పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది: శ్రీ భూపేందర్ యాదవ్
వాతావరణ చర్యలు, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి.... : శ్రీ భూపేందర్ యాదవ్
ప్రపంచ దేశాలు తిరోగమనంలో పయనిస్తున్న సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది.. శ్రీ యాదవ్
Posted On:
19 DEC 2023 1:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందని కేంద్ర పర్యావరణ, అటవీ,వాతావరణ మార్పు ఉపాధి, కార్మిక శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. వాతావరణ చర్యలు, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని వివరించారు. “భారతదేశం కేవలం రూ. 615 కోట్లు వెచ్చించి విజయవంతంగా చంద్రుడిని చేరుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశం భారతదేశం. చంద్రయాన్ 3తో అంతరిక్ష రంగంలో భారతదేశం స్వావలంబన సాధించింది. గతంలో విదేశాల సహకారంతో భారతదేశం అంతరిక్ష యాత్రలు సాగించింది. అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించి చంద్రయాన్-3 ని భారతదేశం స్వయంగా నిర్వహించి విజయం సాధించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరించిన విధానాలతో ఇది సాధ్యమయ్యింది " అని శ్రీ యాదవ్ వివరించారు.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశం అనుసరించిన విధానంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయని శ్రీ యాదవ్ అన్నారు. “కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో భారతదేశం పతనమవుతుందని ప్రపంచం భావించింది. అయితే, అంచనాలు తలకిందులు చేస్తూ కోవిడ్ ని ఎదుర్కొని భారతదేశం నిలబడింది. కోవిడ్‌పై దాని ప్రతిస్పందన ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారింది. భారతదేశం అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని అత్యంత వేగంగా నిర్వహించి ప్రజల ప్రాణాలు రక్షించింది. వ్యాక్సిన్‌లు భారతదేశంలో ఉత్పత్తి అయ్యాయి. టీకాలు అవసరమైన దేశాలకు భారతదేశం సహాయం చేసింది. మైత్రి కార్యక్రమం కింద భారతదేశం దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి సహకారం అందించింది." అని మంత్రి తెలిపారు.
కోవిడ్ నివారణ కోసం భారతదేశం అనుసరించిన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ప్రశంస లభించిందని తెలిపిన శ్రీ యాదవ్ “‘ భారతదేశం సన్నద్ధమైతే ప్రపంచం సన్నద్ధమైనట్టే " అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలను గుర్తు చేశారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన శ్రీ యాదవ్ “కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది అని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని విజయం సాధించింది. కోవిడ్ -19ని ఎదుర్కోవడంలో భారతదేశం అమలు చేసిన చర్యలు ప్రపంచ గుర్తింపు పొందాయి. భారతదేశం సాధించిన v ఆకార ఆర్థిక పునరుద్ధరణ పట్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి,, ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థలు సంతృప్తి వ్యక్తం చేశాయి. చైనా, అమెరికాలు మించి భారతదేశం అభివృద్ధి సాధించింది" అని శ్రీ యాదవ్ అన్నారు. " భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని, ఒకవేళ కోలుకున్నా U ఆకారంలో అభివృద్ధి ఉంటుందని భావించారు. అయితే, భారతదేశం V ఆకార వృద్ధి సాధించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచింది" అని మంత్రి అన్నారు.
ప్రపంచ మాంద్యం మధ్య భారతదేశాన్ని ప్రకాశవంతమైన ప్రదేశంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకుతో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయని ఆయన అన్నారు. "స్థూల దేశీయోత్పత్తిలో భారతదేశం బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోని ఐదవ-అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. 23/24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 6.3% వృద్ధి సాదిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అమెరికా (2.1%), చైనా (4.4%),, యూరోజోన్ (0.7%) వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారతదేశ వృద్ధి(ఐఎంఎఫ్ , అక్టోబర్ 2023) కొనసాగుతోంది, ”అని శ్రీ యాదవ్ చెప్పారు.
గ్లోబల్ దిగ్గజాలు భారతదేశంలో తమ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తున్నాయని శ్రీ యాదవ్ తెలిపారు. “యాపిల్ తన తాజా ఐఫోన్ 15 ను భారతదేశంలో అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. భారతదేశంలో సెమీకండక్టర్లను సంయుక్తంగా తయారు చేసేందుకు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ వేదాంతతో ఒప్పందం కుదుర్చుకుంది , ”అని మంత్రి వివరించారు.
జీడీపీ పరంగా 2025లో జర్మనీని, 2027లో జపాన్‌ను అధిగమించి అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని శ్రీ యాదవ్ అన్నారు.
2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత్‌కాల్ సాకారాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ ప్రతినబూనారు’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
“ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించి ఆధ్యాత్మిక,నాగరికత మూలాలు (వసుదైక కుటుంబం), అందరికీ సంతోషం (సర్వే భవన్తు సుఖినః) విధానం అనుసరించి అంతర్జాతీయ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషించాలి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావన. ఈ విధానాలు అనుసరించి ప్రభుత్వం పనిచేస్తోంది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజల మన్నన, విశ్వాసం పొందాయి. తమ భవిష్యత్తు సురక్షితంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. సురక్షితమైన భారతదేశం మాత్రమే సమస్యలు శక్తివంతంగా ఎదుర్కోగలదు అని ప్రధానమంత్రి విశ్వసిస్తున్నారు" అని శ్రీ యాదవ్ అన్నారు.
శక్తి సామర్ధ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భారతదేశం ప్రపంచ ఆధిపత్యం లో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషితో భారతదేశ ప్రాచీన సంప్రదాయాలు, యోగా, ఆయుర్వేదం వంటి వాటికి ప్రపంచవ్యాప్త ప్రజాదరణ లభించిందని తెలిపిన శ్రీ యాదవ్ “నాటు నాటు ఆస్కార్ సాధించింది. ఎలిఫెంట్ విస్పరర్స్ భారతదేశం సాధించిన మరో గొప్ప విజయం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయులు సాంస్కృతికవిలువలు, సంప్రదాయాలు మరియు ఆలోచనల పరిరక్షణకు కృషి చేస్తున్నారు" అని మంత్రి అన్నారు.
భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు సాధించి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నారని శ్రీ యాదవ్ అన్నారు. ప్రపంచ నేతలు మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
“గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని స్థాయిలలో దేశంలో సానుకూల అభివృద్ధి సాధించింది.. నేడు యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారుతున్నారు. ప్రతిరోజూ కొత్త స్టార్టప్‌లను ప్రారంభించడంలో భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది.స్టార్టప్‌ల సంఖ్యలో భారతదేశం 2వ స్థానంలో ఉంది . అతిపెద్ద ప్రారంభ పర్యావరణ వ్యవస్థలో 3వ స్థానం పొందిన భారతదేశం ప్రపంచంలో యునికార్న్‌లను కలిగి ఉన్న దేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. 2021లో రోజుకు ప్రతి 29 రోజులకు ఒక యునికార్న్‌ఏర్పాటు అయ్యేది. 2022 నాటికి ప్రతి 9 రోజులకు ఒక యునికార్న్‌ఏర్పాటు అవుతోంది' అని శ్రీ యాదవ్ అన్నారు.
ప్రపంచ అవసరాలు దృష్టిలో ఉంచుకుని భారతదేశం పర్యావరణ పరిరక్షణ చర్యలు అమలు చేస్తోందని శ్రీ యాదవ్ తెలిపారు.
“ప్రపంచ వాతావరణ మార్పు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇనిషియల్ అడాప్టేషన్ కమ్యూనికేషన్‌తో పాటు 2019 గ్రీన్‌హౌస్ గ్యాస్ ఇన్వెంటరీపై యుఎన్ఎఫ్ సిసిసి ఒప్పందంపై 26 దేశాలతో పాటు భారతదేశం సంతకం చేసింది. అంతర్జాతీయ సౌర కూటమి, లీడ్-ఐటీ, సిడీఆర్ఐ, ఐఆర్ఐఎస్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి వాతావరణ చర్యల కోసం భారతదేశం కార్యక్రమాలు ప్రారంభించింది. 2030 కి నిర్దేశించిన పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని 2020-21 లో భారతదేశం సాధించింది" అని శ్రీ యాదవ్ వివరించారు. .
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల సుస్థిరమైన అభివృద్ధి, వాతావరణ పరిరక్షణ అంశాల్లో ప్రపంచ దేశాలకు భారతదేశం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ ప్రయత్నాలలో భారతదేశం చేస్తున్న కృషిని కూడా శ్రీ యాదవ్ వివరించారు.
“భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన దేశాలకు భారతదేశం విపత్తు సహాయాన్ని అందించింది. జెనరిక్ ఔషధాలు,సరసమైన ఆరోగ్య సంరక్షణ చర్యలు అమలు చేయడంలో భారతదేశం ముందుంది. టెలిమెడిసిన్, కృత్రిమ మేధస్సు వంటి ఆరోగ్య సంరక్షణ కోసం దేశం కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. మానవతా దృక్పధంతో అవసరమైన దేశాలకు భారతదేశం అండగా నిలుస్తోంది." అని శ్రీ యాదవ్ అన్నారు.
***
(Release ID: 1988515)
Visitor Counter : 172