ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చ‌ర్చ‌కు లోక్‌సభలో ప్రధానమంత్రి సమాధానం


‘‘రాష్ట్రపతి ప్రసంగం భారత పురోగమన వేగాన్ని.. స్థాయిని సూచిస్తోంది’’;

‘‘భారత ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు ఆందోళన కారకాలు’’;

‘‘మా ప్రభుత్వం మూడోదఫాలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద
ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ హామీ ఇస్తున్నాడు’’;

‘‘తొలిదఫాలో మేము గత ప్రభుత్వ కాలపు లోటుపాట్లను పూడ్చాం.. మలిదఫాలో నవ భారతానికి పునాది వేశాం.. మూడోదఫాలో వికసిత భారత్ ప్రగతిని పరుగు పెట్టిస్తాం’’;

‘‘ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. తూర్పు నుంచి పడమర దాకా
స్తంభించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావడం ప్రజలు చూశారు’’;

‘‘అయోధ్యలోని రామ మందిరం సుసంపన్న భారతీయ
సంస్కృతి-సంప్రదాయాలకు శక్తిప్రదాతగా నిలుస్తుంది’’;

‘‘మా ప్రభుత్వం మూడోదఫాలో వెయ్యేళ్లు వర్ధిల్లే భారతావనికి పునాదులు వేస్తుంది’’;

‘‘భరతమాత పుత్రికలకు తలుపులు మూసే రంగమేదీ నేడు దేశంలో లేదు’’;

‘‘భరతమాత సహా 140 కోట్లమంది పౌరుల ప్రగతి కోసం మీ మద్దతు కోరుతున్నాను’’

Posted On: 05 FEB 2024 8:24PM by PIB Hyderabad

   పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్‌స‌భ‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమాధానమిచ్చారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రసంగించేందుకు రాష్ట్రపతి వస్తుండగా, ఆమెతోపాటు వెంట వచ్చిన సభ్యులందరికీ సగర్వంగా, సగౌరవంగా మార్గదర్శనం చేసిన సెంగోల్ గురించి ప్రధాని తన ప్రసంగంలో ముందుగా ప్రస్తావించారు. ఈ వారసత్వం సభ గౌరవాన్ని ఎంతగానో ఇనుమడింపజేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవం, కొత్త పార్లమెంట్ భవనం, సెంగోల్ రాక ఏకకాలంలో సంభవించిన అత్యంత ప్రభావశీల సంఘటనలని ప్రధాని మోదీ అభివర్ణించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ సందర్భంగా తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెలిబుచ్చిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

   రాష్ట్రపతి ప్రసంగం వాస్తవాల ఆధారంగా రూపొందించిన భారీ పత్రమని, ఇది భారత పురోగమన వేగాన్ని, స్థాయిని సూచిస్తున్నదని ప్రధాని నొక్కిచెప్పారు. అలాగే నారీ శక్తి, యువశక్తి, పేదలు, అన్నదాతలనే నాలుగు స్తంభాల ప్రగతి, బలోపేతం ద్వారానే దేశం వేగంగా అభివృద్ధి చెందగలదనే వాస్తవాన్ని ఈ ప్రసంగం స్పష్టం చేసిందన్నారు. ఈ నాలుగు స్తంభాల బలోపేతం ద్వారా దేశం వికసిత భారత్‌గా మారడంలో అనుసరించాల్సిన మార్గాన్ని ఈ ప్రసంగం నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.

   దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. అయితే వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి ఆందోళన కారకాలుగా పరిణమించాయని విచారం వ్యక్తం చేశారు. అనువంశిక రాజకీయాలకు అర్థం వివరిస్తూ- ఒక కుటుంబం నడిపించే రాజకీయ పార్టీ ముందుగా తన సభ్యులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే ఆ కుటుంబ సభ్యులే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో, సొంత బలంతో పార్టీకి వెన్నుదన్నుగా ముందుకు సాగే అనేకమంది సభ్యులకన్నా, వంశపారంపర్య రాజకీయానికే పరిగణన ఉంటుందని ప్రధాని మోదీ వివరించారు. అయితే, ‘‘దేశానికి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన యువకులందరినీ నేను స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ఎంతో ముప్పు వాటిల్లగలదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒకరకమైన దుష్ట సంస్కృతి ఆవిర్భవించడంపై విచారం వ్యక్తం చేస్తూ- దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఒక వ్యక్తికి పరిమితం కాదని, ప్రతి పౌరునికీ సంబంధించినవని ప్రధాని స్పష్టం చేశారు.

   నేడు యావత్ ప్రపంచం ప్రశంసిస్తున్న భారత బలమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ‘‘ప్రస్తుత ప్రభుత్వ మూడో దఫాలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని మోదీ హామీ ఇస్తున్నాడు’’ అని ధీమాగా ప్రకటించారు. జి-20 శిఖరాగ్ర సదస్సు విజయం ఆధారంగా భారతదేశంపై ప్రపంచ దేశాల ఆలోచనలు, దృక్పథాలను అంచనా వేయవచ్చునని ఆయన అన్నారు. దేశాన్ని సౌభాగ్య పథాన నడపడంలో ప్రభుత్వ పాత్రను నొక్కిచెబుతూ- లోగడ 2014లో ఆనాటి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్, అప్పటి ఆర్థిక మంత్రి ప్రకటనలను ప్రధాని మోదీ ఉటంకించారు. అప్పట్లో ‘జిడిపి’ పరిమాణపరంగా భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని ప్రకటించగా, నేడు 5వ స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. అలాగే రాబోయే 3 దశాబ్దాలలో అమెరికా, చైనాల తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆనాటి ఆర్థికశాఖ మంత్రి ప్రకటించినట్లు కూడా తెలిపారు. కానీ, ‘‘ఇప్పుడు... ప్రస్తుత ప్రభుత్వ మూడోదఫాలోనే భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని నేను దేశానికి హామీ ఇస్తున్నాను’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

   ప్రస్తుత ప్రభుత్వ పని వేగాన్ని, దాని భారీ లక్ష్యాలు-సాహసోపేత నిర్ణయాలను ప్రపంచం మొత్తం గమనిస్తోందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. గ్రామీణ పేదలకు 4 కోట్లు, పట్టణ పేదలకు 80 లక్షల వంతున ప్రస్తుత ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించిందని ఆయన సభకు వెల్లడించారు. అలాగే గత 10 సంవత్సరాల్లో 40,000 కిలోమీటర్ల మేర రైలు మార్గాల విద్యుదీకరణ సాధించిందని, 17 కోట్ల అదనపు గ్యాస్ కనెక్షన్లు జారీచేసిందని, పారిశుద్ధ్య విస్తరణ 40 నుంచి 100 శాతానికి పెరిగిందని వివరించారు. దురదృష్టవశాత్తూ గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంపై అరకొరగా మాత్రమే శ్రద్ధ చూపాయని ప్రధాని విచారం వెలిబుచ్చారు. అంతేకాకుండా నాటి ప్రభుత్వాలు ప్రజలను విశ్వసించలేదని పేర్కొన్నారు. కానీ, నేటి ప్రభుత్వం పౌరుల శక్తిసామర్థ్యాలను పునరుద్ఘాటిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘తొలిదఫాలో మేము గత ప్రభుత్వ కాలపు లోటుపాట్లను పూడ్చాం. మలిదఫాలో నవ భారతానికి పునాది వేశాం... మూడోదఫాలో వికసిత భారత్ ప్రగతిని పరుగులు  పెట్టిస్తాం’’ అని ప్రకటించారు.

   తమ ప్రభుత్వం తొలిదఫాలో అమలు చేసిన పథకాల జాబితాను ప్రధానమంత్రి సభకు వివరించారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో-బేటీ పఢావో, సుగమ్య భారత్, డిజిటల్ ఇండియా, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ల గురించి ప్రస్తావించారు. ఇక రెండో దఫాలో ఆర్టికల్ 370 రద్దు, నారీ శక్తి వందన్ అధినియం, భారతీయ న్యాయ సంహితకు ఆమోదం, 40,000కుపైగా కాలం చెల్లిన చట్టాల రద్దు, వందే భారత్/నమో భారత్ రైళ్ల ప్రారంభం వంటి వినూత్న కార్యక్రమాలకు దేశమే ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర దాకా స్తంభించిన ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తికావడాన్ని ప్రజలు ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. మరోవైపు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కనీస సౌకర్యాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ అంకితభావంతో సత్సంకల్పంతో కృషి చేసిందని ఆయన వివరించారు. రామ మందిర ప్రతిష్ఠాపన గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ- అయోధ్యలోని రామాలయం భారతీయ సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఇది నిరంతరం శక్తినిస్తూనే ఉంటుందన్నారు.

   ప్రస్తుత ప్రభుత్వం మూడో దఫాలో కీలక నిర్ణయాలపై దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘మా ప్రభుత్వం మూడోదఫాలో వెయ్యేళ్లు వర్ధిల్లే భారతావనికి పునాదులు వేస్తుంది’’

అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ- గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారని గుర్తుచేశారు. పేదలకు సరైన వనరులు, ఆత్మగౌరవం కల్పిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమేనని పునరుద్ఘాటించారు. అందుకే 50 కోట్ల మంది పేదలకు సొంత బ్యాంకు ఖాతాలు, 4 కోట్ల మందికి సొంత ఇళ్లు, 11 కోట్ల మందికి కొళాయిల ద్వారా నీటి సరఫరా, 55 కోట్ల మందికి ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయని, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయని శ్రీ మోదీ ఏకరవు పెట్టారు. మరోవైపు ‘పిఎం స్వానిధి’ పథకం కింద వడ్డీరహిత రుణాలు పొందుతున్న వీధి వ్యాపారులను ఆయన గుర్తుచేశారు. అలాగే విశ్వకర్మ యోజన కింద హస్తకళాకారులు, చేతివృత్తులవారు సహాయం పొందుతున్నారని తెలిపారు. పిఎం జన్మన్ యోజన కింద ప్రత్యేకించి, దుర్బల గిరిజన వర్గాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. సరిహద్దులలోని గ్రామాల అభివృద్ధి కోసం ఉజ్వల గ్రామాల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. చిరుధాన్యాల ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించడంతోపాటు స్థానికం కోసం నినాదంతో కుటీర పరిశ్రమలకు చేయూత, ఖాదీ రంగం బలోపేతం వగైరా చర్యలను కూడా వివరించారు.

   శ్రీ కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కార ప్రదానం గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు అంతటి మహనీయుడితో అగౌరవంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. ఆ మేరకు 1970 దశకంలో శ్రీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సాగిన కుటిల ప్రయత్నాలను ఆయన గుర్తుచేశారు.

   దేశంలోని నారీ శ‌క్తి సాధికార‌త‌ దిశగా ప్ర‌భుత్వం చేసిన కృషిని ప్ర‌ధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, ‘‘భరతమాత పుత్రికలకు తలుపులు మూసే రంగమేదీ నేడు దేశంలో లేదు.   వారు యుద్ధ విమానాలను కూడా నడిపిస్తున్నారు... సరిహద్దులను సురక్షితంగా ఉంచుతున్నారు’’ అని ప్రధాని సగర్వంగా ప్రకటించారు. దేశంలో 10 కోట్ల మందికిపైగా సభ్యులున్న, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహిళా స్వయం సహాయ సంఘాల సామర్థ్యాలపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో వీరిలో 3 కోట్ల మంది లక్షాధికారి సోదరీమణులుగా రూపొందడాన్ని దేశం చూడగలదని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఆడపిల్లల పుడితే వేడుక చేసుకునే విధంగా వచ్చిన సానుకూల మార్పుపై హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు జీవన సౌలభ్యం దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.

   రైతు సంక్షేమం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయ వార్షిక బడ్జెట్‌ రూ.25,000 కోట్లు కాగా, ఇప్పుడు రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని ప్రధాని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.2,80,000 కోట్లు, పీఎం పంటల బీమా పథకం కింద రూ.30,000 ప్రీమియంపై 1,50,000 కోట్లు చెల్లించినట్లు గుర్తుచేశారు. మత్స్య/పశుసంవర్ధక వ్యవహారాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, మత్స్యకారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. గాలికుంటు వ్యాధి నివారణ ద్వారా జంతువుల ప్రాణరక్షణ కోసం 50 కోట్ల టీకాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

   యువతరం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా వారికి అపార అవకాశాలు అందివచ్చాయని ప్రధాని తెలిపారు. అదేవిధంగా అంకుర సంస్థల యుగం పరిఢవిల్లడం, యూనికార్న్ సంస్థల సంఖ్యలో పెరుగుదల, డిజిటల్ సృష్టికర్తల ఆవిర్భావం, గిఫ్ట్ ఆర్థిక వ్యవస్థ తదితరాల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత్ ఇవాళ ప్రపంచంలో అగ్రగామి డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పారు. ఇది దేశ యువతకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. మరోవైపు మన దేశంలో మొబైల్ తయారీ రంగం విస్తరణ, చౌక డేటా లభ్యతలను కూడా ఆయన స్పృశించారు. భారత పర్యాటక రంగం, విమానయాన రంగాల్లో వృద్ధిని కూడా ఆయన గుర్తుచేశారు. దేశ యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత కల్పనలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కూడా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.

   దేశంలో 2014కు ముందు గడచిన 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన బడ్జెట్ రూ.12 లక్షల కోట్లుకాగా, గత 10 ఏళ్లలో రూ.44 లక్షల కోట్లకు పెరిగిందని ప్రధాని మోదీ సభకు తెలియజేశారు. సరైన వ్యవస్థలు, ఆర్థిక విధానాల రూపకల్పనతో దేశాన్ని ప్రపంచ పరిశోధన-ఆవిష్కరణల కూడలిగా మార్చడంలో యువతను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంధన రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించారు. హరిత ఉదజని, సెమీకండక్టర్స్ రంగాల్లో పెట్టుబడుల రీత్యా భారత్ ముందంజలో ఉండటాన్ని కూడా ప్రధానమంత్రి స్పృశించారు.

   దేశంలో ధరల పెరుగుదల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- 1974లో ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉండేదని గుర్తుచేశారు. రెండు యుద్ధాలు, కరోనావైరస్ మహమ్మారి విజృంభణ మధ్య దేశంలో ధరల పెరుగుదలను అదుపులో ఉంచడంపై నేటి ప్రభుత్వ ఘనతేనని ఆయన ప్రశంసించారు. ఇక దేశంలో ఇంతకుముందు నానా రకాల కుంభకోణాలపై సభలో చర్చలు సాగడాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గత ప్రభుత్వాల కాలంలో ‘పీఎంఎల్‌ఏ’ కింద కేసుల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని, ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.5,000 కోట్ల నుంచి లక్ష కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇలా జప్తు చేసిన నిధులన్నీ పేదల సంక్షేమం కోసం ఉపయోగించబడ్డాయి’’ అని వెల్లడించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.30 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

   అవినీతిపై తుదిశ్వాస దాకా పోరాడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధానమంత్రి- ‘‘దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించక తప్పదు’’ అని హెచ్చరించారు. దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదన్న భారత్ విధానాన్ని అనుసరించాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని పునరుద్ఘాటించారు. వేర్పాటువాద భావజాలాన్ని ఖండిస్తూ- భారత రక్షణ దళాల శక్తిసామర్థ్యాలపై ఆయన గర్వం, విశ్వాసం వెలిబుచ్చారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాలపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు.

   దేశాభివృద్ధి కృషిలో భుజం కలిపి పనిచేసేందుకు ముందుకు రావాలని ప్రధాని మోదీ సభ్యులను కోరారు. ఈ మేరకు ‘‘భరతమాత సహా 140 కోట్లమంది పౌరుల ప్రగతి కోసం మీ మద్దతు కోరుతున్నాను’’ అని విజ్ఞప్తి చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

 

***

DS/TS



(Release ID: 2002960) Visitor Counter : 62