ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


సూరత్ విమానాశ్రయంలో నిర్మిచంని కొత్త సమీకృత టెర్మినల్ భవనం, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గొప్ప ముందడుగు : ప్రధానమంత్రి

Posted On: 17 DEC 2023 3:59PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. కొత్త టెర్మినల్ భవనంలో ఆయన కొద్దిసేపు కలియదిరిగారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి , సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ,

‘‘సూరత్   విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించుకున్న కొత్త టెర్మినల్ భవనం,నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గొప్ప ముందడుగు. అత్యాధునిక సదుపాయాలతో,
ఇది ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాక, ఆర్ధిక పురోగతికి, పర్యాటక అభివృద్ధికి, అనుసంధానత పెంపునకు దోహదపడుతుంది”అని పేర్కొన్నారు.
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తదితరులు ప్రధానమంత్రి వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం:
గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనం 1200 మంది దేశీయ ప్రయాణికులు, 600 మంది విదేశీ ప్రయాణికులకు రద్దీ సమయాల్లో రాకపోకలకు వీలు కల్పించగలదు.
అలాగే అవసరమైతే దీని సామర్ధ్యాన్ని రద్దీ వేళల్లో  3000 మంది ప్రయాణికుల  నుంచి ఏడాదికి 55 లక్షల మంది ప్రయాణికుల సామర్ధ్యం  స్థాయికి తీసుకువెళ్లగలదు.  ఈ భవనాన్ని స్థానిక సంస్కృతి సంప్రదాయాలు,
వారసత్వానికి అనుగుణంగా నిర్మించారు.ఇందులోని లోపలి భాగాలు, వెలుపలి భాగాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. ఈ నూతన టెర్మినల్ బిల్డింగ్ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాన్ని కల్పించడంతోపాటు,
గొప్ప సంప్రదాయ విధానంలో ని ఉడ్ వర్క్ కలిగి ఉంది. సూరత్లోని రండెర్ పాత ఇళ్ల వుడ్ వర్క్ ను  ఇది పోలి ఉంటుంది. గృహ–4 నిబంధనలకు అనుగుణంగా ఈ నూతన టెర్మినల్ బిల్డింగ్ను నిర్మించారు.
డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ వ్యవస్థ, ఇంధన పొదుపుకు తగిన ఏర్పాట్లు,తక్కువ వేడి ఉండేలా ఏర్పాట్లు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు చర్యలు, మురుగునీటి శుద్ది, మొక్కలకు నీటికి రీసైకిల్ చేసిన నీటి వినియోగం,
సౌర విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు వంటివి ఈ భవన ప్రత్యేకతలు. 


(Release ID: 1987647) Visitor Counter : 88