రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
2023-24లో రూ.1000 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన
ఈ పథకం ద్వారా గత 9 సంవత్సరాల్లో సుమారు రూ.25,000 కోట్లు ఆదా
Posted On:
20 DEC 2023 5:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ), 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల విలువైన ఔషధాల విక్రయంతో లక్ష్యాన్ని సాధించింది, దేశంలో జనరిక్ ఔషధాల చరిత్రలో మరో మైలురాయిని దాటింది. ఈ ఘనత దేశ ప్రజల వల్లే సాధ్యమైంది. దేశంలోని 785 పైగా జిల్లాల్లో ఉన్న జన్ ఔషధి కేంద్రాల నుంచి మందులను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ.5,000 కోట్లను ప్రజలు ఆదా చేశారు.
2014లో జన్ ఔషధి కేంద్రాల సంఖ్య కేవలం 80 మాత్రమే. గత 9 ఏళ్లలో ఈ కేంద్రాల సంఖ్య 100 రెట్లు పెరిగింది, ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ దాదాపు 10,000 కేంద్రాలు ఉన్నాయి. గౌరవనీయ ప్రధాన మంత్రి, 2023 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, దేశవ్యాప్తంగా 25,000 పీఎంబీజేపీలను ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ ఏడాది నవంబర్ 30న, జార్ఖండ్‌లోని దియోఘర్ ఎయిమ్స్‌లో 10,000వ జనౌషధి కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో గౌరవనీయ ప్రధాని ప్రారంభించారు. దీనివల్ల, దేశంలోని ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉండడానికి, ఔషధాలు తక్కువ ధరకు, సులభంగా దొరికేలా చూసేందుకు ఈ కేంద్రాల సంఖ్యను 25,000కి విస్తరించేందుకు మార్గం మరింత సుగమం అయింది.
ప్రధాని వాగ్దానం ప్రకారం, 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 25,000 జనౌషధి కేంద్రాలను ప్రారంభించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పీఎంబీఐ అధికారిక వెబ్‌సైట్ www.janaushadhi.gov.in ద్వారా దేశంలోని అన్ని జిల్లాల్లో కొత్త జనౌషధి కేంద్రాల ప్రారంభించడానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలన్నా, సందేహాలు తీర్చుకోవాలన్నా టోల్-ఫ్రీ నంబర్ 1800 180 8080 ద్వారా సంప్రదించవచ్చు.
ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000కు పైగా జనౌషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. పీఎంబీజేపీ ద్వారా 1,963 ఔషధాలు, 293 సర్జికల్ పరికరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గురుగావ్, బెంగళూరు, చెన్నై, గువాహటి, సూరత్‌లలో ఐదు గిడ్డంగులు ఉన్నాయి. సాప్-ఆధారిత సరకు నిర్వహణ వ్యవస్థ మద్దతుతో ఇవి పని చేస్తున్నాయి. మారుమూల & గ్రామీణ ప్రాంతాలకు ఔషధాల సరఫరా కోసం దేశవ్యాప్తంగా 36 పంపిణీ సంస్థలు పని చేస్తున్నాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం పీఎంబీజేపీ ద్వారా చాలా ఆయుర్వేద ఉత్పత్తులను కూడా అమ్ముతున్నారు. ఇవి, ప్రజలకు తక్కువ ధరలకే లభిస్తాయి.
****
(Release ID: 1989008)
Visitor Counter : 112