్రమ కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇది ఆర్టిస్టుల ప్రయోజనాలను,చిత్రపరిశ్రమ రంగంలో పనిచేస్తున్న వివిధ రంగాల వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉపకరిస్తుంది. ఈ దార్శనితతోనే 40 సంవత్సరాల తర్వాత 2023లో సినిమాటోగ్రఫిక్ చట్టానికి చరిత్రాత్మక సవరణలు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం2024లో పూర్తి ప్రక్షాళనతో సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్ )2024 నిబంధనలు తీసుకువచ్చారు. సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్)   రూల్స్ 2024 , సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ నిబంధనలు ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియను క్రమబద్దీకరించడంతో పాటు ఆధునీకరించ నున్నాయి. ప్రత్యేకించి డిజిటల్ యుగం, మారుతున్న సాంకేతికత, చలనచిత్రరంగంలో వస్తున్న ఆధునిక పోకడలను దృష్టిలో ఉంచుకుని వీటిని తీసుకువచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, సి.బి.ఎస్.సి ఇందుకు సంబంధించి చలన చిత్రనిర్మాతలు, సినిమా యజమానులు, దివ్యాంగుల  హక్కుల సంస్థలు, ఎన్జిఓలు, చలనచిత్ర పరిశ్రమ బోర్డులు, సాధారణ ప్రజలు, సినిమా పరిశ్రమతో సంబంధం కలిగిన వారు ఇతర స్టేక్ హోల్డర్లతో విస్తృత సమావేశాలు నిర్వహించి అందరికీ అనుగుణమైన రీతిలో , ప్రధానమంత్రిగారి నినాదమైన     సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కావిశ్వాస్, సబ్ కా ప్రయాస్కు అనుగుణంగా వీటినిరూపొందించిడం జరిగింది. సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ నిబంధనలు 2024లోచేపట్టిన కీలక మార్పులు కిందివిధంగా ఉన్నాయి. ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రక్రియకు అనుగుణంగా సినిమాటోగ్రఫి నిబంధనలను పూర్తిగా సవరించడం జరిగింది. ఇది పారదర్శకతకు, సామర్ధ్యానికి, చలనచిత్ర పరిశ్రమ సులభతర వ్యాపారానికి వీలు కల్పిస్తుంది. ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ కు సంబంధించి పట్టే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. పూర్తిగా డిజిటల్ విధానాన్ని అనుసరించడం వల్ల లావాదేవీలకు సంబంధించి జాప్యాన్ని నివారించడానికి వీలు కలుగుతుంది. సినిమాల,. ఫీచర్ ఫిల్మ్ ల సర్టిఫికేషన్ ఇచ్చేటపుడు,  ఇవి దివ్యాంగులకు ఏమేరకు అందుబాటులో ఉన్నాయన్న అంశాన్ని కూడా పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేస్తారు.

వయసుల వారీగా సర్టిఫికేషన్ :
ప్రస్తుతం ఉన్న యుఎ కేటగిరీని మూడు వయసుల వారీగా విభజించడం జరిగింది. అవి ఏడు సంవత్సరాలు (యు.ఎ7 ప్లస్), పదమూడుసంవత్సరాలు (యుఎ 13 ప్లస్)    పదహారుసంవత్సరాలు (యు.ఎ 16 ప్లస్,) ఈ వయసు ఆధారిత కేటగిరీలు కేవలం సూచనప్రాయమైనవి. ఇవి తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులకు అవగాహన కోసం తెచ్చినవి. ఆయా చిత్రాలు పిల్లలు చూడవచ్చా లేదా అన్నది అవగాహన చేసుకోవడం కోసం ఇవి ఉపకరిస్తాయి. వయసు ఆధారితంగా సినిమాల వర్గీకరణ వల్ల యుఎ చిత్రాల తయారీదారులు ఆయా వయసుల వారికి తగినట్టు చిత్రాలు రూపొందించడానికి వీలు కలుగుతుంది. పిల్లలు వారి స్థాయికి తగని వాటిని చూడకుండా ఇది ఉపకరిస్తుంది. అలాగే భావప్రకటనా స్వేచ్ఛ, వినియోగదారుల ఎంపిక వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. సిబిఎఫ్.సి బోర్డులు, సి.బి.ఎఫ్.సి.అడ్వయిజరీ ప్యానళ్లలో మరింత మంది మహిళలకు అవకాశం కల్పిస్తారు. మూడింట రెండు వంతులమంది మహిళలు ఈ బోర్డులలో  ఉండాలి. సాధారణంగా సగం మంది మహిళలు ఉండేలా చూడాలి. పారదర్శకతకు మరింత వీలు కల్పిస్తూ సినిమాల ప్రాధాన్యతా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల విచక్షణాధికారాలను తొలగిస్తారు. ఏదైనా అత్యవసరమనుకుంటే  సర్టిఫికేషన్ కోసం ప్రాధాన్యతా ప్రాతిపదికన చిత్ర ప్రదర్శనకు కూడా వీలు కల్పిస్తారు.

 సర్టిఫికేట్ గడువు:

 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫికేట్ గడువు కేవలం పది సంవత్సరాలు అనే నిబంధనను తొలగించారు.
చలన చిత్రం కేటగిరీని టెలివిజన్ కోసం మార్పు :
టెలివిజన్ ద్వారా ప్రసారం కోసం రీ ఎడిట్ చేసిన సినిమాను ఎలాంటి పరిమితులు లేకుండా ప్రజలు వీక్షించే కేటగిరీ కింద ప్రసారానికి అనుమతిస్తారు. సిబిఎఫ్.సి.కి సంబంధించిన ప్రధాన నియమావళిని తొలుత1983లో నోటిఫై చేశారు. ఆ తర్వాత వీటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. అయితే చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పెరుగుతున్న ప్రేక్షకులసంఖ్య, గత 40 సంవత్సరాలలో మారిన కంటెంట్ పంపిణీ విధానాలు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత నిబంధనలలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తూ, వీటిని చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉండేట్టు మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం గత ఏడాదిన సినిమాటోగ్రఫీ చట్టం 1952ను సవరించింది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ సవరణ జరిగింది. ఫిల్మ్ సర్టిఫికేషన్కు  సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి ఈ సవరణలు తీసుకువచ్చారు.
నూతనసినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నిబంధనలు 2024, చలనచిత్ర సర్టిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఇవి ప్రస్తుత కాలానికి తగినట్టు ఉన్నాయి. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు ఫిల్మ్ సర్టిఫికేషన్లో మరింత పారదర్శకత, సమర్ధత తీసుకువస్తాయి. అలాగే భారత చలనచిత్ర పరిశ్రమ మరింత పురోగమించడానికి ,వృద్ధిలోకి రావడానికి ఈ నిబంధనలు ఉపకరిస్తాయి.

****

 


(Release ID: 2015732) Visitor Counter : 106