ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల్లో అవగాహన పెంచుతున్న వ్యవస్థాపకురాలికి ప్రధానమంత్రి ప్రశంస
దుంగార్పూర్ వంటి చిన్న గ్రామంలో నా తల్లులు.. సోదరీమణులంతా
సంతోషంగా జీవించడం.. నన్ను ఆశీర్వదించడం మహదానందం: ప్రధానమంత్రి
Posted On:
18 JAN 2024 3:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ మేరకు రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్పూర్ గ్రామంలో ‘గ్రామీణ అజీవిక మిషన్’ కింద స్వయం ఉపాధి పొందుతున్న స్వయం సహాయ సంఘం సభ్యురాలు శ్రీమతి మమత ధింధోర్‌తో ప్రధానమంత్రి సంభాషించారు. ఆమె గుజరాతీ భాషలోనూ మాట్లాడగలగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఐదుగురు సభ్యులున్న ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన ఆమె, 150 సంఘాల్లోని 7500 మంది మహిళలతో కలసి పనిచేస్తుండటాన్ని కొనియాడారు. మహిళల్లో అవగాహన కల్పించడం.. శిక్షణ ఇవ్వడం.. సంఘాల సభ్యులు రుణం పొందడంలో ఆమె నిస్వార్థంగా సహాయం చేస్తుంటారు.
కూరగాయల సాగు కోసం బోరు వేసుకునేందుకు స్వయంగా రుణం పొందిన ఆమె, కూరగాయల దుకాణం కూడా నడుపుతున్నారు. శ్రీమతి మమత వ్యవసాయం, వ్యాపారం ద్వారా మరికొందరికి ఉపాధి కూడా కల్పిస్తుండటం గమనార్హం. పక్కా ఇల్లు నిర్మించుకోవాలన్న తన కల పిఎం ఆవాస్ యోజనతో నెరవేరిందని ప్రధానితో ముచ్చటిస్తూ ఆమె వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సహాయంగా అందే సొమ్ము, దాన్ని పొందే అవినీతిరహిత ప్రక్రియ గురించి ఆమె ప్రధానికి వివరించారు. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తుంటానని, అదే తరహాలో ‘మోదీ హామీ వాహనం’ గురించి కూడా అందరికీ చైతన్యం కల్పించానని వివరించారు. ఈ వాహనం ద్వారా దరఖాస్తు సమర్పించి, ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందాల్సిందిగా ప్రజల్లో ప్రచారం చేశారు.
శ్రీమతి మమతతో ముచ్చటించిన అనంతరం, ఆధునిక ప్రపంచంపై ఆమెకున్న అవగాహనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఆమె సంఘంలోని మహిళా సభ్యులు కార్యక్రమాన్ని వీడియో తీయడం ఆయన గమనించారు. అటుపైన అక్కడ హాజరైన మహిళా వ్యవస్థాపకులతో కాసేపు మాట్లాడారు. ‘‘దుంగార్పూర్ వంటి ఒక చిన్న గ్రామంలో నా తల్లులు.. సోదరీమణులు చాలా సంతోషంగా ఉన్నారు. నన్నెంతో ప్రేమాభిమానాలతో ఆశీర్వదిస్తుండటం మహదానందం కలిగిస్తోంది’’ అని ప్రధాని సహర్షంగా వ్యాఖ్యానించారు. స్వయంగా ముందంజ వేయడంతోపాటు ఇతర మహిళలను తన వెంట నడిపించడంలో శ్రీమతి మమత చూపుతున్న ఉత్సాహాన్ని, అంకిత భావాన్ని కూడా శ్రీ మోదీ ప్రశంసించారు. తమ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తున్నదని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 2 కోట్ల మంది ‘లక్షాధికారి సోదరీమణుల‘ సృష్టి దిశగా చేపట్టిన ప్రణాళిక గురించి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆమె వంటి స్వయం సహాయ సంఘాల సభ్యుల కీలక పాత్రను ప్రధాని నొక్కిచెప్పారు.
***
(Release ID: 1997485)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam