ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి


రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభించిన ప్రధానమంత్రి

“సుందరమైన నగరం చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు నిర్వహించడం ఆనందకారణం”

“ఖేలో ఇండియా క్రీడలు 2024 కి శుభారంభం”

“ఛాంపియన్లను తయారుచేసిన భూమి తమిళనాడు”

“భారతదేశాన్ని క్రీడల్లో అగ్ర దేశంగా తయారుచేయడంలో మెగా క్రీడోత్సవాల నిర్వహణ కీలకం”

“వీర మంగై వేలు నాచ్చియార్ మహిళా శక్తికి చిహ్నం. నేడు అనేక ప్రభుత్వ నిర్ణయాల్లో ఆమె వ్యక్తిత్వం ప్రతిబింబిస్తోంది”

“గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సంస్కరించింది, అథ్లెట్లు ప్రదర్శించారు, దేశంలో క్రీడా వ్యవస్థ పరివర్తన చెందింది”

“నేడు మనం క్రీడలకు యువత రావాలని వేచి చూడడంలేదు, క్రీడాలనే యువత ముందుకు తీసుకు వెళ్తున్నాం”

“నేడు క్రీడలు, సంబంధిత రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే పాఠశాలలు, కళాశాలలకు చెందిన యువతకు మెరుగైన భవిషత్తు అందించడం కూడా మోదీ గ్యారంటీ”

Posted On: 19 JAN 2024 8:10PM by PIB Hyderabad

తమిళనాడులోని  చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.  అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.  

ఈ సందర్భంగా అక్కడ సమావేశమైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ 13వ ఖేలో ఇండియా క్రీడోత్సవాలకు ప్రతీ ఒక్కరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు. 2024 సంవత్సరానికి ఇది శుభారంభమని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ సమావేశమైన అందరూ ప్రపంచ క్రీడల్లో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు నడుపుతున్న యువభారత ప్రతినిధులని ఆయన పేర్కొన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి చెన్నై వచ్చిన అథ్లెట్లు, క్రీడా  ప్రేమికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  ‘‘మీరందరూ కలిసి ఉమ్మడిగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్  వాస్తవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  తమిళనాడు ప్రజల ఆదరాభిమానాల గురించి ప్రస్తావిస్తూ అద్భుతమైన తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళ వంటకాలు అథ్లెట్లందరికీ సొంత ఇళ్లలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని ఆయన అన్నారు. తమిళనాడు అందించే ఆతిథ్యం అందరి హృద‌యాలను దోచుకుంటుందని, ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు యువతకు తమ నౌపుణ్యాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తాయని ఆయన విశ్వాసం ప్రకటించారు. ‘‘ఇక్కడ ఏర్పడే కొత్త స్నేహాలు జీవితకాలం గుర్తుండిపోతాయి’’ అని ఆయన అన్నారు.  
చెన్నైలో ప్రారంభిస్తున్న, శంకుస్థాపన చేస్తున్న దూరదర్శన్, ఆకాశవాణి ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి  ప్రస్తావిస్తూ 1975లో ప్రారంభమైన చెన్నై కేంద్రం నేడు కొత్త ప్రయాణం ప్రారంభించిందని చెప్పారు. 12 ఆకాశవాణి ఎఫ్ఎం ప్రాజెక్టులు 8 రాష్ర్టాలకు చెందిన 1.5 కోట్ల మంది ప్రజలకు చేరతాయి.   

భారతదేశంలో క్రీడలకు తమిళనాడు అందించిన వాటా గురించి ప్రస్తావిస్తూ ఇది చాంపియన్లను తయారుచేసే భూమి అని ప్రధానమంత్రి చెప్పారు. టెన్నిస్ చాంపియన్లు అమృత్ రాజ్ సోదరుల గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే హాకీ కెప్టెన్  భాస్కరన్ ఒలింపిక్స్  లో భారత్ స్వర్ణ పతకం సాధించేందుకు సహాయపడ్డారని చెప్పారు. చెస్ క్రీడాకారులు విశ్వానాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద; పారాలింపిక్స్ చాంపియన్ మరియప్పన్  వంటి వారందరూ దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చారని చెప్పారు. తమిళ భూమి నుంచి అథ్లెట్లందరూ స్ఫూర్తిని పొందుతారని ప్రధానమంత్రి విశ్వాసం ప్రకటించారు. 

అథ్లెట్లు నిరంతరం వెలుగులో ఉండాల్సిన ప్రాధాన్యతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ అందుకోసం దేశంలో భారీ క్రీడోత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించడంలో ఖేలో ఇండియా అభియాన్  కీలక పాత్ర పోషిస్తున్నదని, వారే నేడు మెగా ఈవెంట్లలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యువజన క్రీడలు, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ వంటివి క్రీడారంగంలో ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశంగా నిలుస్తున్నాయన్నారు. నేడు తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ నగరాలు చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ‘‘భాగస్వాములు కావచ్చు లేదా వీక్షకులు కావచ్చు, అందరినీ చెన్నైకి చెందిన అద్భుతమైన బీచ్ లు ఆకర్షిస్తాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. మదురై, తిరుచ్చిలలోని అద్భుత దేవాలయాలు, వాటిలోని కళాఖండాలే కావచ్చు, పారిశ్రామిక నగరం కోయంబత్తూర్  కావచ్చు తమిళనాడు నగరాలన్నీ మరచిపోలేని అనుభూతిని అందిస్తాయని చెప్పారు. 

ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో దేశంలోని మొత్తం 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అథ్లెట్లు పాల్గొంటున్నారని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో పాల్గొంటున్న 5,000 మందిలో కనిపిస్తున్న పోటీ ఒక కొత్త అనుభవం అందిస్తుంది’’ అన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్,  స్క్వాష్  లను తొలిసారిగా ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చారని, అలాగే తమిళనాడుకు చెందిన ప్రత్యేక మార్షల్  ఆర్ట్  సిలంబం కూడా ఈ క్రీడోత్సవాల్లో ఉన్నదని ప్రధానమంత్రి గుర్తు చేశారు.  ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో పాల్గొంటున్రన వారి సంకల్పం, కట్టుబాటు, విశ్వాసం అన్నింటినీ ఈ క్రీడోత్సవాల ద్వారా జాతి వీక్షించగలుగుతుందని ఆయన అన్నారు. 

తమిళ కవి తిరువళ్లువార్ గురించి గుర్తు చేసుకుంటూ ఆయన రచనల ద్వారా యువతలో స్ఫూర్తిని నింపి వారికి ఒక దిశను చూపారని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దృఢంగా ఉండాలని తిరువళ్లువార్  తన బోధనల్లో చెప్పేవారన్నారు. ఖేలో ఇండియా లోగోలో ఆయన చిత్రం కూడా ఉన్నదని చెప్పారు. ఈ సారి క్రీడోత్సవాల చిహ్నం వీరమంగై వేలు నాచ్చియార్ చిత్రం ముద్రించడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ‘‘నిజ జీవితంలో సాహసానికి మారుపేరుగా కనిపించిన వ్యక్తిని  ఒక చిహ్నానికి వాడుకోవడం అత్యంత అరుదైన విషయం. వీరమంగై వేలు నాచ్చియార్ మహిళా శక్తికి నిదర్శనం. నేడు ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాల్లో ఆమె వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఆమె స్ఫూర్తితో ప్రభుత్వం క్రీడాకారిణులను సాధికారం చేసేందుకు నిరంతరం కృషి చేస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. మహిళా అథ్లెట్ల  శక్తిని ప్రదర్శించేందుకు  వేదికగా ‘‘దాస్  కా దమ్’’ పేరిట 20 క్రీడల్లో నెలకొల్పిన మహిళా లీగ్ ల జాబితాను ఆయన వెల్లడించారు. 

2014  సంవత్సరం తర్వాత క్రీడల్లో భారతదేశ విజయాలను ప్రస్తావిస్తూ టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్  గేమ్స్  లో భారతదేశ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన చూపిందని, ఆసియా క్రీడోత్సవాలు, పారా గేమ్స్  లో చారిత్రక ప్రదర్శనలిచ్చిందని, విశ్వవిద్యాలయ క్రీడల్లో పతకాల్లో కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.  ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదంటూ అథ్లెట్లలో గతంలో కూడా ఇదే ఆకాంక్ష ఉండేదని, గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందించిన మద్దతు ద్వారా అది మరింత ప్రజ్వరిల్లిందని ఆయన చెప్పారు.  ‘‘గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం సంస్కరించింది; అథ్లెట్లు ప్రతిభను ప్రదర్శించారు; దేశంలోని క్రీడా వ్యవస్థ అంతా పరివర్తన చెందింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద వేలాది మంది అథ్లెట్లకు నెలకు రూ.50,000 ఆర్థిక మద్దతు అందిస్తున్నామన్నారు. 2014లో ప్రవేశపెట్టిన టార్గెట్  ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద అత్యున్నత శ్రేణి అథ్లెట్లకు శిక్షణ, అంతర్జాతీయ అవకాశాలు, భారీ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పారిస్  లో జరిగే ఒలింపిక్స్  పైన, 2028లో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్  పైన భారతదేశం కన్నేసిన నేపథ్యంలో టాప్స్  కార్యక్రమం కింద అథ్లెట్లకు వీలైనంత సహాయం అందిస్తాం’’ అని ప్రకటించారు.

‘‘నేడు యువత క్రీడల వైపు రావాలని మేం వేచి చూడడంలేదు, యువతనే క్రీడల వైపు నడిపిస్తున్నాం’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు గ్రామీణ, పేద, గిరిజన, అల్పాదాయ మధ్యతరగతి కుటుంబాల్లోని యువత కలలను సాకారం చేస్తున్నాయని ఆయన చెప్పారు. స్థానికం కోసం నినాదం మంత్రంతో స్థానిక ప్రతిభ ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తున్నామని, అలాగే స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించామన్నారు. డయూలో ఇటీవల జరిగిన బీచ్  గేమ్స్  గురించి ప్రస్తావిస్తూ 1600 మంది అథ్లెట్లు పాల్గొన్న ఆ క్రీడల్లో 8 సాంప్రదాయిక భారత క్రీడలను ప్రదర్శించారని పిఎం శ్రీ మోదీ తెలిపారు. ఇవి బీచ్ గేమ్స్ లో కొత్త శకాన్ని ఆవిష్కరించడంతో పాటు క్రీడా టూరిజంను కూడా ప్రోత్సహిస్తాయి గనుక వీటి ద్వారా కోస్తా నగరాలు అధిక ప్రయోజనం పొందుతాయని ఆయన చెప్పారు. 

భారత యువ అథ్లెట్లకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ కట్టుబాటు గురించి ప్రధానమంత్రి నొక్కి చెబుతూ నేడు భారతదేశం ప్రపంచ క్రీడా వాతావరణంలో కీలక కేంద్రంగా మారిందని చెప్పారు. ‘‘అందుకే 2029లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్  గేమ్స్  నిర్వహణకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. క్రీడలు కేవలం మైదానానికే పరిమితం కావడంలేదని, అవి ఆర్థిక రంగాన్ని కూడా ఉత్తేజితం చేసి యువతకు పలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. దేశాన్ని ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలన్న తన సంకల్పాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆర్థిక రంగంలో క్రీడల వాటా పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదంటూ గత 10 సంవత్సరాల కాలంలో క్రీడా సంబంధిత రంగాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో క్రీడా వృత్తి నిపుణులను ప్రోత్సహించడం కోసం నైపుణ్యాభివృద్ధిపై  దృష్టి సారిస్తున్నామని, దేశంలో క్రీడా పరికరాల తయారీదారులు, సేవల రంగాలను ఉత్తేజితం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. స్పోర్ట్స్  సైన్స్, ఇన్నోవేషన్, తయారీ, స్పోర్ట్స్  కోచింగ్, స్పోర్ట్స్  సైకాలజీ, స్పోర్ట్స్  న్యూట్రిషన్ రంగాల్లో  వృత్తి నిపుణులకు ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం గురించి, ఖేలో ఇండియా కార్యక్రమం కింద 300 ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలు, వెయ్యి ఖేలో ఇండియా సెంటర్లు, 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్  ఏర్పాటు చేయడం గురించి కూడా ఆయన తెలియచేశారు. ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానంలో క్రీడలను ప్రధాన పాఠ్యాంశాల్లో భాగంగా ప్రకటించామని, బాల్య దశ నుంచే క్రీడలను కెరీర్  గా ఎంచుకునే అవకాశం కల్పించామని ప్రధానమంత్రి తెలిపారు.
 
భారతదేశ క్రీడా పరిశ్రమ వృద్ధి రూ.లక్ష కోట్లకు చేరుతుందని అంచనాగా చెబుతూక్రీడల పట్ల పెరుగుతున్న కొత్త చైతన్యం, బ్రాడ్ కాస్టింగ్, క్రీడా వస్తువులు, క్రీడా టూరిజం, క్రీడా దుస్తుల వ్యాపారాలు వంటి అన్ని విభాగాల్లోనూ వృద్ధి అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. క్రీడా ఉత్పత్తుల తయారీ కోసం దేశంలోని విభిన్న ప్రాంతాల్లో క్రీడా క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ఖేలో ఇండియా కింద ఏర్పాటు చేస్తున్న క్రీడా మౌలిక వసతులు భారీ ఉపాధి అవకాశంగా నిలుస్తున్నట్టు తెలిపారు.  అలాగే దేశంలోని పలు క్రీడా లీగ్  లు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి  తెస్తున్నట్టు చెప్పారు. ‘‘నేడు పాఠశాలలు, కళాశాలల్లోని మన యువత క్రీడల అనుబంధ రంగాల్లో తమ కెరీర్ నిర్మించుకోవాలనుకుంటున్నారు. వారి మెరుగైన భవిష్యత్తు కూడా మోదీ గ్యారంటీ’’ అని ప్రధానమంత్రి చెప్పారు. 

భారతదేశం పాత రికార్డులన్నింటినీ చెరిపేసి కొత్త రికార్డులు నెలకొల్పుతున్నదంటూ ‘‘భారతదేశం ఒక్క క్రీడల్లోనే కాదు, ప్రతీ రంగంలోనూ అలలు సృష్టిస్తోంది’’ అని ప్రధానమంత్రి  చెప్పారు. భారత యువత సామర్థ్యం పట్ల ఆయన విశ్వాసం ప్రకటించారు. నేటి భారతదేశం భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించగలుగుతుంది అని చెప్పారు. ఈ ఏడాది దేశం మరిన్ని రికార్డులు సృష్టించి జాతికి, ప్రపంచానికి కొత్త విజయాలు సాధించగలుగుతుందన్న విశ్వాసం ప్రకటించారు.  ‘‘మీతోనే భారతదేశం ముందుకు సాగుతుంది గనుక మీరు ముందుకు  సాగాలి. మీరందరూ కలిసికట్టుగా  సాగండి, గెలవండి, దేశాన్ని గెలిపించండి. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభమైనట్టు నేను ప్రకటిస్తున్నాను’’ అంటూ ఆయన ముగించారు.

తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి శ్రీ ఎంకె స్టాలిన్; కేంద్ర సమాచార, ప్రసారాలు; యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్;  కేంద్ర సమాచారం, ప్రసారాల శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రామాణిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పూర్వాపరాలు 
గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సాహించి, క్రీడలను అభివృద్ధి చేయాలన్న; ఔత్సాహిక క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టాలన్న  ప్రధానమంత్రి చెక్కు చెదరని కట్టుబాటు ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల ప్రారంభానికి దారి తీసింది. చెన్నైలోని జవహర్ లాల్  నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు దక్షిణ భారతదేశంలో నిర్వహించడం ఇదే ప్రథమం. తమిళనాడులోని నాలుగు ప్రధాన నగరాలు చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్  లలో 2024 జనవరి 19 నుంచి 31 వరకు వివిధ క్రీడలు నిర్వహిస్తారు. 

ఈ క్రీడోత్సవాల మస్కట్  లో పెట్టిన వీర మంగైగా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే వీర మంగై రాణి వేలు నాచ్చియార్  బ్రిటిష్ వలస పాలనపై  అవిశ్రాంత పోరాటం జరిపిన ఒక రాణి. భారత మహిళల సాహసం,  స్ఫూర్తికి ఈ మస్కట్  చిహ్నంగా నిలుస్తుంది. ఈ క్రీడల లోగోలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువార్ చిత్రం ముద్రించారు. 

ఈ ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో 5600 మంది వరకు అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడోత్సవాలు 13 రోజుల పాటు 15 వేదికల్లో జరుగుతాయి. 26 క్రీడల్లో 275కి పైగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఒక డెమో స్పోర్ట్  ను కూడా ఇందులో  చేర్చారు. ఇక్కడ నిర్వహిస్తున్న 26 క్రీడల్లో ఫుట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి సాంప్రదాయిక క్రీడలు; కలరిపయట్ట్, గట్కా, థంగ్ టా, కబడ్డీ, యోగాసనాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన సాంప్రదాయిక క్రీడ సిలంబంను కూడా ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో  తొలిసారిగా డెమో క్రీడగా చేర్చారు. 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు.  డిడి తమిళ్  గా తీర్చిదిద్దుతున్న డిడి పూదిగై చానల్, 8 రాష్ర్టాలకు చెందిన 12 ఆకాశవాణి ఎఫ్ఎం ప్రాజెక్టులు, జమ్ముకశ్మీర్  కు చెందిన 4 డిడి ట్రాన్స్ మీటర్లు వీటిలో ఉన్నాయి. వీటికి తోడు 12 రాష్ర్టాలకు చెందిన 26 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 

 



(Release ID: 1998172) Visitor Counter : 124