సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీబీఎస్‌వై: ఇన్షా షబీర్ కథ - సాకారమైన కల

Posted On: 28 DEC 2023 10:43AM by PIB Hyderabad

జమ్ము &కశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని ఒక అందమైన లోయ ప్రాంతంలో, ఆర్థిక స్వాతంత్ర్యం, కలల సాకారం, పరివర్తనకు చిహ్నంగా ఒక యువతి నివసిస్తోంది. పుల్వామాలోని ఆరిగంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఇన్షా షబీర్, ఇప్పుడు, వ్యాపార యజమానిగా మారారు. ఆమె ఒక బొటిక్‌ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ లబ్ధిదార్లలో ఆమె ఒకరు.

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇన్షా షబీర్‌ మీడియాతో మాట్లాడారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి మొదట 2017లో విన్నానని, వెంటనే దాని కోసం నమోదు చేసుకున్నానని చెప్పారు. ఈ పథకాన్ని 2011లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గ్రామీణ పేదల కోసం సమర్థవంతమైన సంస్థాగత వేదికలు సృష్టించడం, జీవనోపాధిని స్థిరంగా మెరుగుపరచడం, ఆర్థిక సేవల ద్వారా లబ్దిదార్ల ఆదాయాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యం.

దుస్తులు డిజైన్ చేయడం, రూపొందించడం అంటే ఇన్షాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద స్థానిక టైలరింగ్ పాఠశాలలో చేరడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆమె ప్రతిభ, ఆసక్తి కలిసి వ్యాపార అవకాశంగా, జీవనోపాధి మార్గంగా మారాయి.

డిజైనింగ్‌ కోర్సును పూర్తి చేసిన తర్వాత, ఇన్షా సొంతంగా ఒక బోటిక్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. పీఎంఈజీపీ ఉమీద్ రుణాన్ని పొందారు. డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఆర్థిక సాయం కూడా అందింది. చివరకు, ఆమె తన సొంత బొటిక్‌ ప్రారంభించారు.

నైపుణ్యం, ఆసక్తి ఉన్నా తగిన వనరులు లేకపోతే కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఇన్షా విషయంలో అలా జరగలేదు. డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఆమె తన కలను నిజం చేసింది. ఈ పథకం కింద రాయితీ రుణం అందకపోతే, తాను సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించలేకపోవచ్చని ఇన్షా వెల్లడించారు.

యువతకు సాయంగా నిలుస్తూ నూతన & అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ పథకాలను ఇన్షా కొనియాడారు. కేవలం ధనవంతులే కాదు, పేదలు, గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తులు కూడా విజయవంతమైన వ్యాపారాలను ప్రారంభిస్తున్నారని చెప్పారు. తనకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు, తన బొటిక్‌లో మరికొందరు మహిళలకు కూడా ఇన్షా ఉపాధిని అందిస్తున్నారు. చిన్నదే అయినప్పటికీ, ఆ బోటిక్ వికాసానికి, ఆత్మనిర్భరతకు దర్పణంలా నిలిచింది.

సమాచార మూలం -

ఎక్స్‌ లింక్  –

 

పీఐబీ జమ్ము/నిమిష్ రుస్తగి/హిమాన్షు పాఠక్/రీతు కటారియా/అరుషి ప్రధాన్ అందించిన సమాచారంతో

 

***


(Release ID: 1991251) Visitor Counter : 124