ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి 11 ఢిల్లీలో సశక్త్ నారీ - వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి


నమో డ్రోన్ దీదీస్ ద్వారా వ్యవసాయ డ్రోన్ ల ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని

1,000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్లను కూడా అందజేయనున్న ప్రధాని

స్వయం సహాయక బృందాలకు రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాలు, రూ.2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సపోర్ట్ ఫండ్ ను పంపిణీ చేయనున్న ప్రధాని

లఖ్పతి దీదీలను సన్మానించనున్న ప్రధాని

Posted On: 10 MAR 2024 11:14AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో నమో డ్రోన్ దీదీస్ నిర్వహించే వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను వీక్షించనున్నారు. దేశవ్యాప్తంగా 11 వేర్వేరు ప్రాంతాలకు చెందిన నమో డ్రోన్ దీదీలు కూడా ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1,000 మంది నమో డ్రోన్ దీదీలకు ప్రధాని డ్రోన్లను అందజేయనున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంపొందించాలన్న ప్రధాని దార్శనికతలో నమో డ్రోన్ దీదీ, లఖ్పతి దీదీ కార్యక్రమాలు అంతర్భాగం. ఈ దార్శనికతకు అనుగుణంగా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించిన, ఇతర స్వయం సహాయక బృంద సభ్యులకు వారి అభ్యున్నతి కోసం మద్దతు, ప్రేరణ ఇస్తున్న లఖ్పతి దీదీలను ప్రధాన మంత్రి సన్మానించనున్నారు . 
ప్రతి జిల్లాలో బ్యాంకులు ఏర్పాటు చేసిన బ్యాంక్ లింకేజీ క్యాంపుల ద్వారా స్వయం సహాయక బృందాలకు సబ్సిడీపై రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాలను ప్రధాని పంపిణీ చేయనున్నారు. స్వయం సహాయక బృందాలకు సుమారు రూ.2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సపోర్ట్ ఫండ్ ను కూడా ప్రధాని పంపిణీ చేయనున్నారు.

****


(Release ID: 2013393) Visitor Counter : 108