ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్రప్రదేశ్.. కేరళ రాష్ట్రాల్లో జనవరి 16-17 తేదీల్లో ప్రధాని పర్యటన


దేశంలో ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల రంగం పరివర్తనాత్మక మార్పు దిశగా కొచ్చిలో రూ.4,000 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం;

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) ప్రాంగణంలో ‘కొత్త డ్రై డాక్’తోపాటు
‘ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ’ (ఐఎస్ఆర్ఎఫ్)ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి;

‘సిఎస్ఎల్’లో ‘కొత్త డ్రై డాక్’ వద్ద భారీ వాణిజ్య నౌకలు నిలిపే
సదుపాయం వల్ల విదేశాలపై ఆధారపడే అవసరం తొలగుతుంది;

కొచ్చిలోని పుదువైపీన్‌లో ‘ఐఒసిఎల్’ వంటగ్యాస్ దిగుమతి
టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి;

కేరళలోని గురువాయూర్.. త్రిప్రయార్ శ్రీ రామస్వామి
ఆలయాల్లో దైవదర్శనం.. పూజలు చేయనున్న ప్రధానమంత్రి;

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ‘కస్టమ్స్-పరోక్ష పన్నులు- నార్కోటిక్స్ జాతీయ అకాడమీ’ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 14 JAN 2024 8:35PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 16-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 16వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోగల వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధానమంత్రి సమావేశమవుతారు.

   అటుపైన జనవరి 17వ తేదీన ఉదయం 07:30 గంటలకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలోనూ ఆయన దర్శనంతోపాటు పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల రంగం సంబంధిత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు.

ఓడరేవులు.. నౌకాయానం.. జలమార్గాల రంగానికి ఎనలేని ఉత్తేజం

   కొచ్చి పర్యటనలో భాగంగా రూ.4,000 కోట్లకుపైగా విలువైన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) వద్ద నిర్మించిన ‘కొత్త డ్రై డాక్’ (ఎన్‌డిడి); అంతర్జాతీయ నౌకా మరమ్మతు కేంద్రం (ఐఎస్ఆర్ఎఫ్); కొచ్చిలోని పుదువైపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటగ్యాస్ దిగుమతి టెర్మినల్ ప్రాజెక్టులున్నాయి. భారత ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల రంగం పరివర్తనాత్మకంగా రూపొందాలన్న ప్రధాని దూరదృష్టికి అనుగుణంగా ఈ కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా సామర్థ్యం పెరుగుదలతోపాటు స్వయం సమృద్ధి సాధించడం సాధ్యమన్నది ఆయన దృక్పథం.

   కొచ్చిలోని ప్రస్తుత సిఎస్ఎల్ ప్రాంగణంలో సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన ‘కొత్త డ్రై డాక్’ నవ భారత ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఓ కీలక ప్రాజెక్ట్. మొత్తం 75/60 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల లోతు, 9.5 మీటర్లదాకా డ్రాఫ్ట్ కలిగిన 310 మీటర్ల పొడవైన అంచెలవారీ డ్రై డాక్ ఇది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద సముద్ర మౌలిక సదుపాయాలలో ఇదీ ఒకటి. ఈ ప్రాజెక్టులో భారీ గ్రౌండ్ లోడింగ్‌ సదుపాయం ఉంటుంది కాబట్టి ‘70,000టి’ వరకు భవిష్యత్ విమాన వాహక నౌకలుసహా భారీ వాణిజ్య నౌకల తరహా వ్యూహాత్మక ఆస్తుల నిర్వహణకు వీలుంటుంది. ఇలాంటి అధునాతన సామర్థ్యంగల దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరడంతో అత్యవసర జాతీయ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు.

   కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద దాదాపు రూ.970 కోట్లతో నిర్మించిన ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) ప్రాజెక్ట్ అత్యంత విశిష్టమైనది. ఇక్కడ ‘6000టి’ సామర్థ్యంగల ‘షిప్ లిఫ్ట్ సిస్టమ్, ట్రాన్స్‌ఫర్ సిస్టమ్, 6 వర్క్‌స్టేషన్లు, సుమారు 1,400 మీటర్ల లోతైన బెర్త్‌ ఉన్నాయి. ఇక్కడ ఏకకాలంలో 130 మీటర్ల పొడవుగల 7 నౌకలను నిలపవచ్చు. ప్రస్తుత నౌకల మరమ్మతు సామర్థ్యం ఆధునికీకరణతోపాటు విస్తరించడంలో ఐఎస్ఆర్ఎఫ్ దోహదం చేస్తుంది. అంతేకాకుండా కొచ్చిని అంతర్జాతీయ నౌకా మరమ్మతు కూడలిగా మార్చే దిశగా తోడ్పడుతుంది.

   అలాగే, కొచ్చిలోని పుదువైపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్పీజీ దిగుమతి టెర్మినల్ దాదాపు రూ.1,236 కోట్లతో నిర్మితమైంది. ఈ మేరకు ‘15400 ఎంటి’ నిల్వ సామర్థ్యంగల టెర్మినల్ వల్ల అత్యాధునిక సౌకర్యం సమకూరడంతోపాటు ఈ ప్రాంతంలోని లక్షలాది నివాసాలు, వ్యాపారాలకు సుస్థిర ఎల్పీజీ సరఫరాకు భరోసా లభిస్తుంది. అందరికీ అందుబాటు ధరతో ఇంధన సౌలభ్యం కల్పించడంపై భారత్ కృషిని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుంది.

   ఈ మూడు ప్రాజెక్టుల ప్రారంభం ద్వారా దేశంలో ఓడల నిర్మాణం-మరమ్మత్తు సామర్థ్యాలు, అనుబంధ పరిశ్రమలు సహా ఇంధన మౌలిక సదుపాయాల వృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులు ఎగుమతి-దిగుమతి వాణిజ్యాన్ని కూడా పెంచడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అదే సమయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయి.

కస్టమ్స్-పరోక్ష పన్నులు-నార్కోటిక్స్ జాతీయ అకాడమీ (నసిన్)

   సివిల్ సర్వీస్ సామర్థ్య వికాసం ద్వారా దేశంల పాలనను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి దార్శనికత సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (నసిన్) కొత్త అత్యాధునిక ప్రాంగణాన్ని 500 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది పరోక్ష పన్నులు (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, వస్తుసేవల పన్నులు), మాదక ద్రవ్య నియంత్రణ వ్యవహారాల రంగంలో సామర్థ్య వికాసం దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలుగల ఈ జాతీయస్థాయి శిక్షణ కేంద్రం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్-పరోక్ష పన్నులు) అధికారులతోపాటు కేంద్ర అనుబంధ సేవలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా భాగస్వామ్య దేశాల అధికారులకూ శిక్షణ ఇస్తుంది.

   ఈ కొత్త ప్రాంగణం ఏర్పాటుతో ‘నసిన్’ తన శిక్షణ, సామర్థ్య వికాస కార్యక్రమాల్లో ఇకపై నవతరం సాంకేతికతలు- ఆగ్మెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ, బ్లాక్-చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర వర్ధమాన పరిజ్ఞానాల వినియోగంపై దృష్టి సారిస్తుంది.

 



(Release ID: 1996428) Visitor Counter : 186