ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చత్తీస్ గఢ్ లో మహతారి వందన్ యోజన ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ


మహతారి వందన్ యోజన తొలి వాయిదా చెల్లింపు

చత్తీస్ గఢ్ లో అర్హులైన వివాహిత మహిళలకు నెలకు రూ.1000 డిబిటి విధానంలో చెల్లించే పథకం

Posted On: 10 MAR 2024 2:55PM by PIB Hyderabad

‘‘మా ప్రభుత్వం ప్రతీ ఒక్క కుటుంబ సమగ్ర సంక్షేమానికి కట్టుబడి ఉంది. మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవంతోనే ఇది ప్రారంభమవుతుంది’’
చత్తీస్ గఢ్ లోని మహిళల సాధికారతకు పెద్ద ఉత్తేజంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహతారి వందన యోజన పథకాన్ని ప్రారంభించి ఈ పథకం కింద తొలి వాయిదాను బట్వాడా చేశారు. చత్తీస్ గఢ్ లో అర్హులైన వివాహిత మహిళలకు నెలవారీగా డిబిటి విధానంలో రూ.1000 ఈ పథకం ద్వారా చెల్లిస్తారు. మహిళల ఆర్థిక సాధికారత ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించడం తద్వారా లింగ సమానత్వం తీసుకురావడం, కుటుంబంలో మహిళల నిర్ణయాత్మక పాత్రను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 

2024 జనవరి 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు పైబడిన రాష్ర్టంలోని అర్హులైన వివాహిత మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, కుటుంబ సభ్యులు వదిలివేసిన మహిళలు అందరూ దీనికి అర్హులే. ఈ పథకం ద్వారా 70 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని అంచనా.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ముందు మా దంతేశ్వరి, మా బంబ్లేశ్వరి, మా మహామాయలకు ప్రధానమంత్రి శిరసు వంచి అభివాదం చేశారు. తాను ఇటీవల రాష్ర్టాన్ని సందర్శించి, రూ.35,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. మహతారి వందన యోజన కింద తొలి వాయిదాగా రూ.655 కోట్లు బట్వాడా చేయడం ద్వారా  ప్రభుత్వం తన హామీని నెరవేర్చుకుందని ఆయన అన్నారు. విభిన్న ప్రాంతాలకు చెందిన నారీశక్తి ఈ కార్యక్రమంతో అనుసంధానం కావడం పట్ల ధన్యవాదాలు తెలుపుతూ వారందరినీ కలవడానికి ప్రత్యక్షంగా రాలేకపోయినందుకు క్షమించాలని కోరారు. గత రాత్రి కాశీ విశ్వనాథ్  ధామ్ లో దేశ పౌరులందరి సంక్షేమం కోసం ప్రార్థనలు చేశానని ఆయన తెలిపారు. ‘‘మీరందరూ ప్రతీ నెలా రూ.1000 అందుకుంటారు. ఇది మోదీ గ్యారంటీ’’ అని ఆయన అన్నారు. 

తల్లులు, కుమార్తెల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలుపుతూ ‘‘తల్లులు, కుమార్తెలు బలంగా ఉన్నప్పుడే కుటుంబం బలంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మహిళలు తమ పేరు మీదనే పక్కా ఇళ్లు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారని చెప్పారు. జన్ ధన్ ఖాతాల్లో 50 శాతం మహిళల పేర్ల మీదనే ఉన్నాయి. అలాగే ముద్రా రుణాల్లో 65 శాతం మహిళలే ఉపయోగించుకున్నారు. 10 కోట్లకు పైగా ఎస్ హెచ్ జి మహిళలు లబ్ధి పొందారు, కోటి మందికి పైగా మహిళలు లక్షాధికారి దీదీలుగా మారారు. మొత్తం 3 కోట్ల మంది లక్షాధికారి దీదీలను తయారుచేయడం తమ లక్ష్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నమో దీదీ కార్యక్రమం జీవితాల్లో పరివర్తన తెస్తున్నదంటూ ఈ అంశంపై పెద్ద కార్యక్రమంలో రేపు తాను పాల్గొనబోతున్నానని ఆయన చెప్పారు.  

కుటుంబ సంక్షేమ ప్రాధాన్యతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ మహిళల సంక్షేమం ద్వారానే ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందని అన్నారు. ‘‘మహిళల సమగ్ర సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవంతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెప్పారు. బాలింత, శిశుమరణాల రేటు సహా  గర్భిణీ మహిళలు ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. 

ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి గర్భిణీ మహిళలకు ఉచిత వ్యాక్సినేషన్, గర్భిణీగా ఉన్న సమయంలో రూ.5,000 ఆర్థిక సహాయం సహా పలు కీలక చర్యలను ప్రధానమంత్రి ప్రకటించారు. ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి పని చేసే ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ సిబ్బందికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్యసంరక్షణ  సేవలందించడం గురించి తెలియచేశారు. 

సరైన పారిశుధ్య వసతులు లేని కారణంగా గత కాలంలో మహిళలు ఎదుర్కొన్న కష్టాల గురించ ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ ‘‘ఇళ్లలో మరుగుదొడ్లు లేని కారణంగా మన సోదరీమణులు, కుమార్తెలు ఆత్మగౌరవం దెబ్బ తిని, ఆవేదనాపూరితమైన బాధ అనుభవించిన రోజులు పోయాయి’’ అన్నారు. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి వసతి కల్పించడం ద్వారా మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రముఖంగా వివరించారు.  

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉన్నదంటూ ‘‘ప్రభుత్వం తన హామీలకు కట్టుబడి ఉంది, వాటిని అందించేందుకు హామీ ఇస్తోంది’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. చత్తీస్ గఢ్ రాష్ర్ట ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ మహతారి వందన యోజన ప్రారంభించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే సంపూర్ణ కట్టుబాటుతో 18 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం పనులు కూడా చేపట్టినట్టు తెలిపారు.

వ్యవసాయ సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ రైతులకు చెల్లించవలసిన బోనస్ లన్నీ సకాలంలో చెల్లిస్తామని, చత్తీస్ గఢ్ వరి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతామని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. అటల్  జీ జయంతి సందర్భంగా రైతులకు చెల్లించాల్సిన రూ.3,700 కోట్ల విలువ గల బోనస్ చెల్లింపు సహా వారి మద్దతుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడారు.

ప్రభుత్వ సేకరణ గురించి మాట్లాడుతూ ‘‘మా ప్రభుత్వం చత్తీస్  గఢ్ లో క్వింటాలు ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర చెల్లిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. ప్రభుత్వం 145 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం ద్వారా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంతో పాటు కొత్త మైలురాయిని నమోదు చేసిందని చెప్పారు.

మహిళలు సహా భాగస్వామ్య వర్గాలందరి సమన్వయపూర్వకమైన కృషితో సమ్మిళిత వృద్ధి సాధించగమని తన ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి విశ్వాసం ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం అంకిత, సేవా భావంతో పని చేస్తుందని, హామీలు నెరవేర్చుతూ అందరి పురోగతికి కృషి  చేస్తుందని ఆయన చత్తీస్ గఢ్ ప్రజలకు హామీ ఇచ్చారు. 

చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

***
 


(Release ID: 2014316) Visitor Counter : 114