ప్రధాన మంత్రి కార్యాలయం
ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న "ఖేలో ఇండియా" విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలనుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
“క్రీడల చిహ్నం 'అష్టలక్ష్మి' ఈశాన్య ప్రాంత ఆకాంక్షలు ఎలా కొత్త రెక్కలు తొడుగుతున్నాయో తెలియచెప్పే ప్రతీక”
“ఖేలో ఇండియా క్రీడా కార్యక్రమాలు ఉత్తరం నుండి దక్షిణం వరకు, అలాగే, పశ్చిమం నుండి తూర్పు వరకు, భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ నిర్వహించబడుతున్నాయి”
“విద్యాపరమైన విజయాలు జరుపుకున్నట్లే క్రీడల్లో రాణించే వారిని కూడా గౌరవించే సంప్రదాయాన్ని మనం పెంపొందించాలి. అలా చేయడాన్ని మనం ఈశాన్య ప్రాంతం నుంచి నేర్చుకోవాలి”
“ఖేలో ఇండియా లేదా టాప్స్ వంటి ఇతర కార్యక్రమాలు, మన యువతరానికి కొత్త అవకాశాల పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయి”
“ఒక శాస్త్రీయ విధానంలో సహాయాన్ని అందిస్తే మన అథ్లెట్లు ఏదైనా సాధించగలరు”
Posted On:
19 FEB 2024 7:42PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాల చిహ్నం సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న 'అష్టలక్ష్మి' లా ఉందని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను తరచూ 'అష్టలక్ష్మి' గా సంబోధించే ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ క్రీడోత్సవాలకు చిహ్నంగా సీతాకోకచిలుకను రూపొందించడం ఈశాన్య ప్రాంత ఆకాంక్షలు ఎలా కొత్త రెక్కలు తొడుగుతున్నాయో తెలియచెప్పే ప్రతీకగా నిలిచింది.” అని అభివర్ణించారు.
అథ్లెట్లకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌహతిలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' అనే ఒక గొప్ప భావాన్ని రూపొందించినందుకు ప్రధానమంత్రి వారిని అభినందించారు. "మనస్పూర్తిగా ఆడండి, నిర్భయంగా ఆడండి, మీ కోసం, మీ జట్టు కోసం గెలవండి. అయితే, మీరు ఓడిపోయినా, కలత చెందవద్దు. ప్రతి ఓటమి, నేర్చుకోవడానికి ఒక అవకాశం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
లడఖ్ లో శీతాకాల క్రీడోత్సవాలు, తమిళనాడులో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు, డయ్యులో బీచ్ గేమ్స్, ఈశాన్య భారతంలో కొనసాగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, “ఉత్తరం నుండి దక్షిణం వరకు, అదేవిధంగా, పశ్చిమం నుండి తూర్పు వరకు భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలను చూసి నేను సంతోషిస్తున్నాను.” అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్రీడలను ప్రోత్సహించడంలో, యువతకు తమ ప్రతిభ ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించడంలో అసోం ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
గతంలో, తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనడానికి ఇష్టపడేవారు కాదనీ, దాని వల్ల వారు విద్యకు దూరమవుతారని భయపడేవారనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, ప్రస్తుతం, క్రీడల పట్ల మారుతున్న సమాజ అవగాహనతో పాటు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావడాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో ప్రస్తుతం తమ పిల్లలు సాధించిన విజయాలపై తల్లిదండ్రులు గర్వపడుతున్న మనస్తత్వాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
క్రీడాకారుల విజయాలను పంచుకుని, గౌరవించాల్సిన ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి మోదీ నొక్కి చెబుతూ, “విద్యా పరమైన విజయాలను పంచుకున్నట్లే, క్రీడల్లో రాణించే వారిని గౌరవించే సంప్రదాయాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి.” అని సూచించారు. ఫుట్ బాల్ నుండి అథ్లెటిక్స్ వరకు, బ్యాడ్మింటన్ నుండి బాక్సింగ్ వరకు, వెయిట్ లిఫ్టింగ్ నుండి చెస్ వరకు అథ్లెట్లకు స్ఫూర్తి నిచ్చే విధంగా క్రీడలను ఉత్సాహంగా జరుపుకునే ఈశాన్య ప్రాంత గొప్ప క్రీడా సంస్కృతి నుండి నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు తాము విలువైన అనుభవాలను పొందడంతో పాటు, దేశ వ్యాప్తంగా క్రీడా సంస్కృతి అభివృద్దికి దోహదపడతారని ప్రధానమంత్రి మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
యువతకు అవకాశాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పర్యావరణ వ్యవస్థ గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, “ఖేలో ఇండియా లేదా టాప్స్ వంటి ఇతర కార్యక్రమాలు, మన యువతరానికి కొత్త అవకాశాల పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. శిక్షణ సదుపాయాల నుంచి ఉపకార వేతనాల వరకు అథ్లెట్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, క్రీడలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రపంచ స్థాయి క్రీడోత్సవాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రధానమంత్రి మోదీ సగర్వంగా పంచుకున్నారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలతో సహా వివిధ టోర్నమెంట్లలో భారత అథ్లెట్లు అపూర్వమైన విజయాలను దక్కించుకోవడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై పోటీ చేయగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రధానమంత్రి కొనియాడుతూ, 2019 లో కేవలం 4 పతకాలు గెలుచుకోగా, 2023 లో మొత్తం 26 పతకాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా, ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ఇది కేవలం పతకాల సంఖ్యలు మాత్రమే కాదు, శాస్త్రీయ విధానంతో ప్రోత్సాహాన్ని అందిస్తే మన అథ్లెట్లు ఏమి సాధించగలరో అనే దానికి ఇవి రుజువులు” అని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
క్రీడల ద్వారా నెలకొల్పిన విలువల గురించి ప్రధానమంత్రి పేర్కొంటూ, “క్రీడలలో విజయానికి కేవలం ప్రతిభ కంటే స్వభావం, నాయకత్వం, జట్టుకృషి, స్థితిస్థాపకత ఎక్కువ అవసరం.” అని ఉద్ఘాటించారు. “ఆటలాడేవారు అన్ని రంగాల్లో రాణిస్తారు.” అని ప్రధానమంత్రి పేర్కొంటూ, శారీరక దృఢత్వం కోసమే కాకుండా అవసరమైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం కూడా యువత క్రీడల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు.
క్రీడా రంగానికి మించి ఈశాన్య ప్రాంత అందాలను అన్వేషించాలని ప్రధానమంత్రి మోదీ అథ్లెట్లను కోరారు. ఈ పోటీలు ముగిసాక తమ సాహసాలు, అనుభవాలు, జ్ఞాపకాలు సంగ్రహించి, #NorthEastMemories అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి సామాజిక మాధ్యమం ద్వారా పంచుకోవాలని ప్రధానమంత్రి క్రీడాకారులను ప్రోత్సహించారు. వీటితో పాటు, వారు తరచు కలుసుకునే స్థానిక సమాజాలతో మమేకమై, తమ సాంస్కృతిక అనుభవాలను మెరుగుపరచుకోవడానికి వీలుగా కొన్ని స్థానిక పదబంధాలను నేర్చుకోవాలని కూడా నరేంద్ర మోదీ సూచించారు. భాషిణి యాప్ ను కూడా వినియోగించాలని ప్రధానమంత్రి మోదీ క్రీడాకారులను కోరారు.
***
(Release ID: 2007537)
Visitor Counter : 123
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam