ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనవరి 19న మహారాష్ట్ర.. కర్ణాటక.. తమిళనాడులలో ప్రధాని పర్యటన


చెన్నైలో ఖేలో ఇండియా-2023 యువజన క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని;

‘దూరదర్శన్ తమిళ్’గా నవీకరించిన ‘పొదిగై’ చానెల్ ప్రారంభంసహా దేశంలో ప్రసార

రంగం బలోపేతం దిశగా రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన;

బెంగళూరులో అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్రం ప్రాంగణాన్ని ప్రారంభించనున్న ప్రధాని; అమెరికా వెలుపల బోయింగ్ భారీ పెట్టుబడి;

మహారాష్ట్రలో దాదాపు రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన

Posted On: 17 JAN 2024 8:05PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 19వ తేదీన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ఆయన మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ‘బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌’ను, ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్‌’ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తమిళనాడులోని చెన్నై నగరంలో ‘ఖేలో ఇండియా-2023’ యువజన క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

షోలాపూర్‌లో ప్రధానమంత్రి

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో దాదాపు రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు రాష్ట్రంలో ‘పిఎంఎవై-పట్టణ’ పథకం కింద నిర్మించిన 90,000కుపైగా పక్కా ఇళ్లను జాతికి అంకితం చేస్తారు. అలాగే షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను కూడా ఆయన లబ్ధిదారులకు ప్రదానం చేస్తారు. వీరిలో చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్ లూమ్ కార్మికులు, చెత్త సేకరణదారులు, బీడీ కార్మికులు, డ్రైవర్లు తదితరులున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 10,000 మంది ‘పిఎం-స్వానిధి’ పథకం లబ్ధిదారులకు తొలి, మలి విడత రుణ పంపిణీని ప్రారంభిస్తారు.

బెంగళూరులో ప్రధానమంత్రి

   బెంగుళూరులో కొత్త అత్యాధునిక ‘బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్’ (బిఐఇటిసి) ప్రాంగణాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీన్ని 43 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,600 కోట్ల వ్యయంతో నిర్మించగా, అమెరికా వెలుపల బోయింగ్ సంస్థ తొలిసారిగా ఇంత భారీ పెట్టుబడి పెట్టడం విశేషం. దీనిద్వారా భారతదేశంలోని అంకుర, ప్రభుత్వ-ప్రైవేటు పరిశ్రమల పర్యావరణ వ్యవస్థతో శక్తిమంతమైన భాగస్వామ్యానికి బోయింగ్ సంస్థ శక్తిమంతమైన మూలస్తంభం కాగలదు. అంతేకాకుండా ప్రపంచ గగనతల-రక్షణ పరిశ్రమకు భవిష్యత్తరం ఉత్పత్తులు-సేవల రూపకల్పనలోనూ  తోడ్పడుతుంది.

   ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్‌’ను కూడా ప్రారంభిస్తారు. నానాటికీ విస్తరిస్తున్న భారత విమానయాన రంగంలో మరింత పెద్ద సంఖ్యలో యువతుల ప్రవేశానికి తోడ్పడటం ఈ పథకం లక్ష్యం. దీనిద్వారా ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో దేశవ్యాప్తంగాగల యువతులు, మహిళలు సంక్లిష్ట నైపుణ్యం సముపార్జించే అవకాశం లభిస్తుంది. అలాగే విమానయాన రంగంలో ఉద్యోగాలకు తగిన శిక్షణ కూడా వారికి లభిస్తుంది. ఈ కార్యక్రమం కింద యువతులలో ‘స్టెమ్’ ఆధారిత భవిష్యత్తుపై ఆసక్తి పెంపు దిశగా 150 ప్రణాళికాబద్ధ ప్రదేశాల్లో ‘స్టెమ్’ ప్రయోగశాలలు ఏర్పాటవుతాయి. ఇదే కార్యక్రమం కింద పైలట్లుగా శిక్షణ పొందేవారికి ఉపకార వేతనం కూడా లభిస్తుంది.

ఖేలో ఇండియా యువజన క్రీడలు-2023లో ప్రధానమంత్రి

   అట్టడుగు స్థాయిలో క్రీడాభివృద్ధితోపాటు వర్ధమాన క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంపై ప్రధానికిగల తిరుగులేని నిబద్ధత ‘ఖేలో ఇండియా యువజన క్రీడల’ నిర్వహణకు బాటలు పరచింది. ఈ మేరకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 6వ ‘ఖేలో ఇండియా యువజన క్రీడలు-2023’  ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, దక్షిణ భారతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ క్రీడా ఉత్సవం తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్ నగరాల్లో 2024 జనవరి 19 నుంచి 31 వరకు సాగుతుంది.

   ఈ క్రీడలకు ‘వీర మంగై’ని చిహ్నంగా ఎంపిక చేశారు. బ్రిటిష్ వలస పాలనపై పోరాడిన భారతీయ ‘రాణి వేలు నాచియార్’ను ప్రజలు ‘వీర మంగై’గా ప్రేమాభిమానాలతో పిలుచుకునేవారు. ఆమె పేరిట ఎంపిక చేసిన ఈ చిహ్నం భారత మహిళల పరాక్రమం, స్ఫూర్తికి సంకేతం. భారతనారి శక్తిసామర్థ్యాలను ఇది చాటిచెబుతుంది. ఇక ఆటల సంబంధిత లోగోలో కవి తిరువళ్లువర్ చిత్రం ఉంటుంది.

   ఈ ఖేలో ఇండియా యువజన క్రీడల్లో దేశం నలుమూలల నుంచి 5,600 మంది క్రీడాకారులు 26 క్రీడల్లో పోటీపడతారు. మొత్తం 13 రోజులపాటు 15 కేంద్రాల్లో నిర్వహించే ఈ క్రీడలలో 275 పోటీలతోపాటు ఒక ప్రదర్శనా క్రీడ కూడా ఉంటుంది. ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితరాలు సహా సంప్రదాయక కలరిపయట్టు, గట్కా, తంగ్ టా, కబడ్డీ, యోగా తదితరాల వైవిధ్యభరిత సమ్మేళనంగా ఈ 26 క్రీడల్లో పోటీ సాగుతుంది. కాగా, ఈసారి యువజన క్రీడల్లో తొలిసారిగా తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘సిలంబం’ను ప్రదర్శనా క్రీడగా పరిచయం చేయబడుతోంది.

   ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసార రంగానికి సంబంధించిన దాదాపు రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభ, శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ‘దూరదర్శన్ తమిళ్’గా నవీకరించిన ‘డీడీ పొదిగై’ ఛానెల్‌ ప్రారంభం; 8 రాష్ట్రాల్లో 12 ఆకాశవాణి ‘ఎఫ్ఎం’ ప్రాజెక్టులు; జమ్ముకశ్మీర్‌లో 4 ‘డీడీ ట్రాన్స్‌మిటర్లను ఆయన ప్రారంభిస్తారు. అలాగే 12 రాష్ట్రాల్లో 26 కొత్త ‘ఎఫ్ఎం’ ట్రాన్స్‌మిటర్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

***


(Release ID: 1997157) Visitor Counter : 134