ప్రధాన మంత్రి కార్యాలయం
పోలీసు డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ విజన్ సాకారం కావాలంటే భారత పోలీసు యంత్రాంగం ఆధునికం కావాలి, ప్రపంచ శ్రేణి పోలీసు యంత్రాంగంగా మారాలి : ప్రధానమంత్రి కొత్త నేర చట్టాల రూపకల్పన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఒక విప్లవాత్మక అడుగు : పిఎం ‘‘పౌరులే ప్రథమం, ఆత్మగౌరవం ప్రథమం, న్యాయం ప్రథమం’’ అనే స్ఫూర్తితో రూపొందించినవే ఈ క్రిమినల్ చట్టాలు : పిఎం ‘‘కభీ ఔర్ కహీం భీ’’ ఆధారంగా మహిళలు నిర్భీతిగా పని చేసేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, మహిళల భద్రత కోసం పోలీసు యంత్రాంగం పని చేయాలని పిఎం ఉద్ఘాటన సానుకూల సమాచారం, పౌరుల ప్రయోజనానికి ఉద్దేశించిన సందేశాలు వ్యాపింపచేయడానికి పోలీస్ స్టేషన్లు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి : పిఎం
Posted On:
07 JAN 2024 8:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 6, 7 తేదీల్లో జైపూర్ లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన పోలీసు డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ 58వ అఖిల భారత సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొత్త నేర చట్టాల రూపకల్పన గురించి చర్చిస్తూ దేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఈ చట్టాల రూపకల్పన ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పారు. ‘‘పౌరులే ప్రథమం, ఆత్మగౌరవం ప్రథమం, న్యాయం ప్రథమం’’ అనే స్ఫూర్తితో ఈ న్యాయ చట్టాలను రూపొందించామని ఆయన నొక్కి చెప్పారు. పోలీసులు ఇప్పుడు ‘‘దందా’’ విధానంలో కాకుండా ‘‘డేటా’’ ఆధారంగా పని చేయాలని సూచించారు. సమాజంలోని విభిన్న వర్గాలకు కొత్త న్యాయ చట్టాల వెనుక గల భావోద్వేగపూరితమైన స్ఫూర్తిని తెలియచేసేందుకు పోలీసు చీఫ్ లు ఇప్పుడు ఆలోచనాత్మకంగా పని చేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మహిళలు, బాలికలకు తమ హక్కుల గురించి, కొత్త నేర చట్టాల కింద వారికి గల రక్షణల గురించి తెలియచేయాలని ఆయన తెలిపారు. ‘‘కభీ భీ ఔర్ కహీ భీ’’ (ఏ సమయంలో అయినా ఎక్కడైనా) మహిళలు స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగా మహిళల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
పౌరులకు పోలీసు సిబ్బంది సానుకూల ఇమేజ్ గురించి అర్ధం అయ్యేలా చేయాలని ప్రధానమంత్రి సూచించారు. సానుకూల సమాచారాన్ని, పౌరుల ప్రయోజనాలకు ఉద్దేశించిన సమాచారాన్ని ప్రజలకు అందించడానికి పోలీసు స్టేషన్ స్థాయిలో సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. అంతే కాదు, ప్రకృతి వైపరీత్యాలు, సహాయ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియచేసేందుకు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు. పౌరులు-పోలీసుల మధ్య అనుసంధానతను పటిష్ఠం చేయడానికి క్రీడలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. సరిహద్దు గ్రామాలే దేశానికి ‘‘తొలి గ్రామాలు’’ కావడం కావడం వల్ల ఆ ప్రాంతాల ప్రజలతో అనుసందానం కావడానికి ప్రభుత్వ అధికారులు సరిహద్దు గ్రామాల్లో బస చేయాలని కూడా ఆయన సూచించారు.
భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 విజయం గురించి, అరేబియన్ సముద్రంలో హైజాక్ కు గురైన నౌక నుంచి 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఇలాంటి విజయాలతో భారతదేశం ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్నదని చెప్పారు. ఆదిత్య-ఎల్ 1 విజయం చంద్రయాన్-3 విజయంతో సమానమని ఆయన చెప్పారు. భారత నౌకాదళం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ గర్వకారణమని ఆయన అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్య సాధనకు, ప్రపంచంలో మెరుగుపడుతున్న ప్రొఫైల్, పెరుగుతున్న జాతీయతా బలానికి దీటుగా పోలీసు శాఖ ఆధునికం కావాలని, ప్రపంచ శ్రేణి దళంగా మారాలని సూచించారు.
జైపూర్ లో మూడు రోజుల పాటు సాగిన డిజిఎస్ పి/ఐజిఎస్ పిల జాతీయ సమావేశం ముగింపు సందర్భంగా సర్వీసులో విశిష్ట సేవలందించిన వారిక పోలీసు పతకాలను ప్రధాని అందచేశారు.
కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, హోం శాఖ సహాయ మంత్రి, హోం శాఖ కార్యదర్శి, రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల డిజిఎస్ పి/ఐజిఎస్ పిలు, కేంద్ర పోలీసు సంస్థలు/కేంద్ర సాయుధ పోలీసు దళాల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. క్రితం సంవత్సరాల తరహాలోనే హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ సమావేశంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 500 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. జాతీయ భద్రతలోని కీలకాంశాలు, కొత్త క్రిమినల్ చట్టాలు, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలు, వామపక్ష తీవ్రవాదం, పెరుగుతున్న సైబర్ ముప్పు, ప్రపంచవ్యాప్త రాడికల్ వ్యతిరేక పోరాటం వంటి అంశాలపై ఆ సమావేశంలో చర్చించారు.
(Release ID: 1994519)
|