సహకార మంత్రిత్వ శాఖ

కందిపప్పు ఉత్పత్తి చేసే రైతుల రిజిస్ట్రేషన్, సేకరణ , చెల్లింపుల కోసం నాఫెడ్ , ఎన్ సిసిఎఫ్ అభివృద్ధి చేసిన పోర్టల్ ను న్యూఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నేటి ఆరంభం ఒక నాంది

ఉత్పత్తికి ముందే ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న రైతులందరి నుంచి పప్పు ధాన్యాలను కొనుగోలు చేస్తాం…ఇదిప్రధాని మోదీ హామీ

ఎలాంటి అవినీతికి తావులేకుండా రైతుల ఉత్పత్తుల విలువ సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుంది.

10 సంవత్సరాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెంచినంతగా ఎంఎస్ పి ని ఏ ప్రభుత్వమూ పెంచలేదు.
"సహకార్ సే సమృద్ధి" అంటే "సహకార్ ద్వారా రైతుల సమృద్ధి" అని అర్థం.

ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతులకు రెండు చేతుల్లో లడ్డూలు ఉంటాయి.

పెసలు, శనగలలో ఆత్మనిర్భర్ గా మారిన భారత్ ఇప్పుడు పప్పుదినుసుల్లో కూడా ఆత్మనిర్భర్ గా మారాలి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా నిర్దేశించారు; దీనికోసం లక్షల టన్నుల ఇథనాల్ ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

మొక్కజొన్న సాగు చేసే రైతుల పొలాలు పెట్రోల్ బావులను తలపిస్తాయి.

కేవలం ఏడు నెలల్లోనే అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్ గా భారత్ బ్రాండ్ పప్పు (దాల్) నిలిచింది.

Posted On: 04 JAN 2024 5:53PM by PIB Hyderabad

కందిపప్పు ఉత్పత్తి చేసే రైతుల రిజిస్ట్రేషన్, సేకరణ, చెల్లింపుల కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ సి సిఎఫ్) అభివృద్ధి చేసిన పోర్టల్ ను కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. 'పప్పు దినుసుల్లో స్వావలంబన' అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర హోం , సహకార మంత్రి తన ప్రసంగంలో, ఈ రోజు మనం పోర్టల్ ద్వారా రైతులు నాఫెడ్,  ఎన్ సి సి ఎఫ్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా కందిపప్పును విక్రయించి డిబిటి ద్వారా మార్కెట్ ధరకు ఎంఎస్ పి లేదా మార్కెట్ ధర కంటే ఎక్కువ ఎం ఎస్ పి  ధర పొందగలిగే చొరవ తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రారంభంతో రానున్న రోజుల్లో రైతుల సౌభాగ్యం, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ స్వావలంబన, పౌష్టికాహార కార్యక్రమాలు బలోపేతం అవుతాయన్నారు. దీంతో పంటల సరళి మారుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో పాటు భూసంస్కరణలు, నీటి సంరక్షణ రంగాల్లో కూడా మార్పులు రానున్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడానికి నేటి ఆరంభం నాంది అని ఆయన అన్నారు.

ఈ రోజు దేశం పప్పుధాన్యాల రంగంలో స్వయం సమృద్ధి సాధించలేదని, కానీ పెసలు, శనగల రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామని శ్రీ అమిత్ షా అన్నారు. భారతదేశం వంటి వ్యవసాయ దేశంలో నీటి లభ్యత పెరుగుతోందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విభిన్న వాతావరణం వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. 2027 నాటికి పప్పుధాన్యాల రంగంలో భారతదేశాన్ని 'ఆత్మనిర్భర్'గా మార్చడానికి పప్పుధాన్యాలు పండించే రైతులపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెద్ద బాధ్యతను ఉంచారని, రైతుల సహకారంతో 2027 డిసెంబర్ నాటికి పప్పుధాన్యాల ఉత్పత్తి రంగంలో భారత్ ఆత్మనిర్భర్ గా మారుతుందని, దేశం ఒక్క కిలో పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పప్పు దినుసుల రంగంలో దేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చేందుకు సహకార మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధి తులతో  పలు సమావేశాలు నిర్వహించామని, ఈ లక్ష్య సాధనకు అడ్డుగా ఉన్న అడ్డంకులపై చర్చించామని హోం , సహకార శాఖ మంత్రి తెలిపారు. స్పెక్యులేటర్లు, ఇతర పరిస్థితుల వల్ల పప్పుధాన్యాలు  పండించే రైతులకు చాలా సార్లు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోయారని, దీంతో రైతులు పప్పుధాన్యాల సాగుకు ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తికి ముందే నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ లో రిజిస్టర్ చేసుకున్న రైతు నుంచి ఉత్పత్తికి ముందే తన పప్పుధాన్యాలను 100 శాతం కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) తో కొనుగోలు చేయాలని నిర్ణయించామని శ్రీ షా చెప్పారు. ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతులకు రెండు చేతుల్లో లడ్డూలు ఉంటాయని తెలిపారు. పప్పుధాన్యాల పంట వచ్చినప్పుడు కనీస మద్దతు ధర కంటే పప్పు దినుసుల ధర ఎక్కువగా ఉంటే దాని సగటును లెక్కించి రైతుల నుంచి అధిక ధరకు పప్పుధాన్యాలను కొనుగోలు చేసే శాస్త్రీయ ఫార్ములాను రూపొందించామని, దీనివల్ల రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగదని అన్నారు.

 

రైతులు నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు. రైతుల పప్పుధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వాటిని విక్రయించడానికి రైతులు ఎక్కడికీ తిరగాల్సిన అవసరం ఉండదన్నది ప్రధాని నరేంద్ర మోదీ హామీ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశాన్ని ఆత్మనిర్భర్ గా తీర్చిదిద్దడంలో దేశ రైతాంగం ఏ మాత్రం వెనకడుగు వేయదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో చాలా భాగం ఇప్పటికీ శాకాహారమేనని, వారికి ప్రోటీన్ చాలా ముఖ్యమని, దీనికి ఏకైక వనరు పప్పుధాన్యాలు అని సహకార మంత్రి తెలిపారు. పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో పప్పుధాన్యాల ఉత్పత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. పప్పుధాన్యాల సాగు భూమి నాణ్యతను పెంచుతుంది కాబట్టి పప్పుధాన్యాలు భూమి పునరుద్ధరణకు ముఖ్యమైన పంట అని అన్నారు. పప్పుధాన్యాల ఉత్పత్తికి తక్కువ నీరు సరిపోతుందని, దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పడిపోవడం మన భవిష్యత్తుకు ఆందోళన కలిగించే అంశమని,  భూగర్భ జలమట్టాన్ని కాపాడి, పెంచాలంటే తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని ఆయన అన్నారు.

పప్పుధాన్యాలు పండిస్తే గిట్టుబాటు ధర లభించదనే సందిగ్ధంలో గతంలో రైతులు ఉండేవారని, కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సందిగ్ధతకు తెరదించారని అన్నారు. రైతులు నమోదు చేసుకున్నట్లయితే, మొత్తం పప్పుధాన్యాలను ఎం ఎస్ పి తో కొనుగోలు చేయాల్సిన బాధ్యత నాఫెడ్ ఎన్ సి సి ఎఫ్ పై ఉంటుందని, పప్పుధాన్యాలు ఒక రకంగా రైతుల పొలంలో మినీ ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడమని చెప్పారు. ఒక హెక్టారు విస్తీర్ణం లో 30 నుంచి 40 కిలోల నత్రజనిని అందించడం పెద్ద విషయమని, ఇది అనేక ప్రయోగాల ద్వారా రుజువైందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, బీహార్ వంటి రాష్ట్రాల రైతులు పప్పుధాన్యాల కోసం తమ భూమి పరిమాణాన్ని నమోదు చేసుకోవడం శుభవార్త అని శ్రీ షా అన్నారు. వారి పప్పుధాన్యాలను ఎం ఎస్ పి తో కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వవచ్చునని అన్నారు.

అతి తక్కువ సమయంలో పోర్టల్ ను ప్రారంభించిన నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ లను  హోం, సహకార శాఖ మంత్రి అభినందించారు. పప్పుధాన్యాలను ఉత్పత్తి చేసే అన్ని ప్రాంతాల్లో ఈ పోర్టల్ పై అవగాహన కల్పించాలని దేశంలోని అన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పి ఒ ), అభ్యుదయ రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా సింపుల్ స్టెప్ ద్వారా అన్ని భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ ఆమోదం పొందిన తరువాత, నాఫెడ్ , ఎన్ సి సి ఎఫ్ రైతుల పప్పుధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, తమ  పప్పుధాన్యాలను మార్కెట్లో విక్రయించే అవకాశం కూడా రైతులకు ఉందని ఆయన అన్నారు.

ఈ పోర్టల్ ను చాలా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించామని, దీనిలో ఆధార్ సంఖ్యను ధృవీకరించడం, రైతు కు ప్రత్యేక ఐడిని సృష్టించడం, భూ రికార్డులతో అనుసంధానం చేయడం, ఆధార్ ఆధారిత చెల్లింపుతో అనుసంధానం చేయడం జరిగిందని శ్రీ అమిత్ షా చెప్పారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతుల ఉత్పత్తుల విలువను బదిలీ చేసే వ్యవస్థ ఉంది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఈ పోర్టల్ ను గిడ్డంగుల ఏజెన్సీలతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగంలో పెద్ద మొత్తంలో గిడ్డంగులు రాబోతున్నాయి. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) ఒక పెద్ద గోదామును నిర్మించే దిశగా కదులుతోంది, ఇది పంటల రవాణా సమస్యను పరిష్కరిస్తుంది. ప్రభుత్వం కనీసం ఎం ఎస్ పి ధర ఇస్తుందని, ఒక వేళ మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తే, తమ పంటలను మార్కెట్లో విక్రయించుకునే స్వేచ్ఛ రైతులకు ఉంటుందని సహకార మంత్రి చెప్పారు. భారతదేశం ఒక్క కిలో పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పప్పుధాన్యాల సాగు చేపట్టి 2028 జనవరి ఒకటి నాటికి పప్పుధాన్యాల రంగంలో దేశం సాధించేందుకు దోహద పడాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ కాలంలోనే 537 పి ఎ సి ఎస్ లు, పలు ఎఫ్ పి ఒ లు ఈ పోర్టల్ లో చేరాయని హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. గుజరాత్ నుంచి 480 పి ఎ సి ఎస్ లు, ఎఫ్ పి ఒ లు , మహారాష్ట్ర నుంచి 227,   కర్ణాటక నుంచి 209,  మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి 45  ఈ పోర్టల్ లో చేరేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.  గడచిన తొమ్మిదేళ్లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారీ మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. 2013-14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 265 మిలియన్ టన్నులు కాగా, 2022-23 నాటికి అది 330 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ ఒక్క దశాబ్దాన్ని విశ్లేషించినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని రైతులు అతిపెద్ద వృద్ధిని సాధించారన్నారు. ఈ కాలంలో పప్పు దినుసుల ఉత్పత్తి భారీగా పెరిగిందని, అయితే మూడు పప్పు దినుసుల్లో మనం స్వయం సమృద్ధి సాధించలేదని, వాటిపై స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

పప్పుధాన్యాల ఉత్పత్తి, విస్తీర్ణం పరంగా నేడు భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలవడం సంతృప్తి కలిగించే అంశమని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో 31 శాతం విత్తన విస్తీర్ణం మనదేశంలో ఉంది. మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ వాటా 28 శాతం. ప్రభుత్వం ఎగుమతుల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేసిందని, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా పప్పు దినుసులను ఎగుమతి చేయాలనే లక్ష్యం ముందుకు సాగుతుందని, ఈ బాధ్యత దేశంలోని రైతులపై ఉందన్నారు. ఉత్పాదకతను పెంచేందుకు మంచి విత్తనాల ఉత్పత్తికి సహకార సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తనాల ఉత్పాదకతను పెంచే ప్రాజెక్టును మరికొద్ది రోజుల్లో ముందుకు తెస్తామని చెప్పారు.  మన సంప్రదాయ విత్తనాలను కూడా సంరక్షిస్తాం, ప్రోత్సహిస్తాం అని చెప్పారు. వీటితో పాటు ఉత్పాదకతను పెంచేందుకు సహకార ప్రాతిపదికన బహుళ రాష్ట్ర విత్తన సవరణ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.  అన్ని పి ఎ సి ఎస్  లు కమిటీలో రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2013-14లో దేశంలో రైతులు 19 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను ఉత్పత్తి చేశారని, 2022-23లో ఇది 26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే మనం దీనితో సంతృప్తి చెందకూడదని శ్రీ అమిత్ షా అన్నారు. 2027 నాటికి పప్పుదినుసుల దిగుమతులను నిలిపివేయడమే కాకుండా ఎగుమతి చేసే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సహకార శాఖ మంత్రి రైతులకు భరోసా ఇస్తూ ఈ పోర్టల్ లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలతో దేశం కోసం ఎంతో కృషి చేస్తామని, దీనివల్ల రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి కోరారని అమిత్ షా గుర్తు చేశారు. అంకెలు చూడకుండా ప్రతిపక్షాలు ఎగతాళి చేస్తున్నాయని ఆయన అన్నారు. 2014-15లో కందిపప్పు కనీస మద్దతు ధర రూ.4350 కాగా, నేడు కందిపప్పు కనీస మద్దతు ధర రూ.7000గా ఉందని సహకార శాఖ మంత్రి తెలిపారు. ఒక్క కందుల విషయం లోనే రైతుల ఆదాయాన్ని 65 శాతం పెంచేందుకు కృషి చేశామన్నారు. ఇదే కాలంలో పెసర కనీస మద్దతు ధర రూ.4600 ఉండగా నేడు రూ 8,558, మినుము కనీస మద్దతు ధర రూ.4350 ఉండగా, రూ.6950, శనగ రూ.3100 నుంచి రూ.5440కి, పప్పుల ఎం ఎస్ పి రూ.2950 నుంచి రెండు రెట్లు పైగా రూ 6425 పెరిగింది. ఇప్పుడు రైతులు తమకు కావాల్సినంత కంది, పెసర, మసూర్ వేసుకోవచ్చని, మరేమీ చేయకుండానే వారి ఆదాయం రెట్టింపు అవుతుందని అన్నారు.

గత పదేళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మినహా మరే ప్రభుత్వం కూడా ఎం ఎస్ పి ని ఇంతగా పెంచలేదని హోం , సహకార శాఖ మంత్రి దేశవ్యాప్తంగా రైతులకు చెప్పారు. సహకారోద్యమం లక్ష్యం సహకారం ద్వారా శ్రేయస్సు అని, అదిరైతు శ్రేయస్సు అని ఆయన అన్నారు.ఈ రోజు ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతుల శ్రేయస్సు కోసం సహకార ఉద్యమాన్ని పటిష్ఠం చేసేందుకు కృషి చేశారని, దీనిపై రైతులకు స్పష్టమైన సందేశం, అవగాహన ఉండాలని ఆయన అన్నారు. ఈ రోజు మనం కంది , పెసర, పప్పుధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని శ్రీ షా అన్నారు. పప్పుధాన్యాల నాణ్యత, ఉత్పత్తిని పెంచేందుకు కాన్పూర్ లోని ఐ సి ఎ ఆర్, ఐఐ పి ఆర్ తో కలిసి 150 మంచి విత్తన కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు ఎఫ్ పి ఒ లు కూడా ఈ పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. పప్పుధాన్యాల ప్రాథమిక సాగుకు 608 ఎఫ్ పి ఒ లు, ద్వితీయ, అంతర పంటల సాగుకు 123 ఎఫ్ పి ఒలు నమోదయ్యాయి.

ఈ విప్లవం పోషకాహారాన్ని పెంచి, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, మన వినియోగదారులకు పప్పుధాన్యాల ధరలను కూడా తగ్గిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. అందుకే ఎన్ సి సి ఎఫ్ , నాఫెడ్ ద్వారా 'భారత్ దాల్' అనే కాన్సెప్ట్ ను రూపొందించామని, ప్రస్తుతం ఈ పప్పుధాన్యాలను భారత్ బ్రాండ్ తో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో భారత్ దాల్ పరిధి అతి పెద్దది కాబోతోంది. కేవలం 7 నెలల్లోనే భారత్ దాల్ బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ గా అవతరించిందని ఆయన అన్నారు. దీని ధరలు కూడా తక్కువగా ఉండడంతో మన రైతులు నేరుగా లబ్ది పొందుతున్నారని, వీటితో పాటు ఇథనాల్ ఉత్పత్తిని కూడా పెంచాలని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా నిర్దేశించారని, మనం 20 శాతం ఇథనాల్ కలపాలనుకుంటే, దీని కోసం మనం లక్షల టన్నుల ఇథనాల్ ను ఉత్పత్తి చేయా లని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నాఫెడ్, ఎన్ సి సి ఎఫ్ ఇదే పద్ధతిలో మొక్కజొన్న రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నాయని తెలిపారు. మొక్కజొన్న వేసిన రైతులు తమ మొక్కజొన్నను నేరుగా ఇథనాల్ తయారీ కర్మాగారానికి ఎం ఎస్ పి తో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తామని, తద్వారా రైతు దోపిడీకి గురికాకుండా చూస్తామని, చ ఆ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. రైతుల పొలం మొక్కజొన్న మాత్రమే పండించదని, పెట్రోల్ ఉత్పత్తికి బావిగా మారుతుందన్నారు. పెట్రోలు దిగుమతికి ఉపయోగించే విదేశీ కరెన్సీని దేశ రైతులు పొదుపు చేయాలని ఆయన అన్నారు. పప్పుధాన్యాల రంగంలో మనం ఆత్మనిర్భర్ గా మారాలని, పౌష్టికాహార ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు సహకార మంత్రి తెలిపారు.

***



(Release ID: 1993267) Visitor Counter : 167